Inter education
-
పీడీ పోస్టులకు అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఎడ్యుకేషన్ జారీ చేసిన పీడీ పోస్టుల పరీక్షకు అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన 192 మందిని పీడీ పోస్టు పరీక్ష రాసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే తాము వెల్లడించే వరకు ఫలితాలు విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. ఎంపీఈడీ పూర్తిచేసిన తమను ఇంటర్ ఎడ్యుకేషన్ జారీ చేసిన పీడీ పోస్టుల పరీక్ష రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకూర్తికి చెందిన ఆర్.శ్రీనుతో పాటు మరో 191 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పోస్టులకు గత నెల నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. ఎంపీఈడీతోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు మాత్రమే అర్హులని పేర్కొంది. ఇది చట్టవిరుద్ధమని.. డిగ్రీ పూర్తి చేసిన తమను పరీక్ష రాసేందుకు అనుమతించాలని, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్ర యించారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకా రాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మా సనం.. పరీక్ష రాసేందుకు పిటిషనర్లకు అను మతి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. -
188 పనిదినాలు.. 47 సెలవులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యకు సంబంధించి 2021–22 విద్యాసంవత్సరానికి ఇంటర్ బోర్డు క్యాలెండర్ విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 188 పనిదినాలున్నాయి. కోవిడ్ కారణంగా అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు, పరీక్షల నిర్వహణ వంటి ప్రక్రియలపై ఈ క్యాలెండర్ రూపొందించింది. సెకండియర్ విద్యార్థులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన బోర్డు ఈనెల 16 నుంచి ప్రత్యక్ష తరగతులు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్టియర్ విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఈ ఏడాది ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసిన బోర్డు ఆన్లైన్ దరఖాస్తు తేదీని ఈనెల 27వ తేదీ వరకు పొడిగించింది. అడ్మిషన్లు పూర్తయిన అనంతరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఫస్టియర్ విద్యార్థులకు తరగతులను ప్రారంభించనుంది. 47 సెలవులు ఇంటర్ బోర్డు క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో 47 సెలవుదినాలున్నాయి. అన్ని రెండో శనివారాలు పనిదినాలుగానే ఉంటాయి. టర్మ్ సెలవులు లేవు. వేసవి సెలవుల్లో అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీలను మూసి ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు అన్ని ఆదివారాలు, పబ్లిక్‌సెలవుదినాలను తప్పనిసరిగా పాటించాలి. అడ్మిషన్లు పూర్తిగా బోర్డు ప్రకటించిన షెడ్యూళ్లలో మాత్రమే జరుగుతాయి. విద్యార్థులను తమ కాలేజీల్లో చేరేలా ఒత్తిడి చేయడం, తమ కాలేజీ ఫలితాలు అంటూ ఆకర్షించేలా ప్రలోభపెట్టడం వంటివి చేయరాదు. హోర్డింగులు, పాంప్లేట్లు, పత్రికలు, టీవీల్లో ప్రకటనలు చేయరాదు. పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలా చేస్తామని హామీలివ్వడం నిబంధనలకు విరుద్ధమని, ఇలా చేస్తే చర్యలుంటాయని కాలేజీల యాజమాన్యాలకు బోర్డు స్పష్టం చేసింది. -
హైస్కూళ్లలో ఇక ఇంటర్ విద్య
కడప ఎడ్యుకేషన్ : పదో తరగతి చదివిన చోటే ఇంటర్మీడియెట్‌ను పూర్తి చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత తమ పిల్లలను ఏ కళాశాలలో చేర్పించాలన్నది తల్లిదండ్రులకు పెద్ద సమస్య. ‘ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తుందా.. వచ్చినా ఎంత దూరం వెళ్లి చదువుకోవాలి.. ఒత్తిడి విద్య, ఫీజుల భారం’ లాంటి కారణాలతో చదువును ఆపేసి.. ఇంటికే పరిమితమైపోవడం వంటి వాటకి చెక్ పడనుంది. మండలాలు దాటే పరిస్థితికి చెక్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్ కోసం మండలాలు దాటాల్సిన అవసరం లేదు. మండల కేంద్రంలోని హైస్కూల్లోనే ఇంటర్మీడియెట్ విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు చాలా మంది ఇంటర్మీడియెట్ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. కాలేజీ దూరాభారం వల్లే సమస్య తలెత్తుతోందని దాదాపు అందరూ అంగీకరించినట్లు తెలిసింది. పదో తరగతి తర్వాత ముఖ్యంగా ఎక్కవ మంది బాలికలు విద్యకు దూరమై డ్రాపౌట్స్‌గా మారుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు పేద, మధ్య తరగతి విద్యార్థులు కూడా పై చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేక విద్యకు దూరమౌతున్నారు. ఇక హైస్కూల్స్‌లో ఇంటర్ విద్యను ప్రవేశ పెడితే బాలికల్లో డ్రాపౌట్స్ సంఖ్య తగ్గుతుంది. అలాగే గ్రామీణ ప్రాంత పేద, మధ్య తరగతికి చెందిన వారు విద్యావంతులుగా మారే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా 32 హైస్కూల్స్‌ను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయనున్నారు. వీటిలో చదివే వారంతా ఇక ఇంటర్ విద్యను కొనసాగించనున్నారు. జిల్లాలో ఉన్న జూనియర్ కళాశాలలు జిల్లాలో 50 మండలాలు ఉన్నాయి. ఇందులో 27 ప్రభుత్వ, 20 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు 10 మోడల్ స్కూల్స్, 10 సోసియల్ వేల్ఫేర్, 10 కేజీబీవీలల్లో జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది నుంచి మరో 19 కే జీబీవీల్లో ఇంటర్ విద్యను అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఏడాది నుంచి కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంటర్ తరగతులు బోధించడం వల్ల గ్రామీణ ప్రాంతానికి చెందిన అనేక మంది విద్యార్థులు చదివే అవకాశం ఉంది. జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యే మండలాలివే.. జిల్లాలోని బి కోడూరు, బ్రహ్మంగారిమఠం, చక్రాయపేట, చాపాడు, చెన్నూరు, చిన్నమండెం, చిట్వేలి, దువ్వూరు, గాలివీడు, కమలాపురం, కాశినాయన, ఖాజీపేట, కొండాపురం, లింగాలలో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అలాగే ముద్దనూరులో రెండు, మైలవరం, నందలూరు, ఓబులవారిపల్లె, పెద్దముడియం, పెనగలూరు, పెండ్లిమర్రి, రాజుపాళెం, సిద్దవటం, సింహాద్రిపురంలో రెండు, తొండూరులో రెండు, వల్లూరు, వీరపునాయునిల్లె, వేంపల్లిలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
కేజీబీవీల్లో ఇంటర్
అనాథలు.. బడి మధ్యలో మానేసిన బాలికల కోసం మహానేత దివంగత సీఎం వైఎస్సార్ 2004–05 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 53 మండలాల్లో కస్తూర్బా బాలికల విద్యాలయాలను ప్రారంభించారు. దీంతో ఎంతోమంది నిరుపేద బాలికలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. దివంగత నేత ఆశయాలే స్ఫూర్తిగా పరిపాలన సాగిస్తున్న నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యాలయల్లో సమూల మార్పు తీసుకొచ్చే క్రమంలో భాగంగా జిల్లాలోని 21 కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యను ప్రారంభించాలని నిర్ణయించారు. కర్నూలు ,ఆళ్లగడ్డ: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు ముందు ఈ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిస్ మీడియంలో ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. అయితే పదో తరగతి వరకు చదువున్న బాలికలు ఇంటర్ విద్యకు దూరమవుతండటంతో పాటు బాల్య వివాహాలు జరుగుతున్నా యి. వారు పదితోనే ఆగకుండా ఉన్నత చదువులు చదవాలని భావించి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 140 కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్, వృత్తి విద్యాకోర్సులు ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 21 కేజీబీవీల్లో మొదటి సంవ త్సరం ఇంటర్మిడియట్ ప్రారంభించనున్నారు. నిరుపేద బాలికలకు వరం.. కేజీబీవీల్లో పదో తరగతి పూర్తి చేసిన బాలికలు పై చదువులకు దూరమవుతున్నారు. దూర ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలలకు పంపలేని అనేక మంది బాలికల కుటుంబ సభ్యులు వారికి బాల్య వివాహాలు చేస్తున్నారు. అలాంటి బాలికలకు కేజీబీవీల్లో ఇంటర్ విద్య వరంగా మారనుంది. జిల్లాలోని 53 కేజీబీవీల్లో గత సంవత్సరం రెండు చోట్ల ఇంటర్ విద్య ప్రవేశ పెట్టినప్పటికీ అవసరమైన సిబ్బంది, వసతులు కల్పించక పోవడంతో ఉపయోగంలోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఇంటర్‌తో పాటు టెక్నికల్, ఉపాధి కోర్సులు ప్రవేశ పెట్టడంతో నిరుపేద బాలికలకు వరంగా మారనుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటర్ విద్యకు 50 ఏళ్లు
ఉన్నత విద్యకు వారధిగా ఉండే ఇంటర్ విద్యకు 50 ఏళ్లు వచ్చాయి. 1968లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నద్ధమయ్యింది. దీనికోసం ఇంటర్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ బి.ఉదయలక్ష్మి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. 26వ తేదీ నుంచి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్: 1968కి ముందు ఇంటర్ స్థానంలో 11, 12 తరగతులుగా పాఠశాల విద్య బోర్డు కింద ఉండేది. అప్పట్లో పాఠశాల విద్య, ఉన్నత విద్యగా విద్యావిధానం ఉండేది. విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు 10+2+3 విద్యా విధానాన్ని తీసుకురావాలని కొటారి కమిషన్ సూచించింది. దీంతో పదో తరగతి తర్వాత ఇంటర్ విద్యను తీసుకురావాలని నిశ్చయించారు. అలా 1968లో తొలిసారిగా 11, 12 తరగతుల స్థానంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యను ప్రవేశపెట్టారు. పాఠశాల విద్య స్థానంలో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్యామండలిని 1969లో ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యకు వారధి ఇంటర్ ఉన్నత విద్యకు వారధిగా ఇంటర్ విద్య నిలుస్తోంది. ఇంటర్ విద్యలో ప్రతిభ కనబరిస్తేనే ఉన్నత విద్యలోకి అడుగులు వేయాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించిన ఇంటర్ విద్య ఉన్నత విద్యలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించి, విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి బాటలు వేస్తోంది. ఇంటర్ విద్య వచ్చినప్పటి నుంచి విద్యావిధానంలో సమూల మార్పులు వచ్చాయని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ ఉన్నత విద్యకు బంగారు బాటలు వేయడానికి ఇంటర్ విద్య దోహదపడుతోందని చెబుతున్నారు. స్వర్ణోత్సవాల సంబరాలు ఇంటర్ విద్యను ప్రవేశపెట్టి 50ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఇంటర్ విద్య బోర్డు స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇంటర్ విద్య ప్రాముఖ్యత, ఔన్నత్యంపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వివిధ పోటీలను నిర్వహించనుంది. జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనుంది. పోటీలతో పాటు ఆయా కళాశాలలున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలీలు చేపట్టనుంది. దీనికోసం షెడ్యూల్‌ను ఇంటర్ విద్య విడుదల చేసింది. 26 నుంచి పోటీలు స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు పండుగ వాతావరణాన్ని తలపించేలా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. వ్యాసరచన, వక్తృత్వ, ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలు ఆయా కళాశాలల్లోనే నిర్వహించి, విజేతలను ఎంపిక చేస్తారు. వీటిని పరిశీలించి, విజేతలను ఎంపిక చేసి డిసెంబర్ 3నుంచి 7వ తేదీ వరకు జరిగే జోనల్ స్థాయి పోటీలకు, అక్కడ గెలుపొందిన వారికి 10 నుంచి 15వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో సంబరాలు నిర్వహించనున్నారు. స్వర్ణోత్సవ కమిటీ జిల్లావ్యాప్తంగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అన్ని యాజమాన్య కళాశాలల్లో స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించనున్నారు. స్వర్ణోత్సవ వేడుకలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో 9మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఆర్ఐఓ/డీవీఈఓ, ముగ్గురు ప్రిన్సిపాల్స్, ముగ్గురు జూనియర్ లెక్చరర్లు, ఒక ఫిజికల్ డైరెక్టర్, ఒక లైబ్రేరియన్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. స్వర్ణోత్సవాలు జరుపుకోవాలి ఇంటర్ విద్య ఔన్నత్యాన్ని చాటేలా స్వర్ణోత్సవాలు జరుపుకోనున్నాం. ఈనెల 26వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 275 అన్ని యాజ మాన్య జూనియర్ కళాశాలల్లో పండుగ వాతావరణం తలపించేలా సంబరాలు నిర్వహించాలి. వాటిని ఫొటోలు, వీడియోలు తీసి పంపించాలి. ప్రతి కళాశాలలోనూ తప్పనిసరిగా స్వర్ణోత్సవాలు నిర్వహించాలి.–ఎం.కృష్ణయ్య, ఇంటర్ ప్రాంతీయపర్యవేక్షణాధికారి, తిరుపతి -
ఇంటర్ విద్యాశాఖలో కలకలం
విద్యారణ్యపురి వరంగల్: నకిలీ కుల ధ్రువీకరణ పత్రం తో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఎదు ర్కొంటున్న ఐదు, ఆరో జోన్ల ఇంటర్ విద్య ఆర్జేడీ(ఎఫ్ఏసీ) సుహాసినిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ ప్రభుత్వ స్పెషన్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సుహాసిని ము న్నూరుకాపు సామాజిక వర్గం అనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో ఎస్టీ కేటగిరీలో 1991లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈమె లెక్చరర్‌గా నియామకమయ్యారు. 2005లో ప్రిన్సి పాల్గా, 2014లో ఇంటర్ విద్య ఆర్‌ఐఓగా పదోన్నతి పొం దారు. గత కొంతకాలంగా కరీంనగర్ జిల్లాలో డీఐ ఈఓగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న సుహాసినికి 2016లో ఐదవ, ఆరవజోన్కు సంబంధించిన వరంగల్ ఇంటర్ విద్య ఇన్చార్జి ఆర్జేడీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. గత కొన్ని నెలల క్రితమే ఫుల్ అడిషనల్ చార్జి(ఎఫ్ఏసీ) కూడా ఇచ్చారు. అయితే సుహాసిని ఎస్టీ కాదని, ఆమెది మున్నూరుకాపు సామాజిక వర్గమని, నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందారని ఆరోపిస్తూ ఓ సంస్థ బాధ్యులు కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం సుహాసినిపై ఉన్నతాధికారులతో విచారణ చేయించింది. విచారణలో సుహాసిని ఎస్టీ కాదని, నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందినట్లు వెల్లడైనట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం సుహాసినిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సస్పెన్షన్‌లోనే కొనసాగిస్తారు. సుహాసినిని హెడ్‌క్వార్టర్ కూడా వదిలి వెళ్లొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆమెపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇన్చార్జి ఆర్జేడీగా హన్మంతరావు కాగా సుహాసినిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఐదు, ఆరో జోన్ వరంగల్ ఇంటర్ విద్య ఆర్జేడీగా హన్మంతరావును నియమించినట్లు తెలిసింది. సుహాసినిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో డీఐఈఓగా పనిచేస్తున్న హన్మంతరావును ఆమె స్థానంలో వరంగల్ ఇన్చార్జి ఆర్జేడీగా నియమించారని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో హన్మంతరావు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. -
పాఠశాల విద్యలోకి ఇంటర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం మూడంచెలుగా ఏర్పాటైన ఉన్నత, మాథ్యమిక, ప్రాథమిక విద్యా వ్యవస్థను త్వరలో రెండంచెల వ్యవస్థగా మార్చనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో మిళితం చేయనున్నట్లు ప్రకటించారు. ఇంటర్ విద్య ఇప్పటికే జాతీయ స్థాయిలో పాఠశాల విద్యలో భాగంగానే ఉందని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ‘విజ్ఞాన భూమి’ (నాలెడ్జ్ హబ్)గా తీర్చిదిద్దేందుకు విశ్వవిద్యాలయాల నుంచి తక్షణం కార్యాచరణను ఆరంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ లక్ష్య సాధనలో కీలకపాత్ర వహించాలని రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు చెందిన వీసీలకు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన వీసీల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. వచ్చే వారం నుంచి ‘జ్ఞానధార’ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుం టున్న 18 లక్షల మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే కార్యక్రమా నికి రూపకల్పన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సాంకేతిక అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి, నవ్యావిష్కరణలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం లాంటి లక్ష్యాలతో జూలై మూడో వారం నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమానికి ‘జ్ఞానధార’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఇంతకంటే మంచి పేరును సూచిస్తే పరిశీలిస్తామని చెప్పారు. విద్య, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో పేరు పొందిన ప్రముఖులను ఆహ్వానించి వారి నుంచి ప్రేరణ పొందేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సీఎం సూచించారు. విద్యార్ధులతో మరిన్ని ఈవెంట్లు ఒక్కో వర్శిటీలో ఒక్కో రోజు నిర్వహించే ఈ కార్యక్రమానికి తాను హాజరై 10 వేల మంది విద్యార్థులతో నేరుగా మాట్లాడతానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో పాల్గొనే విద్యార్థులను వివిధ పోటీల ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. పోలవరం, అమరావతి, ఇస్రో ప్రగతి, ఐటీఐవోటీ, స్టార్టప్స్ లాంటి అంశాలపై విద్యార్థులకు సదస్సు నిర్వహించాలన్నారు. సీఐఐతోపాటు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను ఇందులో భాగస్వాములుగా చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణ, సమన్వయ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యామండలి, ఆయా వర్శిటీలే దీనికి అవసరమైన నిధులను సమకూర్చుకోవాలన్నారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్లన్నీ ప్రత్యేకంగా రూపొందించే యాప్ ద్వారా జరుగుతాయి. 18న శ్రీకాకుళం నుంచి ప్రారంభం ఈనెల 18న శ్రీకాకుళం డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుంచి ‘జ్ఞానధార’ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2న విజయనగరం జేఎన్టీయూలో, ఆగస్టు 17న విశాఖ ఏయూలో, ఆగస్టు 31న పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ ఉద్యాన వర్శిటీలో, సెప్టెంబరు 14న రాజమహేంద్రిలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి. మచిలీపట్నం కృష్ణా వర్శిటీ, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీలకు కలిపి సెప్టెంబరు 30న కార్యక్రమం ఏర్పాటవుతుంది. అక్టోబరు 12న నాగార్జున, ఎన్జీ రంగా విశ్వవిద్యాలయాలకు కలిపి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మిగిలిన వర్సిటీల్లో కూడా వరుసగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అవసరాన్ని బట్టి తేదీల్లో మార్పులు చేస్తారు. ప్రతి లక్ష మంది జనాభాకు 48 కళాశాలలతో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచిందని వీసీ సమావేశంలో ఉన్నత విద్యపై నివేదిక సమర్పించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తెలిపారు. 27 వర్శిటీలు, 7 జాతీయ ప్రాధాన్యం కలిగిన విద్యా సంస్థలు రాష్ట్రంలో వున్నాయన్నారు. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిలో దేశంలో ఏపీ మూడవ స్థానంలో ఉందని చెప్పారు. చదువుకుంటూ పనిచేసే విధానం రావాలి నాలుగేళ్ల కళాశాల చదువు నలభై ఏళ్ల కెరియర్‌కు ఎలా ఉపకరిస్తుందో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని వీసీలను సీఎం కోరారు. పుస్తకాల్లో బోధించే సిద్ధాంతాలకు, వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంటోందన్నారు. ఆలోచనలు, ఆచరణకి దూరం పెరిగిపోయేలా మన విద్యావిధానం కొనసాగడం దురదృష్టకరమన్నారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటీవల ఐఎఎస్, ఎంసెట్, ఐఐటీలకు ఎంపికైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషమని చెప్పారు. ప్రతి వర్శిటీని నాలుగైదు పరిశ్రమలకు అనుసంధానం చేయడం ఇక నుంచి తప్పనిసరిగా జరగాలన్నారు. చదువుకుంటూ పనిచేసే అవకాశాలు కల్పిస్తూ ప్రతి విద్యార్ధిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధానాలు రావాలన్నారు. హెరిటేజ్‌ను ఈ–కామర్స్ వైపు వెళ్లమన్నా అందరూ ఐఐటీలోనే చదవాలనే ధోరణి సరికాదని, రానున్న కాలంలో ఆతిథ్యం, ఆహార పరిశ్రమకు ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సుల వైపు మళ్లాలని వీసీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఫ్లిప్‌కార్ట్ స్ఫూర్తితో తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌ను కూడా ఈ–కామర్స్ వైపు మళ్లమని సూచించానన్నారు. -
ఇంటర్ విద్యపై సందిగ్ధం
నిజాంసాగర్: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్ చదువులపై విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేయకపోవడంతో సందిగ్ధత నెలకొంది. రెండు, మూడు రోజుల్లో పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నారు. పదోతరగతిలో ఉత్తీర్ణులయ్యే కస్తూర్బా విద్యార్థినులు ఇంటర్ చదువులకు ఎటువైపు వెళ్లాలన్న ఆయోమయంలో ఉన్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఇంటర్ చదువులను ప్రారంభిస్తామని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. కానీ ఇంత వరకు ఆదేశాలు ఇవ్వలేదు. 2009 సంవత్సరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తడ్వాయి, సదాశివనగర్, గాందారి, బాన్సువాడ, బీర్కూర్, కామారెడ్డి, బిక్కనూర్, మాచారెడ్డి, దొమకొండ మండలాల్లో కస్తూర్బా విద్యాలయాలను ప్రారంభించారు. ఆయా కస్తూర్బా విద్యాలయాల నుంచి ఇప్పటి వరకు 7 బ్యాచ్‌ల్లో విద్యార్థినులు పదోతరగతి పరీక్షలు రాశారు. పదోతరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు రాబట్టారు. దాంతో కస్తూర్బాల్లో విద్యాప్రమాణాల పెంపుపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్ విద్యను అమలుకు విద్యా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాని స్పష్టమైన ఆదేశాలు జారికాలేదు. గురుకులాల్లోఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 2018–19 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రభుత్వ గురుకులాలతోపాటు ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మిడియట్‌లో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలోని ఆయా మం డలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మిడియట్ ఆడ్మిషన్ల కోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కాని జిల్లాలోని 17 కస్తూర్బా విద్యాలయాల నుంచి 628 మంది విద్యార్థినులు పదోతగతి పరీక్షలు రాశారు. కస్తూర్బాల్లో ఇంటర్ విద్యను అమలు చేస్తే చాలా మంది చదువుల కొనసాగించడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆదేశాలు రాలేదు– కుంతల, జిల్లా అధికారిణి కసూర్బాగాంధీ విద్యాలయాల్లో ఇంటర్ విద్యబోధన అమలుపై ఇంత వరకు స్పష్టమైన ఆదేశాలు రాలేదు. జిల్లాలోని రెండు విద్యాలయాల్లో మాత్రం ఇంటర్ విద్యను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సమాచారం రాలేదు. -
బాలికలకు వరం
ఆదిలాబాద్‌టౌన్: ఆర్థిక స్థోమత లేక చదువు మధ్యలో మానేసిన, తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం ఆరు నుంచి 10వ తరగతి వరకు విద్యను అందిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6నుంచి 8వ తరగతి విద్యార్థులకు చదువుకు అవసరం అయి న నిధులు విడుదల చేస్తుండగా.. 9,10వ తరగ తి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యయాన్ని భరిస్తోంది. డెప్యూటీ సీఎం ఆధ్వర్యంలో బాలిక విద్య సబ్ కమిటీ మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్‌ను కలిసి కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్యను పొడి గించాలని కోరగా ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు జరగనుంది. వచ్చే విద్య సంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 68 కేజీబీవీలున్నాయి. వీటిలో 10,380 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్‌లోని 17 కేజీబీవీల్లో 2,385 మంది, నిర్మల్‌లో 18 కేజీబీవీల్లో 2900 మంది, ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలో 15 కేజీబీవీల్లో 2500 మంది విద్యార్థులు, మంచిర్యాల జిల్లాలో 18 కేజీబీవీల్లో 2600 విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశా రు. ఈ పాఠశాలల్లో చదివిన వారికి వసతితో పాటు నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భోజన మెనూలో కూడా ఇటీవల ప్రభుత్వం మార్పు చేసింది. వారానికి రెండు సా ర్లు మటన్, నాలుగు సార్లు చికెన్, రోజు కోడిగుడ్డు, నెయ్యి, ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, పాలు, స్నాక్స్ అందిస్తున్నారు. అంతే కాకుండా న్యాప్కిన్స్, కాస్మోటిక్ కిట్లను అంది స్తున్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పది తర్వాత చదువు కొనసాగించే వీలు.. కేజీబీవీల్లో చదివి పదో తరగతి ఉత్తీర్ణులైన చాలా మంది ఇంటర్ విద్యను కొనసాగించలేకపోతున్నారు. గురుకులాల్లో ఇతర కళాశాలల్లో అందరికీ సీట్లు లభించకపోవడం, వారి సొంత గ్రామాలకు వెళ్లిపోవడం, ఆర్థిక స్థోమత కారణంగా అక్కడికే చదువును ఆపేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తో విద్యార్థులకు మేలు జరగనుంది. ఉన్నత చదువు చదువుకునే వీలుంటుంది. పదో తరగతి వరకు కేజీబీవీలో చదివిన వారు ఆ తర్వాత అక్కడే విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించడంతో తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలపై భద్రత భావం ఉంటుంది. ఎట్టకేలకు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేజీబీవీల ను ఇంటర్ విద్య వరకు పొడిగిస్తామని పలు సా ర్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలిక విద్య ఉపసంఘానికి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ఉండడంతో అమలుకు నోచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు ఆ కేజీబీవీల్లోనే ఇంటర్ చదువుకునే అవకాశం ఉం టుంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులు 2500 మంది ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మేలు.. ఆరు నుంచి పదో తరగతి వరకు ఆదిలా బాద్ కేజీబీవీలో చదువుతున్నా. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్ కూడా ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించింది. నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు బాగున్నాయి. – శీతల్, పదోతరగతి విద్యార్థి, ఆదిలాబాద్ విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు జరగనుంది. కేజీబీవీల్లో ప్రస్తుతం పదోతరగతి వరకే విద్యను అందించడం జరుగుతుంది. పది పూర్తయిన తర్వాత కొంత మంది పిల్లలు ఇంటర్ అభ్యసించకుండా చదువు మానేస్తున్నారు. కేజీబీవీల్లో ఇంటర్ ఏర్పాటు చేయడం వల్ల పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అనంతరం ఇక్కడే చదువుకోవచ్చు. – లస్మన్న, ఆర్వీఎం సెక్టోరియల్ అధికారి -
నో జంబ్లింగ్.. ఓన్లీ గ్యాంబ్లింగ్..!
సాక్షి, హైదరాబాద్:‘‘విద్యా వ్యాపారంలో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు మార్కులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అధిక మార్కులు, ర్యాంకుల పేరుతో విస్తృత ప్రచారం చేసుకుంటూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. కానీ విద్యార్థికి సంపూర్ణ జ్ఞానం అందించాలన్న ధ్యాసే వాటికి లేకుండాపోయింది. ప్రయోగాలు చేయించే ఆలోచనే లేదు. పరీక్షల సమయంలో మేనేజ్ చేస్తూ వంద శాతం మార్కులు వేయిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ప్రాక్టికల్స్ నాలెడ్జి ఉండటం లేదు. దీంతో పై తరగతులకు వెళ్లాక వారు ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థుల జంబ్లింగ్ అమలు చేయాల్సిందే..’’ పదేళ్ల కిందట ప్రొఫెసర్ దయారత్నం కమిటీ చెప్పిన మాటలివి. అయితే ఇప్పటివరకు ఇంటర్ బోర్డు వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల వ్యాపార దృక్పథాన్ని కమిటీ బయటపెట్టినా పట్టించుకోలేదు. కమిటీ సిఫారసులు అమలు కాకపోవడానికి కార్పొరేట్ కాలేజీల మాయాజాలమే ప్రధాన కారణం. పదేళ్ల నుంచి ఇప్పటివరకు ఏవేవో కారణాలు చెబుతూ ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి వాయిదా వేస్తూనే ఉన్నారు. అప్పట్లో ల్యాబ్‌లు లేవు.. ఇపుడు ప్రాక్టికల్స్ లేవు! రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని 2006లోనే ప్రొఫెసర్ దయారత్నం కమిటీ స్పష్టం చేసింది. 60 శాతం ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని, 30 శాతం ప్రభుత్వ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని, మొత్తంగా రాష్ట్రంలోని 40 శాతం జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌లు లేవని వెల్లడించింది. దీంతో ప్రభుత్వం 2008లోనే వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని, జంబ్లింగ్ అమలు చేస్తామని స్పష్టం చేసింది. ప్రైవేటు కాలేజీల ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్ము రూ.4 లక్షలను బ్యాంకు నుంచి విడిపించుకుని ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అయితే సొమ్మును తీసుకున్న యాజమాన్యాలు.. ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినట్లుగా తమదైన ‘మేనేజ్మెంట్’ను ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నాయి. 30కి 30 వేస్తే పరిశీలన ఏదీ? బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ఒక్కో దాంట్లో ప్రాక్టికల్స్‌కు 30 మార్కుల చొప్పున 120 మార్కులు ఉంటాయి. అదే ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీలో 30 చొప్పున 60 మార్కులు ఉంటాయి. అయితే ఒక్కో సబ్జెక్టుకు 30కి 30 మార్కులు వస్తే వాటిని పునఃపరిశీలన చేయిస్తామన్న బోర్డు నిబంధనలు అమలు కావడం లేదు. ఇప్పటివరకు ఒక్క విద్యార్థి విషయంలో కూడా పునఃపరిశీలన జరగలేదు. విద్యార్థులకు నష్టం.. జంబ్లింగ్ అమలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ విద్యార్థులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. కార్పొరేట్, ప్రైవేటు విద్యార్థులకు అధిక మార్కులు వస్తుండటంతో అగ్రికల్చర్ కోర్సుల్లో వారికే మెరిట్ ద్వారా సీట్లు వస్తున్నాయి. వెయిటేజీ కారణంగా ఎంసెట్‌లో టాప్ ర్యాంకులతో వారికే టాప్ కాలేజీల్లో సీట్లు లభిస్తున్నాయి. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు రికార్డులు కూడా సరిగ్గా ఉండవు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల విద్యార్థులు ప్రాక్టికల్స్ సరిగ్గా చేయరు. అయినా వారికి ఒక్కో సబ్జెక్టులో 30కి 30 మార్కులు వస్తున్నాయి. కనీసం వారి రికార్డులు కూడా సరిగ్గా ఉండవు. వారి చేతి రాతతో సరిపోలవు. అయినా వారు ప్రాక్టికల్స్ చేసినట్లుగా సృష్టిస్తున్నారు. ఇలా తాత్కాలిక ప్రయోజనం చేకూరవచ్చు. కానీ ఆ విద్యార్థుల భవిష్యత్తుకు తీరని నష్టమన్న సంగతి గ్రహించడం లేదు. – కవిత కిరణ్, బోటనీ లెక్చరర్ 80% కాలేజీల్లో నో ప్రాక్టికల్స్ ప్రస్తుతం రాష్ట్రంలోని 80 శాతం ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల్లో ల్యాబ్‌లే లేవన్న విమర్శలున్నాయి. ల్యాబ్‌ను నిర్వహించే ల్యాబ్ అసిస్టెంట్లు ఏ కాలేజీలోనూ లేరనే వాస్తవాలు ఇంటర్మీడియెట్ విద్యా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లోనే అనేకసార్లు బయట పడింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపు సమయంలో ఏదో ఒక హాల్‌కు సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్ అంటూ బోర్డులు పెట్టి ఫొటోలతో దరఖాస్తు చేయడం తప్ప కాలేజీల్లో ప్రాక్టికల్స్ జరగడం లేదన్న వాస్తవాన్ని ఇంటర్ విద్యా శాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. రాష్ట్రంలో 1,556 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉంటే వాటిలోని 80 శాతం కాలేజీల్లో ప్రాక్టికల్స్ జరగడం లేదని ఇంటర్ బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. పరీక్షల సమయం వచ్చిందంటే కొన్ని కాలేజీలు మాత్రం మూడు రోజులు విద్యార్థులను కొంతమేర సిద్ధం చేయడం, మిగతా ఎగ్జామినర్లను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను మేనేజ్ చేసి మార్కులు వేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగతా కాలేజీలైతే ఆ కొద్దిపాటి ప్రిపరేషన్ కూడా చేయించకుండానే విద్యార్థులను పరీక్షలకు తీసుకొస్తున్నట్లు విమర్శలున్నాయి. వారికి ప్రాక్టికల్స్‌పై కనీస అవగాహన ఉండటం లేదు. మళ్లీ మొదలైన ‘మేనేజ్’మెంట్ రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షల మేనేజ్మెంట్ మళ్లీ మొదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు దాదాపు 90 వేల మంది బైపీసీ విద్యార్థులు హాజరుకానుండగా, 1.45 లక్షల మంది ఎంపీసీ విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తం 2.35 లక్షల మంది విద్యార్థుల్లో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల నుంచే లక్షన్నర మందికి పైగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు మళ్లీ ‘మేనేజ్’మెంట్‌కు సిద్ధమయ్యాయి. ఇందుకోసమే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కస్తూర్బాల్లో ఇంటర్
తిర్యాణి(ఆసిఫాబాద్): కస్తూర్బాగాంధీ విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు వరంగా మారనున్నాయి. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ చదవలేని వారి కోసం ప్రభుత్వం ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయిం చింది. దీంతో ఈ సంవత్సరం పదో తరగతిచదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే కస్తూర్బావిద్యాలయాల్లోనే చదువుకునే అవకాశం కల్పించనుంది. దీంతో విద్యార్థినుల్లో ఆశలు చిగు రిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులు చదువు మధ్యలో మానేయ్యకుండా ఉండడానికి ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రతీ మండలంలో ఈ విద్యాలయాలు ఉన్నాయి. 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత వసతితో విద్యను అందిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు కూడ ఆశించిన విధంగా వస్తున్నాయి. దీంతో పేద విద్యార్థినులు మేలు పొందుతున్నారు. కానీ పదో తరగతి తర్వాత విద్యార్థినులకు హాస్టల్ వసతితో కూడిన బోధన ఇంటర్ వరకు లేకపోవడంతో చాల మంది విద్యార్థినులు పదో తరగతితోనే చదువు ముగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ కాలేజీలు ఉన్నా హాస్టల్ వసతి లేక అనేక మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. మరో కారణమేమిటంటే పదో తరగతి తర్వాత ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడంతో వారి చదువు మధ్యలోనే ఆగిపోతోంది. ఈ మేరకు విద్యావేత్తలు, అధికారులు ఆలోచన చేసి కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశపెడితే డ్రాపౌట్లను తగ్గించవచ్చనే ఆలోచనకు వచ్చారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలతో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యకు అనుకూలంగా ఉన్న కేజీబీవీ పాఠశాలల వివరాలు సేకరించింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అందులో 2,325 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కొత్తగా పెంచికల్‌పేట, చింతలమానెçపల్లి, లింగాపూర్‌లలో 2017 జూలైలో కేజీబీవీ పాఠశాలలను ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం 6,7 తరగతుల్లో విద్యాబోధన ఇంగ్లిష్ మీడియంలో కొనసాగుతోంది. కాగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యను కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లలోని కేజీబీవీలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న కేజీబీవీల్లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా కొత్తగా ఏర్పాటు చేసిన కస్తూర్బాల్లో 6,7 తరగతుల విద్యార్థులు 325 పోను పాత పాఠశాలల్లో చదువుకునే 2100 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. డ్రాపౌట్లకు చెక్.. జిల్లాలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవ సాయం, వ్యవసాయ కూలీపై ఆధారపడి జీవించేవారే. దీంతో అధిక కుటుంబాలు ఇంటర్ చదివించే స్థోమత లేక మధ్యలో చదువు మాన్పిస్తున్నారు. ఇంటర్ విద్యను కేజీబీవీల్లో ప్రవేశపెడితే విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లలను చదివించడానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. దీంతో డ్రాపౌట్లను కూడా తగ్గించవచ్చని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పేద విద్యార్థినులకు వరం కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రవేశపెడితే పేద విద్యార్థినులకు హాస్టల్ వసతితో కూడిన విద్య లభిస్తుంది. దీంతో వారికి ఉన్నత చదువులు చదవడానికి అవకాశం కలుగుతుంది. ఇంటర్ తర్వాత కేజీబీవీల్లో డిగ్రీ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లోని కేజీబీవీలలో ఇంటర్మీడియెట్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. – ఎన్.శంకర్, కేజీబీవీల జిలా ప్రత్యేకాధికారి -
ఇంటర్ విద్య ఆర్ఐఓ, డీవీఈఓ పోస్టుల విలీనం
ప్రతీ జిల్లాకు ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డీఐఈఓ కార్యాలయాలు విద్యారణ్యపురి : జిల్లాలోని ఇంటర్ విద్య, జిల్లా వృత్తి విద్యాధికారి పోస్టులను విలీనం చేయబోతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పునర్విభజనతో వరంగల్, హన్మకొండ (వరంగల్ రూరల్), భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటుకు ముసాయిదా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్య ఆర్ఐవో, జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) కార్యాలయాలు ఉన్నాయి. ఇంటర్ విద్య ఆర్ఐవో ప్రైవేట్ జూనియర్ కళాశాలల పర్యవేక్షణతోపాటు పరీక్షలను నిర్వహించే బాధ్యత చూస్తున్నారు. డీవీఈవో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పర్యవేక్షిస్తున్నారు. వృత్తి విద్యాకోర్సులును కూడా నడిపిస్తున్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు కానున్నందున ఇక ఆ రెండు కార్యాలయాలు వేర్వేరుగా కాకుండా ఒకే కార్యాలయంగా విలీనం కాబోతున్నాయి. ఇక నూతన జిల్లాలో ఆ రెండు పోస్టులు కలిపి జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈఓ) వ్యహరిస్తారు. దీంతో జిల్లాకో డీఐఈఓ ఉంటారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఇంటర్ విద్య ఆర్ఐవో, డీవీఈవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని సీనియర్ పిన్సిపాళ్లు ఇద్దరు బాధ్యతలను నిర్విర్తిస్తున్నారు. ఇందులో ఒకరిని ఒక జిల్లాకు మరొకరిని మరో జిల్లాకు డీఐఈవోలుగా బాధ్యతలు అప్పగిస్తే మిగతా రెండు జిల్లాలకు డీఐఈవోలుగా ఎవరిని నియమిస్తారనేది చర్చనీయాంశంగా ఉంది. ఒకవేళ నియమిస్తే మరో ఇద్దరి సీనియర్ ప్రిన్సిపాళ్లను డీఐఈవోలుగా నియమించాల్సి ఉంటుంది. లేదా ప్రస్తుతం ఉన్న ఇంటర్ విద్య ఆర్ఐఓ, డీవీఈఓలకే అప్పగిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ విద్య ఆర్ఐఓ, డీవీఈఓలు పోస్టులు కలిపి 17 మంది పనిచేస్తున్నారు. ఇక 27 జిల్లాలు కానున్న నేపథ్యంలో వారిని సర్దుబాటు చేసినా అన్ని జిల్లాలకు సరిపోరు. ప్రస్తుతం ఉన్నవారినే సర్దుబాటు చేస్తారా లేదా వేరే సీనియర్ ప్రిన్సిపాల్స్క అవకాశం కల్పిస్తారానేది వేచి చూడాల్సిందే. జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్య ఆర్ఐవో కార్యాలయంలో సీనియర్ ప్రిన్సిపాల్ ఆర్‌ఐవోగా విధులు నిర్వర్తిస్తుండగా అందులో ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. దినసరి వేతన ఉద్యోగులుగా ఇద్దరు, మరో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ అటెండర్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇక హన్మకొండలోని జిల్లా వృత్తివిద్యా కార్యాలయంలో డీవీఈవో సీనియర్ ప్రిన్సిపాల్ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా ఒకరు çఅడ్మినిసే్ట్రటివ్ ఆఫీసర్ సూపరింటెండెంట్, ఒకరు సీనియర్ అసిస్టెంట్, మరొకరు జూనియర్ అసిస్టెంట్, అటెండర్ తదితరులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు ఆర్ఐవో, డీవీఈఓ కార్యాలయాల ఉద్యోగులను కలిపి కొత్తగా ఏర్పాటు చేయబోయే నాలుగు జిల్లాలకు సర్దుబాటు చేసి ప్రతిపాదించారు. అయినప్పటికీ కొత్తగా ఏర్పాటు చేయనున్న డీఐఈవో కార్యాలయంలో ఉద్యోగుల కొరత ఉంటుంది. నాలుగు జిల్లాల ఏర్పాటు చేయబోతున్నందున వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న ప్రభు్వత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాలలకు సంబం«ధించిన వివరాలను సైతం ఆయా జిల్లాల పరిధిలోకి వెళ్లేలా ఫైళ్ల విభజన కూడా చేస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా ఇంటర్ విద్య ఆర్ఐవో కార్యాలయం హన్మకొండలోని సుబేదారిలోని అద్దెభవనంలో కొనసాగుతుండగా హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీవీఈవో కార్యాలయం ఉంది. ఇక రెండు పోస్టులు విలీనంతో ఇక వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) కార్యాలయం అద్దెభవనంలో ఉండబోతుండగా, హన్మకొండకు పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో ఏర్పాటు చేయనున్నారు. మిగతా జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఓ హాల్లో ఇంటర్ విద్య ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం ఉండేలా ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇక ఇంటర్ విద్య ఎడ్యుకేషన్ఆఫీసర్ జిల్లాకు ఒకరు ఉండి ప్రభుత్వ, ఎయిడెడ్ప్రైవేట్ జూనియర్ కళాశాలలను కూడా పర్యవేక్షిస్తారు. జిల్లాలో 44 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా అందులో వరంగల్ జిల్లాకు 14, హన్మకొండ జిల్లాలో 9, భూపాలపల్లి జిల్లాకు 8, మహబూబాబాద్ జిల్లాకు 8, యాదాద్రి జిల్లాకు 6, సిద్దిపేటకు 2 ప్రభుత్వ కళాశాలలు ఉండబోతున్నాయి. ఈమేరకు ప్రతిపాదించారు. ఇక ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో మహబూబాబాద్ జిల్లాకు ఒకటి, వరంగల్ జిల్లాలో ఆరు ఉండబోతున్నాయి. ఇక ప్రస్తుతం వరంగల్ జిల్లాలో 241 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉండగా అందులో కొత్తగా ఏర్పాటు కాబోతున్న వరంగల్ జిల్లాకు 67, హన్మకొండకు 88, భూపాలపల్లి జిల్లాకు 17, మహబూబాబాద్ జిల్లాకు 41 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండబోతున్నాయి. -
గాడి తప్పిన ఇంటర్ విద్య
అధ్యాపకుల కొరత రెన్యూవల్‌కు నోచుకోని కాంట్రాక్ట్ లెక్చరర్లు అతిథి అధ్యాపకులను తీసుకోనేందుకు ప్రభుత్వం ససేమిరా అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ విద్య గాడి తప్పుతోంది. అనేక కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. వారి స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెల్లవుతున్నా వారి పోస్టులను రెన్యూవల్ చేయలేదు. మరోవైపు అతిథి అధ్యాపకులను తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. పోస్టులు 652.. పని చేస్తోంది 156 మంది జిల్లాలో 39 జనరల్, రెండు ఒకేషనల్ కలిపి మొత్తం 41 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 26,710 మంది విద్యార్థులు మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మొత్తం 652 అధ్యాపక పోస్టులున్నాయి. వీటిల్లో కేవలం 156 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. ఉదాహరణకు శింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈ విద్యా సంవత్సరం కొత్తగా సైన్స్ గ్రూపులు మంజూరయ్యాయి. ఎంపీసీలో 10 మంది, బైపీసీలో 18 మంది విద్యార్థులు చేరారు. అయితే బోధించే అధ్యాపకులు లేరు. గణితం, ఫిజిక్స్, బొటనీ, కెమిస్ట్రీ, జువాలజీ అన్ని సబ్జెక్టులకు గాను ఒక్క పోస్టూ మంజూరు చేయలేదు. ఏదో ప్రిన్సిపల్ చొరవతో వీలున్నప్పుడు ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు (గెస్ట్ ఫ్యాకల్టీ) వచ్చి బోధిస్తున్నారు. అతిథి అధ్యాపకులుగా తమను తీసుకుంటారనే నమ్మకంతో అప్పుడప్పుడు వచ్చి చెబుతున్నారు. అనంతపురం నగరంలోని పాతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితం అధ్యాపకుడి పోస్టు ఖాళీగా ఉంది. -
సర్కారీ ఇంటర్ ఉచితం
-
కా‘లేజి’ ప్రాక్టికల్స్
ఖమ్మం: ఇంటర్ విద్య జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. ప్రయోగశాలలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఇరుకు గదుల్లో ఒక మూలన విద్యార్థులు, మరో మూలన సైన్ల్యాబ్ పరికరాలు దర్శనమిస్తున్నాయి. పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధనోపకరణాలను ఉపయోగించుకోవాల్సిన అధ్యాపకులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. పలు కళాశాలల్లో సైన్స్ పరికరాలు బయటకు తీసిన పాపాన పోవట్లేదు. ఇంటర్మీడియెట్ పూర్తవుతున్న కనీసం పిప్పెట్, బ్యూరెట్, స్క్రూగేజీ, వెర్నియర్ కాలిపస్ అంటే తెలియని విద్యార్థులున్నారంటే అతిశయోక్తి కాదు. తరగతి గదిలోనే సైన్స్ పరికరాలు ఉండటంతో కొన్ని కళాశాలల్లో ఆకతాయి విద్యార్థులు వాటిని పగులగొడుతున్నారు. కొన్ని కాలేజీల్లో చెట్లకింద ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. కొన్నింటిలో సైన్స్‌ల్యాబ్‌లు శిథిలావస్థకు చేరాయి. కాలేజీల్లో కొనసాగుతున్న మొక్కుబడి ప్రాక్టికల్స్‌పై ‘సాక్షి’ మంగళవారం పరిశీలన జరిపింది. బూజుపడుతున్న పరికరాలు జిల్లాలో సగానికి పైగా కళాశాలల్లో బోధనోపకరణాల ఆధారంగా బోధన జరగడం లేదని తేలింది. కొన్ని కాలేజీల్లో ప్రయోగశాలల తలుపులు తీసిన దాఖలాలే లేవు. పరికరాలు, రసాయనాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. జిల్లాలో 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఎంపీసీలో మొదటి సంవత్సరం 825 మంది. ద్వితీయ సంవత్సరంలో 990 మంది, బైపీసీ ప్రథమ సంవత్సరం 1,292 మంది, ద్వితీయ సంవత్సరం 1,204 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు మొత్తం 2,194 మంది ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరు కావాలి. కానీ వీరిలో సగం మంది ఇప్పటివరకు ల్యాబ్‌లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఇక ప్రాక్టిక ల్స్ ఎలా చేయాలని విద్యార్థులు వాపోతున్నారు. తరగతి గదిలోనే ప్రయోగశాలలు బాటనీ, జువాలజీ ల్యాబ్స్‌లో జంతు కళేబరాలు, అవశేషాలు, స్పెసిమెన్స్ విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం అంతర్నిర్మాణం తెలుసుకునేందుకు మైక్రోస్కోప్‌లు వినియోగించాలి. రసాయనశాస్త్రంలో లవణ విశ్లేషణ, మూలకాలు, లవణాల ఘనపరిమాణం గురించి తెలియాలంటే రసాయనాలు కావాలి. వీటిలో కొన్ని ప్రమాదకరమైన యాసిడ్స్ ఉంటాయి. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ల్యాబ్స్ ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ జిల్లాలోని ఖమ్మం నయాబజార్, శాంతినగర్ కళాశాలలతోపాటు ఇతర ప్రాంతాల్లో తరగతి గదుల్లోనే ప్రయోగ పరికరాలు ఉన్నాయి. వైరా కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లకు ఒక గది, బాటనీ, జువాలజీలకు కలిపి ఒక గదిని కేటాయించారు. కొత్త సిలబస్‌కు సంబంధించిన చార్టులూ ఏర్పాటు చేయలేదు. రసాయనాలు, పరికరాలు కొరతగా ఉన్నాయి. ఏన్కూరు కళాశాలలో ప్రత్యేకంగా ల్యాబ్ లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నిసార్లు యాసిడ్స్ మీద పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కారేపల్లి ప్రభుత్వ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకులు లేరు. పినపాక నియోజకవర్గం అశ్వాపురంలో ల్యాబ్‌లు లేవు. అవసరమైనప్పుడు భారజల కర్మాగారం కళాశాలకు తీసుకెళ్లి ప్రయోగాలు చేయిస్తున్నారు. మణుగూరు, పినపాక, గుండాలలో ల్యాబ్‌లు ఉన్నా వాటిలో సరైన సౌకర్యాలు లేవు. బూర్గంపాడులో ప్రయోగశాల భవనం కురుస్తుండటంతో వాటిలో పరికరాలు దెబ్బతిన్నాయి. కొత్తగూడెంలో ప్రయోగశాల గదుల నిర్మాణం కోసం రూ.29 లక్షలు మంజూరు చేశారు. 2013 జనవరిలో ఆరుగదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. బిల్లులు రాలేదని సంబంధిత కాంట్రాక్టర్ గదుల నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలోని బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి కొతులు ప్రవేశించి సైన్స్‌ల్యాబ్ పరికరాలను ధ్వంసం చేస్తున్నాయి. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలలను శిథిలావస్థ భవనంలో నిర్వహిస్తున్నారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోబీరువాల్లో ల్యాబ్ పరికరాలను భద్రపరచాల్సి వస్తోంది. లక్షలు వెచ్చించినా ప్రయోగాలు శూన్యం.. లక్షలు వెచ్చించినా ప్రభుత్వ కళాశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. 2012 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ సిద్ధార్థజైన్ సైన్స్ పరికరాల కొనుగోలు కోసం ప్రయత్నించారు. కళాశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి కళాశాలకు రూ. లక్ష నుంచి రెండు లక్షల మేరకు గ్రాంట్స్ విడుదల చేశారు. ఆ నిధులతో దాదాపు అన్ని కళాశాలల అధ్యాపకులు ప్రయోగశాలల పరికరాలు కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించి బిల్లులు తీసుకున్నారు. అదే సంవత్సరం కాలేజీల అభివృద్ధి కోసం ప్రతి కళాశాలకు రూ. 10వేల చొప్పున విడుదల చేశారు. ఈ నిధులు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నా.. కొనుగోలు చేసిన వస్తులు మాత్రం సగం కూడా కనిపించకపోవడం గమనార్హం. ఈ సంవత్సరం కూడా ఒక్కో కళాశాలకు రూ. 37,000 ప్రభుత్వం విడుదల చేసింది. వీటినైనా సక్రమంగా ఖర్చు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సమస్యల సుడిగుండంలో ఇంటర్ విద్య
మంచిర్యాల సిటీ : జిల్లాలో ఇంటర్ విద్య సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఇంటర్ విద్యను పటిష్టం చేయడానికి 1990 సంవత్సరానికి ముందు ప్రభుత్వం 46 కళాశాలలు మంజూరు చేసింది. మొదటి విడతగా మంజూరైన 15 కళాశాలలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 2000 సంవత్సరం నుంచి 2009 వరకు దశలవారీగా 30 కళాశాలలు మంజూరయ్యాయి. వీటిలోని 13 కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే తరగతులు నిర్వహించడం గమనార్హం. 14 ఏళ్లుగా అరకొర సౌకర్యాలతో 30 కళాశాలలు నెట్టుకొస్తున్నాయి. వీటిలో 15 కళాశాలలకు నిధులు మంజూరై పనులు పునాదులకే పరిమితమయ్యాయి. కొన్ని కళాశాలల్లో వసతులు లేకపోవడం, పోస్టులు భర్తీ చేయకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులే బోధించడం, పక్కా భవనాలు లేకపోవడంతో విద్యార్థులు చేరడం లేదు. జిల్లాలోని రె బ్బెన, కౌటాల కళాశాలల్లోనే 300కు పైగా అడ్మిషన్లు అవుతున్నాయి. మిగతా కళాశాలలు 100 నుంచి 150అడ్మిషన్లకు పరిమితమవుతున్నాయి. ఒక్కో కళాశాలకు ఖర్చు ఏడాదికి రూ.2.50 కోట్లు ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఏడాదికి వే తనాలు, ఇతరత్రా అవసరాలకు కలిపి రూ.2.50 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జిల్లాలోని 46 కళాశాలలకు ఏడాదికి రూ.115 కోట్ల ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో ఒక ఇంటర్ మీడియట్ విద్యార్థికి ఏడాదికి సగటున రూ.33 వేలు ఖర్చు చేస్తున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంత ఖర్చు చేసినా ఇంటర్ విద్య సుడిగుండంలో చిక్కుకొని ఉండటం శోచనీయం. పక్కా భవనాలు.. ఆదిలాబాద్(బాలురు), ఆదిలాబాద్(బాలిక లు), ముథోల్, ఉట్నూర్, మంచిర్యాల, భైంసా, నిర్మల్(బాలురు), నిర్మల్(బాలికలు), కాగ జ్నగర్, చెన్నూర్, బెల్లంపల్లి(బాలురు), బోథ్, ఖానాపూర్, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్ కళాశాలలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. భవనాలు లేనివి.. కుభీర్, సారంగాపూర్, దిలావార్పూర్, సిర్పూర్(టి), లోకేశ్వరం, కాసిపేట, బెల్లంపల్లి(బాలిక లు), జన్నారం, దండేపల్లి, తలమడుగు, రెబ్బె న, దహెగాం, ఇచ్చోడ కళాశాలలకు భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. కౌటాల కళాశాల అటవీ శాఖ భవనంలో కొనసాగుతోంది. తానూర్ మం డలానికి ఈ విద్యాసంవత్సరం మంజూరైంది. తరగతులు ఎక్కడ నిర్వహించాలో అధికారలకే తెలియాలి. పాక్షికంగా ఉన్నవి.. కెరమెరి, మందమర్రి, బెజ్జూరు, తిర్యాణి, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, మామడ, తాంసి, బేల, నూర్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, వాంకిడి, జైపూర్ కళాశాలలకు భవనాలు పాక్షికంగా తయారు కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కడెం కళాశాల భవనం కూడా పాక్షికంగా తయారైంది. ఈ కళాశాలో మూడు గదులే పూర్తి కావడంతో ప్రథమ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారు. ద్వితీయ సంవత్సరం తరగతులు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణాలు ఆలస్యం భవన నిర్మాణాలకు అధికారుల సహకారం, కాం ట్రాక్టర్లు మందుకు రాకపోవడం, నిధుల మం జూరులో ఆలస్యం, వచ్చిన నిధులకు వెంటనే ప నులు ప్రారంభించక పోవడంతో నిధులు వెనక్కి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఆసిఫాబాద్, రె బ్బెన, మామడ, కౌటాల మండలాల కళాశాలల కు రూ.65లక్షలు మంజూరైనప్పటికీ పనులు ప్రా రంభం కాలేదు. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఒ ప్పందం పక్కాగా లేకపోవడంతో పనులు ఆల స్యం అవుతున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సిర్పూర్(టి) కళాశాలకు ఏడాదిన్నరకు అధికారులు స్థలం మంజూరు చేశారంటే ఇంటర్ విద్యపై జిల్లా ఉన్నతాధికారులకు ఉన్న పట్టింపుకు తార్కాణం. సిబ్బంది లేక ఇబ్బంది ప్రతి ప్రభుత్వ కళాశాలకు సరిపడేంత అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బందిలో ముగ్గురు అ టెండర్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఒక జూని యర్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు అవసరం. జిల్లాలోని చాలా కళాశాలలకు బోధనేతర సిబ్బంది లేరు. 80 శాతం కాంట్రాక్టు అధ్యాపకులతోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం మంజూరైన తానూర్ కళాశాలకు కనీసం ప్రిన్సిపాల్ పోస్టును కూడా అధికారులు మంజూరు చేయలేదంటే అధికారుల చిత్తశుద్ధి ఇంటర్ విద్యపై ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ విద్యార్థులు.. బోధన రుసుం.. ప్రతి ప్రభుత్వ కళాశాలలో హెచ్ఈసీ, సీఈసీ, ఎంపీసీ, బైపీసీ నాలుగు గ్రూపులు ఉన్నాయి. ప్ర తి గ్రూపునకు 55 సీట్ల చొప్పున 45 కళాశాలల్లో నాలుగు గ్రూపులకు కలిపి ఒక సంవత్సరం కో ర్సుకు 9,900సీట్లు ఉంటాయి. వీటిలో ప్రథమ సంవత్సరంలో ఆర్ట్స్గ్రూప్లో 3,000, సైన్స్గ్రూ ప్లో 1,500మంది విద్యార్థులు చేరుతున్నారు. ప్రథమ సంవత్సరంలో అనుత్తీర్ణులు కావడంతో ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య 3,500 చేరుకుంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం లో 7వేల మంది విద్యార్థులకు సగటున రూ. 400చొప్పున రూ.32లక్షలు చెల్లించడం విశేషం. ప్రైవేటు విద్యార్థులు.. బోధన రుసుము.. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రైవేటు విద్యార్థులు 40 వేల మంది చదువుతున్నారు. ఆర్ట్స్‌లో 24 వేలు, సైన్స్‌లో 16 వేల మంది వి ద్యార్థులు ఉన్నారు. ఆర్ట్స్ విద్యార్థులకు రూ. 1,600, సైన్స్ విద్యార్థులకు రూ.1,980 చొప్పున ఒక్కొక్కరికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆర్ట్స్ విద్యార్థులకు రూ.3.84 కోట్లు, సైన్స్ విద్యార్థులకు రూ.3.16 కోట్లు చెల్లిస్తోంది. జిల్లాలో ప్రైవేటు విద్యార్థులకు ఏడాదికి రూ.7 కోట్లు ప్రభుత్వం చెల్లించడం విశేషం. కొసమెరుపు.. జిల్లాకు ఒక ఆర్ఐవో ఉంటారు. ఆర్ఐవో కేవ లం పరీక్షల నిర్వహణ, ప్రైవేటు కళాశాలల పర్యవేక్షణ, అనుమతి వరకే పనిచేస్తారు. ప్రభుత్వ కళాశాలల పర్యవేక్షణ చేయాల్సింది డీవీఈవో. ఇతను కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రభు త్వ కళాశాలలను పర్యవేక్షణ చేయాలి. డీవీఈవో కు ఇటీవలనే తెలంగాణ ఆర్జేడీగా అదనపు బా ద్యతలు అప్పగించారు. తెలంగాణలోని 385 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. రెండు జిల్లాల అధికారిగా తన పనితీరులో న్యాయం చేయని అధికారి తెలంగాణలోని 385కళాశాలలకు ఏమేరకు తన పనితీరును చూపిస్తారో రాష్ట్ర ఉన్నతాధికారులకే తెలియాలి. -
ఎదురులేని ‘ఎన్ఆర్ఐ’
ఇంటర్ విద్యలో నాణ్యమైన బోధనకు చిరునామాగా నిలిచిన ‘ఎన్ఆర్ఐ అకాడమి’ ఎంసెట్ 2014 ఫలితాలలోనూ స్టేట్ టాప్ ర్యాంకులతో దూసుకెళ్లింది. మెడికల్, ఇంజనీరింగ్‌లో రికార్డు స్థాయిలో వందలోపు, వెయ్యిలోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించింది. మెడికల్‌లో 360 మందికిపైగా ఎన్నారై విద్యార్థులు సీట్ గెట్టింగ్ ర్యాంకులు తెచ్చుకున్నారు. ఇంజనీరింగ్‌లో వెయ్యిలోపు బెస్ట్ ర్యాంకులతో 12,304 ఇంజనీరింగ్ సీట్ గెట్టింగ్ ర్యాంకులు ఎన్నారైకు దక్కాయి. గత ఆరేళ్లుగా విజయాల క్రమాన్ని పెంచుకుంటున్న తాము ఈ ఏడాది అత్యున్నత ర్యాంకులతోపాటు అత్యధిక సీట్ గెట్టింగ్ ర్యాంకులను సాధించామని ‘ఎన్నారై అకాడమి’ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్, డెరైక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య వివరించారు. ‘కేవలం కొందరికే కాదు.. అందరికీ అత్యుత్తమ ర్యాంకులు’ అన్న తమ విధానం ఈ ఫలితాలలో కూడా ప్రతిబింబించిందని చెప్పారు. ఎన్నారై డాక్టర్ల నేతృత్వంలో నడుస్తున్న ‘ఎన్నారై అకాడమి’లో డాక్టర్, ఇంజనీర్ కావాలనే లక్ష్యాన్ని చేరుకోవటం సులభ సాధ్యమని పేర్కొన్నారు.