Inter-board
-
ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టా.. లేనట్టా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసే అవకాశం ఇస్తుందా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. ఇంటర్ ఫలితాల్లో తప్పుల కారణంగా కొంతమంది విద్యార్థులు ఫెయిల్ కాగా, మరికొంత మందికి తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, ఫెయిలైన 3.82 లక్షల మంది జవాబు పత్రాలను బోర్డు రీవెరిఫికేషన్ చేసింది. దీంతో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు కొంతమంది పాసైనా తక్కువ మార్కులు రావడంతో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా వారి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అయితే వారిలో కొందరు ఇంప్రూవ్మెంట్ రాయాలని భావిస్తున్నారు. వారికి ఇప్పుడు బోర్డు అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది తేల్చడం లేదు. బోర్డు పొరపాట్ల కారణంగా తాము ఫెయిల్ అయ్యామని, మరికొంత మందికి తక్కువ మార్కులు వచ్చాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఈ నెల 7 నుంచి జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బోర్డు అధికారులు మాత్రం సెకండియర్ విద్యార్థుల్లో ఇంప్రూవ్మెంట్ రాసేవారు అరుదేనని చెబుతున్నారు. ఒకవేళ ఇంప్రూవ్‌మెంట్‌లో ఆ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిలైనా అవే మార్కులు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న మార్కులు కోల్పోతారు కాబట్టి సెకండియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరుకారని చెబుతున్నారు. 585 మందికి అవకాశం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన 585 మంది విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం కల్పించింది. ప్రథమ సంవత్సర విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాస్తే ఎందులో ఎక్కువ మార్కులు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి వారికి మాత్రం ఈ నెల 7 నుంచి జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. -
వెబ్సైట్లో ఇంటర్ జవాబు పత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు, మార్కుల వివరాలను బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన రీ వెరిఫికేషన్‌లో సున్నా మార్కులు వచ్చిన సమాధానాలు, అసలు దిద్దని సమాధానాలను మాత్రమే పరిశీలించి మార్కులు వేశారని పేర్కొన్నారు. అలాగే మార్కుల మొత్తాన్ని కూడా సరిచూశారని తెలిపారు. బోర్డు నిబంధనల ప్రకారం ఒకసారి మార్కులు వేసిన జవాబులను పునఃపరిశీలన చేయడం మాత్రం జరగదని స్పష్టంచేశారు. అంటే రీ వాల్యుయేషన్ ఉండదని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని ఆయన కోరారు. రీవెరిఫికేషన్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన ఫస్టియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాయడానికి సబ్జెక్టుకు రూ.150 చొప్పున కాలేజీలో ఫీజు చెల్లించి, ప్రిన్సిపాల్ ద్వారా బోర్డుకు మాన్యువల్ నామినల్ రోల్ పంపించాలని సూచించారు. ఎంఈసీ విద్యార్థులు ఇది గమనించాలి... ఎంఈసీ విద్యార్థులు గణితంలో 75 మార్కుల ప్రశ్నపత్రానికే సమాధానాలు రాసినప్పటికీ, వారికి వచ్చిన మార్కులను 50 మార్కులకు అనుగుణంగా గుణించి మెమోలో వేస్తారని అశోక్ వివరించారు. ఉదాహరణకు ఓ విద్యార్థికి గణితం పేపర్లో 18 మార్కులు వస్తే.. వాటిని 2/3తో గుణించి 12 మార్కులుగా నిర్ధారించి, ఆ మేరకు మెమోలో ప్రింట్ చేస్తారని తెలిపారు. అందువల్ల విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల కంటే మెమోలో తక్కువ వచ్చాయని ఆందోళన చెందకుండా ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. -
రీ వెరిఫికేషన్‌పై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇంటర్మీడియెట్‌లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్రంలోని 12 మూల్యాంకన కేంద్రాల్లో జరుగుతోందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రీ వెరిఫికేషన్‌తో గ్లోబరీనా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆ మార్కులను ఇంటర్ బోర్డుకు పంపిస్తారన్నారు. ఇలా వచ్చిన మార్కులతో ఫలితాల ప్రాసెసింగ్ చేయడానికి త్రిస భ్య కమిటీ సూచనల మేరకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ సంస్థ ద్వారా ‘డేటాటెక్ మెథడెక్స్’అనే ఓ కంప్యూటర్ ఏజెన్సీని ఎంపిక చేశామన్నారు. ఈ సంస్థ, గ్లోబరీనా సంస్థ రెండూ వేర్వేరుగా జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ చేపట్టిన తర్వాత వచ్చిన మార్కులతో రిజల్ట్స్ ప్రాసెసింగ్ ప్రక్రియను సమాంతరంగా నిర్వహిస్తాయని తెలిపారు. -
‘మాజీ’లకు ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్: కుర్చీలకు అతుక్కుపోయిన ‘మాజీ’లకు ఉద్వాసన పలకాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. పదవీ విరమణ పొందినా ఆయా శాఖల్లో సలహాదారులుగా, ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్న వారిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ శాఖల్లో ఇలా తిష్ట వేసిన వారితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని నిర్ధారణకు వచ్చింది. అన్ని శాఖల్లో ఇలా కొనసాగుతున్న వారిని గుర్తించి తొలగించాలని నిర్ణయించింది. ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారమే దీనికి కారణంగా కనిపిస్తోంది. పదవీ విరమణ పొందినా అదే శాఖలో కొనసాగుతున్న కొందరితోనే ఇంటర్ మార్కుల వ్యవహారంలో తప్పులు జరిగినట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. తాజాగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన రాద్ధాంతం వెనుక ఈ అధికారుల పాత్ర ఉందని నిఘా వర్గాలు సీఎం కేసీఆర్ నివేదిక సమర్పించాయి. మాజీ అధికారులే బోర్డు పాలనా వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పదవీ విరమణ పొందినా... అదే పోస్టుల్లో కొనసాగుతున్న ఉద్యోగులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో శాఖల వారీగా ఈ తరహాలో పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కతీయాలని సీఎం స్పష్టం చేశారు. మెరుగైన సేవలు అందిం చేందుకు అనుభవజ్ఞులను కొన్ని శాఖల్లో కొనసాగించాలని రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుని పలు శాఖల్లో కొందరు పదవీ విరమణ పొందినా రకరకాల కారణాలతో అదే శాఖలో విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఆయా శాఖల్లోని రెగ్యులర్ ఉద్యోగులు, ‘విరమణ’ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. 1,127 మంది ఉన్నట్లు లెక్క... రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో 1,127 మంది ఉద్యోగులు కన్సల్టెంట్, ఓఎస్డీ పోస్టుల పేరు తో పాత విధులనే నిర్వర్తిస్తున్నారని తేలింది. ఇందులో మాజీ ఐఏఎస్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మొదలు కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఉన్నట్లు స్పష్టమైంది. వీరందరిని తొలగించాలని నిర్ణయించింది. పదవీ విరమణ చేసినా కన్సల్టెంట్లుగా అవే సీట్లలో కొనసాగుతుండడంతో పదోన్నతులు, పోస్టింగ్‌లలో దిగువ శ్రేణి అధికారులకు అన్యాయం జరుగుతోంది. శాఖలో వారి పెత్తనమే కొనసాగడంతో రెగ్యు లర్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. -
కొనసాగిన ‘ఇంటర్’ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో బోర్డు తప్పిదాలపై నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 6 రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డును ముట్టడించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. బుధవారం కూడా పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టగా దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు పలికారు. జవాబు పత్రాల రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌కు విద్యార్థుల వద్ద ఫీజు వసూలు చేయొద్దని తల్లిదండ్రులు కోరారు. యంత్రాంగం చేసిన తప్పిదానికి తామెందుకు ఫీజు కట్టాలని ప్రశ్నించారు. ఫలితాల్లో తప్పిదాలు సవరించాలని, ఉచితంగా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ జరిపించాలని.. అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు వద్ద రోజురోజుకూ ఆందోళనలు తీవ్రతరమవుతుండడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్యార్థులను సైతం లోనికి అనుమతించడం లేదు. దీంతో ఇంటర్మీడియట్ ఫలితాలు, అడ్వాన్స్ సప్లిమెంటరీ, ఫీజు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ ఇంటర్ బోర్డులో అవకతవకల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆరోపించింది. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే అధికారులు, మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించింది. బుధవారం బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో డీవైఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల చావుకు కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను ఆ పదవినుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. సరిగ్గా రాయనివారే ఫెయిల్ అవుతారని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కమిటీ ముందుకొచ్చిన గ్లోబరీనా ఇంటర్ ఫలితాలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిశీలన ప్రక్రియ వేగవంతమైంది. ఫలితాల విడుదలలో బోర్డు తీసుకున్న చర్యలతో పాటు సాంకేతిక వ్యవహారాలు చూసుకునే ప్రైవేటు సంస్థ ప్రమేయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈనెల 22న త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 23న కమిటీ బృందం ఇంటర్‌బోర్డును సందర్శించి ఫలితాల ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉన్న వారితో చర్చించింది. ప్రస్తుత కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్ (సీఓఈ)తోపాటు అంతకు ముందున్న సీఓఈతో కూడా వేర్వేరుగా సమావేశమైంది. బుధవారం ఇంటర్ బోర్డులో డీపీఆర్పీ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనాతో సమావేశమైంది. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇచ్చిన సమాచారంతో పాటు కాంట్రాక్టు సంస్థ చేసిన కార్యక్రమాలను త్రిసభ్య కమిటీ విశ్లేషించనుంది. -
60% కంటే తక్కువ హాజరుంటే..
శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇంటర్ సైన్స్ విద్యార్థులకు 60 శాతం హాజరు ఉంటేనే వార్షిక పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోకి రానుంది. గతేడాది కూడా ఈ నిబంధన ఉన్నప్పటికీ అప్పట్లో ఆన్లైన్ హాజరు విధానం లేకపోవడం వల్ల కచ్చితంగా అమలయ్యేది కాదు. ఈ ఏడాది బయోమెట్రిక్, ఆన్లైన్ హాజరును ప్రవేశపెట్టడంతో విద్యార్థి హాజరు ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. దీంతో ఇకపై 60 శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలయ్యే అవకాశం ఉంది. సైన్స్ తప్ప మిగిలిన ఇతర సబ్జెక్టుల విద్యార్థులకు 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే వారి నుంచి కాండినేషన్ ఫీజు వసూలు చేసి పరీక్షకు అనుమతిస్తారు. 10 రోజులు హాజరు తక్కువగా ఉంటే రూ.200, 18 రోజులు హాజరు తక్కువగా ఉంటే రూ.250, అంతకంటే హాజరు తక్కువగా ఉంటే రూ.400 కాండినేషన్ ఫీజుగా వసూలు చేస్తారు. డిసెంబర్ 28 వరకు గడువు ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగిసినా, రూ.2,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించే అవకాశాన్ని ఇంటర్ బోర్డు తాజాగా కల్పించింది. వచ్చే ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో తొలిసారిగా జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 2019 ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. వీలైనంత వరకు ఈ పరీక్షలను ప్రభుత్వ కళాశాలల్లోనే నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆదేశాలను జిల్లా అధికారులకు జారీ చేసింది. సెకండియర్‌కు గ్రేడింగ్ విధానం ఈ ఏడాది నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. గతేడాది మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేశారు. పరీక్షల నిర్వహణపై సందేహాలు వచ్చే ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి మాసాంతం నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. మార్చి నెలలో ఎన్నికలు వస్తే ఇంటర్ పరీక్ష నిర్వహణ కష్టసాధ్యమవుతుందని పలువురు అధ్యాపకులు చెబుతున్నారు. -
ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ టైమ్‌టేబుల్ విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి పరీక్షలు ప్రారంభమై మార్చి 18తో ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది జనవరి 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, జనవరి 30న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. -
ఆన్లైన్ ఆగమాగం
సాక్షి, హైదరాబాద్: ఇలాంటి అనేక సమస్యలతో రాష్ట్రంలోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు అన్న తేడా లేకుండా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో యాజమాన్యాలు బోర్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. రాష్ట్రంలో వొకేషనల్ కోర్సులు చదువుతున్న దాదాపు 70 వేల మంది విద్యార్థుల్లో అనేక మంది విద్యార్థుల పరీక్ష ఫీజులు బోర్డుకు చేరకపోవడం, చేరినా తప్పులు దొర్లడంతో యాజమాన్యాలు ఆగమాగం అవుతున్నాయి. ఇక గతంలో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం తప్పుల తడకగా తయారైంది. దాంతో కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు వరుస తప్పుల కారణంగా బోర్డు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వొకేషనల్ విద్యార్థుల డేటా, ఓల్డ్ స్టూడెంట్స్ డేటా ఇప్పటివరకు అప్డేట్ కాలేదని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. తప్పుల తడకగా వచ్చిన విద్యార్థుల సమాచారంతో రేపు విద్యార్థులకు హాల్‌టికెట్లు జనరేట్ చేసే క్రమంలో అందరికి జనరేట్ కాకపోయినా, వాటిల్లో తప్పిదాలు దొర్లినా లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తప్పుల సవరణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించినా బోర్డు కార్యదర్శి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో బోర్డు పరీక్షల నియంత్రణాధికారి చేతులెత్తేసినట్లు సమాచారం. ప్రత్యామ్నాయాలు ఉన్నా ససేమిరా.. తప్పుల తడకగా వచ్చిన సమాచారంతో విద్యార్థులకు హాల్‌టికెట్లు జనరేట్ కష్టమని, అందులో తప్పులు దొర్లితే బోర్డుకే కాదు ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. డేటా సరిగ్గా ఉందా? లేదా? పొరపాట్లు ఉన్నాయా? ఉంటే వాటి సవరణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని పరీక్షల విభాగం ముఖ్య అధికారి మొత్తుకుంటున్నా బోర్డు కార్యదర్శి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బోర్డుకు వచ్చిన విద్యార్థుల ఫీజు చెల్లింపు వివరాలను కాలేజీల వారీగా వెబ్‌సైట్‌లోని వారి లాగిన్‌లో పెట్టి, మార్పులు ఉంటే తిరిగి పంపించమని అడుగుదామంటున్నా ఒప్పుకోవడం లేదని తెలిసింది. లేదా అన్ని కాలేజీలకు తమకు చేరిన డేటాను మెయిల్ చేసి, మార్పులు చేసి హార్డ్ కాపీలు తీసుకువస్తే బోర్డులో మార్పులు చేద్దామని సూచించినా ఒప్పుకోవడం లేదని సమాచారం. ఆ రెండింటిలో ఏది చేసినా తన వల్లే పొరపాట్లు జరిగాయని ఒçప్పుకున్నట్లు అవుతుందనే ఉద్దేశంతో బోర్డు కార్యదర్శి అందుకు ససేమిరా అంటున్నట్లు కొంతమంది అధికారులు పేర్కొన్నారు. తన హయాంలో ఈ పొరపాట్లు బయటకు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్లో ఎలాగూ కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి అధికారుల మార్పు ఉంటుందని, తాను వెళ్లిపోయాక కొత్తగా వచ్చే వారే చూసుకుంటారన్న ఆలోచనతో తప్పుల సవరణకు విముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఎందుకీ మొండితనం.. సమస్యలు ఉన్నాయని బోర్డు అధికారులకు, బోర్డు కార్యదర్శికి ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను (సీజీజీ) పక్కకు పెట్టి మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు ఓ ప్రైవేటు సంస్థకు పనులను అప్పగించడమే గందరగోళానికి కారణమైంది. పైగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, పరిస్థితి గందరగోళంగా మారిందని బోర్డు కార్యదర్శి అశోక్‌కు ఫిర్యాదులు అందినా స్పందించడం లేదని ప్రైవేటు యాజమాన్యాలే కాదు.. ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఉన్నాయని తెలిసినా వాటి పరిష్కారానికి వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా ప్రమాదకర పరిస్థితిని తెస్తున్నారని విమర్శిస్తున్నారు. తప్పులను సవరించకుండా, ఫీజు చెల్లించకుండా విద్యార్థులు నష్టపోయేలా చేసేందుకే కొంతమంది అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని, తద్వారా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రమాదం ఉందని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు పేర్కొంటున్నారు. నల్లగొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో (వొకేషనల్) 44 మంది ఫార్మాటెక్ విద్యార్థులున్నారు. ఇప్పటివరకు వారి ఫీజు బోర్డుకు చేరలేదు. ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని ప్రయత్నిస్తున్నా డేటా కనిపించడం లేదు. ప్రతి రోజు బోర్డుకు మెయిల్ పంపుతుంటే అప్డేట్ చేస్తామంటున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఫీజు చెల్లింపు గడువు ముగిసిపోయింది. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ గందరగోళంలో పడ్డారు. దేవరకొండ దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో (వొకేషనల్) ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ (ఏఈటీ) కోర్సును 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారి ఫీజు వాస్తవానికి రూ. 11,490. కానీ వారందరి ఫీజు కింద ఆన్లైన్లో చెల్లించినపుడు రూ.7,440 మాత్రమే డిడక్ట్ అయి చలానా జనరేట్ అయింది. ఇద్దరు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వారి ఫీజులూ యాక్సెప్ట్ కావడం లేదు. -
అడ్డగోలు ప్రవేశాలకు అంతేలేదు!
సాక్షి, అమరావతి: ఇంటర్ విద్యను కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఆదాయ మార్గంగా మార్చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా కుప్పలు తెప్పలుగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వాస్తవ సంఖ్యకు, రికార్డుల్లో చూపించే లెక్కకు ఎక్కడా పొంతన ఉండదు. నిర్ణీత ఫీజు కంటే పది రెట్లు ఎక్కువగా పిండుకుంటున్నా ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. అనుమతులు లేకుండా హాస్టళ్లను తెరుస్తున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మూడొంతుల మంది ప్రైవేట్ కాలేజీల్లోనే.. రాష్ట్రంలో 3,361 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1,143 మాత్రమే ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు కాగా తక్కిన 2,218 కాలేజీలు కార్పొరేట్ సంస్థలవే. గతంలో ప్రభుత్వం రూపొందించిన గణాంకాల ప్రకారం శ్రీచైతన్య పరిధిలో 186 కాలేజీలుండగా అందులో 1.52 లక్షల మంది చదువుతున్నట్లు పేర్కొంది. నారాయణ పరిధిలోని 152 కాలేజీల్లో 85 వేల మంది, ఎన్ఆర్ఐ యాజమాన్యం పరిధిలోని 38 కాలేజీల్లో 14 వేల మంది, శ్రీగాయత్రి పరిధిలోని 27 కాలేజీల్లో 12 వేల మంది, ఇతర ప్రైవేట్ కాలేజీల్లో మిగతా విద్యార్థులు చదువుతున్నట్లు తేల్చారు. అప్పట్లో విద్యార్థుల సంఖ్య 7 లక్షలు మాత్రమే కాగా ఇప్పుడు ఇంటర్లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య గత ఏడాది 10.26 లక్షల వరకు ఉంది. వీరిలో 3 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుండగా మిగతా వారంతా ప్రైవేట్ కళాశాలల్లోనే చేరుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు కొన్ని కాలేజీలకే ఇంటర్ గుర్తింపు తీసుకుని పలు బ్రాంచీలు నిర్వహిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి తదితర పట్టణాల్లో ఇలా జోరుగా విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. ఎండాకాలంలోనే ప్రవేశాలు పూర్తి ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి బోర్డు పలు నిబంధనలు విధిస్తూ సరŠుయ్యలర్లు జారీ చేసింది. నిర్ణీత షెడ్యూల్ విధించినా కార్పొరేట్ విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం మార్చి 29 నుంచి మే 31 వరకు సెలవులు ఇచ్చి జూన్ 1న కాలేజీలను పునః ప్రారంభించాలి. మొదటి విడత ప్రవేశాలను అప్పుడే నిర్వహించాల్సి ఉండగా ప్రైవేట్ కాలేజీలు అంతకు ముందే వేసవి సెలవుల్లోనే చేపడుతున్నాయి. ఒక్కో సెక్షన్‌కు గరిష్టంగా 88 మంది చొప్పున ఎన్ని సెక్షన్లకు అనుమతి ఉంటే అంత మందిని మాత్రమే చేర్చుకోవాల్సి ఉన్నా పరిమితికి మించి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. రిజర్వేషన్లకు చెల్లుచీటీ నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29% సీట్లు ఇవ్వాలి. అందులో బీసీ(ఏ) 7%, బీసీ(బీ) 10 శాతం, బీసీ(సీ) 1%, బీసీ(డీ) 7 శాతం, బీసీ(ఈ)కి 4% చొప్పున సీట్లు ఇవ్వాలి. దివ్యాంగులకు 3 శాతం, ఎన్సీసీ, క్రీడల కోటా కింద 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33% సీట్లు బాలికలకు కేటాయించాలి. ఈ నిబంధనలను కార్పొరేట్ కాలేజీలు ఎక్కడా పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో ప్రవేశాలతో ఫీజుల దందాకు తెర ఇంజనీరింగ్ మాదిరిగానే ఆన్లైన్లో ప్రవేశాల విధానాన్ని తెస్తే ప్రైవేట్ కాలేజీల అరాచకాలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఫీజులను కూడా ప్రభుత్వమే ఆన్లైన్ ద్వారా సంబంధిత కాలేజీలకు చెల్లించేలా ఏర్పాటు చేస్తే అడ్డగోలు వసూళ్లకు తెర పడుతుందని, ప్రవేశాల్లో పారదర్శకత వస్తుందని సూచిస్తున్నారు. అయితే ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల విద్యా వ్యాపారానికి కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ముందుకు రావడం లేదు. చీమల పుట్టల్లా హాస్టళ్లు... ఒకవైపు లెక్కకు మించి ప్రవేశాలను కల్పిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అనుమతులు లేకుండానే కాలేజీలకు అనుబంధంగా ఇరుకు గదుల్లో హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. కాలేజీల్లో ప్రవేశానికి నిబంధనల ప్రకారం డేస్కాలర్లకు రూ.12,500 చొప్పున మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.60 వేల నుంచి రూ.లక్షకు పైనే గుంజుతున్నాయి. ఇక హాస్టళ్లలో చేరేవారి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా పిండుకుంటున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. -
ప్రభుత్వ కాలేజీల టాపర్లకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రతిభకు ప్రతిబింబాలని ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ అశోక్ పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీల్లో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకొని అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఆయన బంగారు పతకాలు, నగదు బహుమతులతో సత్కరించారు. టాపర్లకు సత్కారం.. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కాలేజీల నుంచి 985 మార్కులతో టాపర్‌గా నిలిచిన సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని జూలూరి శ్రీమేధకు రూ.50 వేల నగదు, బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే 982 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో ఉన్న సిద్దిపేట జిల్లా కోహెడ కాలేజీకి చెందిన కుంభం రమ్యకు రూ.40 వేల నగదుతోపాటు ప్రశంసాపత్రం, 978 మార్కులతో మూడో స్థానం పొందిన ఆదిలాబాద్ జిల్లా బో«ధ్‌కు చెందిన కె.హారికకు రూ.30 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే గ్రూపుల వారీగా, జనరల్, వొకేషనల్‌లో టాపర్లను సన్మానించారు. -
14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 14 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. 819 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,20,549 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. వారిలో ఇంప్రూవ్మెంట్ కోసం హాజరు కానున్న వారు 1,25,960 మంది ఉన్నట్లు శుక్రవారం బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 8,420 మంది ఇన్విజిలేటర్లను, 819 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 819 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటాయని అశోక్ తెలిపారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, 8:45 గంటలకల్లా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను 1:30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 2:15 గంటలకల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో కూర్చోవాలన్నారు. పరీక్ష ప్రారంభ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారు ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చని సూచించారు. వాటిపై కాలేజీల ప్రిన్సిపాళ్ల సంతకాలు అవసరం లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 040–24601010/24732369 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. 24 నుంచి ప్రాక్టికల్స్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగానే ఈ నెల 24 నుంచి 28 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు అశోక్ తెలిపారు. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలను ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరుగుతుందన్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,294 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 9,63,546 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. దీనికి ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు ఉదయం 8:30 గంటల కంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు.. ఈ సారి ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని తెలిపారు. ఇన్విజిలేటర్లు కూడా ఫోన్లను తీసుకెళ్లవద్దని పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే బోర్డు కార్యాలయంలోని కంట్రోల్‌రూమ్ 040–24601010, 040–24732369 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. 4,55,635 మంది ఫస్టియర్ విద్యార్థులు, 5,07,911 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. హాల్టికెట్లలో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే.. ద్వితీయ సంవత్సర పరీక్షల ప్రారంభ తేదీపై కొంత గందరగోళం నెలకొంది. మొదట్లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే విద్యార్థుల హాల్టికెట్లలో మాత్రం మార్చి 2 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్నట్లు షెడ్యూల్ ముద్రించారు. దీంతో విద్యార్థులు కొంత గందరగోళానికి గురయ్యారు. దీనిపై అధికారులను సంప్రదించగా.. హాల్‌టికెట్‌లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. -
నో జంబ్లింగ్.. ఓన్లీ గ్యాంబ్లింగ్..!
సాక్షి, హైదరాబాద్:‘‘విద్యా వ్యాపారంలో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు మార్కులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అధిక మార్కులు, ర్యాంకుల పేరుతో విస్తృత ప్రచారం చేసుకుంటూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. కానీ విద్యార్థికి సంపూర్ణ జ్ఞానం అందించాలన్న ధ్యాసే వాటికి లేకుండాపోయింది. ప్రయోగాలు చేయించే ఆలోచనే లేదు. పరీక్షల సమయంలో మేనేజ్ చేస్తూ వంద శాతం మార్కులు వేయిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ప్రాక్టికల్స్ నాలెడ్జి ఉండటం లేదు. దీంతో పై తరగతులకు వెళ్లాక వారు ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థుల జంబ్లింగ్ అమలు చేయాల్సిందే..’’ పదేళ్ల కిందట ప్రొఫెసర్ దయారత్నం కమిటీ చెప్పిన మాటలివి. అయితే ఇప్పటివరకు ఇంటర్ బోర్డు వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల వ్యాపార దృక్పథాన్ని కమిటీ బయటపెట్టినా పట్టించుకోలేదు. కమిటీ సిఫారసులు అమలు కాకపోవడానికి కార్పొరేట్ కాలేజీల మాయాజాలమే ప్రధాన కారణం. పదేళ్ల నుంచి ఇప్పటివరకు ఏవేవో కారణాలు చెబుతూ ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి వాయిదా వేస్తూనే ఉన్నారు. అప్పట్లో ల్యాబ్‌లు లేవు.. ఇపుడు ప్రాక్టికల్స్ లేవు! రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని 2006లోనే ప్రొఫెసర్ దయారత్నం కమిటీ స్పష్టం చేసింది. 60 శాతం ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని, 30 శాతం ప్రభుత్వ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని, మొత్తంగా రాష్ట్రంలోని 40 శాతం జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని వెల్లడించింది. దీంతో ప్రభుత్వం 2008లోనే వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని, జంబ్లింగ్ అమలు చేస్తామని స్పష్టం చేసింది. ప్రైవేటు కాలేజీల ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్ము రూ.4 లక్షలను బ్యాంకు నుంచి విడిపించుకుని ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అయితే సొమ్మును తీసుకున్న యాజమాన్యాలు.. ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినట్లుగా తమదైన ‘మేనేజ్మెంట్’ను ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నాయి. 30కి 30 వేస్తే పరిశీలన ఏదీ? బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ఒక్కో దాంట్లో ప్రాక్టికల్స్‌కు 30 మార్కుల చొప్పున 120 మార్కులు ఉంటాయి. అదే ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీలో 30 చొప్పున 60 మార్కులు ఉంటాయి. అయితే ఒక్కో సబ్జెక్టుకు 30కి 30 మార్కులు వస్తే వాటిని పునఃపరిశీలన చేయిస్తామన్న బోర్డు నిబంధనలు అమలు కావడం లేదు. ఇప్పటివరకు ఒక్క విద్యార్థి విషయంలో కూడా పునఃపరిశీలన జరగలేదు. విద్యార్థులకు నష్టం.. జంబ్లింగ్ అమలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ విద్యార్థులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. కార్పొరేట్, ప్రైవేటు విద్యార్థులకు అధిక మార్కులు వస్తుండటంతో అగ్రికల్చర్ కోర్సుల్లో వారికే మెరిట్ ద్వారా సీట్లు వస్తున్నాయి. వెయిటేజీ కారణంగా ఎంసెట్‌లో టాప్ ర్యాంకులతో వారికే టాప్ కాలేజీల్లో సీట్లు లభిస్తున్నాయి. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు రికార్డులు కూడా సరిగ్గా ఉండవు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల విద్యార్థులు ప్రాక్టికల్స్ సరిగ్గా చేయరు. అయినా వారికి ఒక్కో సబ్జెక్టులో 30కి 30 మార్కులు వస్తున్నాయి. కనీసం వారి రికార్డులు కూడా సరిగ్గా ఉండవు. వారి చేతి రాతతో సరిపోలవు. అయినా వారు ప్రాక్టికల్స్ చేసినట్లుగా సృష్టిస్తున్నారు. ఇలా తాత్కాలిక ప్రయోజనం చేకూరవచ్చు. కానీ ఆ విద్యార్థుల భవిష్యత్తుకు తీరని నష్టమన్న సంగతి గ్రహించడం లేదు. – కవిత కిరణ్, బోటనీ లెక్చరర్ 80% కాలేజీల్లో నో ప్రాక్టికల్స్ ప్రస్తుతం రాష్ట్రంలోని 80 శాతం ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల్లో ల్యాబ్‌లే లేవన్న విమర్శలున్నాయి. ల్యాబ్‌ను నిర్వహించే ల్యాబ్ అసిస్టెంట్లు ఏ కాలేజీలోనూ లేరనే వాస్తవాలు ఇంటర్మీడియెట్ విద్యా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లోనే అనేకసార్లు బయట పడింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపు సమయంలో ఏదో ఒక హాల్‌కు సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్ అంటూ బోర్డులు పెట్టి ఫొటోలతో దరఖాస్తు చేయడం తప్ప కాలేజీల్లో ప్రాక్టికల్స్ జరగడం లేదన్న వాస్తవాన్ని ఇంటర్ విద్యా శాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. రాష్ట్రంలో 1,556 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉంటే వాటిలోని 80 శాతం కాలేజీల్లో ప్రాక్టికల్స్ జరగడం లేదని ఇంటర్ బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. పరీక్షల సమయం వచ్చిందంటే కొన్ని కాలేజీలు మాత్రం మూడు రోజులు విద్యార్థులను కొంతమేర సిద్ధం చేయడం, మిగతా ఎగ్జామినర్లను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను మేనేజ్ చేసి మార్కులు వేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగతా కాలేజీలైతే ఆ కొద్దిపాటి ప్రిపరేషన్ కూడా చేయించకుండానే విద్యార్థులను పరీక్షలకు తీసుకొస్తున్నట్లు విమర్శలున్నాయి. వారికి ప్రాక్టికల్స్‌పై కనీస అవగాహన ఉండటం లేదు. మళ్లీ మొదలైన ‘మేనేజ్’మెంట్ రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షల మేనేజ్మెంట్ మళ్లీ మొదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు దాదాపు 90 వేల మంది బైపీసీ విద్యార్థులు హాజరుకానుండగా, 1.45 లక్షల మంది ఎంపీసీ విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తం 2.35 లక్షల మంది విద్యార్థుల్లో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల నుంచే లక్షన్నర మందికి పైగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు మళ్లీ ‘మేనేజ్’మెంట్‌కు సిద్ధమయ్యాయి. ఇందుకోసమే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫస్టియర్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 19 వరకు, సెకండియర్ పరీక్షలను మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ మంగళవారం షెడ్యూల్‌ను జారీ చేశారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష అదే నెల 31న ఉంటుందని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. జనరల్‌తోపాటు వొకేషనల్ విద్యార్థులకు ఇవే పరీక్ష తేదీలు వర్తిస్తాయని తెలిపారు. మొదటి రోజు ద్వితీయ భాషా సబ్జెక్టుతో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే టెన్త్ పరీక్షల షెడ్యూలు.. పదో తరగతి పరీక్షల షెడ్యూలు ఖరారుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 12 లేదా 14వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంది. ఏటా ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినం. ఈసారి నుంచి ఏప్రిల్ 12వ తేదీని చివరి పనిదినంగా ప్రకటించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 9 వరకు ప్రీఫైనల్ పరీక్షలున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 12 లేదా 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
ఇంటర్ నోటిఫికేషన్ ఇంకెప్పుడు?
ఆన్లైన్ ప్రవేశాలపై తేలనందునే జాప్యం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రవేశాల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్ జారీకి నిర్ణయం తీసుకోవాలంటూ ఇంటర్ బోర్డు పంపించిన ఫైలును పక్కన పడేసింది. గతేడాది టెన్త్ ఫలితాల తర్వాత వారం రోజుల్లోనే ఇంటర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసిన బోర్డు... ఈసారి పదో తరగతి ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా చర్యలు తీసుకోలేకపోతోంది. ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల వ్యవహారాన్ని ఎటూ తేల్చకుండా సంబంధిత ఫైలును పక్కన పడేయడమే ఇందుకు కారణం. బోర్డు నిబంధనల ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్రవేశాల ప్రక్రియే ప్రారంభం కాకపోవడంతో ఈసారి ఫస్టియర్ తరగతులు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రముఖ ప్రైవేటు కాలేజీలు తమ ఇష్టానుసారంగా సీట్లు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ ప్రవేశాలు వద్దంటూ ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నందునే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన ఫైలును ఇంటర్ బోర్డు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి పంపించి 45 రోజులు అవుతున్నా.. తొందరపడవద్దంటూ పక్కన పెట్టేశారు. దీంతో ఈసారి ప్రవేశాలు ఆన్లైన్లో చేపడతారా? ఆఫ్‌లైన్‌లో చేపడతారా? అన్న గందరగోళం నెలకొంది. -
ఇంటర్ బోర్డు ‘ప్రైవేట్’ బేరం
- ప్రైవేట్ సంస్థ ఆన్లైన్ పాఠాల యాప్‌కు బోర్డు అండ! - బోర్డు ఆధ్వర్యంలోనే రూపొందిస్తున్నట్లు సర్టిఫికేషన్ - సీనియర్ అధికారుల ప్రోత్సాహంతోనే ప్రైవేట్ వ్యాపారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డులో భారీ అక్రమానికి తెర లేచింది. ఆన్లైన్లో పాఠాలు అందిస్తామంటూ ఓ ప్రైవేట్ సంస్థ రూపొందిస్తున్న మొబైల్ యాప్‌ను బోర్డే సర్టిఫై చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్ చదివే 10 లక్షల మంది విద్యార్థులకు ఆ యాప్ అందుబాటులోకి తేవడం ద్వారా రూ. కోట్లు సంపాదించవచ్చన్న ప్రైవేట్ సంస్థ ఆలోచనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బోర్డు సర్టిఫై చేసిందంటే సహజంగానే కంటెంట్ బాగుంటుందనే ఆలోచనతో విద్యార్థులంతా కొనుగోలు చేస్తారు. బాగా ఉపయోగపడు తుందని భావిస్తారు. విద్యార్థుల ఆ ఆశలను క్యాష్ చేసుకొని భారీగా దండుకోవచ్చన్న ప్రైవేట్ సంస్థ ప్రణాళికకు బోర్డు ఓకే చెప్పింది. దానిపై ఒప్పందం చేసుకుంది. యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే విద్యార్థి నుంచి ఏటా రూ. 300 చొప్పున వసూలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దీన్ని వ్యతిరేకించిన అధికారులపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు కక్ష సాధింపు చర్యలకు దిగారు. యాప్‌ను వ్యతిరేకించినందుకు, అనుకూలంగా సంతకం చేయనందుకు ఓ అధికారిని రాత్రికి రాత్రే బదిలీ చేశారు. ఒత్తిడి తట్టుకోలేక మరో అధికారి రీప్యాట్రేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. అకడమిక్ విభాగం లోని మరికొంత మంది అదే బాటలో ఉన్నారు. అయినా ప్రైవేట్ సంస్థ వ్యాపారానికి బోర్డును అడ్డగోలుగా తాకట్టు పెట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. డిస్క్ పేరుతో : ఇంటర్మీడియెట్‌కు గాను ఆన్లైన్ డిజిటల్ పాఠాలు అందిస్తామంటూ డిజిటల్ స్టడీ కంటెంట్ (డిస్క్) పేరుతో వ్యాపారం చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థ సిద్ధమైంది. బోర్డును సంప్రదించి ఉన్నతాధి కారులను ఒప్పించింది.ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత నుంచి బోర్డుకు ఓ మాట చెప్పిం చింది.చకచకా పనులు మొదలయ్యాయి. ఒప్పందాలు జరిగాయి. విద్యార్థులకు ఇంటర్ పాఠాలను అందిస్తామని.. అలాగే ఎంసెట్, జేఈఈ మెటీరియల్ రూపొందిస్తామని సదరు సంస్థ చెప్పగా అందుకూ బోర్డు ఓకే చెప్పింది. దీంతో యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు పనులు మొదలయ్యాయి. ఇంటర్ బోర్డు సర్టిఫై చేసిన యాప్ అంటూ విద్యార్థుల నుంచి దండుకునేందుకు సంస్థ సిద్ధమైంది. బోర్డు ఆన్లైన్ పాఠాలు మూలకు... రెండేళ్ల కిందట సిలబస్ మార్పులు చేసిన సమయంలో ఆన్లైన్ పాఠాలను బోర్డు రూపొందించినా ఇంతవరకూ విద్యార్థులకు అందుబాటులోకి తేలేదు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో 10 నుంచి 15 మంది సీనియర్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు రోజుల తరబడి కూర్చొని రూపొందిం చిన పాఠాలను మూలన పడేసింది. విద్యార్థులకు అందించాలన్న ధ్యాస అధికారుల్లో లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు కనీసం మన టీవీ ద్వారా ఆ పాఠాలను చెప్పించాలన్న ఆలోచ నలూ రావడం లేదు. మరోవైపు గతేడాది గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇచ్చిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు.. ఈసారీ కోచింగ్ సిద్ధమవగా బోర్డు పట్టించుకోకుండాప్రైవేటు సంస్థ రూపొంది స్తున్న యాప్‌కు ఓకే చెప్పింది. బోర్డులోని కిందిస్థాయి అధికారులంతా వ్యతిరేకించినా యాప్‌నే అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. అనుమతి కుదరదన్నందుకు బదిలీ.. ఇంటర్ బోర్డులో అకడమిక్ విభాగం అనుమతి లేకుండా ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. కాబట్టి అకడమిక్ విభాగంలోని అధికారులంతా ఆ యాప్‌కు సంతకం చేయాలని, అనుమతివ్వాలని బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఒత్తిడి పెంచారు. అయితే ప్రైవేటు సంస్థ యాప్ ఎందుకు, బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన ఆన్లైన్ పాఠాలున్నాయి, మొబైల్ యాప్ ద్వారా వాటిని అందిద్దాం అని అసోసియేట్ ప్రొఫెసర్ సునంద వివరించారు. దాన్ని ఏమాత్రం వినిపించుకోని అధికారి.. సంతకం చేయాలని సునందపై ఒత్తిడి పెంచారు. ప్రైవేటు సంస్థ వ్యాపారానికి బోర్డు వత్తాసు పలకడం సరికాదని, ఆ సంస్థ కంటెంట్‌కు మనం ఓకే చెప్పడం కుదరదని, సంతకం చేయనని ఆమె స్పష్టం చేశారు. దీంతో రాత్రికి రాత్రే పెద్దపల్లిలో ఓ కాలేజీకి ఆమెను బదిలీ చేశారు. -
గ్రేస్ మార్కుల విధానానికి స్వస్తి
- ఏ రాష్ట్రంలోనూ అమలు చేయొద్దన్న సీబీఎస్ఈ - టెన్త్, ఇంటర్లో అదనపు మార్కులు ఇవ్వొద్దని నిర్ణయం - ఈ విద్యా సంవత్సరం నుంచి గ్రేస్, యాడ్‌స్కోర్, మోడరేషన్ బంద్ సాక్షి, హైదరాబాద్: పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లలో అదనపు మార్కుల విధానానికి స్వస్తి పలకాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మోడరేషన్, యాడ్ స్కోర్, గ్రేస్ మార్కుల పేరుతో ఇస్తున్న అదనపు మార్కులను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయొద్దని నిర్ణయానికి వచ్చింది. ఇటీవల అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికా రులతో సీబీఎస్ఈ సమావేశం నిర్వహించగా.. రాష్ట్రం నుంచి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పరీక్షల నియంత్రణాధికారి సుశీల్‌కుమార్, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు మార్కుల విధానం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని సమావేశంలో దృష్టికి వచ్చింది. ఇంటర్‌తోపాటు ఢిల్లీ, సెంట్రల్ వర్సిటీలకు చెందిన కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల్లో మార్కుల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో అదనపు మార్కుల విధానానికి స్వస్తి పలకాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, కేరళలో కల్చరల్ స్పోర్ట్స్‌లో ఉన్న విద్యార్థులకు 10 మార్కుల చొప్పున కలుపుతున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి క్రీడలు ఆడితే, నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటే కొన్ని మార్కులు కలు పుతున్నారు. మన రాష్ట్రంతోపాటు మరికొన్ని రాష్ట్రా ల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయిన, ప్రశ్నలు కఠినంగా వచ్చిన సందర్భాల్లో ఒకటి, రెండు మార్కులతో పాస్ అయ్యే విద్యార్థులకు మార్కులను యాడ్ స్కోర్‌గా ఇస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో 3 సెట్ల ప్రశ్నపత్రాలను ఇస్తుండటంతో మార్కుల్లో తేడాలొస్తున్నాయి. ఈ సందర్భాల్లోనూ మోడరేషన్ పేరుతో మార్కులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ రకంగానూ మార్కులను అదనంగా ఇవ్వొద్దని అన్ని రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. -
ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం ఇవ్వాలి
ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థుల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తప్పిన సబ్జెక్టులకు తప్ప ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టుల ఇంప్రూవ్‌మెంట్‌కు ఇంటర్ బోర్డు అవకాశం ఇవ్వక పోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. శనివారం పరీక్ష ఫీజుకు తుది గడువు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఒకటి, రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాని వారు మిగతా వాటిల్లో మెరుగైన మార్కుల కోసం ఇంప్రూవ్మెంట్ రాసుకొనే అవకాశం ఉంది. కానీ బోర్డు అధికారులు అందుకు అనుమతించడం లేదు. గడువు పెంచండి... ఈ నెల 16న ఇంటర్ ఫలితాలు వచ్చాయి. మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టడానికి గడువు శనివారంతో ముగుస్తుంది. మే 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. కానీ, ఫెయిలైన విద్యార్థులు బెటర్మెంట్ కూడా రాయాలంటే ఇంటర్ బోర్డు అనుమతి కావాలని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇంటర్ బోర్డుకు వెళ్లి అడిగితే... అక్కడ అధికారులెవరూ నోరు మెదపడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా శనివారం బ్యాంకులు కూడా బంద్ ఉన్నాయని, ఇలాగైతే తమ పిల్లల భవిష్యత్ ఏం కావాలని వాపోతున్నారు. తమ పిల్లలకు బెటర్మెంట్ అవకాశం కల్పించాలని, ఫీజు గడువు పెంచాలని కోరుతున్నారు.