Intermediate advanced supplementary
-
14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 14 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. 819 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,20,549 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. వారిలో ఇంప్రూవ్మెంట్ కోసం హాజరు కానున్న వారు 1,25,960 మంది ఉన్నట్లు శుక్రవారం బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 8,420 మంది ఇన్విజిలేటర్లను, 819 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 819 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటాయని అశోక్ తెలిపారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, 8:45 గంటలకల్లా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను 1:30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 2:15 గంటలకల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో కూర్చోవాలన్నారు. పరీక్ష ప్రారంభ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారు ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చని సూచించారు. వాటిపై కాలేజీల ప్రిన్సిపాళ్ల సంతకాలు అవసరం లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 040–24601010/24732369 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. 24 నుంచి ప్రాక్టికల్స్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగానే ఈ నెల 24 నుంచి 28 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు అశోక్ తెలిపారు. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలను ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరుగుతుందన్నారు. -
నేడు ఇంటర్ ‘సప్లిమెంటరీ’ ఫలితాలు
మధ్యాహ్నం 3 గంటలకు విడుదల సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం వెల్లడి కానున్నాయి. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయ ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య ఫలితాలు విడుదల చేస్తారు. మే నెలలో జరిగిన ఇంటర్మీడియెట్ జనర ల్, వొకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా. ఈ ఫలితాలను విద్యార్థులు www. sakshieducation.com, tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in, http://examresults.ts.nic.in వెబ్సైట్లలో పొందవచ్చు. అలాగే పరిష్కారం కాల్ సెంటర్‌కు (1100 నంబర్‌కు) బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇతర ల్యాండ్‌లైన్/మొబైల్ నుంచి 18004251110 నంబర్‌కు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఈసేవా, మీసేవా, రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్, టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లోనూ పొందవచ్చు. కళాశాలల ప్రిన్సిపల్స్ తమ కాలేజీల వారీగా ఫలితాలను యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి జ్http://bietelangana. cgg.gov.inలో పొందవచ్చు. -
13న ఇంటర్ ‘అడ్వాన్స్డ్’ విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంసెట్ కమిటీ ర్యాంకులను వెల్లడించింది. వెబ్సైట్లో కూడా ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంచింది. మరోవైపు ఈనెల 13న ఆయా విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ఉన్నత విద్యా మండలి శుక్రవారం నిర్ణయించింది. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 20 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించినా దాదాపు 12 వేల మంది ఇంటర్లో ఫెయిల్ అవడం వల్ల వారికి ర్యాంకులను కేటాయించలేదు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వారు పాస్ కావడంతో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు కేటాయించారు. రెండు దఫాలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎంసెట్ ర్యాంకు పొందిన విద్యార్థులకు 13న ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. అన్ని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి వెరిఫికేషన్ చేపడతారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజమాబాద్, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని రుద్రంపూర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, మెదక్ (మహిళ), సిద్దిపేటలోని రాజగోపాల్‌పేట, కరీంనగర్‌లోని మహిళ పాలిటెక్నిక్‌లు, రామంతాపూర్, హైదరాబాద్ పాతబస్తీలోని క్యూక్యూ పాలిటెక్నిక్ కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. అలాగే నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీ, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కరీంనగర్‌లోని ఎస్ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్, సాంకేతిక విద్యాభవన్లలో వెరిఫికేషన్ చేపడతారు. ర్యాంకుల వివరాలను వెబ్సైట్లో పొందవచ్చు. ఆగస్టులో డీఎడ్ ద్వితీయ పరీక్షలు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వచ్చే ఆగస్టులో వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి.శేషుకుమారి తెలిపారు. విద్యార్థులు ఈనెల 20లోగా పరీక్ష ఫీజును చెల్లించాలని, రూ.50 ఆలస్య రుసుముతో ఈనెల 27వ తేదీలోగా చెల్లించవచ్చని వెల్లడించారు. గతంలో ఫెయిల్ అయిన వారు 3 సబ్జెక్టులకు అయితే రూ. 175, రెండు సబ్జెక్టులకు అయితే రూ. 150, ఒక సబ్జెక్టుకు రూ. 125 చెల్లించాలని పేర్కొన్నారు. -
ఒకరి బదులు మరొకరు రాసిన పరీక్ష
విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంటర్ సెకండియర్‌లో ఘటన విద్యారణ్యపురి : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో హన్మకొండలోని ప్రతిభా జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో శుక్రవారం ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పరీక్షలో ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్‌కు దొరికిపోయూడు. ఇంటర్ విద్య ఆర్ఐవో మలహల్రావు కథనం ప్రకారం.. నగరంలో జయముఖి జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ పూర్తయిన విద్యార్థి ఎం. సాగర్ ప్రతిభ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఫిజిక్స్ పరీక్ష రాస్తుండగా సంబంధిత ఇన్విజిలేటర్ హాల్ టికెట్‌ను పరిశీలించారు. దీంతో సూర శివకృష్ణకు బదులుగా సాగర్ పరీక్ష రాస్తున్నట్లుగా గుర్తించారు. శివకృష్ణ హాల్‌టికెట్‌పై సాగర్ ఫోటో పెట్టి జిరాక్స్ తీసి ఆ హాల్‌టికెట్‌తో హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలోని హాల్‌టికెట్‌తో సరిపోల్చగా తేడాగా ఉన్నట్లు గుర్తించి అతనివద్ద నుంచి పరీక్ష రాస్తున్న పత్రాలను స్వాధీనం చేసుకుని సాగర్‌ను కేయూ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అదపులోనికి తీసకొని కేసు నమోదు చేశారు. అసలు విద్యార్ధి శివకృష్ణ తాను రాయాల్సిన పరీక్షను మరొకరితో రాయిస్తున్నందున అతడిని డిబార్ చేశారు. శివకృష్ణది నగరంలోని జయముఖి జూనియర్ కళాశాల. అయితే ప్రతిభ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రంగా ఉంది. ఎం. సాగర్ కూడా జయముఖి జూనియర్ కళాశాలలోనే ఇటీవల ఇంటర్ సెకండియర్ పూర్తిచేశాడు. ఫస్టీయర్‌లో మరొకరి డిబార్ శుక్రవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలో జిల్లాలోని తొర్రూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్ చే స్తూ ఓ విద్యార్థి డిబార్ అయ్యారని ఇంటర్‌విద్య ఆర్ఐవో మలహల్రావు తెలిపారు. ఫస్టీయర్‌లో 20,664 మంది విద్యార్థులకు 18,764మంది విద్యార్థులు హా జరయ్యారని తెలిపారు. అలాగే సెకండియర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు 6,352 మంది విద్యార్థులకు 5,795 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. -
గుడివాడ 2టౌన్ సీఐపై వేటు
కానిస్టేబుల్ సస్పెండ్ ఇంటర్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అధికారుల చర్యలు నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌పై క్రిమినల్ కేసు ఆర్ఐవో, ఎగ్జామినేషన్ కమిటీ సభ్యుల తొలగింపు {పశ్నపత్రాలు లీక్ కాలేదు: బోర్డు స్పష్టీకరణ మచిలీపట్నం, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో గుడివాడ 2 టౌన్ సీఐ బాలగంగాధర తిలక్, హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్లు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి తెలిపారు. అలాగే, గుడివాడ నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యశాస్త్రితోపాటు హెడ్ కానిస్టేబుల్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. లీకేజీ ఆరోపణలపై జాయింట్ కలెక్టర్ మురళి విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పూర్తిస్థాయి విచారణ అనంతరం నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఇక, ఈ ఘటనలో ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐవో) పి.వెంకట్రామయ్యను ఆ బాధ్యతల నుంచి తొలగించి, ఆయన స్థానంలో విజయవాడ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజారావును నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కమిటీలోని ముగ్గురు సభ్యులను ఆ బాధ్యతల నుంచి తొలగిం చారు. ఆర్ఐవో పి.వెంకట్రామయ్య, డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు, చీఫ్ సూపరింటెండెంట్, కస్టోడియన్‌పై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. గుడివాడలోని నారాయణ జూనియర్ కళాశాలకు ‘ఇంటర్ సప్లిమెంటరీ’ పరీక్షా కేంద్రం కేటాయించనప్పటికీ, ప్రిన్సిపాల్ ప్రశ్నపత్రాలను ముందుగా తీసుకెళ్లడంతో లీకేజీ జరిగిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. లీక్ కాలేదు: గుడివాడ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటర్ ప్రశ్నపత్రాల బండిల్స్ ఉన్న పెట్టెలను నారాయణ కాలేజీకి తరలించినప్పటికీ, అవి లీక్ కాలేదని ప్రాథమిక విచారణలో తేలినట్టు ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోర్డు కార్యదర్శి బుధవారం ప్రకటన విడుదల చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి లేకుండా ప్రశ్నపత్రాలున్న పెట్టెలను నారాయణ కాలేజీకి తరలించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.