లలితమైన భాష రమ్యమైన భావం | C Narayana reddy gets Ghanapet award for his poetry | Sakshi
Sakshi News home page

లలితమైన భాష రమ్యమైన భావం

Published Mon, Jul 25 2016 2:54 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

లలితమైన భాష రమ్యమైన భావం

లలితమైన భాష రమ్యమైన భావం

సినారె కవితల్లో కాళిదాసాది భారతీయ మహాకవుల పరువముంది. ఉర్దూ కవుల ఆవేశం, నవ్యత కనిపిస్తాయి. భట్టుమూర్తి వంటి ప్రజ్ఞ ఉంది. ఆయన హృదయమే కవిత్వం. బాలకవిగా చివురు తొడిగి కవితా వటవృక్షమై ఎదిగిన పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి కవితా ప్రస్థానంలో ఎన్నో మలుపులు కనిపిస్తాయి. ‘మార్పు నా తీర్పు’ అని ఏనాడో అన్నారాయన. ప్రవహించే నీరులా స్వచ్ఛమైన కవిత ఎప్పుడూ ఆరోగ్యకరమే. సినారె కవిత్వంలో మనకు ప్రధానంగా, ప్రథమంగా గోచరించేది రమణీయకత. ఏది చెప్పినా, మెత్తదనం సంతరించుకున్న కవిత ఆయన సొంతం. ఒకనాడు ఆయనను అనుప్రాస ప్రియుడన్నారు. కాని అనుప్రాస మోజులో పడి ఎక్కడా శిల్పాన్ని కాని, కవిత్వాన్ని కాని దూరం చేసుకోలేదు. వాటిని తన ధోరణిలోకి ఇముడ్చుకొని వశపరచుకొన్నాడు. అందుకే ప్రతి గేయం, ప్రతి పద్యం విరజాజి పందిరిలా ఉంటుంది.
 
 నారాయణరెడ్డి చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన కవికిశోరం. బి.ఎ. దాకా ఉర్దూ మాధ్యమంలో చదివినా మాతృభాషపై మమకారం పోగొట్టుకోలేదు. విద్యార్థి దశనుండి కవితలు వ్రాస్తూ వచ్చారు. ఆ దశలోనే నవ్వని పువ్వు వంటి గేయ నాటికలు, జలపాతం వంటి ఉత్తమ రచనలు వెలువడ్డాయి. విద్యార్థిగా ఉన్నప్పుడే సభలూ సమావేశాలకూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన కంటే రసవంతంగా వ్యాఖ్యానమందించే వారు లేరనిపించుకొన్నారు కూడా.
 
 సినారె కవితల్లో కాళిదాసాది భారతీయ మహాకవుల పరువముంది. ఉర్దూ కవుల ఆవేశం, నవ్యత కనిపిస్తాయి. భట్టుమూర్తి వంటి ప్రజ్ఞ ఉంది. భావకవిగా, అభ్యుదయ కవుల్లో అభ్యుదయవాదిగా, విప్లవ ధోరణికి నీరాజనం పట్టే విప్లవ రచయితగా, ప్రజాకవిగా భాసిల్లారు. విరసంతో సరసం ఆడగల సమర్థుడాయన. ఆయన హృదయమే కవిత్వం. ఆర్ద్రతతో తడిసిన ఆయన అంతరంగం నుండి పెకిలి వచ్చే ప్రతిపదంలోనూ కవిత్వం ఉంటుంది. ‘సురభిళ శబ్దమ్మొక్కటి తరగెత్తిన చాలు/ నా యెడద నందులందు కోటి నందనాలు గుబాళించు’ అనే శబ్ద శిల్పి ఆయన.
 
 ఆయన తన రచనల్లో తననీ విధంగా పరిచయం చేసుకొన్నారు: ‘నా పేరు కవి, ఇంటిపేరు చైతన్యం, ఊరు సహజీవనం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం’. ఒక్కచోట ఆయన ఇలా హితవు పల్కారు: ‘ముళ్ళలాగ ఎవరినీ నొప్పించవద్దు/ పూలలాగ అందరినీ మురిపిస్తే ముద్దు’. పచ్చి వేడి, పిచ్చి చలువ ఆయనలో చూడొచ్చు. మహోద్ధతి, మౌనగతి రెండూ ఆయనకు తెలుసు. ఆయన సంప్రదాయాన్ని జీర్ణించుకొన్న ప్రయోగం. ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయం.
 
 ఒక దీపావళినాడు ఒక చిన్నారిపాప దీపం వెలిగిస్తున్నది. ఆ పాపను చూసి రెడ్డిగారి హృదయంలో వెలిగిన కవితా జ్యోతి: ‘ముట్టించు పాపా దీపం ముట్టించు/ ముసురుకొన్న మా తమస్సును/ నీవైనా తుదముట్టించు’. ఆయన శ్రమ జీవుల చమట బిందువులను జాతి రత్నాలుగా తలచారొకచోట. మంచికి నిలబడ్డ మనిషిని మహర్షిగా కొలిచి మానవతావాదిగా కనిపించారు మరోచోట. పొరలు కమ్మని విజ్ఞానం అరవిందంలా విరియాలని వాంఛించారింకో చోట. ఆయన కవిత్వంపై కాల్పనికోద్యమ, మానవోద్యమ, అభ్యుదయోద్యమ ప్రభావాలున్నా వాటిని తనవిగా చేసుకోగల ప్రతిభాశాలి ఆయన.
 
 లలితమైన భాష, రమ్యమైన భావన ఆయన సొంతం. ‘ఈ పదముల రాపాడిన మాపురములు, చిరుగజ్జెలు చప్పని నా బ్రతుకులోన రసధ్వనులను పలికించెను’. బండరాతిలో గుండెల చప్పుడును, పాషాణంలో సైతం ప్రాణాన్ని గమనించగలిగిన రసజ్ఞుడు. ‘ఈ నల్లని రాలలో - ఏ కన్నులు దాగెనో/ ఈ బండల మాటున - ఏ గుండెలు మ్రోగెనో/ పైన కఠినమనిపించును - లోన వెన్న కనిపించును/ కదలలేవు మెదలలేవు - పెదవి విప్పి చెప్పలేవు/ ఉలియలికిడి విన్నంతనె - గలగలమని పొంగి పొరలు’.
 సహృదయత గల కవి - అందుకే సమతా శాంతుల నాకాంక్షిస్తున్నారు. ‘సమత నా తల్లి- సౌహార్దం నా తండ్రి/ అనాది నా జననం-అనంతం నా పయనం/ విశ్వం నా ఊరు-శాంతి నా పేరు’.
 సామాన్య ప్రజలను పీడిస్తే-ఆవేశం పుడుతుంది. ఎక్కడ? ‘చిల్లిగవ్వకు కొరగాని-చితికిన బతుకుల నుంచి’. చివరకేమవుతుంది? ‘పిడికిళ్ల లోని ఆవేశం-పిడుగులను పుట్టిస్తుంది/ నడి నెత్తిలోని ఆవేశం- నవయుగాన్ని సృష్టిస్తుంది’.
 కవి బ్రహ్మవంటివాడు-అతన్ని మించిన వాడే ఆత్మ చేతన అంటూ ఉంటే- ఆ సత్యాన్ని చాలా బాగా చెప్పారు.
 ‘నేను రాస్తున్నది తుడిచి వేస్తున్నది-గీతం కాదు, స్వరలిపి అతడు గీస్తున్నది సీలు వేస్తున్నది-అదృష్ట పలకం మీద భాస్వర లిపి స్వరం గొప్ప భాస్వరం కంటె-గీతిక గొప్ప జాతకం కంటె అతనికంటె నేనే గొప్ప-ఆత్మ చేతన అంటూ వుంటె’.
 కవికి కావలసింది ఆత్మ చేతన. అతడు చేయాల్సిన కల్పనలేమిటో, అతని కర్తవ్యమేమిటో నిశితంగా అంటున్నాడు. ‘ఈ రాత్రి కనవలసింది- కవలలను కాదు-క్రాంతి గోళాలను/ ఈనాడు కావలసింది- డోల ఊపడం కాదు-నిద్రలేపడం’. సినారె ప్రతి మాటలో ప్రగతివాదం ప్రస్ఫుటిస్తుంది. ఒకనాడు భావ గీతాలు వ్రాసిన యువకవి; శృంగారాన్ని వరించిన రసజ్ఞుడు, కాలాన్ని గమనించి అవసరాన్ని గుర్తించి ప్రజా సమస్యలను ఆకళించుకొని ప్రజాకవిగా సాగుతున్నారు.
 - డా॥ఎ.రాధాకృష్ణరాజు
 (వ్యాసకర్త - అధ్యక్షులు,
 కర్ణాటక తెలుగు విజ్ఞాన సమితి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement