పుత్రికోత్సాహం | Anantapur Seventh Place in Tenth Class Results | Sakshi
Sakshi News home page

పుత్రికోత్సాహం

Published Wed, May 15 2019 11:22 AM | Last Updated on Wed, May 15 2019 11:22 AM

Anantapur Seventh Place in Tenth Class Results - Sakshi

అనంతపురంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి విజయగర్వంతో అడుగులు వేస్తున్న కుమార్తెను చూసి ఓ తండ్రి ముసిముసినవ్వులు

అనంతపురంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి విజయగర్వంతో అడుగులు వేస్తున్న కుమార్తెను చూసి ఓ తండ్రి ముసిముసినవ్వులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ‘అనంత’ సత్తా చాటింది. 95.55 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7వ స్థానాన్ని దక్కించుకుంది. పదో తరగతి పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కాగా.. జిల్లాలో 2,971 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. గతేడాది 2,200 మందివిద్యార్థులు 10/10 పాయింట్లు సాధించగా.. ఈసారి 771 మంది పెరిగారు. బాలురు, బాలికల మధ్య పోటీ నెలకొన్నా బాలికలు స్వల్ప ఆధిక్యత సాధించారు. బాలురకంటే 0.85 శాతం ఉత్తీర్ణత పెరిగింది. రాష్ట్రంలోనూ మన జిల్లా గతేడాదికంటే మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 8వ స్థానంలో నిలవగా ఈసారి ఒకస్థానం పైకి ఎగబాకి 7వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 95.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 0.32 శాతం తగ్గింది. మొత్తం 50,507 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 48,066 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 25,861 మంది బాలురకు గాను 24,504 మంది 94.75 శాతం ఉత్తీర్ణత సాధించగా, 24,646 మంది బాలికలకు గాను 23,562 మంది 95.6 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 

ఫలితాల కోసం ఎదురుచూపు
ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రకటిస్తారని రెండు రోజుల ముందే అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు, స్కూళ్ల యాజమాన్యాలు ఉదయం నుంచే ఎదురు చూశారు.  ఎట్టకేలకు విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఫలితాలు ప్రకటించగానే విద్యార్థులు, తల్లిదండ్రులు నెట్‌సెంటర్ల వద్ద, మొబైళ్లలో ఫలితాలు చూసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. 

ప్రైవేట్‌ స్కూళ్లలో 2,542 మంది 10/10 పాయింట్లు  
అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 2,971 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించగా వీరిలో ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులే 2,542 మంది ఉండడం విశేషం. అలాగే ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులు 19 మంది, బీసీ గురకుల పాఠశాలల్లో 16 మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 31 మంది, కేజీబీవీల్లో 40 మంది, మునిసిపల్‌ పాఠశాలల్లో 63 మంది, మోడల్‌ స్కూళ్లలో 41 మంది, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 13 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 14 మంది, గిరిజన గురుకుల పాఠశాలల్లో ముగ్గురు, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 189 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించారు. 

508 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత
మొత్తం 975 స్కూళ్ల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఇందులో 508 మంది స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేట్‌ స్కూళ్లు 362కు గాను 263 స్కూళ్లు ఈ ఘనత సాధించాయి. జిల్లా పరిషత్‌ స్కూళ్లు 437కు గాను 157 వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాగే ఎయిడెడ్‌ స్కూళ్లు 2, బీసీ గురుకుల పాఠశాలలు 6, ప్రభుత్వ పాఠశాలలు మూడు, కేజీబీవీలు 42, మున్సిపల్‌ పాఠశాలలు 8, మోడల్‌ స్కూళ్లు 15, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు 2, సాంఘిక సంక్షేమ స్కూళ్లు 9, ఒక గిరిజన గురుకుల పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. 

కలిసొచ్చిన ఇంటర్నల్‌ మార్కులు
నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానం కావడంతో విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 80 మార్కులకు మాత్రమే పరీక్ష రాశారు. తక్కిన 20 మార్కులు ఇంటర్నల్‌ మార్కులు. అంటే ఫార్మాటివ్, సమ్మేటివ్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులు, నోట్స్, ›ప్రాజెక్ట్‌ వర్క్, పుస్తక సమీక్ష ఆధారంగా ఆయా పాఠశాలల యాజమాన్యమే ఈ 20 మార్కులు వేసింది. ఈ విధానం ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. దాదాపు విద్యార్థులందరికీ 18–20 మార్కులు వేసినట్లు తెలుస్తోంది.  10/10 పాయింట్లు సాధించేందుకు ఇంటర్నల్‌ మార్కులు దోహదపడ్డాయి. 

జూన్‌ 6 వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు
సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్థులు జూన్‌ 6 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంది. అలాగే రీకౌంటింగ్‌ కోరే విద్యార్థులు రూ. 500, రీ వెరిఫికేషన్, జిరాక్స్‌ ప్రతులు కోరే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి దరఖాస్తులను ఈనెల 30లోపు హెచ్‌ఎంలకు అందజేయాలని డీఈఓ జనార్దనాచార్యులు వెల్లడించారు.  

‘అనంత సంకల్పం’ కలిసొచ్చింది  
పదో తరగతి ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు బాగా కష్టపడ్డారు. వారి కృషి, 40 రోజుల ‘అనంత సంకల్పం’ కార్యక్రమం అమలు బాగా కలిసొచ్చింది.  కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సూచనలు,  సలహాలు ఇవ్వడం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. తక్కువ  మార్కులు వచ్చాయనో, ఫెయిల్‌ అయ్యామనో ఎవరూ కుంగిపోవద్దు. నైతిక స్థైర్యం కోల్పోవద్దు. మరో ప్రయత్నం చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది.    – జనార్దనాచార్యులు, డీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement