ఇంటర్నల్ మార్కులు నమోదు చేస్తున్న దృశ్యం
అనంతపురం ఎడ్యుకేషన్: గతంలో చేసిన తప్పిదాలను మళ్లీ చేశారు. చేసిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా.. పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 2017–18 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ పదో తరగతి పరీక్షలకు హాజరై ఇంటర్నల్(అంతర్గత) మూల్యాంకనంలో మార్కులు నమోదు కాని విద్యార్థులకు సంబంధించి ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు నమోదు చేసేందుకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో ఈ మార్కులు నమోదు కాని విద్యార్థుల వివరాలు వారి తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ కమిషనర్, అమరావతి నుంచే సమాచారం చేరవేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సీనియర్ ప్రధానోపాధ్యాయులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి స్థానిక కేఆస్‌ఆర్ బాలికల పాఠశాలలో ఈ నెల 7 నుంచి గురువారం.. అంటే నాలుగు రోజల పాటు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి రికార్డులను పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాత మార్కులు నమోదు చేస్తూ వచ్చారు.
నమోదు కాని 32 మందివిద్యార్థుల మార్కులు
జిల్లాలో 137 స్కూళ్ల నుంచి 2121 మంది విద్యార్థుల మార్కులను అప్‌లోడ్ చేయాల్సి ఉందంటూ రాష్ట్ర అధికారుల నుంచి జాబితా వచ్చింది. గడువు ముగిసే సమయానికి 130 స్కూళ్ల నుంచి 2,089 మంది విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. ఇంకా ఏడు స్కూళ్ల నుంచి 32 మంది విద్యార్థుల మార్కులను నమోదు చేయాల్సి ఉంది. ఈ స్కూళ్లన్నీ కూడా ప్రైవేట్‌వే కావడం గమనార్హం. అనంతపురంలో రెండు, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, మడకశిరలో ఒక్కో స్కూలు ఉంది. ఇంటర్నల్ మార్కులు నమోదు చేయని అన్ని స్కూళ్లకు మోమోలు జారీ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అవకాశం ఇచ్చినా మార్కులు నమోదు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment