ఉన్నట్టా.. లేనట్టా! | Confusion On Tenth Class Internal Marks | Sakshi
Sakshi News home page

ఉన్నట్టా.. లేనట్టా!

Published Mon, Sep 17 2018 12:05 PM | Last Updated on Mon, Sep 17 2018 12:05 PM

Confusion On Tenth Class Internal Marks - Sakshi

పరీక్షలను పర్యవేక్షిస్తున్న డీఈఓ శామ్యూల్‌

నెల్లూరు(టౌన్‌): పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కులు విద్యార్థులు, ఉపాధ్యాయులను అయోమయంలో పడేసింది. గత రెండేళ్లుగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 80 మార్కులకే నిర్వహిస్తున్నారు. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్‌ మార్కులుగా కలుపుతున్నారు. అయితే ఈ ఏడాది 100 మార్కులకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉంటాయని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. పాఠశాలలను పునఃప్రారంభించి 3 నెలలు పూర్తయినా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఎన్ని మార్కులు ఉంటాయన్న దానిపై ఇప్పటికీ జిల్లా విద్యాశాఖకు స్పష్టత రాలేదు. పరీక్షల్లో ఎన్ని మార్కులకు పేపరు ఉంటుందన్న ఆందోళన ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో నెలకొంది. గత రెండేళ్లుగా పరీక్షల్లో మార్పులు చేస్తూ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు. అయితే ప్రైవేట్‌ విద్యాసంస్థల యజమానులు మాత్రం పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కులు ఉండాలని మంత్రిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది.

స్పష్టత లేక అమోమయం
జిల్లాలో మొత్తం 694 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 348 ప్రభుత్వ, 346 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది 35,478 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 21799 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 10254 మంది బాలురు, 11538 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలల్లో 13679 మంది విద్యార్థులు చదవుతున్నారు. వారిలో 7825 మంది బాలురు, 5854 మంది బాలికలు ఉన్నారు. ప్రతి ఏటా మార్చిలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే పది పరీక్షలు ఎన్ని మార్కులకు నిర్వహిస్తారో ఇప్పటికీ విద్యార్థులకు తెలియని పరిస్థితి నెలకొంది. 2016–17 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. గతంలో పదో తరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు 100 మార్కులకు పరీక్ష నిర్వహించే వారు. గత రెండేళ్లుగా ఒక్కో సబ్జెక్ట్‌కు 80 మార్కులకే పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన 20 మార్కులకు పాఠశాలల్లో నిర్వహించే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్, సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకుని మార్కులు వేస్తున్నారు. ఏడాదికి 4 ఫార్మేటివ్‌లు, 3 సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌లు నిర్వహించాల్సిఉంది. అయితే 2017–18లో తొలి సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పేపర్‌ లీకు కావడంతో ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేసి రెండు అసెస్‌మెంట్‌లనే నిర్వహించారు. 2016–17 విద్యా సంవత్సరంలో ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షలకు సంబంధించి వచ్చిన మార్కుల ఆధారంగా 8వ తరగతిలో 10 మార్కులు, 9వ తరగతిలో 10 మార్కులు తీసుకుంటామని ప్రకటించారు. కానీ కేవలం 10వ తరగతిలో 4 ఫార్మేటివ్‌లు రెండు అసెస్‌మెంట్‌ల్లో వచ్చిన 360 మార్కులను పరిగణనలోకి తీసుకుని ఇంటర్నల్‌ మార్కులను కలిపారు. అయితే 2017–18 సంవత్సరంలో ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పబ్లిక్‌ పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కులు వేశారు. అయితే సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యార్థులకు ఒకే రకమైన ప్రశ్నపత్రంతో పరీక్షలు నిర్వహించారు.

మార్కులపై గందరగోళం
పదో తరగతి మార్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. పదిలో 100 మార్కులకు పరీక్షలు ఉంటాయని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించినా దీనిపై జిల్లా విద్యాశాఖకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికి తొలి ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షను నిర్వహించగా, ప్రస్తుతం రెండో ఫార్మేటివ్‌ పరీక్ష జరుగుతోంది. తొలి సమ్మెటివ్‌ పరీక్షను దసరా సెలవుల అనంతరం అక్టోబర్‌ చివరి వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. పదో తరగతి పరీక్షల్లో 80 మార్కులు ఉండడం ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ప్రయోజనమని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఒకే ప్రశ్నపత్రం ఉండడం వల్ల లీక్‌ చేయడం పరిపాటిగా మారింది. గతేడాది సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేయడం వల్ల ఏకంగా పరీక్షలనే రద్దు చేశారు.  

కార్పొరేట్‌ వాళ్లదే..
పదిలో ఇంటర్నల్‌ మార్కుల కోసం కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యాసంస్థల విద్యార్థులకు లాభసాటిగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థల యజమానులు తమకు ఇష్టం వచ్చిన విధంగా విద్యార్థులకు ఇంటర్నల్‌ మార్కులు వేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఎక్కువగా కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు 10కి 10 జీపీఏ రావడం సులభతరమైందంటున్నారు. దీంతోనే పదిలో ఇంటర్నల్‌ మార్కులు తప్పనిసరిగా ఉండాలని కార్పొరేట్‌ విద్యాసంస్థల యజమానులు పట్టుబడుతున్నారు. ఈ విషయంపై మంత్రి నారాయణ ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పదో తరగతికి ఇంటర్నల్‌ మార్కులు ఉండవని, 100 మార్కులకు పరీక్షలు ఉంటాయని ప్రకటించినా ఇప్పటికీ ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement