ఖమ్మం: ఇంటర్ విద్య జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. ప్రయోగశాలలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఇరుకు గదుల్లో ఒక మూలన విద్యార్థులు, మరో మూలన సైన్‌ల్యాబ్ పరికరాలు దర్శనమిస్తున్నాయి. పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధనోపకరణాలను ఉపయోగించుకోవాల్సిన అధ్యాపకులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. పలు కళాశాలల్లో సైన్స్ పరికరాలు బయటకు తీసిన పాపాన పోవట్లేదు.
ఇంటర్మీడియెట్ పూర్తవుతున్న కనీసం పిప్పెట్, బ్యూరెట్, స్క్రూగేజీ, వెర్నియర్ కాలిపస్ అంటే తెలియని విద్యార్థులున్నారంటే అతిశయోక్తి కాదు. తరగతి గదిలోనే సైన్స్ పరికరాలు ఉండటంతో కొన్ని కళాశాలల్లో ఆకతాయి విద్యార్థులు వాటిని పగులగొడుతున్నారు. కొన్ని కాలేజీల్లో చెట్లకింద ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. కొన్నింటిలో సైన్స్‌ల్యాబ్‌లు శిథిలావస్థకు చేరాయి. కాలేజీల్లో కొనసాగుతున్న మొక్కుబడి ప్రాక్టికల్స్‌పై ‘సాక్షి’ మంగళవారం పరిశీలన జరిపింది.
బూజుపడుతున్న పరికరాలు
జిల్లాలో సగానికి పైగా కళాశాలల్లో బోధనోపకరణాల ఆధారంగా బోధన జరగడం లేదని తేలింది. కొన్ని కాలేజీల్లో ప్రయోగశాలల తలుపులు తీసిన దాఖలాలే లేవు. పరికరాలు, రసాయనాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. జిల్లాలో 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఎంపీసీలో మొదటి సంవత్సరం 825 మంది. ద్వితీయ సంవత్సరంలో 990 మంది, బైపీసీ ప్రథమ సంవత్సరం 1,292 మంది, ద్వితీయ సంవత్సరం 1,204 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు మొత్తం 2,194 మంది ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరు కావాలి. కానీ వీరిలో సగం మంది ఇప్పటివరకు ల్యాబ్‌లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఇక ప్రాక్టిక ల్స్ ఎలా చేయాలని విద్యార్థులు వాపోతున్నారు.
తరగతి గదిలోనే ప్రయోగశాలలు
బాటనీ, జువాలజీ ల్యాబ్స్‌లో జంతు కళేబరాలు, అవశేషాలు, స్పెసిమెన్స్ విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం అంతర్నిర్మాణం తెలుసుకునేందుకు మైక్రోస్కోప్‌లు వినియోగించాలి. రసాయనశాస్త్రంలో లవణ విశ్లేషణ, మూలకాలు, లవణాల ఘనపరిమాణం గురించి తెలియాలంటే రసాయనాలు కావాలి. వీటిలో కొన్ని ప్రమాదకరమైన యాసిడ్స్ ఉంటాయి. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ల్యాబ్స్ ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ జిల్లాలోని ఖమ్మం నయాబజార్, శాంతినగర్ కళాశాలలతోపాటు ఇతర ప్రాంతాల్లో తరగతి గదుల్లోనే ప్రయోగ పరికరాలు ఉన్నాయి.
వైరా కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లకు ఒక గది, బాటనీ, జువాలజీలకు కలిపి ఒక గదిని కేటాయించారు. కొత్త సిలబస్‌కు సంబంధించిన చార్టులూ ఏర్పాటు చేయలేదు. రసాయనాలు, పరికరాలు కొరతగా ఉన్నాయి. ఏన్కూరు కళాశాలలో ప్రత్యేకంగా ల్యాబ్ లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నిసార్లు యాసిడ్స్ మీద పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కారేపల్లి ప్రభుత్వ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకులు లేరు.
పినపాక నియోజకవర్గం అశ్వాపురంలో ల్యాబ్‌లు లేవు. అవసరమైనప్పుడు భారజల కర్మాగారం కళాశాలకు తీసుకెళ్లి ప్రయోగాలు చేయిస్తున్నారు. మణుగూరు, పినపాక, గుండాలలో ల్యాబ్‌లు ఉన్నా వాటిలో సరైన సౌకర్యాలు లేవు. బూర్గంపాడులో ప్రయోగశాల భవనం కురుస్తుండటంతో వాటిలో పరికరాలు దెబ్బతిన్నాయి.
కొత్తగూడెంలో ప్రయోగశాల గదుల నిర్మాణం కోసం రూ.29 లక్షలు మంజూరు చేశారు. 2013 జనవరిలో ఆరుగదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. బిల్లులు రాలేదని సంబంధిత కాంట్రాక్టర్ గదుల నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు.
మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలోని బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి కొతులు ప్రవేశించి సైన్స్‌ల్యాబ్ పరికరాలను ధ్వంసం చేస్తున్నాయి.
కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలలను శిథిలావస్థ భవనంలో నిర్వహిస్తున్నారు.
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోబీరువాల్లో ల్యాబ్ పరికరాలను భద్రపరచాల్సి వస్తోంది.
లక్షలు వెచ్చించినా ప్రయోగాలు శూన్యం..
లక్షలు వెచ్చించినా ప్రభుత్వ కళాశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. 2012 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ సిద్ధార్థజైన్ సైన్స్ పరికరాల కొనుగోలు కోసం ప్రయత్నించారు. కళాశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి కళాశాలకు రూ. లక్ష నుంచి రెండు లక్షల మేరకు గ్రాంట్స్ విడుదల చేశారు. ఆ నిధులతో దాదాపు అన్ని కళాశాలల అధ్యాపకులు ప్రయోగశాలల పరికరాలు కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించి బిల్లులు తీసుకున్నారు.
అదే సంవత్సరం కాలేజీల అభివృద్ధి కోసం ప్రతి కళాశాలకు రూ. 10వేల చొప్పున విడుదల చేశారు. ఈ నిధులు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నా.. కొనుగోలు చేసిన వస్తులు మాత్రం సగం కూడా కనిపించకపోవడం గమనార్హం. ఈ సంవత్సరం కూడా ఒక్కో కళాశాలకు రూ. 37,000 ప్రభుత్వం విడుదల చేసింది. వీటినైనా సక్రమంగా ఖర్చు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
కా‘లేజి’ ప్రాక్టికల్స్
Published Wed, Dec 31 2014 12:27 AM | Last Updated on Sat, Sep 15 2018 7:39 PM
Advertisement
Advertisement