సందర్భం
ఆధునిక కవిత్వంలో మానవతా కేతనాన్ని నిలిపిన మహాకవి తిలక్. అనుభూతి వాద కవిగా ప్రకటించుకొన్న తిలక్ చేపట్టిన ప్రతి వస్తువునీ కవితామయం చేసి కవిత్వంలో వెలుగులు విరజిమ్మిన రవి. శైలీ రమ్యత సాధించిన నవకవి.
జీవిత విశేషాలు : తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన 1921 ఆగస్టు 1న పశ్చిమగోదావరిజిల్లా తణుకు మండపాక గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి సత్య నారాయణకు లోకమాన్య బాలగంగాధర తిలక్‌పై ఉన్న అభిమానంతో ఆ పేరు పెట్టారు.
రచనా వ్యాసంగం : ఆధునిక సాహితీ ఉద్య మాల్లో అప్పట్లో ప్రముఖంగా ఉన్న భావకవితా ఉద్యమ ప్రభావంతో 1937లో ప్రభాతము–సంధ్య అనే పద్యకవితా సంకలాన్ని వెలువరించాడు. బొంబాయిలో 1942లో జరిగిన అఖిల భారత అభ్యుదయ సంఘం ప్రతినిధిగా పాల్గొన్నారు. అనారోగ్యం వల్ల 1945 నుండి 1955 వరకు సాహిత్య కృషి అంతగా సాగలేదు. 1961 నుండి కవిత్వంలో కొత్త పోకడలు చూపించాడు. కవిత్వంతో పాటు కథలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, లేఖా సాహిత్యం, మొదలైన ప్రక్రియలన్నింటినీ సుసంపన్నం చేశాడు. మరణానంతరం 1968లో ఆయన వచన కవితలను విశాలాంధ్ర పబ్లికేషన్‌వారు ‘అమృతం కురిసిన రాత్రి’ పేరిట ప్రచురించారు. ఈ సంకలానికి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి.
కవితా తత్త్వ వివేచన : తన కవితా లక్ష్యాన్ని వివరిస్తూ ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, ప్రజాశక్తుల విజయ ఐరావతాలు/ వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు’ అందమైన ఆర్ధ్రమైన భావాలను అందమైన శైలిలో చెప్పడమే తన కవితా లక్ష్యమన్నాడు. ఆధునిక కవిత్వ తత్త్వాల్లో తన కవిత్వం దేనికీ చెందదని స్పష్టీకరించాడు. తిలక్ కవితా విమర్శకుడిగా ‘నవత–కవిత’ ఖండికల్లో ‘కవిత్వం ఒక అల్కెమి. దాని రహస్యం కవికే తెలుసు. కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు. అని కవితా కళను రసవాదవిద్యతో పోల్చాడు. కవితా పర మావధిని వివరిస్తూ ‘కవిత్వం అంతరాంతర జ్యోతి స్సీమల్ని బహిర్గతం చేయాలి, విస్తరించాలి. చైతన్య పరిధి. అగ్ని చల్లినా/అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి కావాలని వివేచించాడు. తిలక్ హైదరాబాద్ నగరాన్ని స్త్రీతో పోల్చి నగరం మీద ప్రేమగీతం ఖండిక రాశాడు. ట్యాంక్‌బండ్‌ను స్త్రీ నడుముతో, అబిడ్స్‌ని కళ్లతో పోల్చాడు. నౌబత్‌పహాడ్‌ని నాగరంగా భావించి వర్ణించాడు.
తపాలాశాఖ వార్షికోత్సవ సందర్భంగా తిలక్ మిత్రుడు డాక్టర్ తంగిరాల వెంకటసుబ్బారావు అభ్యర్థన మేరకు తపాలా బంట్రోతు ఖండిక రాశాడు. అప్పటి కవుల దృక్పథాన్ని అన్యాపదేశంగా అధిక్షేపిస్తూ ‘ఈ నీ ప్రార్థన కడుంగడు అసహ్యం సుబ్బారావు/ ఉత్త పోస్టుమన్ మీద ఊహలు రానే రావు’ అంటూ ప్రారంభించి తపాలా బంట్రోతు స్థితిని ‘ఎండలో వానలో ఎండిన చివికిన చిన్న సైజు జీతగాడు’ అంటూ వర్ణించాడు. ఆర్తగీతం ఆరంభంలో ‘నాదేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించ లేను. ఈ విపంచికలో శృతి కలుపలేను’ అని నిర్మోహ మాటంగా ప్రకటించాడు. తిలక్ కవితా ఖండికల్లో అధిక్షేపాత్మకాలెన్నో ఉన్నాయి. ప్రత్యేకించి ‘న్యూ సిలబస్’ ఖండికలో భారతదేశంలో అధిక జనాభాను, ఆర్థిక పరిస్థితిని అధిక్షేపిస్తూ ‘అమెరికాలో డాలర్లు పండును/ఇండియాలో సంతానం పండును’ అంటారు. స్త్రీలపై జరిగే అత్యాచారాలను, వేధింపులను అధిక్షేపిస్తూ ‘గజానికొక గంధారీ కొడుకు, గాంధీగారి దేశంలో... అంటాడు.
ఆధునికాంధ్ర కవిత్వంలో అద్భుతమైన శైలీ విన్యాసంతో మానవతావాదానికి మకుటాయమానమైన ఖండికలతో అభ్యుదయానురక్తితో అమృతం కురిసిన రాత్రి సంకలాన్ని సృష్టించిన తిలక్ చిరస్మరణీయుడు. ఆధునిక కవులకు అనుసరణీయుడు.
(ఆగస్టు 1న మహాకవి తిలక్ శతజయంతి)
వ్యాసకర్త సాహితీ విమర్శకులు ‘ 98491 77594
డా. పీవీ సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment