Dr Reddys
-
క్యాన్సర్‌కు కొత్త మందు.. డాక్టర్ రెడ్డీస్ ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. తిరగబెట్టే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్స కోసం భారత్‌లో తొలిసారిగా టోరిపాలిమాబ్ అనే ఇమ్యునో–ఆంకాలజీ ఔషధాన్ని విడుదల చేసింది. నాసోఫారింజియల్ కార్సినోమా అనేది తల, మెడ క్యాన్సర్‌కు సంబంధించింది. ఇది గొంతు పైభాగంపై చోటుచేసుకుంటుంది. పీడీ–1 ఔషధం అయిన టోరిపాలిమాబ్ సంప్రదాయ చికిత్సతో పోలిస్తే అత్యుత్తమ ఫలితాలను ప్రదర్శించిందని రెడ్డీస్ వెల్లడించింది. భారత్‌లో జైటోర్వి బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్ చేయనున్నట్లు తెలిపింది. ఇమ్యునో–ఆంకాలజీ అనేది ఒక క్యాన్సర్ చికిత్స విధానం. ఇది క్యాన్సర్‌ను నిరోధించడానికి, నియంత్రించడానికి, తొలగించడానికి రోగనిరోధక వ్యవస్థ శక్తిని ఉపయోగిస్తుంది. చైనా, యూఎస్ తర్వాత ఈ ఔషధం అందుబాటులోకి వచ్చిన మూడవ దేశం భారత్ కావడం విశేషం.ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ.. పునరావృతమయ్యే లేదా మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా చికిత్సకై యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ), మెడిసిన్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నియంత్రణ సంస్థలు ఆమోదించిన ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం ఇదేనని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. టోరిపాలిమాబ్ కోసం 2023లో కంపెనీ షాంఘై జున్షి బయోసైన్సెస్‌తో లైసెన్స్, వాణిజ్యీకరణ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, లాటిన్ అమెరికాతో సహా 21 దేశాల్లో టోరిపాలిమాబ్‌ను అభివృద్ధి చేయడానికి, అలాగే వాణిజ్యీకరించడానికి డాక్టర్ రెడ్డీస్ ప్రత్యేక హక్కులను పొందింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర తొమ్మిది దేశాల్లో అందుబాటులోకి తేవడానికి లైసెన్స్ పరిధి విస్తరణకు సైతం ఈ ఒప్పందం అనుమతిస్తుందని కంపెనీ వివరించింది. -
డాక్టర్ రెడ్డీస్ చేతికి మెనో ల్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా అమెరికాకు చెందిన మహిళల ఆరోగ్య సంరక్షణ, సప్లిమెంట్స్ ఉత్పత్తుల సంస్థ మెనోల్యాబ్స్ను కొనుగోలు చేసింది. అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ అమిరిస్లో భాగమైన మెనోల్యాబ్స్ను దివాలా కోడ్ ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. మెనోల్యాబ్స్ పోర్ట్‌ఫోలియోలో ఏడు బ్రాండెడ్ ఉత్పత్తులు, యాప్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. మహిళల పౌష్టికాహార, వెల్నెస్ ఉత్పత్తుల మార్కెట్లో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు మెనోల్యాబ్స్ కొనుగోలు ఉపయోగపడగలదని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్తర అమెరికా విభాగం సీఈవో మార్క్ కికుచి తెలిపారు. మెనోల్యాబ్స్ అమెరికాలో తమ సొంత ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్‌తో పాటు అమెజాన్, వాల్‌మార్ట్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
మైగ్రేన్ తలనొప్పి నివారణ పరికరం..
-
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే డాక్టర్ రెడ్డీస్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా పిల్లల పోషణ ఉత్పత్తుల్లోకి ప్రవేశించింది. సెలీహెల్త్ కిడ్జ్ ఇమ్యునో ప్లస్ పేరుతో రోగ నిరోధక శక్తిని పెంచే గమ్మీస్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..? వెల్మ్యూన్, ప్రీబయోటిక్స్, విటమిన్లు, లవణాల వంటి పదార్ధాల కలయికతో శాస్త్రీయంగా వీటిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. 30 గమ్మీస్తో కూడిన ప్యాక్ ధర రూ.480 ఉంది. మందుల షాపుల్లో, ఆన్లైన్లో లభిస్తుంది. (అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్: భారీగా పెరిగిన ఈ-కామర్స్ ఎగుమతులు) -
డాక్టర్ రెడ్డీస్ ‘సిడ్మస్’ ఔషధ రేటు తగ్గింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) హృద్రోగ చికిత్సలో ఉపయోగించే సిడ్మస్ ఔషధం రేటు ను గణనీయంగా తగ్గించింది. దీనితో 50 మి. గ్రా. ట్యాబ్లెట్ ధర రూ. 78.32 నుంచి రూ. 29కి తగ్గుతుంది. అలాగే 100 మి.గ్రా. ధర రూ. 83.86 నుంచి రూ. 49కి, 200 మి.గ్రా. ట్యా బ్లెట్ రేటు రూ. 96.71 నుంచి రూ. 79కి తగ్గు తుందని కంపెనీ తెలిపింది. భారత మా ర్కె ట్‌కు సంబంధించి సిడ్మస్ బ్రాండును నొవార్టిస్ నుంచి గతేడాది డీఆర్ఎల్ కొనుగోలు చేసింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
డాక్టర్ రెడ్డీస్ రూ. 1,500 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వ్యాపార విస్తరణపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇందులో సింహభాగం బయోసిమిలర్స్, ఇంజెక్టబుల్స్ తదితర విభాగాల సామర్థ్యాల పెంపు కోసం వినియోగించనుంది. అలాగే ప్రస్తుత ప్లాంట్ల విస్తరణ, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలను మెరుగుపర్చుకోవడం, డిజిటైజేషన్ ప్రాజెక్టులు మొదలైన వాటిపైనా ఇన్వెస్ట్ చేయనుంది. ఆనలిస్ట్‌లతో సమావేశంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ ఈ విషయలు తెలిపారు. ఏడాదికి 30–40 ఉత్పత్తులు కాకుండా అర్ధవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్న 20–25 ఉత్పత్తులనైనా ప్రవేశపెట్టడంపై మరింతగా దృష్టి సారిస్తున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. పనితీరు అంతగా బాగాలేని కొన్ని బ్రాండ్లను సరిచేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆయన వివరించారు. గత కొన్నేళ్లుగా పాటిస్తున్న వైవిధ్య వ్యాపార వ్యూహాల కారణంగా కేవలం ఒక మార్కెట్ లేదా ఒక నిర్దిష్ట అవకాశంపై ఆధారపడే పరిస్థితులను, రిస్కులను తగ్గించుకోగలిగామని ఇజ్రేలీ చెప్పారు. ప్రస్తుత భౌగోళిక .. రాజకీయ .. ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు మొదలైన సవాళ్లు నెలకొన్న కష్టసమయంలోనూ వృద్ధి సాధించేందుకు ఈ వ్యూహాలే తమకు తోడ్పడగలవని పేర్కొన్నారు. -
ప్రపంచం చూపు మనవైపు: మోదీ
న్యూఢిల్లీ: మన దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచమంతా మనవైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయగాథలో టీకా ఉత్పత్తిదారులు పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన శనివారం కోవిడ్–19 వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశమయ్యారు. టీకాపై తదుపరి పరిశోధనలతోపాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ప్రధానితో జరిగి సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కేవలం 9 నెలల్లో 100 కోట్ల కరోనా టీకా డోసులు ప్రజలకు పంపిణీ చేయడం గొప్ప ముందడుగు అని, మోదీ నాయకత్వ పటిమతోనే ఈ ఘనత సాధ్యమైందని వారు ప్రశంసించారు. ప్రధానితో భేటీ అనంతరం ఎస్ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి దార్శనికతతో తక్కువ సమయంలోనే 100 కోట్ల డోసులు ఇవ్వడం సాధ్యమయ్యిందని తెలిపారు. దేశంలో ఫార్మా రంగం అభివృద్ధి, భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై మోదీతో చర్చించినట్లు తెలిపారు. ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవడం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకత అని భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. స్వల్ప వ్యవధిలో 100 కోట్ల టీకా డోసులు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదని, మోదీ పట్టుదల, అంకితభావంతో ఇది అచరణ సాధ్యమయ్యిందని చెప్పారు. ఒక నాయకుడు తన దేశానికి చేయగలిగిన గొప్ప పని ఇది అని కొనియాడారు. డీఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి వెనుక మోదీ కృషి ఎంతగానో ఉందని జైడస్ క్యాడిలా సంస్థ ప్రతినిధి పంకజ్ పటేల్ చెప్పారు. -
మరో 9 నగరాల్లో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్.. జాబితాలో విశాఖ, మిర్యాలగూడ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి చికిత్సలో డీఆర్డీవో రూపొందించిన కీలక డ్రగ్‌ను ఇటీవల విడుదల చేసిన దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ మరో శుభవార్త అందించింది. స్పుత్నిక్-వీ టీకాలు ఇక నుంచి మరో 9 నగరాల్లో అందబాటులోకి వస్తాయని డాక్టర్ రెడ్డీస్ సంస్థ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నం, బడ్డీ, కోల్హాపూర్, మిర్యాలగూడ నగరాలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పైలట్ పద్ధతిలో టీకాలను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను .. మన దేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. కాగా, ఈ టీకాను మొదట హైదరాబాద్‌లో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం స్పుత్నిక్-వీ టీకాలను కోవిన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం లేదు. పైలట్ లాంచింగ్ ప్రక్రియ తుది దశలో ఉన్నదని, రెండు డోసుల టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. కాగా, మైనస్ 18డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద స్పుత్నిక్ వీ టీకాలను నిల్వ చేస్తారు. The #SputnikV vaccine will be available in 9 more cities across India, including Bengaluru, Mumbai, Chennai, Visakhapatnam, Baddi, Kolhapur and Miryalaguda.👇https://t.co/fIuXV2XDJP — Sputnik V (@sputnikvaccine) June 17, 2021 చదవండి: భారత ట్విటర్ ఎండీని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు -
డీఆర్డీఓ 2-డీజీ డ్రగ్ ఎవరు వాడాలి? ఎవరు వాడొద్దు?
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్) డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎవరెవరికీ డ్రగ్ వేయాలి.. వేయకూడదో స్పష్టం చెప్పింది. కోవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించినట్టు గుర్తు చేసింది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని సూచించింది. పాజిటివ్‌గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజుల పాటు డ్రగ్ ఇవ్వొచ్చు అని పేర్కొంది. అయితే ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని స్పష్టం చేసింది. నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన హృద్రోగ, శ్వాసకోస, హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మెంట్ సమస్యలు ఉన్నవారిపై ఈ డ్రగ్‌ను పరీక్షించలేదని, అలాంటివారికి వినియోగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం అని డీఆర్డీఓ సూచించింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వరాదు అని డీఆర్డీఓ స్పష్టంగా పేర్కొంది. రోగులు, వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను సంప్రదించవచ్చు. 2dg@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సరఫరాకు విజ్ఞప్తి చేయవచ్చు. డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో 2డీజీ సాచెట్ ధర రూ.990గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. చదవండి: మార్కెట్లోకి 2-డీజీ డ్రగ్ విడుదల చదవండి: 2-డీజీ సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్ -
యాంటీ కోవిడ్ డ్రగ్ 2-డీజీ ఔషధం విడుదల
న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్, డీఆర్డీవో అభివృద్ధి చేసిన కోవిడ్–19 ఔషధం ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. నోటి ద్వారా తీసుకునే 2–డీజీ ఔషధాన్ని ఒక మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్ల చికిత్సలో వాడటానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే. 2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్ (క్లుప్తంగా 2–డీజీ) ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులు తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని రక్షణశాఖ తెలిపింది. -
కరోనా విలయం: డీఆర్డీవో డ్రగ్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూడిల్లీ : కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీవో)కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో ఢిల్లీలోని ఐఎన్ఎంఏఎస్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్) ల్యాబ్ రూపొందించిన యాంటీ కరోనా డ్రగ్‌కు అనుమతి సాధించింది. ఇప్పటికే నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ అద్భుతమైన ఫలితాల నేపథ్యంలో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ-కోవిడ్ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధానికి డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. తీవ్రమైన కోవిడ్ బాధితుల్లో ఈ మందు అమోఘంగా పని చేస్తుందని, వేగంగా కోలుకోవడంతోపాటు ఆక్సిజన్‌పై అధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని డీఆర్డీవో తాజాగా ప్రకటించింది. గ్లూకోజ్ రూపంలో ఉండే 2-డీజీ ఔషధాన్ని దేశంలో సులభంగా ఉత్పత్తి చేయడంతోపాటు, విరివిగా అందుబాటులో తీసుకరాచ్చని కంపెనీ చెబుతోంది. ఈ డ్రగ్ సాజెట్‌లలో పొడి రూపంలో లభిస్తుంది. దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్ వ్యాపించిన భాగాల్లోకి చేరి అక్కడ సెల్స్‌లోని కరోనా శక్తిని అడ్డుకోవడంతోపాటు, విస్తరణను గణనీయంగా నిరోధిస్తుంది. దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి విస్తరణ, బాధితులు ఆక్సిజన్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ డ్రగ్ ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే రోగులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని కూడా బాగా తగ్గిస్తుందని అంచనా. ఐఎన్ఎంఏఎస్- డీఆర్డీవో శాస్త్రవేత్తలు హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహాయంతో ప్రయోగాల్లో వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. దీంతో గత ఏడాది మేలో కోవిడ్ -19 రోగులలో పరీక్షలకు డీసీజీఐ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) రెండో దశకు అనుమతినిచ్చింది. వీటి ఫలితాల ఆధారంగా డిసెంబర్ 2020 - మార్చి 2021 మధ్య 220 మంది రోగులపై మూడో క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు గుజరాత్‌కు చెందిన 27 కోవిడ్ ఆసుపత్రులలో ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. '2-డియోక్సీ-డి-గ్లోకోజ్' (2-డీజీ)గా వ్యవహరిస్తున్న ఈ యాంటీ-కోవిడ్-19 చికిత్స ఔషధాన్ని కోవిడ్ బాధితుల మీద పరీక్షించినప్పుడు వారిలో అత్యధిక శాతం మందికి ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాల వచ్చాయి. ఈ ఫలితాల వివరణాత్మక డేటాను డీసీజీఐకి సమర్పించిన నేపథ్యంలో తాజా అనుమతి లభించింది. చదవండి : కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే! An anti-COVID-19 therapeutic application of the drug 2-deoxy-D-glucose (2-DG) has been developed by INMAS, a lab of DRDO, in collaboration with Dr Reddy’s Laboratories, Hyderabad. The drug will help in faster recovery of Covid-19 patients. https://t.co/HBKdAnZCCP pic.twitter.com/8D6TDdcoI7 — DRDO (@DRDO_India) May 8, 2021 -
పేటెంట్ వివాదానికి స్వస్తి : షేరు దూకుడు
సాక్షి,ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు కాలం కలిసి వస్తోంది. తాజా పరిణామాలతో శుక్రవారం నాటి మార్కట్లో హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ డా.రెడ్డీస్ షేరు దూసుకు పోతోంది. వరుసగా నాల్గోరోజూ కొనుగోళ్ళ మద్దతుతో 5 శాతానికి పైగా ఎగిసి రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఇటీవల నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ తయారీ ఒప్పందానికి తోడు, అమెరికాకు చెందిన సెల్జీన్తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధికారికంగా ప్రకటించింది. సెల్జీన్తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్ల ఆసక్తిభారీగా నెలకొంది. ('స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్) కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘రెవ్లీమిడ్’ ఔషధంపై యూఎస్ కంపెనీ ‘సెల్జీన్’ తో డాక్టర్ రెడ్డీస్‌కు పేటెంట్ వివాదాన్ని తాజాగా పరిష్కరించుకుంది. వ్యాజ్యం లోని అన్న అసాధారణమైన వివాదాల పరిష్కారం, రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి డీల్ కుదిరినట్టు తెలిపింది. దీంతో 2022 మార్చి తరువాత ప్రపంచంలోని ‘టాప్-10’ ఔషధాల్లో ఒకటైన ‘రెవ్లీమిడ్’ ఔషధంపై సెల్జీన్ యూఎస్ మార్కెట్లో విక్రయించే అంశంపై ఇరు కంపెనీలు ఒప్పందాన్ని ఆమోదించినట్టు తెలిపింది. తద్వారా 2022 మార్చి తర్వాత యూఎస్‌లో ‘రెవ్లీమిడ్’ జనరిక్ ఔషధం విక్రయాలకు డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి లభించింది. అలాగే 2026 జనవరి 31 వరకు కొంత పరిమితితోను. ఆ తర్వాత పరిమితి లేకుండా విక్రయం చేసుకోవచ్చని డాక్టర్ రెడ్డీస్ నార్త్ అమెరికా జెనెరిక్స్ సీఈఓ మార్క్ కికుచి చెప్పారు. మల్టిపుల్ మైలోమా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, మాంటిల్ సెల్ లింఫోమా, ఫోలిక్యులార్ లింఫోమా లాంటి కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. కాగా వరుస నష్టాలకు చెక్ చెప్పిన లాభాల మార్కెట్లో నిఫ్టీ ఫార్మా దాదాపు 4 శాతం ఎగిసింది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సిప్లా సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. -
డాక్టర్ రెడ్డీస్ నష్టం రూ.570 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆర్థిక ఫలితాల విషయంలో అనలిస్టుల అంచనాలు తారుమారయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో భారీ నష్టం చవిచూసింది. ఈ కాలంలో కంపెనీ రూ.569.7 కోట్ల నష్టం ప్రకటించింది. 2018–19 క్యూ3లో రూ.485 కోట్ల నికరలాభం ఆర్జించింది. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం రూ.4,384 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14 శాతం పెరుగుదల. ఇక ఎబిటా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24 శాతం అధికమై రూ.1,074 కోట్లుగా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచామని డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్ జి.వి.ప్రసాద్ తెలిపారు. బలమైన ఎబిటా మార్జిన్స్ నమోదు చేశామని చెప్పారు. జి–నువారింగ్తోపాటు కొన్ని ఉత్పత్తుల బ్రాండ్ విలువ పడిపోవడం, ఆ మేరకు కేటాయింపులు చేయడం వల్ల నష్టం చవిచూడాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. ఈ కేటాయింపులు రూ.1,320 కోట్లుగా ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్ఓ సౌమెన్ చక్రవర్తి, సీఈవో ఎరెజ్ ఇజ్రాయెలి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. కలిసొచ్చిన గ్లోబల్ జనరిక్స్.. కంపెనీకి గ్లోబల్ జనరిక్స్ కలిసొచ్చాయి. ఈ విభాగం నుంచి ఆదాయం రూ.3,593 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం పెరుగుదల. యూరప్, కొత్తగా ఉద్భవిస్తున్న మార్కెట్లు, భారత్ ఈ ఆదాయ వృద్ధికి దోహదం చేశాయి. ఉత్తర అమెరికా నుంచి 8 శాతం వృద్ధితో రూ.1,600 కోట్ల ఆదాయం సమకూరింది. యూఎస్ మార్కెట్లో ఈ త్రైమాసికంలో కంపెనీ అయిదు కొత్త ఉత్పత్తులు విడుదల చేసింది. ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి రూ.920 కోట్లు, భారత్ నుంచి రూ.763 కోట్ల రెవెన్యూ నమోదైంది. యూరప్ నుంచి 52 శాతం వృద్ధితో రూ.310 కోట్ల రెవెన్యూ సాధించింది. -
కంపెనీల వేటలో డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) తాజాగా మరింత వృద్ధి సాధించే దిశగా ఇతర కంపెనీలను కొనుగోలు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు వివిధ దశల్లో ఉన్నాయి. రుణ, ఈక్విటీ నిష్పత్తి కనిష్ట స్థాయిలో ఉండటంతో ఇతర సంస్థల కొనుగోలుకు ఆర్థికంగా కొంత వెసులుబాటు లభించగలదని డీఆర్ఎల్ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో డీఆర్ఎల్ సహ చైర్మన్, సీఈవో జీవీ ప్రసాద్ ఈ విషయాలు వెల్లడించారు. తొలి త్రైమాసికంలో డీఆర్ఎల్ నికర లాభం 45% ఎగిసి రూ. 663 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో నికర లాభం రూ. 456 కోట్లు. కెనడాలో రెవ్లిమిడ్ ఔషధ వివాదానికి సంబంధించి సెల్జీన్ సంస్థతో సెటిల్మెంట్ ఒప్పందం కింద రూ. 350 కోట్లు అందడం .. కంపెనీ లాభాల పెరుగుదలకు దోహదపడింది. క్యూ1లో సంస్థ ఆదాయం రూ. 3,721 కోట్ల నుంచి రూ. 3,843 కోట్లకు పెరిగింది. ‘తొలి త్రైమాసికంలో చాలా మటుకు కీలక మార్కెట్లలో వృద్ధి నమోదు చేయగలిగాం. పనితీరును మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి సారిస్తాం‘ అని ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఎరెజ్ ఇజ్రేలీ బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడించారు. జీవీ ప్రసాద్ ఇకపై సహ చైర్మన్, ఎండీగా కొనసాగుతారు. ప్రస్తుతం ఇజ్రేలీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త ఉత్పత్తుల ఊతం.. కొత్త ఉత్పత్తుల ఊతంతో కీలకమైన ఉత్తర అమెరికా, భారత్ తదితర మార్కెట్లలో ఆదాయాలు మెరుగుపర్చుకోగలిగినట్లు డీఆర్ఎల్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలిపారు. గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం ఎనిమిది శాతం వృద్ధితో రూ. 3,298 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికాలో జనరిక్స్ ఆదాయం మూడు శాతం వృద్ధితో రూ. 1,632 కోట్లకు పెరిగింది. జనరిక్స్‌కు సంబంధించి యూరప్‌లో 19 శాతం (రూ.240 కోట్లు), భారత్‌లో 15 శాతం (రూ. 696 కోట్లు), వర్ధమాన దేశాల మార్కెట్లలో ఆదాయాలు 10 శాతం (రూ. 729 కోట్లు) మేర వృద్ధి నమోదు చేశాయి. తొలి త్రైమాసికంలో ఉత్తర అమెరికా మార్కెట్లో అయిదు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడంతో పాటు ఐసోట్రెటినోయిన్ ఔషధాన్ని రీ–లాంచ్ చేసినట్లు సౌమేన్ చక్రవర్తి చెప్పారు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏలో మొత్తం 107 జనరిక్ ఔషధాలకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అమ్మకాల పెరుగుదల, కొత్త ఉత్పత్తుల ఊతంతో భారత మార్కెట్ ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధి నమోదు చేశాయి. తగ్గిన పీఎస్‌ఏఐ .. అయితే, ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన 16 శాతం, సీక్వెన్షియల్‌గా 33 శాతం క్షీణతతో రూ. 454 కోట్లకు పరిమితమయ్యాయి. కొన్ని ఔషధాల నాణ్యతపరమైన అంశాలు తొలి త్రైమాసికంలో పీఎస్‌ఏఐ విభాగంపై ప్రతికూల ప్రభావం చూపాయని, రెండో త్రైమాసికంలో పరిస్థితులు సర్దుకోగలవని సౌమేన్ చక్రవర్తి వివరించారు. ఫలితాలు మార్కెట్ ముగిశాక వెల్లడయ్యాయి. సోమవారం బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు సుమారు రెండు శాతం క్షీణించి రూ. 2,653 వద్ద ముగిసింది. -
అంచనాలు మించిన డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుబాక్సోన్ ఔషధం, భారత్‌తో పాటు వర్ధమాన దేశాల మార్కెట్లలో అమ్మకాల ఊతంతో ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.456 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ.59 కోట్లతో పోలిస్తే ఇది సుమారు ఎనిమిది రెట్లు అధికం. అప్పట్లో జీఎస్టీ తదితర అంశాల ప్రభావంతో లాభాలు స్వల్ప స్థాయికి పరిమితమయ్యాయి. ఈ క్యూ1లో లాభాలు దాదాపు రూ.290 కోట్ల మేర ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేసినప్పటికీ.. అంతకు మించిన ఫలితాలను కంపెనీ ప్రకటించింది. ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.3,315 కోట్ల నుంచి రూ. 3,721 కోట్లకు పెరిగింది. కొత్తగా ప్రవేశపెట్టిన సుబాక్సోన్ ఔషధం అమ్మకాలు, విదేశీ మారకం పరమైన ప్రయోజనాలు ఇందుకు తోడ్పడ్డాయని గురువారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డీఆర్ఎల్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి విలేకరులకు తెలిపారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై క్యూ1లో వ్యయాలు కొంత తగ్గినా.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జరిపిన కేటాయింపుల్లో ఉండబోవన్నారు. అటు పెట్టుబడి వ్యయాలు రూ.1,000 కోట్ల మేర ఉండొచ్చని ముందుగా అంచనా వేసినప్పటికీ.. కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇవి అంతకన్నా కొంత తక్కువగా రూ. 800 కోట్ల పైబడి ఉండవచ్చని చక్రవర్తి చెప్పారు. ఆశావహంగా వృద్ధి అవకాశాలు.. రాబోయే త్రైమాసికాల్లోను వృద్ధి అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయని, అయితే కొంత ఆచితూచి వ్యవహరించనున్నామని డీఆర్ఎల్ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. క్యూ1లో ఆదాయానికి ఊతమిచ్చిన సుబాక్సోన్ విక్రయాల నిలిపివేతతో మిగతా త్రైమాసికాలపై కొంత ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుబాక్సోన్ పేటెంట్ విషయంలో బ్రిటన్ ఔషధ సంస్థ ఇండీవియర్తో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉత్తర అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ.. వ్యయాలను నియంత్రించుకోవడం, అధిక వృద్ధి సాధనపై ప్రధానంగా దృష్టి సారించనునట్లు ప్రసాద్ చెప్పారు. సుబాక్సోన్ ఔషధ పేటెంట్ వివాద పరిష్కారం, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం, పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేయడం, పరిశోధన.. తయారీ కార్యకలాపాలు, వ్యయాల నియంత్రణపైనా కసరత్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. దువ్వాడ ప్లాంటు విషయంలో అమెరికా ఎఫ్‌డీఏను మరోసారి తనిఖీలకు ఆహ్వానించినట్లు, సానుకూల ఫలితాలు రావొచ్చని ఆశిస్తున్నట్లు ప్రసాద్ చెప్పారు. రష్యా మార్కెట్లో క్రమంగా రికవరీ కనిపిస్తోందని, మిగతా మార్కెట్లలో కూడా రెండంకెల వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కోతలు.. సీనియర్ మేనేజ్మెంట్లో మార్పుల, చేర్పుల నేపథ్యంలో సుమారు 150–200 ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. గత క్వార్టర్లో మొదలైన ఈ కార్యక్రమం ఈ త్రైమాసికంలో పూర్తి కానుందన్నారు. పనితీరు తదితర అంశాలు ప్రాతిపదికగా దీన్ని చేపట్టినట్లు ప్రసాద్ చెప్పారు. విభాగాలవారీగా..: గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు సుమారు 12% వృద్ధితో రూ.3,064 కోట్లకు, ఫార్మా సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ విభాగం ఆదాయాలు 10% వృద్ధితో రూ. 541 కోట్లకు పెరిగాయి. జనరిక్స్‌కి సంబంధించి ఉత్తర అమెరికాలో 6%, భారత మార్కెట్లో 30%, వర్ధమాన మార్కెట్లలో 16% వృద్ధి నమోదైంది. ఉత్తర అమెరికాలో అమ్మకాలు రూ.1,590 కోట్లు, భారత్‌లో రూ.607 కోట్లుగా ఉన్నాయి. -
డాక్టర్ రెడ్డీస్‌పై అమెరికాలో క్లాస్యాక్షన్ దావా
న్యూఢిల్లీ: దేశీ ఔషధ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌పై అమెరికాలో కొంతమంది ఇన్వెస్టర్లు దావా వేశారు. అమెరికా స్టాక్ మార్కెట్ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ తమపై న్యూజెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టులో సెక్యూరిటీస్ క్లాస్ యాక్షన్ లా సూట్ దాఖలైందని కంపెనీ బుధవారం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. కార్పొరేట్ నాణ్యతా వ్యవస్థకు సంబంధించి తప్పుడు ప్రకటనలు, సమాచారాన్ని దాచిపెట్టడం వంటి చర్యలవల్ల షేరు ధర పతనమైందనేది ఇన్వెస్టర్ల ప్రధాన ఆరోపణ. దీనికి కారణమైన కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో డాక్టర్ రెడ్డీస్ షేర్లను(ఏడీఆర్) కొనుగోలు చేసిన కొందరు ఇన్వెస్టర్ల తరఫున అక్కడి న్యాయ సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా, తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారౖమైనవని.. దీన్ని చట్టపరంగా తాము ఎదుర్కోనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మరోమారు స్పష్టం చేసింది. బుధవారం డాక్టర్ రెడ్డీస్ షేరు ధర బీఎస్ఈలో స్వల్పంగా 0.22 శాతం నష్టంతో రూ.2,283 వద్ద స్థిరపడింది. -
డాక్టర్ రెడ్డీస్‌కు కొత్త తలనొప్పి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. కంపెనీ, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా యూఎస్ కోర్టులో క్లాస్ యాక్షన్ సూట్ దాఖలైంది. అమెరికన్ ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాలను డాక్టర్ రెడ్డీస్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కొందరు ఇన్వెస్టర్ల తరఫున అక్కడి ఓ న్యాయ సేవల సంస్థ న్యూజెర్సీ జిల్లా కోర్టును ఆశ్రయించింది. కార్పొరేట్ క్వాలిటీ సిస్టమ్ పేరిట 2015 నవంబరు 6న జారీ అయిన యూఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లెటర్, 2017 ఆగస్టు 10న జారీ అయిన జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ లేఖలకు సంబంధించి కంపెనీ ఉద్ధేశపూర్వకంగా, తప్పుదోవ పట్టించేలా ప్రకటన చేసిందని, అసలు విషయాన్ని దాచిపెట్టిందని ఆరోపిస్తూ కోర్టులో దావా దాఖలయింది. కంపెనీ చర్యలవల్ల షేర్ ధర పడిపోయిందని, నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. ఈ ఇన్వెస్టర్లు 2015 జూన్ 15, 2017 ఆగస్టు 10 మధ్య న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో షేర్లను కొనుగోలు చేశారు. అయితే కోర్టు నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఆరోపణల్లో వాస్తవం లేదని, కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాతే స్పందిస్తామని వెల్లడించింది. బీఎస్ఈలో సోమవారం రెడ్డీస్ షేరు ధర రూ.41.95 (2.01 శాతం) తగ్గి రూ.2,045.95 వద్ద స్థిరపడింది. -
ఒబామాకేర్ మారితే వ్యాపారానికి ముప్పు:రెడ్డీస్
హైదరాబాద్: ఒబామాకేర్ స్థానంలో మరో చట్టం వస్తే యూఎస్ మార్కెట్లో తమ వ్యాపారానికి ముప్పు వాటిల్లుతుందని ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఒబామాకేర్గా ప్రాచుర్యంలో ఉన్న పేషంట్ ప్రొటెక్షన్, అఫర్డబుల్ కేర్ యాక్ట్ (పీపీఏసీఏ) స్థానంలో కొత్త చట్టం అమెరికన్ హెల్త్ కేర్ యాక్ట్ తేవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. మార్చి 2017లో ఈమేరకు యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ యాక్ట్‌ను పాస్ చేశారు. ప్రస్తుతం ఈ చట్టం యూఎస్ సెనేట్ వద్ద పెండింగులో ఉంది. పీపీఏసీఏతోపాటు ఔషధాల ధర, ఆరోగ్య బీమాతో ముడిపడి ఉన్న చట్టాల్లో మార్పుతో కంపెనీ కార్యకలాపాలు, వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని యూఎస్ సెక్యురిటీస్, ఎక్సే్చంజ్ కమిషన్‌కు రెడ్డీస్ తెలిపింది. భారత్‌లోని తయారీ కేంద్రాలపై యూఎస్ఎఫ్డీఏతోపాటు అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన నియంత్రణ సంస్థల తనిఖీలు ఇటీవలి కాలంలో పెరిగాయి. అత్యుత్తమ విధానాలు, నాణ్యత ప్రమాణాలు పాటించినా వార్నింగ్ లెటర్లు, ఇంపోర్ట్ బ్యాన్స్ నుంచి రక్షణకు హామీ లేదని వ్యాఖ్యానించింది. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రాన్స్‌పసిఫిక్ పార్టనర్షిప్ (టీపీపీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి యూఎస్ వైదొలిగింది. స్వేచ్ఛా వాణిజ్యం విషయంలో జరిగే మార్పులు, అదనపు కస్టమ్స్ డ్యూటీల విధింపు, అంతర్జాతీయ లావాదేవీల ఇబ్బందులతో కంపెనీ వ్యాపార పనితీరును ప్రభావితం చేస్తుందని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన జనరిక్ ఫార్మా కంపెనీలు ఎన్నో యూఎస్ఎఫ్డీఏ నుంచి ఇంపోర్ట్ అలర్ట్‌కు గురయ్యాయని గుర్తు చేసింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : ఆసియన్ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలతో సోమవారం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 91 మేర పాయింట్ల నష్టంలో 29,370 వద్ద కొనసాగుతుండగా... నిఫ్టీ 28.60 పాయింట్ల నష్టంలో 9122 వద్ద ట్రేడవుతోంది. సన్ ఫార్మాకు చెందిన దాద్రా యూనిట్ ఆడిట్ లో భాగంగా 11 అబ్సర్వేషన్స్ ను అథారిటీలు చేపట్టాలని అమెరికా ఎఫ్‌డీఏ ఆదేశాలు జారీచేయగా.. సన్ ఫార్మా షేర్లు 2 శాతం మేర పడిపోతున్నాయి. కంపెనీకున్న అమెరికా సప్లయిర్స్ లో హలోల్ తర్వాత అతిపెద్ద యూనిట్ దాద్రా యూనిటే. టోరెంట్ ఫార్మాకు చెందిన రెండు ప్లాంట్స్ ను తిరిగిపరిశీలించాలని అమెరికా ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో ఆ కంపెనీ షేర్లు కూడా ట్రేడింగ్ ప్రారంభంలో 2 శాతం నష్టపోయాయి. ఇదే సమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పై ఎలాంటి అబ్సర్వేషన్స్ ను అమెరికా ఆదేశించకపోవడంతో ఆ కంపెనీ షేర్లు 2 శాతంపైగా లాభాలను ఆర్జిజిస్తున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 64.42 వద్ద ప్రారంభమైంది. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో చాలా ఆసియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడుతోంది. మరోవైపు పసిడి దూకుడుగా 193 రూపాయల లాభంలో 29,422 రూపాయల వద్ద కొనసాగుతోంది. -
డాక్టర్ రెడ్డీస్ ప్లాంటులో ఎఫ్‌డీఏ తనిఖీలు పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మిర్యాలగూడ ప్లాంటులో అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తనిఖీలు పూర్తయినట్లు ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వెల్లడించింది. మూడు సూచనలతో ఎఫ్‌డీఏ ఫారం 483ని జారీ చేసినట్లు తెలిపింది. ఇందులో పేర్కొ న్న అంశాల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు డీఆర్ఎల్ వివరించింది. -
15 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా
న్యూఢిల్లీ: ప్రభుత్వం 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.12,000 కోట్లు. ఆమోదం పొందిన వాటిల్లో డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, వొడాఫోన్, తదితర సంస్థల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు ఉన్నాయి. -
డాక్టర్ రెడ్డీస్‌పై కొరియా కంపెనీ దావా
♦ తయారీ మార్గదర్శకాల ఉల్లంఘన, మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ♦ న్యూజెర్సీ స్టేట్ కోర్టులో పిటిషన్ దాఖలు ♦ మిలియన్ల డాలర్ల జరిమానా రాబట్టాలని వినతి హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే బహుళజాతి భారతీయ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌కు మరో చిక్కు వచ్చి పడింది. డాక్టర్ రెడ్డీస్‌పై దక్షిణ కొరియాకు చెందిన బయోటెక్ కంపెనీ మెజియాన్ ఫార్మా కోర్టుకెక్కింది. ఉత్తమ తయారీ విధానం మార్గదర్శకాల (సీజీఎంపీ) విషయంలో పెద్ద ఎత్తున లోపాలను దాచిపెట్టి డాక్టర్ రెడ్డీస్ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. నిబంధనల అమలులో తప్పుదోవ పట్టించి, మోసపూరితంగా విషయాలను దాచిపెట్టిన డాక్టర్ రెడ్డీస్ నుంచి మిలియన్ డాలర్లను నష్టాల కింద వసూలు చేయాలని కోరింది. అంగస్తంభన లోపానికి సంబంధించి తమ నూతన ఔషధం ఉడెనాఫిల్ దరఖాస్తుకు యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి నిరాకరించడానికి కారణం డాక్టర్ రెడ్డీస్ తప్పుదోవ పట్టించడమేనని మెజియాన్ ఆరోపించింది. ఉడెనాఫిల్ మార్కెటింగ్‌కు అనుమతి నిరాకరించడం వల్ల కాలహరణంతోపాటు వ్యయాలకు దారితీసిందన్నది మెజియాన్ ఆరోపణ. దీనివల్ల ఉడెనాఫిల్ ఔషధానికి సంబంధించి కొత్తగా తయారీ, సరఫరాదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి మెజియాన్ ఎదుర్కొంది. ఉడెనాఫిల్ ఎన్డీఏ అనుమతి కోసం మరోసారి దరఖాస్తు చేసే చర్యలను ఈ కంపెనీ ఇప్పటికే చేపట్టింది. మాకు సమాచారం లేదు... కేసు విషయాన్ని డాక్టర్ రెడ్డీస్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లగా... మెజియాన్ నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని, న్యూజెర్సీ స్టేట్ కోర్టు నుంచి లీగల్ నోటీసు కూడా ఏదీ రాలేదని స్పష్టం చేసింది. తమకు అధికారికంగా ఏదైనా సమాచారం వస్తే అప్పుడు స్పందిస్తామని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి తెలిపారు. డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన మిర్యాలగూడ, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్లాంట్లలో తనిఖీల సందర్భంగా పలు నిబంధనల ఉల్లంఘనలు, అతిక్రమణలు బయటపడడంతో 2015 నవంబర్‌లో ఎఫ్‌డీఏ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటి నుంచి బయటపడకముందే తాజాగా మెజియాన్ రూపంలో మరో సమస్యను కంపెనీ ఎదుర్కోనుంది. కాగా, అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్లాంట్లలో ప్రస్తుత త్రైమాసికంలోనే యూఎస్ఎఫ్డీఏ మరోసారి డిట్ నిర్వహిస్తుందని కంపెనీ భావిస్తోంది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 309 కోట్లు
• క్యూ2లో 60 శాతం డౌన్ • అమెరికా, వర్ధమాన మార్కెట్లలో తగ్గిన అమ్మకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం సుమారు 60 శాతం క్షీణించి రూ. 309 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 775 కోట్లు. ఈసారి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం సైతం 10 శాతం క్షీణతతో సుమారు రూ. 4,021 కోట్ల నుంచి రూ. 3,616 కోట్లకు తగ్గింది. ఉత్తర అమెరికా మార్కెట్లో కొన్ని కీలక ఔషధాలకు సంబంధించి ధరలపరమైన ఒత్తిళ్లతో అమ్మకాలు తగ్గడం కారణంగా స్థూల లాభాల మార్జిన్ 56 శాతం మేర క్షీణించినట్లు కంపెనీ తెలిపింది. వెనిజులాలో ప్రతికూల పరిస్థితులు, వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు క్షీణించడం.. ఆదాయం తగ్గుదలకు మరో కారణమని పేర్కొంది. అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు కొనసాగవచ్చని, అయితే మరిన్ని కొత్త ఉత్పత్తుల ఆవిష్కరించడం ద్వారా వృద్ధి మెరుగుపర్చుకోగలమని డీఆర్ఎల్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వెనిజులా నుంచి రావాల్సిన ఫార్మా బకాయిల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. క్యూ2లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై దాదాపు రూ. 520 కోట్లు వెచ్చించినట్లు చక్రవర్తి తెలిపారు. ఔషధాల ధరలను నియంత్రించేలా నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ జారీ చేసిన కొన్ని నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ ఇండియన్ ఫార్మా అలయెన్స్ 2014 జులైలో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేయడంతో భవిష్యత్‌లో ఎదురయ్యే రూ. 34.4 కోట్ల ఖర్చులను విక్రయ వ్యయాల కింద చూపాల్సి వచ్చినట్లు వివరించారు. మరోవైపు, సీక్వెన్షియల్ ప్రాతిపదికన మాత్రం అన్ని విభాగాలు మెరుగ్గా పనితీరు కనపర్చడంతో కంపెనీ ఆదాయం 11 శాతం, స్థూల లాభం 61 శాతం మేర పెరిగింది. వృద్ధి ప్రణాళికలు .. అధిక వృద్ధి సాధించే క్రమంలో కొంగ్రొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నట్లు, త్వరలో బ్రెజిల్‌లోనూ అడుగుపెట్టనున్నట్లు ముఖర్జీ తెలిపారు. ఇకనుంచి ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు కొత్త దేశాల మార్కెట్లలో ప్రవేశించాలని భావిస్తున్నట్లు సంస్థ సీవోవో అభిజిత్ ముఖర్జీ చెప్పారు. అలాగే ప్రతీ సంవత్సరం తరహాలోనే ఈసారీ రూ. 1,000-రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రూ. 632 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం, మిర్యాలగూడ, దువ్వాడ ప్లాంట్లలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపర్చుకునేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఈ ఏడాది జనవరి, మార్చి, మే, ఆగస్టుల్లో అమెరికా ఎఫ్‌డీఏకి నివేదికలు పంపామని, మరోసారి ప్లాంట్లను పరిశీలించాలని కోరినట్లు ముఖర్జీ వివరించారు. ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు తదితర అంశాలకు సంబంధించి సుమారు 40 మిలియన్ డాలర్లు వ్యయమైనట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్లాంటును ఇటీవలే కెనడాకు చెందిన ఔషధ రంగ నియంత్రణ సంస్థ పరిశీలించినట్లు ముఖర్జీ వివరించారు. రెండో త్రైమాసికంలో డీఆర్ఎల్ గ్లోబల్ జెనరిక్ విభాగం ఆదాయం 12% తగ్గి 2,900 కోట్లకు పరిమితమైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు 13%, యూరప్‌లో 16%, వర్ధమాన మార్కెట్లలో 27 శాతం తగ్గాయి. అయితే భారత్‌లో మాత్రం 14 శాతం మేర వృద్ధి చెందాయి. ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు భారత్‌లో 21 శాతం క్షీణించగా.. అమెరికాలో 64 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2 శాతం క్షీణతతో రూ. 578 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ షేరు సుమారు 3.5 శాతం పెరిగి రూ. 3,200 వద్ద ముగిసింది. -
కొలంబియా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దాదాపు 26 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) తాజాగా కొలంబియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ రమణ.. కొలంబియా కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించినట్లు డీఆర్ఎల్ వెల్లడించింది. కొలంబియాలోని క్యాన్సర్ పేషంట్లకు అత్యుత్తమ నాణ్యతతో, అందుబాటు ధరల్లో ఔషధాలను అందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రమణ తెలిపారు. విలువ పరంగా డీఆర్ఎల్ అమెరికాలో జనరిక్ ఆంకాలజీ ఇంజెక్టబుల్ విభాగంలో రెండో అతి పెద్ద సంస్థగాను, భారత్‌లో జనరిక్ ఆంకాలజీ కంపెనీల్లో అగ్రస్థానంలోనూ ఉంది. కంపెనీకి 20 పైగా తయారీ కేంద్రాలు, 20వేల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. భారత్, అమెరికా, రష్యా తదితర దేశాలు కీలక మార్కెట్లుగా ఉన్నాయి. -
ఆమ్జెన్తో డాక్టర్ రెడ్డీస్ జట్టు
భారత్‌లో మూడు ఔషధాల మార్కెటింగ్‌కు ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) తాజాగా అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ఆమ్జెన్తో భాగస్వామ్యాన్ని మరిన్ని ఔషధాలకు విస్తరించింది. ఈ ఒప్పందం ప్రకారం ఆమ్జెన్కి చెందిన మూడు ఔషధాలను డీఆర్ఎల్ భారత్‌లో మార్కెటింగ్, పంపిణీ చేస్తుంది. ఆంకాలజీ, ఆస్టియోపోరోసిస్ చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. ఎక్స్జెవా (డెనోసుమాబ్), వెక్టిబిక్స్ (పానిటుముమాబ్) ప్రోలియా (డెనోసుమాబ్) ఔషధాలు ఇందులో ఉన్నాయి. వాస్తవానికి క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే వివిధ ఔషధాలకు సంబంధించి 2015లోనే ఇరు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఆమ్జెన్కి చెందిన కిప్రోలిస్, బ్లిన్సైటో, రెపాథా ఔషధాలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. ఇక, తాజా పరిణామం ఆంకాలజీ, ఆస్టియోపోరోసిస్ సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన ఔషధాలు అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడగలదని డీఆర్ఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ రమణ తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్‌తో భాగస్వామ్యంలో భారత్‌లోని మరింత మంది పేషంట్లకు అవసరమైన ఔషధాలను ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఆమ్జెన్ వైస్ ప్రెసిడెంట్ పెన్నీ వాన్ తెలిపారు. శుక్రవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ షేరు స్వల్పంగా పెరిగి రూ. 3,151 వద్ద ముగిసింది. -
డీజేఎస్ఐలో లిస్టయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) తాజాగా డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండిసెస్ (డీజేఎస్ఐ)లో చోటు దక్కించుకుంది. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సెన్సైస్ పరిశ్రమల గ్రూప్‌లో తమ సంస్థ లిస్టయినట్లు డీఆర్ఎల్ వెల్లడించింది. 22 అంశాల ప్రాతిపదికన సంస్థ ఎంపిక జరిగింది. ఉత్పత్తుల నాణ్యత, రీకాల్ నిర్వహణ, కార్పొరేట్ సామాజిక బాధ్యత తదితర అంశాల్లో తమకు అత్యుత్తమ స్కోరు దక్కినట్లు డీఆర్ఎల్ తెలిపింది. వర్ధమాన దేశాల నుంచి ఈ సూచీలో చోటు దక్కించుకున్న ఏకైక ఫార్మా కంపెనీ తమదేన ని సంస్థ కో-చైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. -
అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్
నైట్రోగ్లిసరిన్ ట్యాబ్లెట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా నైట్రోగ్లిసరిన్ ట్యాబ్లెట్లను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. హృద్రోగం కారణంగా చాతీలో అకస్మాత్తుగా వచ్చే నొప్పి నివారణకు, చికిత్సకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. నైట్రోస్టాట్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. 0.3 మి.గ్రా., 0.4 మి.గ్రా., 0.6 మి.గ్రా. మోతాదుల్లో ఈ ట్యాబ్లెట్లు లభ్యమవుతాయి. 2016 మార్చితో ముగిసిన ఏడాదికి గాను అమెరికా మార్కెట్లో నైట్రోస్టాట్ అమ్మకాలు 108 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటీరస్ షేరు సోమవారం స్వల్పంగా పెరిగి రూ. 3,048 వద్ద ముగిసింది. -
టాప్ ఫార్మా సంస్థల్లో...8 హైదరాబాదీ కంపెనీలు
♦ పేరొందిన కంపెనీల్లో డాక్టర్ రెడ్డీస్‌కు 4వ స్థానం ♦ అరబిందో, నాట్కో, సువెన్, దివీస్కూ చోటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అత్యధికంగా పేరొందిన ఫార్మా బ్రాండ్ల జాబితాలో హైదరాబాద్‌కి చెందిన 8 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 4వ స్థానంలో నిలిచింది. ‘భారత్‌లో పరపతి గల ఫార్మా బ్రాండ్స్ 2016’ పేరిట టీఆర్ఏ రీసెర్చ్, బ్లూబైట్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొం దించింది. ఈ జాబితాలో అరబిందో ఫార్మా 11వ స్థానం, నాట్కో ఫార్మా 21వ స్థానం దక్కించుకున్నాయి. అటు సువెన్ లైఫ్ సెన్సైస్ (40వ ర్యాంకు), దివీస్ లేబొరేటరీస్ (44), జెనోటెక్ లేబొరేటరీస్ (48), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (49), బయోలాజికల్-ఇ 52వ ర్యాంకుల్లో నిలిచాయి. ఈ జాబితాలో ముంబైకి చెందిన లుపిన్ అగ్రస్థానంలోను, సన్ ఫార్మా రెండు, సిప్లా మూడవ స్థానంలో నిలిచాయి. 41 దేశీ సంస్థలు, 17 అంతర్జాతీయ సంస్థలు.. వెరసి మొత్తం 58 బ్రాండ్స్‌ను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇండియాస్ మోస్ట్ రెప్యూటెడ్ బ్రాండ్స్ సిరీస్‌లో ఇది రెండోది. మీడియాలోనూ, వినియోగదారుల్లోనూ ఆయా బ్రాండ్స్‌పై ఉన్న అభిప్రాయాన్ని విశ్లేషించి, తదనుగుణంగా ర్యాం కులు ఇవ్వడం జరిగిందని ఇండియాస్ మోస్ట్ రెప్యూటెడ్ బ్రాండ్స్ ప్రతినిధి పూజా కౌరా తెలిపారు. వేగవంతమైన వృద్ధిపరంగా 2020 నాటికి టాప్ 3 ఫార్మా మార్కెట్లలో ఒకటిగా ఉండనుందని ఆమె పేర్కొన్నారు. ఫార్మా రంగంపై గతేడాది జూలై 15- ఈ ఏడాది జూలై 16 మధ్యలో వచ్చిన 24,414 వార్తల విశ్లేషణ ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. భారత్‌లో పేరొందిన విదేశీ బ్రాండ్స్ విషయానికొస్తే జీఎస్కే అగ్రస్థానంలోనూ, ఫైజర్, అబాట్ తదుపరి స్థానాల్లోనూ నిలిచాయి. -
8,600 నుంచి దిగొచ్చిన నిఫ్టీ
ముంబై : స్వల్ప లాభాలతో ప్రారంభమైన మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే నాటికి నష్టాల బాట పట్టాయి. నిన్నటి ట్రేడింగ్‌లో 8600 మార్కును అధిగమించిన నిఫ్టీ, నేటి ట్రేడింగ్‌లో 45 పాయింట్లు దిగొచ్చి, 8,590.65వద్ద ముగిసింది. సెన్సెక్స్ 118.82 పాయింట్లు నష్టపోయి 27,976.52గా నమోదైంది. యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్&టీ మార్కెట్లో టాప్ గెయినర్లుగా ఉండగా..డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హీరో మోటార్ కార్పొరేషన్, కొటక్ మహింద్రా బ్యాంకు, అరబిందో ఫార్మా, కోల్ ఇండియా, ఓఎన్జీసీలు నష్టాలను గడించాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దాదాపు 5 శాతం మేర పడిపోయి, రూ.3,317గా నమోదైంది. నేడు ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మిస్ చేయడంతో, నిఫ్టీలో రెడ్డీస్ ల్యాబ్స్ భారీగా పతనమైంది. ఆటో స్టాక్స్, బ్యాంకు స్టాక్స్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో, మార్కెట్లు నష్టాల బాట పట్టినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాంకు నిఫ్టీ 0.9 శాతం పడిపోయింది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.08 పైసలు బలపడి, 67.28గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రా.ల పుత్తడి ధర స్వల్పంగా పడిపోయింది. 15 రూపాయల నష్టంతో రూ.30,892గా రికార్డు అయింది. -
నార్త్ అమెరికాలో బ్రాండెడ్ జనరిక్స్: డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్: కాంప్లెక్స్ జనరిక్స్, నూతన ప్రొప్రైటరీ ఉత్పత్తులు రానున్న రోజుల్లో కంపెనీ వృద్ధికి బాటలు పరుస్తాయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది. ఉత్తర అమెరికా మార్కెట్లో బ్రాండెడ్ జనరిక్స్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. రష్యా, సీఐఎస్తోపాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో బయాలాజిక్స్ విభాగాన్ని విస్తృతం చేయనున్నట్టు కంపెనీ చైర్మన్ కె.సతీష్ రెడ్డి కంపెనీ వార్షిక నివేదికలో తెలిపారు. -
డాక్టర్ రెడ్డీస్ షేర్ల బైబ్యాక్ పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) షేర్ల బైబ్యాక్ ఆఫర్ కింద 51 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. సగటున షేరు ఒక్కింటికి రూ. 3,090.92 చొప్పున కొనుగోలు చేశామని, ఇందుకోసం మొత్తం రూ. 1,569 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించింది. దీంతో బైబ్యాక్ ముగిసినట్లయిందని పేర్కొంది. షేరు ఒక్కింటికి రూ. 3,500కు మించకుండా రూ. 1,569.4 కోట్లు వెచ్చించి ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్ల బైబ్యాక్ చేపట్టాలన్న ప్రతిపాదనను ఈ ఏడాది ఫిబ్రవరిలో డీఆర్ఎల్ బోర్డు ఆమోదించింది. అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నుంచి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో డీఆర్ఎల్ షేర్ల బైబ్యాక్ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాల దరిమిలా మంగళవారం కంపెనీ షేరు ధర 0.81 శాతం పెరిగి రూ. 3,266.81 వద్ద ముగిసింది. -
ప్యాకేజింగ్ ప్రమాణాల్ని పాటించాం: డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాలో తమ ఔషధ ప్యాకేజింగ్ వివాదంపై ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్(డీఆర్ఎల్) స్పందించింది. ప్యాకేజింగ్ విషయంలో తాము అన్ని ప్రమాణాలనూ పాటించామని, దీనిపై విచారణ జరిపిన దర్యాప్తు సంస్థలకూ పూర్తి సహకారం అందించామని తెలిపింది. 2002-2011 మధ్య కాలంలో పిల్లలకు అంతగా సురక్షితం కాని ప్యాక్‌లలో డీఆర్ఎల్ ఔషధాలను విక్రయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ తదితర అంశాల గురించి డీఆర్ఎల్ గతంలోనే మార్కెట్ నియంత్రణ సంస్థలకు తెలిపింది. అయిదేళ్ల క్రితం నాటి ఈ కేసుకు సంబంధించి డీఆర్ఎల్పై చర్యలు తీసుకోవాలంటూ అమెరికా వినియోగదారుల కమిషన్ (యూఎస్సీపీఎస్సీ) తాజాగా అక్కడి న్యాయశాఖను ఆశ్ర యించడంతో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వార్తల దరిమిలా గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు 1.95 శాతం క్షీణించి రూ. 3,071.45 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ కు వెనిజులా దెబ్బ
♦ క్యూ4లో రూ. 431 కోట్ల రైట్ డౌన్ ♦ లాభం రూ. 75 కోట్లు, 86% తగ్గుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నికర లాభం 86 శాతం మేర క్షీణించి రూ. 75 కోట్లకు (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) పరిమితమైంది. వెనిజులా దేశంలో మార్కెట్ నుంచి రావాల్సిన మొత్తంలో రూ. 431 కోట్లను సర్దుబాటు చేయడం ఇందుకు కారణం. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 519 కోట్లు. ఇక తాజాగా ఆదాయం సైతం దాదాపు 3 శాతం క్షీణతతో రూ. 3,870 కోట్ల నుంచి రూ. 3,756 కోట్లకు తగ్గింది. వెనిజులాలో ఆ దేశపు కరెన్సీ భారీగా క్షీణించడంతోపాటు అక్కడి ప్రభుత్వ నియంత్రణపరమైన కారణాల వల్ల సుమారు 60 మిలియన్ డాలర్ల మొత్తం నిల్చిపోయిందని, ముందస్తు జాగ్రత్త చర్యగా దీన్ని రైట్ డౌన్ చేశామని గురువార ం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ సీఈవో జీవీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. అయితే, సదరు మొత్తం వసూలవడాన్ని బట్టి వెనిజులాలో అందుబాటు ధరల్లో ఔషధాలను అందించడంపై అక్కడి ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని ఆయన వివరించారు. ఇకపై పూర్తిగా నగదు ప్రాతిపదికన లావాదేవీలు జరిపేందుకు రెండు ప్రభుత్వ రంగ సంస్థలతో చర్చిస్తున్నట్లు ప్రసాద్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ మార్కెట్‌ను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఇక అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) తాఖీదుల దరిమిలా సదరు యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలను మరింతగా మెరుగుపరుస్తున్నామని, ఇప్పటి దాకా దాదాపు సగం ప్రక్రియ పూర్తయ్యిందని ప్రసాద్ చెప్పారు. వర్ధమాన మార్కెట్లలో తగ్గుదల.. జనరిక్స్‌కు సంబంధించి కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఇంజెక్టబుల్స్ ఊతంతో ఆదాయాలు క్యూ4లో 12 శాతం పెరిగాయి. భారత్‌లో 11 శాతం వృద్ధి నమోదైంది. అయితే, వర్ధమాన మార్కెట్లలో 31%, యూరప్‌లో 18 శాతం క్షీణించింది. కొత్తగా 14 జనరిక్స్ కోసం ఎఫ్‌డీఏకి డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తులు చేసింది. ఇక ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఉత్తర అమెరికాలో 60 శాతం, యూరప్‌లో 2%, భారత్‌లో 10%, మిగతా దేశాల్లో 18% క్షీణించింది. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం జనరిక్స్ ఆదాయాలు వర్ధమాన మార్కెట్లు మినహా (25% డౌన్) భారత్, యూరప్, ఉత్తర అమెరికా 19% వృద్ధి కనపర్చాయి. ర ష్యాలో రూబుల్ మారకం విలువ క్షీణించడం తదితర అంశాలు ఆయా మార్కెట్లలో తగ్గుదలకు కారణమని ప్రసాద్ వివరించారు. ప్రణాళికలు...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా సుమారు రూ. 1,200 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు ఉంటాయని, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలపై దాదాపు 11-12 శాతం వ్యయాలు చేయనున్నామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి చెప్పారు. మిగులు నిధుల్లో కొంత భాగాన్ని షేర్ల బైబ్యాక్‌కు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మరిన్ని కొత్త ఔషధాలను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరం..: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 15,471 కోట్ల ఆదాయంపై రూ. 2,001 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రిత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ. 14,819 కోట్లు కాగా లాభం రూ. 2,218 కోట్లు. రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 20 డివిడెండు ప్రకటించింది. బీఎస్ఈలో సంస్థ షేరు 3.65% పెరిగి రూ. 2,973.85 వద్ద ముగిసింది. -
