తండ్రికి తగ్గ తనయ.. వేలకోట్ల కంపెనీలో కీలక వ్యక్తి: ఎవరీ నీలిమా? | Details Of Nilima Prasad Divi And Education Job More | Sakshi
Sakshi News home page

తండ్రికి తగ్గ తనయ.. వేలకోట్ల కంపెనీలో కీలక వ్యక్తి: ఎవరీ నీలిమా?

Published Sat, Feb 8 2025 7:51 PM | Last Updated on Sat, Feb 8 2025 8:26 PM

Details Of Nilima Prasad Divi And Education Job More

వ్యాపార రంగంలో కేవలం తండ్రులు మాత్రమే కాదు, తండ్రులకు తగ్గ కుమార్తెలు కూడా ఉన్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు హైదరాబాద్‌లో అత్యంత ధనవంతుడైన డాక్టర్ మురళీ కె. దివి కుమార్తె.. 'నీలిమా ప్రసాద్ దివి'. ఈమె గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతిపెద్ద జెనరిక్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల తయారీదారులలో ఒకటైన 'దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్' విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి నీలిమా. ఈమె 2012లో తండ్రి స్థాపించిన కంపెనీలో చేరి.. దాని ఉన్నతికి ఎంతో కృషి చేశారు.

దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కంపెనీలు చేరడానికి ముందే.. నీలిమాకు మెటీరియల్ రిక్వైర్మెంట్, ఫైనాన్సింగ్ అండ్ ఆసీకాంటింగ్ వంటి వాటిలో సుమారు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది. ప్రస్తుతం కంపెనీలో మెటీరియల్ సోర్సింగ్, ప్రొక్యూర్‌మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి కీలక రంగాలను పర్యవేక్షిస్తోంది.

'దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్'ను నీలిమా తండ్రి డాక్టర్ మురళీ కె. దివి స్థాపించారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.63 లక్షల కోట్ల కంటే ఎక్కువ. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. కంపెనీ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ దివి, భారతదేశంలోని అత్యంత సంపన్న ఫార్మా బిలియనీర్లలో ఒకరు. వీరి నికర విలువ 10.1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని అంచనా.

ఇదీ చదవండి: టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!

నీలిమా ప్రసాద్ దివి.. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. యూకేలోని గ్లాస్గో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌లో మరొక మాస్టర్స్ డిగ్రీని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె కంపెనీలో కీలక బాధ్యతలను చూస్తూనే.. 'దివి ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్'కు మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్నారు. మొత్తం మీద తండ్రికి తగ్గ తనయగా వ్యాపారరంగంలో నీలిమా ముందుకు సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement