గతేడాది పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థులు(ఫైల్)
పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులను ఇష్టమొచ్చినట్లు వేసుకునే కార్యక్రమానికి ఇక చెక్ పడే విధంగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతేడాది పది ఫలితాల్లో పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు అధికంగా పదికి పది గ్రేడ్‌లు వచ్చాయి. ఇంటర్నల్‌లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా మార్కులను వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది కమిటీలను నియమించి ప్రైవేటు, కార్పొరేట్ దూకుడుకు కళ్లెం వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
కడప ఎడ్యుకేషన్ : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పదవ తరగతి ఇంటర్నల్ పరీక్షల్లో ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకుని, అత్యధికంగా పదికి పది గ్రేడ్స్ సాధిస్తున్నాయి. దీనిపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో ఎక్కువ జీపీఏ వచ్చిన పాఠశాలలపై విచారణ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. దీంతో పాటు ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తారనే ప్రచారం జరిగినా విద్యాశాఖ ఈ ఏడాది కూడా ఇంటర్నల్ మార్కులను కొనసాగిస్తుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిటీల నియామకం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో కమిటీలు వేయడంతో తూతూ మంత్రంగా పనిచేశారనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి విమర్శలకు కట్టడి చేసేందుకు ఈ ఏడాది జనవరిలోనే కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈనెల 9న విద్యాశాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
మూడు విభాగాలుగా కమిటీలు..
రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు మండలం, డివి జన్, జిల్లాస్థాయిలో మూడు కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను పరిశీలించాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సమ్మెటివ్–1, ఫార్మెటివ్‌కు సంబంధించి 1,2,3,4 పరీక్షల మార్కులను కమిటీలు పరిశీలించనున్నాయి. మండలస్థాయి కమిటీలో ఎంఈఓ, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, డివిజినల్ స్థాయి కమిటీ చైర్మన్‌లో డిప్యూటీ ఈఓ, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, ఎస్‌ఎస్‌ఏ సెక్టోరియల్ అధికారి, జిల్లాస్థాయి కమిటీలో డీఈఓ, ప్రభుత్వ పరీక్షల సహాయక కమీషనర్, డీసీఈబీ సెక్రటరీ, డైట్ ప్రిన్సిపల్ సభ్యులుగా వ్యవహరిస్తారు.
నివేదికలు ఇలా..
మండలస్థాయిలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వ రకు పదోతరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను పరిశీలించి డివిజినల్ స్థాయికి కమిటీకి నివేదిక అం దించాలి. అయితే వీటిలో 80 శాతం ప్రైవేటు, అన్ ఎ యిడెడ్ పాఠశాలలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే డివిజినల్ స్థాయి కమిటీ ఫిబ్రవరి 5 నుంచి 13లోపు పరిశీలన పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటిటీ నివేదిక అం దించాలి. వారు 5 నుంచి 13లోపు మార్కులను పరిశీ లించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదిక అందించాలి.
ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహించకుండానే పరిశీలన..
ఇంటర్నల్ మార్కుల పరిశీలనకు కమిటీలను ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా ఇంతవరకు పాఠశాలల్లో ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహించలేదు. ఇది నిర్వహించకుండా మార్కుల పరిశీలన ఏవిధంగా జరుపుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎస్‌ఏ–1, పార్మెటివ్–1,2,3 పరీక్షలు మాత్రమే జరిగాయి. ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ నాలుగు పరీక్షలకు సంబంధించి 280 మార్కులకు 20 మార్కులుగా ఇంటర్నల్ మార్కులను వేయడం సాధ్యం కాదు. మరి ఇలాంటి పరిస్థితిలో కమిటీలు ఇంటర్నల్ మార్కులను ఎలా తనిఖీ చేస్తారో తెలియాలి.
ఫార్మెటివ్–4 పరీక్ష నిర్వహిస్తాం
ఇప్పటి వరకు జరిగిన సమ్మెటివ్–1 ఫార్మెటివ్ 1,2,3 పరీక్షలకు సంబం ధించి మార్కులను కమిటీలు పరిశీలిస్తాయి. ఫార్మెటివ్– 4 పరీక్షను త్వరలో నిర్వహిస్తాం. పరీక్ష ముగియగానే అవసరమైతే ఆ మార్కులను కూడా పరిశీలిస్తారు. ఫార్మెటివ్–4 కాకుండా మిగతా వాటిని పరిశీలించగానే పరిస్థితి అర్థమవుతోంది. – జీవీ నారాయణరెడ్డి, డీసీఈబీ సెక్రటరీ
పారదర్శకంగా తనిఖీలు
గతేడాది కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు పదవ తగరతిలో ఇంటర్నల్ మార్కులను ఇస్టానుసారంగా వేసుకున్నాయన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమిటీలను ఏర్పాటు చేసి పరిశీలించాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ నెల 28లోపు కమిటీలను ఏర్పాటు చేసి పారదక్శంగా తనిఖీలు చేపడతాం. ఎవరికైనా వాస్తవ మార్కుల కంటే ఎక్కవ మార్కులు వేసినట్లు గురిస్తే చర్యలు తీసుకుంటాం.– పి. శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి.
Comments
Please login to add a commentAdd a comment