laboratories
-
బెయిన్ క్యాపిటల్ చేతికి పోరస్ ల్యాబ్స్
హైదరాబాద్: స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను విస్తరించే వ్యూహంలో భాగంగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బైన్ క్యాపిటల్ హైదరాబాద్‌కు చెందిన పోరస్ లేబొరేటరీస్‌ను కొనుగోలు చేసింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడించలేదు. అయితే ఒప్పందం విలువ దాదాపు రూ.2,500–రూ3,000 కోట్లు (302–363 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. 2021–22 ఆర్థిక సంవత్సరంలో పోరస్ నికర విక్రయాల విలువ రూ.807 కోట్లు. 2020–21తో పోల్చితే (678 కోట్లు) 19 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. స్థూలంగా ఆదాయాలు ఇదే కాలంలో 97 శాతం వృద్ధితో రూ.123 కోట్ల నుంచి రూ.242 కోట్లకు ఎగసింది. 1994లో ఎన్. పురుషోత్తమ రావు స్థాపించిన పోరస్.. స్పెషాలిటీ పాలిమర్లు, ఎలక్ట్రానిక్ రసాయనాలు, ఆగ్రోకెమికల్స్తో పాటు ఇతర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డాక్టర్ రెడ్డీస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా రక్తపోటుపై అవగాహన కార్యక్రమాలతో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 30,813 మంది వైద్యులు పంపిన సందేశాలను ఆకులుగా అలంకరించి అతి పెద్ద హృదయాకృతిని రూపొందించినందుకు గాను ఈ ఘనత దక్కించుకుంది. దాదాపు 200 కిలోల బరువున్న ఈ ఇన్‌స్టాలేషన్‌ను హైదరాబాద్ బాచుపల్లిలోని కంపెనీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. -
యూనికెమ్ ల్యాబొరేటరీస్‌లో ఇప్కా ల్యాబ్స్‌కు 33.38% వాటా!
న్యూఢిల్లీ: ఔషధ రంగంలో ఉన్న ఇప్కా ల్యాబొరేటరీస్ తాజాగా యూనికెమ్ ల్యాబొరేటరీస్‌లో 33.38 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ.1,034 కోట్లు. యూనికెమ్ ప్రమోటర్ నుంచి 2,35,01,440 షేర్లను ఒక్కొక్కటి రూ.440 చొప్పున ఇప్కా దక్కించుకుంటోంది. అలాగే యూనికెమ్లో పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి మరో 26 శాతం వరకు వాటాలను ఒక్కో షేరుకు రూ.440 చెల్లించి కొనుగోలు చేసేందుకు ఇప్కా ఓపెన్ ఆఫర్ ఇవ్వనుంది. ఎంచుకున్న వృద్ధి మార్కెట్లలో కంపెనీ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడానికి తాము నిర్ధేశించుకున్న వ్యూహానికి అనుగుణంగా ఈ డీల్ ఉందని ఇప్కా ల్యాబొరేటరీస్ ప్రమోటర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రేమ్‌చంద్ గోధా ఈ సందర్భంగా తెలిపారు. 1949లో ఇప్కా ప్రారంభం అయింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 50 శాతం. ఫినిష్డ్ డోసెజెస్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను తయారు చేస్తోంది. -
ఎన్ఎస్ఈలో జిమ్ ల్యాబ్ లిస్టింగ్
న్యూఢిల్లీ: జనరిక్ ప్రొడక్టుల హెల్త్‌కేర్ కంపెనీ జిమ్ ల్యాబొరేటరీస్ తాజాగా ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. శుక్రవారం రూ. 336 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ. 340 వద్ద గరిష్టం, రూ. 330 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 3 శాతం లాభంతో రూ. 332 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 2018 జూన్‌లోనే లిస్టయిన స్మాల్ క్యాప్ కంపెనీ వారాంతాన ఎన్ఎస్ఈలోనూ లిస్టింగ్‌ను సాధించింది. విభిన్న, నూతన తరహా జనరిక్ ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, ఎండీ అన్వర్ డి. పేర్కొన్నారు. వీటిని ఈయూ మార్కెట్లలో ఫైలింగ్ చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలియజేశారు. కంపెనీ ప్రధానంగా నూతనతరహా డ్రగ్ డెలివరీ సొల్యూషన్స్ అందిస్తోంది. -
నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి.. కానీ అక్కడ మాత్రం లాబొరేటరీలో..!
నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి కదా, మరి లాబొరేటరీలో నక్షత్రం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే! లాబొరేటరీలోనే ఇటీవల ఒక బుల్లి నక్షత్రాన్ని తయారు చేశారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. ఆక్స్ఫర్డ్ సమీపంలోని ‘జాయింట్ యూరోపియన్ టారస్’ (జేఈటీ) లాబొరేటరీలో దీనిని తయారు చేసినట్లు యూకే అటామిక్ ఎనర్జీ అథారిటీ (యూకేఏఈఏ) వెల్లడించింది. ఈ బుల్లి నక్షత్రం ద్వారా కేవలం ఐదు సెకండ్లలోనే ఏకంగా 59 మెగాజౌల్స్ శక్తిని ఉత్పత్తి చేసి, 1997 నాటి రికార్డును శాస్త్రవేత్తలు బద్దలు కొట్టారని యూకేఏఈఏ ప్రకటించింది. ఐదు సెకండ్లలో ఈ బుల్లి నక్షత్రం ద్వారా ఉత్పత్తి చేసిన శక్తితో ఐదు సెకండ్ల పాటు 35 వేల ఇళ్ల విద్యుత్ అవసరాలను తీర్చవచ్చు. ఇది కేవలం ప్రయోగాత్మకంగా నమూనాలా ఉత్పత్తి చేసిన విద్యుత్తు మాత్రమే! ఐదు సెకన్ల ప్రయోగం కోసం ఇందులో కేవలం 0.1 మిల్లీగ్రాము డీయుటేరియం, ట్రిటియమ్ కణాలను ఉపయోగించారు. ఇవి రెండూ హైడ్రోజన్‌కు చెందిన ఐసోటోప్లు. న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా పనిచేసే ఈ బుల్లి నక్షత్రం పూర్తిస్థాయిలో పనిచేస్తే, ఇది ఏకంగా సూర్యుడికి పదిరెట్ల వేడిమిని ఉత్పత్తి చేయగలదు. దీని ద్వారా కాలుష్యంలేని విద్యుత్తును చిరకాలం సరఫరా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు నిజానికి 1980లలోనే మొదలైంది. ఇది విజయవంతమైతే, 2050 నాటికి ప్రపంచమంతటికీ కాలుష్యంలేని విద్యుత్తును సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు. చదవండి: లేడీ ఇన్ బ్లాక్.. చావు అంచుల దాకా వెళ్లి బతికాడు.. ఇప్పటికి మిస్టరీగానే -
సెకండ్ వేవ్‌పై అప్రమత్తం
సాక్షి, అమరావతి: బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటం, అది ఇప్పటికే కొన్ని దేశాలకు వ్యాప్తి చెంది ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ టెస్టుల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. కరోనా సమయానికి మన రాష్ట్రం ఒక్క టెస్టు కూడా చేసే పరిస్థితి లేని దశ నుంచి నేడు రోజుకు 70 వేల టెస్టులు చేసే స్థాయికి వచ్చింది. తాజాగా రోజుకు 1.10 లక్షల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే దిశగా ల్యాబొరేటరీల స్థాయిని పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిలో మరిన్ని టెస్టులు చేసేందుకు వీలుగా మెషినరీని పెంచారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ల్యాబొరేటరీ వ్యవస్థను బలోపేతం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 75 వేల వరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. దీన్ని 1.10 లక్షలకు పెంచుతున్నారు. ఈ మేరకు తాజాగా మెషీన్లు కొనుగోలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున వచ్చినా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేశారు. భవిష్యత్‌లో రకరకాల వైరస్‌లకు సంబంధించిన వ్యాధుల నిర్ధారణకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తాజా సామర్థ్యానికి సరిపడా సిబ్బందినీ నియమిస్తున్నారు. మైక్రో బయాలజిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర సిబ్బందిని సుమారు 300 మందిని నియమించేందుకు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేశారు. ట్రూనాట్ టెస్టులు నిలిపివేత రాష్ట్రంలో మూడు రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్టీపీసీఆర్ గోల్డెన్ స్టాండర్డ్‌గా పిలుస్తారు. వైరాలజీ ల్యాబొరేటరీల్లో గొంతు లేదా ముక్కులో నుంచి తీసిన ద్రవాన్ని పరీక్షిస్తారు. ఇప్పుడు ఈ టెస్ట్ కిట్ల వ్యయం తగ్గింది. ట్రూనాట్ మెషీన్ల ద్వారా కూడా ఇదే పద్ధతిలో ప్రక్రియ జరుగుతుంది. కాకపోతే ఇందులో చిప్ పద్ధతిలో ఫలితం వస్తుంది. ఈ టెస్టుకు కొంచెం ఖరీదు ఎక్కువ. అందుకే ఇప్పుడు దీనిని నిలిపివేశారు. మూడోది ర్యాపిడ్ యాంటీజెన్. వీటిని కూడా క్రమంగా తగ్గిస్తూ కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయాలన్న ఉద్దేశంతో వైరాలజీ ల్యాబొరేటరీల సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా భవిష్యత్‌లో వైరస్ కారణంగా వచ్చే వ్యాధులను ప్రతి జిల్లాలోనూ తక్షణమే గుర్తించేందుకు వీలుంటుంది. -
ప్రభుత్వ పరిధిలోనే రోగ నిర్ధారణ పరీక్షలు
గతం: ఏదో కంపెనీ రావడం పీపీపీ కింద పరీక్షలు చేస్తున్నామని చెప్పడం, ఫ్రాంచైజీల్లో పరీక్షలు చేశామనడం.. డాష్‌బోర్డులో ఇష్టారాజ్యంగా అప్లోడ్ చేసుకోవడం.. ప్రస్తుతం: ప్రభుత్వ పరిధిలోనే పరీక్షలు జరగాలి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబొరేటరీలు బాగుపడాలి.. సామాన్యులు, పేదలు ప్రతి ఒక్కరికీ మెరుగైన రోగ నిర్ధారణ పరీక్షలు జరగాలి.. దీనికి ఎంతైనా ఫరవాలేదు.. ఇదీ ఇప్పటి ప్రభుత్వ ఉద్దేశం. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ పరిధిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత నలుగురు సభ్యులతో కమిటీ నియమించి, పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. పలువురు వైద్యనిపుణుల అభిప్రాయాలతో పాటు, సుజాతారావు కమిటీ సూచనల మేరకు రాష్ట్రంలో 14 నుంచి 134 పరీక్షల వరకు ప్రభుత్వ పరిధిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ల్యాబొరేటరీల ఉన్నతీకరణ ► రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తపరీక్షలకు అవసరమైన పరికరాలు సమకూరుస్తారు. ► ల్యాబొరేటరీల్లో పాథాలజీ, హిస్టోపాథాలజీ, మైక్రోబయాలజీ పరీక్షలు చేస్తారు. ల్యాబ్ పరికరాల కొనుగోలుకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తారు. ► కొనుగోళ్లను ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్షిస్తుంది. ► నిర్ధారణ పరీక్షలకు అవసరమైన రసాయనాలు (రీఏజెంట్స్) కొరత లేకుండా చూస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 10 శాతం బయట నుంచి కొనుగోలు చేయవచ్చు. ► ర్యాపిడ్ డయాగ్నిస్టిక్స్ టెస్ట్ కిట్లు కూడా ప్రతి ఆస్పత్రిలో అందుబాటులో ఉంచుతారు.పరీక్ష ఫలితాలను రోగి మొబైల్ నంబరుకు మెస్సేజ్ రూపంలో పంపుతారు. ► ఇన్వెంట్రీ మేనేజ్మెంట్ అంటే నిర్ధారణ పరీక్షలు చేసిన ప్రతి రోగికి సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు. మూడు పెద్ద ల్యాబ్‌ల ఏర్పాటు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అతిపెద్ద ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్కటి రూ.25 కోట్లతో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో వీటిని నిర్మిస్తారు. ఒక్కో ల్యాబ్‌లో రోజుకు 10 వేల పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. ఇక మన ఆస్పత్రుల్లోనే.. అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు సొంతంగానే చేపడుతున్నాం. రోజుకు 10 వేల టెస్టులు జరిగే మూడు మేజర్ ల్యాబ్‌లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత మిగతా జిల్లాల్లో ఏర్పాటు చేస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
కోవిడ్ పరీక్షల ధరలు సవరిస్తూ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ప్రైవేటు ల్యాబరేటరీల్లో కోవిడ్-19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఏబీఎల్, ఐసీఎంఆర్‌లు అనుమతించిన ప్రైవేటు ల్యాబరేటరీల్లో పరీక్షలకు వసూలు చేసే ధరలనూ సవరిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు పంపింది. ఆర్ఎన్ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు పూర్తి స్థాయిలో మార్కెట్లో అందుబాటులోకి రావడంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను తగ్గించాని ఆదేశించింది. ప్రభుత్వం పంపించే నమునాలను 800 రుపాయలకు మాత్రమే వసూలు చేయాలని సూచిస్తూ ల్యాబ్ నిర్వహకులను ఆదేశించింది. వచ్చే నమునాలకు 1000 రూపాయల వరకూ వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
మరో మూడు కోవిడ్ ల్యాబొరేటరీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 వైరస్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం మరో మూడు ల్యాబొరేటరీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో, ల్యాబొరేటరీల నిర్వాహణాధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఏమన్నారంటే.. ► కోవిడ్–19 నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ల్యాబొరేటరీలు పనిచేస్తున్నాయి. ► శనివారం నుంచి కడప, గుంటూరులలో ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ► ఆదివారం సాయంత్రానికి విశాఖపట్నం ల్యాబొరేటరీని కూడా సేవల పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ► ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 450 కోవిడ్–19 టెస్టులు జరుగుతుండగా, ఈ కొత్త ల్యాబులు అందుబాటులోకి వస్తే ఆ సంఖ్య 570 టెస్టులకు పెరుగుతుంది. ► స్థానికంగా టెస్టులు చేయడం వల్ల నమూనాలను తరలించేందుకు అయ్యే రవాణా వ్యయం తగ్గుతుంది. ► రవాణా సమయం కూడా తగ్గడం వల్ల తొందరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. -
సిరాచుక్కా చెరిగీపోదులే!
ఒక్క సిరాచుక్క దేశ ప్రగతికి దిక్సూచి అన్నట్లుగా.. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల సమయంలో కీలక భూమిక పోషించడమే కాదు.. అందరికీ సుపరిచితమైన సిరాచుక్క తయారీకి గ్రేటర్ నగరం చిరునామాగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 దేశాలతో పాటు, మన దేశంలోని 29 రాష్ట్రాలకు సైతం గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఎన్నికల క్రతువులోవినియోగించే సిరాచుక్క ఎగుమతి అవుతుండటం విశేషం. నగరం కేంద్రంగా సుమారు మూడు దశాబ్దాలుగా దీనినినిర్విఘ్నంగా నిర్వహిస్తోంది రాయుడు ల్యాబరేటరీస్ సంస్థ.ఆ వివరాలేమిటో ఒకసారి చూద్దాం. సాక్షి, సిటీబ్యూరో : మనం ఓటు వేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం సిరాచుక్క. మన దేశంతో పాటు చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన తర్వాత వేలికి సిరాచుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలిపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒక వేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలికైనా సిరాచుక్క పెట్టాలి. ఎన్నిల వేళ కీలకంగా మారే ఈ సిరా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోనే తయారవుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల ఎన్నికల్లో ఈ సిరానే వాడుతున్నారు. ఇక్కడి నుంచే ఎగుమతి.. భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్) ఒకటి కాగా.. హైదరాబాద్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని రాయుడు ల్యాబరేటరీస్ మరొకటని దీని సీఈఓ శశాంక్ రాయుడు తెలిపారు. 37 ఏళ్లుగా ఇంక్‌ను తయారు చేస్తున్నామని చెప్పారు. పల్స్ పోలియో కార్యక్రమంలోనూ.. ఎన్నికల్లోనే కాకుండా పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా సిరాను వాడుతుంటారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు గుర్తించేందుకు వారి వేలిపై సిరా చుక్క పెడుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) కూడా ఇండెలిబుల్ ఇంక్ కోసం రాయుడు ల్యాబరేటరీస్ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఏ దేశంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగినా అక్కడ ఈ సిరానే ఉపయోగిస్తుండడం విశేషం. అంత ఈజీగా చెరిగిపోదు.. ఎన్నికల్లో వాడే సిరాను సెమీ పర్మనెంట్ ఇంక్గా చెప్పవచ్చు. ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతో పాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలిపై పెట్టిన తర్వాత మూడు నుంచి ఏడు రోజుల పాటు చెరిగిపోకుండా ఉంటుంది. -
సాగుభూమిలో సారమెంత?
ఏ నేలలో ఏ పంట వేయాలి..ఎంత మోతాదులో ఎరువులు వాడాలి.. తదితర విషయాలు తెలుసుకునేందుకు రైతులు విధిగా మట్టి పరీక్షలు చేయించాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ ఇందుకోసం మట్టి నమూనాలు సేకరించి తీసుకెళ్లినా పరీక్షలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. స్థానికంగానే పరీక్షలు చేసేందుకు ప్రతీ క్లస్టర్‌కు మినీ భూసార పరీక్ష కిట్లను గతేడాది ప్రభుత్వం అందజేసింది. అయితే ఇవి అటకెక్కాయి. దీంతో రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలు కవర్లలోనే మూలుగుతున్నాయి. దీంతో భూసార పరీక్ష ఫలితాలు అందక రైతులు వారికి తోచిన పంటలు సాగు చేస్తూ నష్టపోతున్నారు. తలమడుగు(బోథ్): జిల్లాలోని 18 మండలాలకు 91 యూనిట్లు మంజూరయ్యాయి. క్లస్టర్‌కు ఒక్కటి చొప్పున మండలానికి నాలుగు నుంచి ఆరు వరకు మినీ భూసార పరీక్ష కిట్లను గతేడాదే ఏఈవోలకు అందించారు. ఇంతవరకు బాగానే ఉన్న వాటిని ఇప్పటివరకు ఉపయోగించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం హడావుడిగా భూసార పరీక్ష కిట్లను అందించినా ఈ కేంద్రాలకు అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యం, ప్రత్యేక గదులు, లేబర్, ఫర్నిచర్ తదితర వసతులు కల్పించాల్సి ఉంది. కానీ కిట్లు మాత్రమే ఇచ్చి సౌకర్యాలు కల్పించకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో గ్రామాల్లో కిట్లు నిరుపయోగంగా మారాయి. జిల్లాలో కేవలం12 చోట్ల మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగతా గ్రామాల్లో ఇప్పటి వరకు వీటిని కనీసం తెరిచి చూడలేదు. కొన్ని మండలాల్లో వ్యవసాయశాఖ కార్యాలయంలో మూలనపడేశారు. దీంతో కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. పరీక్షలు వట్టివే.. గ్రామాల్లో పంట పొలాల నుంచి సేకరించిన మట్టిని ల్యాబ్‌లో పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ మేరకు సారం ఉంది. సారం లేని భూముల్లో ఏ మేరకు ఏయే ఎరువులు ఎంతమేరకు వాడాలి. ఏ పంటలకు అనుకులంగా ఉంటుంది..అనే విషయాలను రైతులకు తెలియజేయాలి. ఈ విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యతను మండల వ్యవసాయ విస్తరణాధికారులకు (ఏఈఓ) ప్రభుత్వం అప్పగించింది. 5వేల ఎకరాల సాగు భూమికి ఒక విస్తరణాధికారిని నియమించింది. జిల్లాలో మొత్తం 2లక్షల 10 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్నది 101 మంది. ఏఈవోలకు గతంలోనే భూసార పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. వీరు భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు రైతులకు అందించాలి. కార్డులో భూమి సంబం«ధించిన వివరాలు నమోదు చేయాలి. వివరాల ఆధారంగా ఎరువులు ఎంత మొత్తంలో వాడాలో తెలుస్తుంది. కానీ గ్రామాల్లో ఎక్కడా పరీక్షలే చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రైతు పొలంలో భూసార పరీక్షలు గతంలో మెట్ట ప్రాంతమైతే 25 ఎకరాలు తడి భూమిలో అయితే 6.25 ఎకరాలకు ఒక నమునాను సేకరించి భూసార పరీక్షలు నిర్వహించేవారు. కాగా ఇక నుంచి ప్రతీ రైతు పొలంలో భూసార పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో క్లస్టర్ పరిధిలోని ఒక ఏఈవోకు భూసార పరీక్ష కిట్‌ను అందించారు. పరీక్షలు నిర్వహించి ప్రతి రైతుకూ భూసార కార్డులు అందజేయాల్సి ఉంది. వసతులు కరువు.. వ్యవసాయ విస్తరణ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించడానికి లవణాల లభ్యత(ఎలక్ట్రానిక్ కార్బన్) ఉదజని సూచికలను గుర్తించాలి. అంటే నైట్రోజన్, భాస్వరం, పొటాష్ల శాతం పొలంలో ఏ మేరకు ఉన్నాయో పరీక్షల ద్వారా తేల్చాలి. పరీక్షలు చేయడానికి కార్యాలయంలో విద్యుత్, నీటి, వసతి కల్పించాలి. ప్రభుత్వం వసతులు కల్పించడంతో పాటు కనీసం టేబుల్, కుర్చీలు, గ్రామంలో ఒక గది ఏర్పాటు చేయాలి. కానీ అవేమి లేకుండానే మట్టి పరీక్షలు చేసి రైతులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని వ్యవసాయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 18 మండలాల్లో మట్టి నమూనా పరీక్షల యూనిట్లు ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారాయి. కొంతమంది ఏఈవోలకు ఈసీ పరీక్షలు చేస్తే పీహెచ్ పరీక్షలు రాకపోవడం, పీహెచ్ పరీక్షలు వచ్చిన వారికి ఈసీ పరీక్షలు చేయరాకపోవడంతో మట్టి నమునా పరీక్షలు పూర్తిస్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. సౌకర్యాలు కరువు.. భీంపూర్ మండలం కొత్తగా ఏర్పడింది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకే అద్దె భవనాలు దొరకడం లేదు. ఇక తాంసి కార్యాలయంలో విద్యుత్, నీటి సౌకర్యం లేదు. తలమడుగు మండలంలో 6 కిట్లు అందజేశారు. వీటిలో ఎక్కడా సౌకర్యాలు లేకపోవడంతో కిట్లను వ్యవసాయ కార్యాలయంలో నిరుపయోగంగా ఉంచారు. భూసార పరీక్షలు నిర్వహించాలంటే ఒక ప్రత్యేక ల్యాబ్ ఉండాలి. ల్యాబ్‌లో నీటివసతి, సిబ్బంది ఉండాలి. కానీ అవేమి లేకుండా పరీక్షలు నిర్వహించడం ఇబ్బంది అవుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపయోగంలోకి తెస్తాం జిల్లాలో గతేడాది 91 మినీ భూసార పరీక్ష కిట్లు వచ్చాయి. వాటిని మండలాలకు పంపిణీ చేశాం. సంబంధిత ఏఈవోలు తీసుకొని గ్రామాల్లో యూనిట్లు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం, భవనాలు లేక నిరుపయోగంగా మారాయి. వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తాం. భూసార పరీక్షలు చేసే సమయం వచ్చింది కనుక తప్పకుండా అన్ని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. – ఆశాకుమారి, జేడీఏ -
మరిన్ని ప్రాంతాలకు థైరోకేర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ చైన్ థైరోకేర్ టెక్నాలజీస్ చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 8 ల్యాబ్‌లు ఉన్నాయి. 2020 నాటికి వీటి సంఖ్య 60కి చేరుకుంటుందని థైరోకేర్ ఫౌండర్ డాక్టర్ వేలుమణి శుక్రవారమిక్కడ తెలిపారు. విజయవాడ, వైజాగ్‌లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఒక్కో కేంద్రానికి కంపెనీ రూ.4 కోట్లు ఖర్చు చేస్తోంది. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. 1,000 నగరాలు, పట్టణాల్లో 3,000 ఫ్రాంచైజీల ద్వారా శాంపిల్ కలెక్షన్ సెంటర్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. అతితక్కువ వ్యయానికే సేవలు అందిస్తూ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నామని వివరించారు. రోజుకు 3,00,000 పరీక్షలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఫ్రెషర్లకే ఉద్యోగాలు.. కంపెనీ ఉద్యోగులు 1,200 మంది ఉన్నారు. వీరిలో ఫ్రెషర్లే 98 శాతం అని వేలుమణి చెప్పారు. ‘కంపెనీ ఏర్పాటుకు ముందు 50 ఉద్యోగాలకు ఇంటర్వ్యూకు వెళ్లినా అనుభవం లేదన్న కారణంతో నన్ను రిజెక్ట్ చేశారు. అందుకే ఫ్రెషర్లను మాత్రమే తీసుకోవాలన్న ది మా అభిమతం. రెండేళ్లలో శాంపిల్ కలెక్షన్ కేంద్రా లు మరో 7,000 రానున్నాయి. ప్రతి కేంద్రం ద్వారా కనీసం 35 మందికి ఉపాధి లభిస్తోంది. ఫ్రాంచైజీల వద్ద 10,000 పైచిలుకు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ పనిచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. 2020 నాటికి రూ.600 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం. 5 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాం’ అని పేర్కొన్నారు. -
డాక్టర్ రెడ్డీస్‌కు కొత్త తలనొప్పి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. కంపెనీ, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా యూఎస్ కోర్టులో క్లాస్ యాక్షన్ సూట్ దాఖలైంది. అమెరికన్ ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాలను డాక్టర్ రెడ్డీస్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కొందరు ఇన్వెస్టర్ల తరఫున అక్కడి ఓ న్యాయ సేవల సంస్థ న్యూజెర్సీ జిల్లా కోర్టును ఆశ్రయించింది. కార్పొరేట్ క్వాలిటీ సిస్టమ్ పేరిట 2015 నవంబరు 6న జారీ అయిన యూఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లెటర్, 2017 ఆగస్టు 10న జారీ అయిన జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ లేఖలకు సంబంధించి కంపెనీ ఉద్ధేశపూర్వకంగా, తప్పుదోవ పట్టించేలా ప్రకటన చేసిందని, అసలు విషయాన్ని దాచిపెట్టిందని ఆరోపిస్తూ కోర్టులో దావా దాఖలయింది. కంపెనీ చర్యలవల్ల షేర్ ధర పడిపోయిందని, నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. ఈ ఇన్వెస్టర్లు 2015 జూన్ 15, 2017 ఆగస్టు 10 మధ్య న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో షేర్లను కొనుగోలు చేశారు. అయితే కోర్టు నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఆరోపణల్లో వాస్తవం లేదని, కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాతే స్పందిస్తామని వెల్లడించింది. బీఎస్ఈలో సోమవారం రెడ్డీస్ షేరు ధర రూ.41.95 (2.01 శాతం) తగ్గి రూ.2,045.95 వద్ద స్థిరపడింది. -
దివీస్‌కు మరోసారి అమెరికా షాక్
⇒ వైజాగ్ యూనిట్‌పై యూఎస్ఎఫ్డీఏ ఇంపోర్ట్ అలర్ట్ ⇒ ఒకేరోజు 20 శాతం పడిన షేరు ధర హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్‌కు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) షాకిచ్చింది. విశాఖపట్నంలోని తయారీ యూనిట్‌పై ఇంపోర్ట్ అలర్ట్ విధించింది. దీని ప్రకారం ఈ ప్లాంటులో తయారైన ఉత్పత్తులను యూఎస్ విపణికి ఎగుమతి చేయడానికి వీల్లేదు. కొన్ని ఔషధాలకు యూఎస్ఎఫ్డీఏ మినహాయింపు ఇచ్చినట్టు కంపెనీ బీఎస్ఈకి వెల్లడించింది. వీటిలో లెవెటిరాసెటమ్, గాబాపెంటిన్, లామోట్రిజిన్, కాపెసిటబిన్, నాప్రోక్సెన్, రాల్టెగ్రావిర్, అటోవాక్వోన్ తదితర 10 రకాల యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. నిషేధం ఉన్న ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఫార్మా రంగ నిపుణుడొకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూనిట్‌పైనే ఇంపోర్ట్ అలర్ట్ విధించడం కంపెనీకి ఊహించని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. వైజాగ్ యూనిట్ కీలకం.. కంపెనీకి హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నంలో యూనిట్ ఉంది. దివీస్ విక్రయాల్లో ఈ యూనిట్ 60–65 శాతం సమకూరుస్తోందని తెలుస్తోంది. అలాగే యూఎస్ అమ్మకాల్లో 20 శాతం అందిస్తోంది. 2016 నవంబర్ 29–డిసెంబర్ 6 మధ్య వైజాగ్ యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఎఫ్‌డీఏ పలు లోపాలను ఎత్తిచూపింది. ఎఫ్‌డీఏ లేవనెత్తిన లోపాలను సరిదిద్దేందుకు స్వతంత్ర నిపుణులతో కలసి పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, ఇంపోర్ట్ అలర్ట్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో దివీస్ షేరు ధర మంగళవారం 20 శాతం పడింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఒక్కో షేరు రూ.156 నష్టపోయి రూ.634.35 వద్ద ముగిసింది. -
జికా వైరస్ నిర్ధారణకు 2 కేంద్రాల గుర్తింపు
సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జికా వైరస్ నిర్ధారణకు ప్రత్యేక ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. జికా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్ర మత్తంగా ఉండాలని ఈ మేరకు కేంద్ర అధి కారులు ఆదేశాలు జారీచేశారు. దేశం మొత్తం మీద 25 ల్యాబొరేటరీలను గుర్తించగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ వెంకటేశ్వరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎస్వీఎంసీ-తిరుపతి), తెలంగాణలో గాంధీ మెడికల్ కాలేజ్ (జీఎంసీ-సికింద్రాబాద్)లను గుర్తించారు. ఈ రెండు సెంటర్లలో జికా వైరస్‌కు సంబంధించిన కేసులను నిర్ధారిస్తే కేంద్రానికి తెలియ జేయాలని పేర్కొన్నారు. -
కా‘లేజి’ ప్రాక్టికల్స్
ఖమ్మం: ఇంటర్ విద్య జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. ప్రయోగశాలలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఇరుకు గదుల్లో ఒక మూలన విద్యార్థులు, మరో మూలన సైన్ల్యాబ్ పరికరాలు దర్శనమిస్తున్నాయి. పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధనోపకరణాలను ఉపయోగించుకోవాల్సిన అధ్యాపకులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. పలు కళాశాలల్లో సైన్స్ పరికరాలు బయటకు తీసిన పాపాన పోవట్లేదు. ఇంటర్మీడియెట్ పూర్తవుతున్న కనీసం పిప్పెట్, బ్యూరెట్, స్క్రూగేజీ, వెర్నియర్ కాలిపస్ అంటే తెలియని విద్యార్థులున్నారంటే అతిశయోక్తి కాదు. తరగతి గదిలోనే సైన్స్ పరికరాలు ఉండటంతో కొన్ని కళాశాలల్లో ఆకతాయి విద్యార్థులు వాటిని పగులగొడుతున్నారు. కొన్ని కాలేజీల్లో చెట్లకింద ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. కొన్నింటిలో సైన్స్‌ల్యాబ్‌లు శిథిలావస్థకు చేరాయి. కాలేజీల్లో కొనసాగుతున్న మొక్కుబడి ప్రాక్టికల్స్‌పై ‘సాక్షి’ మంగళవారం పరిశీలన జరిపింది. బూజుపడుతున్న పరికరాలు జిల్లాలో సగానికి పైగా కళాశాలల్లో బోధనోపకరణాల ఆధారంగా బోధన జరగడం లేదని తేలింది. కొన్ని కాలేజీల్లో ప్రయోగశాలల తలుపులు తీసిన దాఖలాలే లేవు. పరికరాలు, రసాయనాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. జిల్లాలో 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఎంపీసీలో మొదటి సంవత్సరం 825 మంది. ద్వితీయ సంవత్సరంలో 990 మంది, బైపీసీ ప్రథమ సంవత్సరం 1,292 మంది, ద్వితీయ సంవత్సరం 1,204 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు మొత్తం 2,194 మంది ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరు కావాలి. కానీ వీరిలో సగం మంది ఇప్పటివరకు ల్యాబ్‌లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఇక ప్రాక్టిక ల్స్ ఎలా చేయాలని విద్యార్థులు వాపోతున్నారు. తరగతి గదిలోనే ప్రయోగశాలలు బాటనీ, జువాలజీ ల్యాబ్స్‌లో జంతు కళేబరాలు, అవశేషాలు, స్పెసిమెన్స్ విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం అంతర్నిర్మాణం తెలుసుకునేందుకు మైక్రోస్కోప్‌లు వినియోగించాలి. రసాయనశాస్త్రంలో లవణ విశ్లేషణ, మూలకాలు, లవణాల ఘనపరిమాణం గురించి తెలియాలంటే రసాయనాలు కావాలి. వీటిలో కొన్ని ప్రమాదకరమైన యాసిడ్స్ ఉంటాయి. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ల్యాబ్స్ ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ జిల్లాలోని ఖమ్మం నయాబజార్, శాంతినగర్ కళాశాలలతోపాటు ఇతర ప్రాంతాల్లో తరగతి గదుల్లోనే ప్రయోగ పరికరాలు ఉన్నాయి. వైరా కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లకు ఒక గది, బాటనీ, జువాలజీలకు కలిపి ఒక గదిని కేటాయించారు. కొత్త సిలబస్‌కు సంబంధించిన చార్టులూ ఏర్పాటు చేయలేదు. రసాయనాలు, పరికరాలు కొరతగా ఉన్నాయి. ఏన్కూరు కళాశాలలో ప్రత్యేకంగా ల్యాబ్ లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నిసార్లు యాసిడ్స్ మీద పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కారేపల్లి ప్రభుత్వ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకులు లేరు. పినపాక నియోజకవర్గం అశ్వాపురంలో ల్యాబ్‌లు లేవు. అవసరమైనప్పుడు భారజల కర్మాగారం కళాశాలకు తీసుకెళ్లి ప్రయోగాలు చేయిస్తున్నారు. మణుగూరు, పినపాక, గుండాలలో ల్యాబ్‌లు ఉన్నా వాటిలో సరైన సౌకర్యాలు లేవు. బూర్గంపాడులో ప్రయోగశాల భవనం కురుస్తుండటంతో వాటిలో పరికరాలు దెబ్బతిన్నాయి. కొత్తగూడెంలో ప్రయోగశాల గదుల నిర్మాణం కోసం రూ.29 లక్షలు మంజూరు చేశారు. 2013 జనవరిలో ఆరుగదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. బిల్లులు రాలేదని సంబంధిత కాంట్రాక్టర్ గదుల నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలోని బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి కొతులు ప్రవేశించి సైన్స్‌ల్యాబ్ పరికరాలను ధ్వంసం చేస్తున్నాయి. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలలను శిథిలావస్థ భవనంలో నిర్వహిస్తున్నారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోబీరువాల్లో ల్యాబ్ పరికరాలను భద్రపరచాల్సి వస్తోంది. లక్షలు వెచ్చించినా ప్రయోగాలు శూన్యం.. లక్షలు వెచ్చించినా ప్రభుత్వ కళాశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. 2012 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ సిద్ధార్థజైన్ సైన్స్ పరికరాల కొనుగోలు కోసం ప్రయత్నించారు. కళాశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి కళాశాలకు రూ. లక్ష నుంచి రెండు లక్షల మేరకు గ్రాంట్స్ విడుదల చేశారు. ఆ నిధులతో దాదాపు అన్ని కళాశాలల అధ్యాపకులు ప్రయోగశాలల పరికరాలు కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించి బిల్లులు తీసుకున్నారు. అదే సంవత్సరం కాలేజీల అభివృద్ధి కోసం ప్రతి కళాశాలకు రూ. 10వేల చొప్పున విడుదల చేశారు. ఈ నిధులు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నా.. కొనుగోలు చేసిన వస్తులు మాత్రం సగం కూడా కనిపించకపోవడం గమనార్హం. ఈ సంవత్సరం కూడా ఒక్కో కళాశాలకు రూ. 37,000 ప్రభుత్వం విడుదల చేసింది. వీటినైనా సక్రమంగా ఖర్చు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సమస్యల బడులు!
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో బాల, బాలికలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ప్రహరీ, ప్రయోగశాలలు, గ్రంథాలయం వంటి సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం ఏటా దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలలోనూ కనీసం 70 శాతం సౌకర్యాలు కూడా అందుబాటులోకి రాకపోవడం శోచనీయం. పేద పిల్లలు చదువుతున్న పాఠశాలలు అంటే అధికారులకు అంత చులకన ఎందుకో అనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చిన్న సమస్య ఎదురైతే నిలదీసే రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి గురించి ఎక్కడా కూడా నోరు మెదపకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధి పనుల్లో పలువురు రాజకీయ నాయకులే భాగస్వాములు కావడం కూడా నిర్లక్ష్యానికి కొంతమేర కారణమవుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంత మేరకు సౌకర్యాలు కల్పించారో తెలుపుతున్నటువంటి పూర్తి సమాచారంతో జూన్ ఏడో తేదీన హాజరు కావాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. జిల్లాలో విద్యావ్యవస్థ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 3,084, ప్రాథమికోన్నత పాఠశాలలు 444, ఉన్నత పాఠశాలలు 543 ఉన్నాయి. వీటిలో ఏటా ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు రెండున్నర లక్షల మంది బాల, బాలికలు చదువుకుంటారు. సౌకర్యాలు ఇప్పటి వరకు జిల్లాలోని పాఠశాలలకు 10,910 తరగతి గదులు ఉన్నాయి. 1,176 పాఠశాలల్లో మాత్రమే ఫర్నిచర్ ఉంది. 2,769 మరుగుదొడ్లు బాలురకు, 3,813 మరుగుదొడ్లు బాలికలకు, 960 పాఠశాలల్లో బాలురకు తాగునీరు, 1,132 పాఠశాలల్లో బాలికలకు తాగునీరు, బాలురకు 2,012 మూత్రశాలలు, బాలికలకు 1,875 మూత్రశాలలు నిర్మించారు. ప్రతి 40 మంది విద్యార్థులకు కనీసం ఒక మరుగుదొడ్డి, మూత్రశాల ఉండాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులు మంజూరవుతున్నాయి. ఈ నిధులతో ఎన్ని చర్యలు తీసుకున్నా కేవలం పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మాత్రమే కొంత మేరకు సౌకర్యాలు ఉన్నాయి. కానీ మూరుమూల ప్రాంతాల్లోని సగం వరకు పాఠశాలల్లో సౌకర్యాలు లేనేలేవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిర్వహణ లోపం కొత్తవి నిర్మాణం లేకపోయినా పరవాలేదు. కనీసం నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలను ప్రతి రోజు సక్రమంగా విద్యార్థులకు అందుబాటులో ఉంచలేకపోతున్నారు. నిర్వహణ లోపం దాదాపు ప్రతి పాఠశాలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. బోధనేతర సిబ్బంది ఏ ఒక్క పాఠశాలలోనూ సరిపడా లేకపోవడంతో నిర్వహణ లోపం కచ్చితంగా ఉంటోంది. తాగునీరు పాఠశాల సమయంలో సరఫరా చేయాలంటే పగటి పూట గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండదనేది జగమెరిగిన సత్యం. దీంతో నీటి కోసం వేసిన బోరు పనిచేయదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు సమీప ఇళ్లలోకి వెళ్లాల్సిందే. అదేవిధంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉపయోగించాలంటే నీటి వసతి తప్పనిసరి. వీటిని శుభ్రంగా ఉంచాలంటే నీటితో పాటు, స్కావెంజర్లు కావాలి. నీటి వసతి, స్కావెంజర్లు లేకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా మారాయి. పాఠశాల గదులను రోజువారీగా శుభ్రం చేయడానికి చాలా చోట్ల ఆయాలు లేకపోవడంతో పిల్లలతో పనులు చేయిస్తున్నారు. బోధనేతర సిబ్బంది 70 శాతం పాఠశాలల్లో లేకపోవడంతో ఉన్న సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రాక నిరుపయోగంగా మారాయి. పనిభారం జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగానే ఉం ది. దీనికి తోడు బోధనేతర సిబ్బంది పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ప్రధానోపాధ్యాయు లే అన్నీ తామై చేసుకోవాల్సిన దుస్థితి నెలకొం ది. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మండల విధ్యాధికారి, ఉప విద్యాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, ఆర్వీఎం, జిల్లా కలెక్టర్, క్లస్టర్ సమావేశాలు అంటూ అధిక సమయం వీటికే పడుతోంది. దీంతో సౌకర్యాల నిర్వహణ బాధ్యతలు కనుమరుగై పోతున్నాయనడానికి ఇది కూడా కారణంగా కనిపిస్తోంది. ఇన్ని కారణాల నేపథ్యంలో విద్యార్థులు మాత్రం సమస్యల మధ్యే చదువులు వెల్లదీస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ పరిస్థితులు మారేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముక్తకంఠంతో కోరుతున్నారు.