హైస్కూళ్లలో ఇక ఇంటర్‌ విద్య | Inter Education in High Schools YSR Kadapa | Sakshi
Sakshi News home page

హైస్కూళ్లలో ఇక ఇంటర్‌ విద్య

Published Wed, Jul 22 2020 11:19 AM | Last Updated on Wed, Jul 22 2020 11:19 AM

Inter Education in High Schools YSR Kadapa - Sakshi

సంబేపల్లె హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులు

కడప ఎడ్యుకేషన్‌ : పదో తరగతి చదివిన చోటే ఇంటర్మీడియెట్‌ను పూర్తి చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత తమ పిల్లలను ఏ కళాశాలలో చేర్పించాలన్నది తల్లిదండ్రులకు పెద్ద సమస్య. ‘ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తుందా.. వచ్చినా ఎంత దూరం వెళ్లి చదువుకోవాలి.. ఒత్తిడి విద్య, ఫీజుల భారం’ లాంటి కారణాలతో చదువును ఆపేసి.. ఇంటికే పరిమితమైపోవడం వంటి వాటకి చెక్‌ పడనుంది.

మండలాలు దాటే పరిస్థితికి చెక్‌
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్‌ కోసం మండలాలు దాటాల్సిన అవసరం లేదు. మండల కేంద్రంలోని హైస్కూల్లోనే ఇంటర్మీడియెట్‌ విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంటర్మీడియెట్‌ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు చాలా మంది ఇంటర్మీడియెట్‌ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. కాలేజీ దూరాభారం వల్లే సమస్య తలెత్తుతోందని దాదాపు అందరూ అంగీకరించినట్లు తెలిసింది. పదో తరగతి తర్వాత ముఖ్యంగా ఎక్కవ మంది బాలికలు విద్యకు దూరమై డ్రాపౌట్స్‌గా మారుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు పేద, మధ్య తరగతి విద్యార్థులు కూడా పై చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేక విద్యకు దూరమౌతున్నారు. ఇక హైస్కూల్స్‌లో ఇంటర్‌ విద్యను ప్రవేశ పెడితే  బాలికల్లో డ్రాపౌట్స్‌ సంఖ్య తగ్గుతుంది. అలాగే గ్రామీణ ప్రాంత పేద, మధ్య తరగతికి చెందిన వారు విద్యావంతులుగా మారే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా 32 హైస్కూల్స్‌ను ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. వీటిలో చదివే వారంతా ఇక ఇంటర్‌ విద్యను కొనసాగించనున్నారు.

జిల్లాలో ఉన్న జూనియర్‌ కళాశాలలు
జిల్లాలో 50 మండలాలు ఉన్నాయి. ఇందులో 27 ప్రభుత్వ, 20 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు 10 మోడల్‌ స్కూల్స్, 10 సోసియల్‌ వేల్ఫేర్, 10 కేజీబీవీలల్లో జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది నుంచి మరో 19 కే జీబీవీల్లో ఇంటర్‌ విద్యను అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ ఏడాది నుంచి కార్పొరేట్, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంటర్‌ తరగతులు బోధించడం వల్ల గ్రామీణ ప్రాంతానికి చెందిన అనేక మంది విద్యార్థులు చదివే అవకాశం ఉంది. 

జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యే మండలాలివే..
జిల్లాలోని బి కోడూరు, బ్రహ్మంగారిమఠం, చక్రాయపేట, చాపాడు, చెన్నూరు, చిన్నమండెం, చిట్వేలి, దువ్వూరు, గాలివీడు, కమలాపురం, కాశినాయన, ఖాజీపేట, కొండాపురం, లింగాలలో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అలాగే ముద్దనూరులో రెండు, మైలవరం, నందలూరు, ఓబులవారిపల్లె, పెద్దముడియం, పెనగలూరు, పెండ్లిమర్రి, రాజుపాళెం, సిద్దవటం, సింహాద్రిపురంలో రెండు, తొండూరులో రెండు, వల్లూరు, వీరపునాయునిల్లె, వేంపల్లిలో జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement