ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 14 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. 819 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,20,549 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. వారిలో ఇంప్రూవ్‌మెంట్ కోసం హాజరు కానున్న వారు 1,25,960 మంది ఉన్నట్లు శుక్రవారం బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 8,420 మంది ఇన్విజిలేటర్లను, 819 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను, 819 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటాయని అశోక్ తెలిపారు.
విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, 8:45 గంటలకల్లా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను 1:30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 2:15 గంటలకల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో కూర్చోవాలన్నారు. పరీక్ష ప్రారంభ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చని సూచించారు. వాటిపై కాలేజీల ప్రిన్సిపాళ్ల సంతకాలు అవసరం లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 040–24601010/24732369 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
24 నుంచి ప్రాక్టికల్స్
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగానే ఈ నెల 24 నుంచి 28 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు అశోక్ తెలిపారు. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలను ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment