గుడివాడ 2టౌన్ సీఐపై వేటు | Gudivada 2 Town Exclusion by the ci | Sakshi
Sakshi News home page

గుడివాడ 2టౌన్ సీఐపై వేటు

Published Thu, May 29 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

Gudivada  2 Town Exclusion by the ci

కానిస్టేబుల్ సస్పెండ్
ఇంటర్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అధికారుల చర్యలు
నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌పై క్రిమినల్ కేసు
ఆర్‌ఐవో, ఎగ్జామినేషన్ కమిటీ సభ్యుల తొలగింపు
{పశ్నపత్రాలు లీక్ కాలేదు: బోర్డు స్పష్టీకరణ

 
మచిలీపట్నం, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో గుడివాడ 2 టౌన్ సీఐ బాలగంగాధర తిలక్, హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్లు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి తెలిపారు. అలాగే, గుడివాడ నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యశాస్త్రితోపాటు హెడ్ కానిస్టేబుల్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. లీకేజీ ఆరోపణలపై జాయింట్ కలెక్టర్ మురళి విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పూర్తిస్థాయి విచారణ అనంతరం నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు.

ఇక, ఈ ఘటనలో ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్‌ఐవో) పి.వెంకట్రామయ్యను ఆ బాధ్యతల నుంచి తొలగించి, ఆయన స్థానంలో విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజారావును నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, డిపార్ట్‌మెంటల్ ఎగ్జామినేషన్ కమిటీలోని ముగ్గురు సభ్యులను ఆ బాధ్యతల నుంచి తొలగిం చారు. ఆర్‌ఐవో పి.వెంకట్రామయ్య, డిపార్ట్‌మెంటల్ ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు, చీఫ్ సూపరింటెండెంట్, కస్టోడియన్‌పై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. గుడివాడలోని నారాయణ జూనియర్ కళాశాలకు ‘ఇంటర్ సప్లిమెంటరీ’ పరీక్షా కేంద్రం కేటాయించనప్పటికీ, ప్రిన్సిపాల్ ప్రశ్నపత్రాలను ముందుగా తీసుకెళ్లడంతో లీకేజీ జరిగిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

 లీక్ కాలేదు: గుడివాడ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటర్ ప్రశ్నపత్రాల బండిల్స్ ఉన్న పెట్టెలను నారాయణ కాలేజీకి తరలించినప్పటికీ, అవి లీక్ కాలేదని ప్రాథమిక విచారణలో తేలినట్టు ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోర్డు కార్యదర్శి బుధవారం ప్రకటన విడుదల చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి లేకుండా ప్రశ్నపత్రాలున్న పెట్టెలను నారాయణ కాలేజీకి తరలించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement