నో జంబ్లింగ్‌.. ఓన్లీ గ్యాంబ్లింగ్‌..! | There is no jambling implementation in Inter practical | Sakshi
Sakshi News home page

నో జంబ్లింగ్‌.. ఓన్లీ గ్యాంబ్లింగ్‌..!

Published Mon, Jan 29 2018 1:57 AM | Last Updated on Mon, Jan 29 2018 1:57 AM

There is no jambling implementation in Inter practical - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:‘‘విద్యా వ్యాపారంలో ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు మార్కులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అధిక మార్కులు, ర్యాంకుల పేరుతో విస్తృత ప్రచారం చేసుకుంటూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. కానీ విద్యార్థికి సంపూర్ణ జ్ఞానం అందించాలన్న ధ్యాసే వాటికి లేకుండాపోయింది. ప్రయోగాలు చేయించే ఆలోచనే లేదు. పరీక్షల సమయంలో మేనేజ్‌ చేస్తూ వంద శాతం మార్కులు వేయిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ నాలెడ్జి ఉండటం లేదు. దీంతో పై తరగతులకు వెళ్లాక వారు ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో విద్యార్థుల జంబ్లింగ్‌ అమలు చేయాల్సిందే..’’ పదేళ్ల కిందట ప్రొఫెసర్‌ దయారత్నం కమిటీ చెప్పిన మాటలివి. అయితే ఇప్పటివరకు ఇంటర్‌ బోర్డు వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల వ్యాపార దృక్పథాన్ని కమిటీ బయటపెట్టినా పట్టించుకోలేదు. కమిటీ సిఫారసులు అమలు కాకపోవడానికి కార్పొరేట్‌ కాలేజీల మాయాజాలమే ప్రధాన కారణం. పదేళ్ల నుంచి ఇప్పటివరకు ఏవేవో కారణాలు చెబుతూ ప్రైవేటు, కార్పొరేట్‌ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి వాయిదా వేస్తూనే ఉన్నారు. 

అప్పట్లో ల్యాబ్‌లు లేవు.. ఇపుడు ప్రాక్టికల్స్‌ లేవు! 
రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని 2006లోనే ప్రొఫెసర్‌ దయారత్నం కమిటీ స్పష్టం చేసింది. 60 శాతం ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని, 30 శాతం ప్రభుత్వ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని, మొత్తంగా రాష్ట్రంలోని 40 శాతం జూనియర్‌ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని వెల్లడించింది. దీంతో ప్రభుత్వం 2008లోనే వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని, జంబ్లింగ్‌ అమలు చేస్తామని స్పష్టం చేసింది. ప్రైవేటు కాలేజీల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సొమ్ము రూ.4 లక్షలను బ్యాంకు నుంచి విడిపించుకుని ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అయితే సొమ్మును తీసుకున్న యాజమాన్యాలు.. ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినట్లుగా తమదైన ‘మేనేజ్‌మెంట్‌’ను ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నాయి. 

30కి 30 వేస్తే పరిశీలన ఏదీ? 
బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ఒక్కో దాంట్లో ప్రాక్టికల్స్‌కు 30 మార్కుల చొప్పున 120 మార్కులు ఉంటాయి. అదే ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీలో 30 చొప్పున 60 మార్కులు ఉంటాయి. అయితే ఒక్కో సబ్జెక్టుకు 30కి 30 మార్కులు వస్తే వాటిని పునఃపరిశీలన చేయిస్తామన్న బోర్డు నిబంధనలు అమలు కావడం లేదు. ఇప్పటివరకు ఒక్క విద్యార్థి విషయంలో కూడా పునఃపరిశీలన జరగలేదు.

విద్యార్థులకు నష్టం.. 
జంబ్లింగ్‌ అమలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ విద్యార్థులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. కార్పొరేట్, ప్రైవేటు విద్యార్థులకు అధిక మార్కులు వస్తుండటంతో అగ్రికల్చర్‌ కోర్సుల్లో వారికే మెరిట్‌ ద్వారా సీట్లు వస్తున్నాయి. వెయిటేజీ కారణంగా ఎంసెట్‌లో టాప్‌ ర్యాంకులతో వారికే టాప్‌ కాలేజీల్లో సీట్లు లభిస్తున్నాయి. 
– డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు

రికార్డులు కూడా సరిగ్గా ఉండవు 
కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల విద్యార్థులు ప్రాక్టికల్స్‌ సరిగ్గా చేయరు. అయినా వారికి ఒక్కో సబ్జెక్టులో 30కి 30 మార్కులు వస్తున్నాయి. కనీసం వారి రికార్డులు కూడా సరిగ్గా ఉండవు. వారి చేతి రాతతో సరిపోలవు. అయినా వారు ప్రాక్టికల్స్‌ చేసినట్లుగా సృష్టిస్తున్నారు. ఇలా తాత్కాలిక ప్రయోజనం చేకూరవచ్చు. కానీ ఆ విద్యార్థుల భవిష్యత్తుకు తీరని నష్టమన్న సంగతి గ్రహించడం లేదు.  
– కవిత కిరణ్, బోటనీ లెక్చరర్‌ 

80% కాలేజీల్లో నో ప్రాక్టికల్స్‌
ప్రస్తుతం రాష్ట్రంలోని 80 శాతం ప్రైవేటు కార్పొరేట్‌ కాలేజీల్లో ల్యాబ్‌లే లేవన్న విమర్శలున్నాయి. ల్యాబ్‌ను నిర్వహించే ల్యాబ్‌ అసిస్టెంట్లు ఏ కాలేజీలోనూ లేరనే వాస్తవాలు ఇంటర్మీడియెట్‌ విద్యా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లోనే అనేకసార్లు బయట పడింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపు సమయంలో ఏదో ఒక హాల్‌కు సైన్స్‌ ల్యాబ్, మ్యాథ్స్‌ ల్యాబ్‌ అంటూ బోర్డులు పెట్టి ఫొటోలతో దరఖాస్తు చేయడం తప్ప కాలేజీల్లో ప్రాక్టికల్స్‌ జరగడం లేదన్న వాస్తవాన్ని ఇంటర్‌ విద్యా శాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. రాష్ట్రంలో 1,556 ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు ఉంటే వాటిలోని 80 శాతం కాలేజీల్లో ప్రాక్టికల్స్‌ జరగడం లేదని ఇంటర్‌ బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. పరీక్షల సమయం వచ్చిందంటే కొన్ని కాలేజీలు మాత్రం మూడు రోజులు విద్యార్థులను కొంతమేర సిద్ధం చేయడం, మిగతా ఎగ్జామినర్లను, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను మేనేజ్‌ చేసి మార్కులు వేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగతా కాలేజీలైతే ఆ కొద్దిపాటి ప్రిపరేషన్‌ కూడా చేయించకుండానే విద్యార్థులను పరీక్షలకు తీసుకొస్తున్నట్లు విమర్శలున్నాయి. వారికి ప్రాక్టికల్స్‌పై కనీస అవగాహన ఉండటం లేదు. 

మళ్లీ మొదలైన ‘మేనేజ్‌’మెంట్‌ 
రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్‌ పరీక్షల మేనేజ్‌మెంట్‌ మళ్లీ మొదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు దాదాపు 90 వేల మంది బైపీసీ విద్యార్థులు హాజరుకానుండగా, 1.45 లక్షల మంది ఎంపీసీ విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తం 2.35 లక్షల మంది విద్యార్థుల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల నుంచే లక్షన్నర మందికి పైగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు మళ్లీ ‘మేనేజ్‌’మెంట్‌కు సిద్ధమయ్యాయి. ఇందుకోసమే ప్రైవేటు కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థుల నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement