13న ఇంటర్ ‘అడ్వాన్స్‌డ్’ విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | 13 Inter 'Advanced' Student Certificate verification | Sakshi
Sakshi News home page

13న ఇంటర్ ‘అడ్వాన్స్‌డ్’ విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

Published Sat, Jul 11 2015 1:18 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

13 Inter  'Advanced' Student Certificate verification

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంసెట్ కమిటీ ర్యాంకులను వెల్లడించింది. వెబ్‌సైట్‌లో కూడా ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంచింది. మరోవైపు ఈనెల 13న ఆయా విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ఉన్నత విద్యా మండలి శుక్రవారం నిర్ణయించింది. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 20 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు.

ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించినా దాదాపు 12 వేల మంది ఇంటర్‌లో ఫెయిల్ అవడం వల్ల వారికి ర్యాంకులను కేటాయించలేదు. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వారు పాస్ కావడంతో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు కేటాయించారు.
 
రెండు దఫాలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎంసెట్ ర్యాంకు పొందిన విద్యార్థులకు 13న ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. అన్ని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి వెరిఫికేషన్ చేపడతారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజమాబాద్, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని రుద్రంపూర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, మెదక్ (మహిళ), సిద్దిపేటలోని రాజగోపాల్‌పేట, కరీంనగర్‌లోని మహిళ పాలిటెక్నిక్‌లు, రామంతాపూర్, హైదరాబాద్ పాతబస్తీలోని క్యూక్యూ పాలిటెక్నిక్ కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు.

అలాగే నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కాలేజీ, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కరీంనగర్‌లోని ఎస్‌ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్, సాంకేతిక విద్యాభవన్‌లలో వెరిఫికేషన్ చేపడతారు. ర్యాంకుల  వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
 
ఆగస్టులో డీఎడ్ ద్వితీయ పరీక్షలు
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వచ్చే ఆగస్టులో వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి.శేషుకుమారి తెలిపారు. విద్యార్థులు ఈనెల 20లోగా పరీక్ష ఫీజును చెల్లించాలని, రూ.50 ఆలస్య రుసుముతో ఈనెల 27వ తేదీలోగా చెల్లించవచ్చని వెల్లడించారు. గతంలో ఫెయిల్ అయిన వారు 3 సబ్జెక్టులకు అయితే రూ. 175, రెండు సబ్జెక్టులకు అయితే రూ. 150, ఒక సబ్జెక్టుకు రూ. 125 చెల్లించాలని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement