డాక్టర్ రెడ్డీస్‌కు కొత్త తలనొప్పి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. కంపెనీ, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా యూఎస్ కోర్టులో క్లాస్ యాక్షన్ సూట్ దాఖలైంది. అమెరికన్ ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాలను డాక్టర్ రెడ్డీస్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కొందరు ఇన్వెస్టర్ల తరఫున అక్కడి ఓ న్యాయ సేవల సంస్థ న్యూజెర్సీ జిల్లా కోర్టును ఆశ్రయించింది.
కార్పొరేట్ క్వాలిటీ సిస్టమ్ పేరిట 2015 నవంబరు 6న జారీ అయిన యూఎస్‌ఎఫ్‌డీఏ వార్నింగ్ లెటర్, 2017 ఆగస్టు 10న జారీ అయిన జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ లేఖలకు సంబంధించి కంపెనీ ఉద్ధేశపూర్వకంగా, తప్పుదోవ పట్టించేలా ప్రకటన చేసిందని, అసలు విషయాన్ని దాచిపెట్టిందని ఆరోపిస్తూ కోర్టులో దావా దాఖలయింది.
కంపెనీ చర్యలవల్ల షేర్ ధర పడిపోయిందని, నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. ఈ ఇన్వెస్టర్లు 2015 జూన్ 15, 2017 ఆగస్టు 10 మధ్య న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో షేర్లను కొనుగోలు చేశారు. అయితే కోర్టు నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఆరోపణల్లో వాస్తవం లేదని, కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాతే స్పందిస్తామని వెల్లడించింది. బీఎస్‌ఈలో సోమవారం రెడ్డీస్ షేరు ధర రూ.41.95 (2.01 శాతం) తగ్గి రూ.2,045.95 వద్ద స్థిరపడింది.