ఈ నెల 18 నుంచి డాక్టర్ రెడ్డీస్ షేర్ల బైబ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) ఏప్రిల్ 18 నుంచి షేర్ల బైబ్యాక్ చేపట్టనున్నట్లు మంగళవారం తెలిపింది. గరిష్టంగా షేరు ఒక్కింటికి రూ. 3,500 వెచ్చించనున్నట్లు వివరించింది. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో మంగళవారం నాటి కంపెనీ షేరు ప్రారంభ ధర రూ. 3,079తో పోలిస్తే 14 శాతం అధికం. షేర్ల బైబ్యాక్ కోసం డీఆర్ఎల్ గరిష్టంగా రూ. 1,569 కోట్లు కేటాయించింది. కంపెనీ మొత్తం మూలధనంలో 25 శాతం షేర్లకు మించకుండా ఈ బైబ్యాక్ జరుపుతుంది. మిగులు నిధులను సమర్ధంగా వినియోగించుకునే లక్ష్యంలో భాగంగా బైబ్యాక్ చేపట్టాల్సి వచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజా బైబ్యాక్‌తో షేర్ల సంఖ్య తగ్గుతుందని, ఫలితంగా షేరు ఒక్కింటిపై రాబడి (ఈపీఎస్) పెరుగుతుందని పేర్కొన్నాయి. గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి డీఆర్ఎల్ చేతిలో సుమారు రూ. 2,500 కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. కాగా, షేర్ల బైబ్యాక్ వార్తలతో మంగళవారం బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు ధర 1.79 శాతం పెరిగి రూ. 3,082.80 వద్ద క్లోజయ్యింది. -
జపాన్ కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపాన్‌కు చెందిన ‘ఇసాయి’ కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇసాయి అభివృద్ధి చేస్తున్న క్యాన్సర్ ఏజెంట్ ఈ7777పై వాణిజ్యపరమైన హక్కులను (ఆసియా, జపాన్ కాకుండా) డాక్టర్ రెడ్డీస్ కొనుగోలు చేసింది. కానీ ఎంత మొత్తానికి ఈ హక్కులను కొనుగోలు చేసింది కంపెనీ తెలియచేయలేదు. -
జినోపోర్ట్ తో రెడ్డీస్ లెసైన్సింగ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బయోఫార్మాస్యూటికల్ కంపెనీ జినోపోర్ట్తో లెసైన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా జినోపోర్ట్ తయారు చేసిన క్లినికల్ స్టేజ్‌లో ఉన్న ఎక్స్పీ23829 అనే నూతన రసాయన నామం అభివృద్ధితోపాటు యూఎస్ మార్కెట్లో వాణిజ్యీకరణకు రెడ్డీస్‌కు ప్రత్యేక హక్కులు వస్తాయి. సొరియాసిస్ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. అలాగే నరాల సంబంధ చికిత్సల కోసమూ ఉపయోగపడేలా దీనిని అభివృద్ధి చేయవచ్చని కంపెనీ తెలిపింది. హక్కులను పొందినందుకుగాను డాక్టర్ రెడ్డీస్ రూ.335 కోట్లను జినోపోర్ట్కు చెల్లిస్తుంది. నియంత్రణ, వాణిజ్య పరమైన మైలురాళ్లను రెడ్డీస్ అధిగమించినందుకు (భవిష్యత్తులో) రూ.2,935 కోట్ల వరకు జినోపోర్ట్ పొందనుంది. అలాగే అమ్మకాలనుబట్టి రాయల్టీని రెడ్డీస్ చెల్లిస్తుంది. -
టర్కీ ఫార్మా కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టర్కీకి చెందిన బయె సిమిలర్ తయారీ సంస్థ టీఆర్ ఫార్మాతో డాక్టర్ రెడ్డీస్ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డాక్టర్ రెడ్డీస్‌కి చెందిన మూడు బయోసిమిలర్ ప్రోడక్టులను టీఆర్ ఫార్మా టర్కీలో వాణిజ్యపరంగా తయారు చేసి విక్రయించనుంది. అంతర్జాతీయంగా బయోసిమిలర్ వ్యాపారంలో విస్తరించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని డాక్టర్ రెడ్డీస్ వైస్ ప్రెసిడెంట్ ఎం.వి.రమణ తెలిపారు. -
షేర్ల బైబ్యాక్‌కు డాక్టర్ రెడ్డీస్ ఓకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపింది. ఓపెన్ మార్కెట్లో ఒక్కొక్కటి రూ.3,500లకు మించకుండా 44.84 లక్షల షేర్లను కొనుగోలు చేసేందుకు... అంటే దాదాపు రూ.1,569 కోట్ల వరకు వెచ్చించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్‌లో 2.6 శాతానికి సమానం. కనీసం 22.42 లక్షల షేర్లను రెడ్డీస్ కొనుగోలు చేయనుంది. ఇక బైబ్యాక్ ధర గడిచిన రెండు వారాల్లో వీక్లీ హై, లో క్లోజింగ్ ప్రైస్ సగటుతో పోలిస్తే... 18.6 శాతం ఎక్కువని కంపెనీ వెల్లడించింది. షేర్ల బైబ్యాక్‌కు వెళ్లనున్నట్టు గత వారం కంపెనీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కంపెనీ ప్రకటన నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర ఒక దశలో 4.52 శాతానికి పైగా ఎగసింది. చివరకు షేరు 3.52 శాతం లాభపడి రూ.2,961 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో షేరు ధర 3.67 శాతం పెరిగి రూ.2,960.70 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.50,517.78 కోట్లకు చేరుకుంది. కాగా, కంపెనీకి చెందిన మూడు ప్లాంట్లలో ఉల్లంఘనలు జరిగాయంటూ యూఎస్ఎఫ్డీఏ హెచ్చరిక లేఖలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమగ్ర సంస్కరణలు, దిద్దుబాటు కార్య ప్రణాళికను (సీఏపీఏ) పూర్తి చేసినట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సీవోవో అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. ఈ విషయమై యూఎస్ఎఫ్డీఏ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
బైబ్యాక్ ఆలోచనలో డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికల నేపథ్యంలో భారీగా పతనమైన షేర్లను కొనుగోలు చేయాలని డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం 25.57% వాటాను కలిగి ఉన్న ప్రమోటర్లు బైబ్యాక్ ద్వారా వాటా పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. వచ్చే వారం జరిగే బోర్డు సమావేశంలో బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేం జీలకు తెలియచేసింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.2,887 వద్ద కదులుతోంది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 579 కోట్లు
♦ వర్ధమాన దేశాలు దెబ్బతీసినా ఆదుకున్న దేశీయ వ్యాపారం ♦ 34 శాతం వృద్ధితో రూ. 580 కోట్లకు... ♦ మొత్తం ఆదాయం రూ.3,986 కోట్లు; 3శాతం వృద్ధి ♦ యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలపై సానుకూలంగా స్పందిస్తున్నాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; రష్యా, ఇతర వర్ధమాన దేశాల వ్యాపారం దెబ్బతీసినా దేశీయ వ్యాపారం ఆదుకోవడంతో డాక్టర్ రెడ్డీస్ స్థిరమైన ఫలితాలను ప్రకటించగలిగింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నికర లాభం స్వల్పంగా ఒక శాతం పెరిగి రూ. 574 కోట్ల నుంచి రూ. 579 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం 3 శాతం వృద్ధితో రూ. 3,843 కోట్ల నుంచి రూ. 3,968 కోట్లుగా నమోదయ్యింది. వర్ధమాన దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమన ప్రభావం ఫలితాలపై పడినట్లు డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్ అండ్ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. సమీక్షా కాలంలో రష్యా, వెనెజులాతో సహా ఇతర వర్థమాన దేశాల వ్యాపారం 28 శాతం క్షీణించి రూ. 884 కోట్ల నుంచి రూ. 640 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశీయంగా అమ్మకాలు 34 శాతం పెరిగి రూ. 433 కోట్ల నుంచి రూ. 580 కోట్లకు పెరిగాయి. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ త్రైమాసికంలో ఇండియాలో 5 ఉత్పత్తులు విడుదల చేయడం వల్ల వ్యాపారం వృద్ధి చెందడానికి కారణంగా పేర్కొన్నారు. కీలకమైన ఉత్తర అమెరికా వ్యాపారం 18 శాతం వృద్ధితో రూ. 1,942 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో ఆర్అండ్డీ కేటాయింపులు 5.1 శాతం క్షీణించి రూ.409 కోట్లకు పరిమితమయ్యింది. ఈ త్రైమాసికంలో మొత్తం నాలుగు ఔషధాలకు అనుమతులు లభించాయి. దిద్దుబాటు చర్యలు మూడు యూనిట్లకు జారీ చేసిన హెచ్చరికల లేఖపై స్పందించామని, యూఎస్ఎఫ్డీఏ సూచనల మేరకు తగు చర్యలు చేపట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. హెచ్చరికల తర్వాత గడువు విధించిన డిసెంబర్ 7లోగా వివరణ జారీ చేశామని, అంతే కాకుండా 45 రోజుల్లో చేపట్టిన దిద్దుబాటు చర్యలను తెలియచేస్తూ మరో లేఖ రాసినట్లు తెలిపారు. తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ త్వరలోనే మరో లేఖ రాయనున్నట్లు తెలిపారు. తాము తీసుకున్న చర్యలకు యూఎస్ఎఫ్డీఏ సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ హెచ్చరికలు, ఆయిల్ ధరలు తగ్గడం వంటి కారణాలతో వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. -
అమెరికాలో తిరిగి డాక్టర్ రెడ్డీస్ ఎసిడిటీ క్యాప్సుల్స్
ముంబై: ఎసిడిటీని నివారించే జెనరిక్ వెర్షన్ ఎసోమెప్రజాల్ క్యాప్యుల్స్‌ను డాక్టర్ రెడ్డిస్ తిరిగి అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. స్థానిక కోర్టు ఈ జెనరిక్ వెర్షన్ అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయమని ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ క్యాప్యుల్స్ రంగును మార్చి తిరిగి విడుదల చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రాజెనికాకు చెందిన నెక్సియమ్ క్యాప్యుల్స్కి ఇది జెనరిక్ వెర్షన్. డాక్టర్ రెడ్డీస్ జెనరిక్ వెర్షన్‌ను ఒరిజినల్ క్యాప్యుల్స్లాగా ఉదారంగులోనే విడుదల చేయడంపై ఆస్ట్రాజెనికా కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. -
నిపుణుల కోసం డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగానికి అవసరమైన వృత్తి నిపుణులను తీర్చిదిద్దడానికి లైఫ్ సెన్సైస్ సెక్టర్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్ఎస్ఎస్ఎస్డీసీ), విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (వీఊపీఈఆర్)లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం ఫార్యాస్యూటికల్, బయోటెక్నాలజీ, క్లీనికల్ రీసెర్చ్ రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. దీంతో దేశ ఆర్థిక జీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న ఫార్మారంగానికి నిపుణుల కొరత తీరుతుందని డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
డాక్టర్ రెడ్డీస్‌కు మరో షాక్!
లా సూట్ దాఖలు చేసిన అమెరికా సంస్థ లుండిన్లా కంపెనీ ఆర్థిక ఫలితాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణ ఖండించిన డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం నెల రోజుల్లో రూ. 20,000 కోట్ల మార్కెట్క్యాప్ ఆవిరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్‌కి కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. తాజాగా డాక్టర్ రెడ్డీస్ ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిందంటూ అమెరికాలో క్లాస్ యాక్షన్ లా సూట్ దాఖలయ్యింది. లాస్ ఏంజెల్స్‌కు చెందిన లా సంస్థ లుండిన్ లా ఈ లా సూట్‌ను దాఖలు చేసింది. డాక్టర్ రెడ్డీస్ ఈ మధ్య విడుదల చేసిన ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఆరోపించింది. అంతేకాదు ఈ లా సూట్లో ఇతరులు కూడా భాగస్వామ్యులుగా చేరవచ్చని లుండిన్లా ఆహ్వానించడం విశేషం. కానీ ఆరోపణలను డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. కార్పొరేట్ గవర్నెన్స్ పాటించడంలో తామెప్పుడూ ముందుంటామని, సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీ నిబంధనలను పాటిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే తాము ఇండియన్ అకౌంటింగ్, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ స్టాండర్స్ (ఐఎఫ్ఆర్ఎస్) ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇటువంటి లాసంస్థలు విడుదల చేసే అడ్వటోరియల్ పత్రికా ప్రకటనలపై తాము స్పందిచమని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మధ్యనే డాక్టర్ రెడ్డీస్‌కి చెందిన మూడు తయారీ యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలు లేవని యూఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లెటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాత ఆస్ట్రాజెన్‌కాకు చెందిన జెనరిక్ ఔషధం నెగ్జియమ్ను అమెరికాలో విక్రయించడంపై స్థానిక కోర్టు తాత్కాలికంగా రద్దు చేసింది. ఇలా వరుసగా తగులుతున్న దెబ్బలతో డాక్టర్ రెడ్డీస్ షేరు నెల రోజుల్లో 25 శాతంగా నష్టపోయింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20,000 కోట్లు హరించుకుపోయింది. గురువారం అమెరికాలో లాసూట్ దాఖలయ్యిందని వార్తలు వెలువడగానే డాక్టర్ రెడ్డీస్ షేరు 7 శాతంపైగా నష్టపోయి రూ. 3,138 కనిష్ట స్థాయికి పడిపోయింది. కానీ ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రితం ముగింపుతో పోలిస్తే 3% నష్టపోయి రూ. 3,287 వద్ద ముగిసింది. షేర్లు కొన్న ప్రమోటర్లు భారీగా పతనమైన నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ప్రమోటర్లకు చెందిన హోల్డింగ్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ గురువారం మార్కెట్లో 45,000 షేర్లను కొనుగోలు చేసింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ లాబ్‌లో హోల్డింగ్ కంపెనీ వాటా 23.35 శాతం నుంచి 23.37 శాతానికి పెరిగింది. -
డాక్టర్ రెడ్డీస్ చేతికి యూసీబీ ఇండియా?
ఒప్పందం విలువ రూ. 845 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ విలీనాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా బెల్జియంకు చెందిన యూసీబీ ఇండియా యూనిట్‌ను సుమారు రూ.845 కోట్లకు కొనుగోలు చేసే విధంగా ఇరు కంపెనీల మధ్య అవగాహన కుదిరినట్లు మార్కెట్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించడానికి ఇరు కంపెనీల ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. కానీ ఈ ఒప్పందంతో నేరుగా సంబంధం ఉన్న వారి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 135 మిలియన్ డాలర్లకు యూసీబీని కొంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కంపెనీ వద్ద ఉన్న మిగులు నిధులను ఉపయోగించనుంది. గత త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా సుమారు రూ. 2,850 కోట్ల విలువైన నగదు, పెట్టుబడులు ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఈ మధ్య దేశీయ మార్కెట్‌పై దృష్టిసారించిన డాక్టర్ రెడ్డీస్ వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా స్థానికంగా ఉన్న కంపెనీలను కొనుగోలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఎలర్జీ, శ్వాస సంబంధిత వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలను తయారు చేసే యూసీబీ ఇండియా యూనిట్‌ను కొనుగోలు కోసం ఎంచుకుంది. ప్రస్తుతం యూసీబీ కంపెనీలో 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మంగళవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు ధర సుమారు ఒక శాతం నష్టపోయి రూ. 3,434 వద్ద ముగిసింది. -
ఫార్మా కంపెనీలకు దేశీయ మార్కెట్ దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ఫార్మా కంపెనీలకు ఉత్తర అమెరికా మార్కెట్ అంతగా కలిసి రాకపోయినా ఆ మేరకు దేశీయ మార్కెట్ ఆదుకుంది. ప్రధాన కంపెనీల ఫలితాలను పరిశీలిస్తే ఆదాయ, నికర లాభాలపై అమెరికా నుంచి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇదే సమయంలో ఊహించని విధంగా దేశీయ మార్కెట్లో ఆదాయం పెరగడం విశేషం. గత కొన్నేళ్లుగా సింగిల్ డిజిట్‌కి పరిమితమైన దేశీయ ఫార్మా మార్కెట్ వృద్ధి ఈ ఏడాది 12-15 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ త్రైమాసికంలో ఫార్మా ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని, కాని డాలరుతో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉండటంతో రానున్న కాలంలో ఎగుమతుల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల తెలిపారు. ఈ త్రైమాసికంలో పలు ప్రధాన కంపెనీలు ఈ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటు నమోదు చేశాయి. సన్ ఫార్మా, సిప్లా, లూపిన్ కంపెనీలు ఈ త్రైమాసిక దేశీయ ఆదాయంలో 20 శాతానికిపైగా వృద్ధిని నమోదు చేస్తే, గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీలు 15 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఉదాహరణకి దేశీయ అతిపెద్ద ఫార్మా కంపెనీ సన్ ఫార్మా ఈ త్రైమాసికంలో అమెరికా వ్యాపారంలో 15 శాతం వృద్ధిని నమోదు చేస్తే, ఇదే సమయంలో ఇండియా వ్యాపారంలో అత్యధికంగా 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ కూడా ప్రధాన ఆదాయ వనరైన అమెరికా మార్కెట్లో కేవలం 9 శాతం వృద్ధిని నమోదు చేస్తే దేశీయ మార్కెట్లో 14 శాతం వృద్ధిని సాధించింది. మారిన నిబంధనల వల్ల అమెరికా మార్కెట్లో కొత్త ఉత్పత్తుల అనుమతికి జాప్యం జరుగుతోందని, దీనికి తోడు ధరలపై ఒత్తిడి ఉండటం కూడా అమెరికా వ్యాపార వృద్ధి తగ్గడానికి ప్రధాన కారణంగా డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి ఫలితాల విడుదల సందర్భంగా తెలిపారు. కానీ ఇదే సమయంలో అరబిందో ఫార్మా ఎగుమతుల వృద్ధి, దేశీయ ఆదాయ వృద్ధి కంటే ఎక్కువగా ఉంది. ఎగుమతుల్లో 32 వృద్ధి నమోదైతే, దేశీయ ఆదాయంలో కేవలం 6 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యింది. సిప్లా అయితే ఎగుమతులు 9 శాతం క్షీణిస్తే, దేశీయ ఆదాయం 20 శాతం మేర పెరిగింది. ఈ త్రైమాసిక ఫలితాలను చూసి దేశీయ ఫార్మా టర్న్ ఎరౌండ్ అయ్యిందని చెప్పలేం కాని, గతంతో పోలిస్తే వృద్ధి బాగుందంటున్నారు జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి. దాదాపు సగం టర్నోవర్ ఇక్కడి నుంచే... ప్రస్తుతం దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయం సుమారు రూ. 1.70 లక్షల కోట్లు ఉండగా, అందులో రూ. 90,000 కోట్లు ఎగుమతుల నుంచి వస్తుంటే, రూ. 80,000 కోట్లు దేశీయ మార్కెట్ నుంచి సమకూరాయి. అతిపెద్ద జనాభా కలిగిన దేశీయ జనాభాలో కొనుగోలు శక్తి పెరుగుతుండటంతో దేశీయ ఫార్మా రంగం వేగంగా విస్తరించనుందని ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ తెలిపారు. గత రెండేళ్ల నుంచి దేశీయ ఫార్మా వేగంగా విస్తరిస్తోందని, కానీ ఇదే సమయంలో అమెరికాతో సహా ఇతర యూరప్ దేశాల్లో ఫార్మా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. -
డాక్టర్ రెడ్డీస్ ‘వాల్సైట్’కి ఎఫ్‌డీఏ అనుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాంటీ వైరల్ ఔషధం ‘వాల్సైట్’ జనరిక్ వెర్షన్‌కి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతి లభించినట్లు ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) తెలిపింది. దీంతో త్వరలో అమెరికా మార్కెట్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఎయిడ్స్ పేషంట్లలో సైటోమెగలోవైరస్ రెటినిటిస్ అనే కంటి సంబంధ సమస్యల చికిత్స కోసం ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం రోషె హోల్డింగ్ సంస్థ వాల్సైట్ను తయారు చేస్తోంది. దీని జనరిక్ వెర్షన్ తయారీ కోసం మరో భారతీయ ఫార్మా సంస్థ రాన్బ్యాక్సీకి సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చినా, ఆ కంపెనీ ప్లాంట్లలో నాణ్యతాపరమైన ప్రమాణాలు లేవన్న కారణంగా అనుమతులను ఎఫ్‌డీఏ రద్దు చేసింది. వాల్సైట్ ఔషధ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 3,000 కోట్లు ఉంది. దీని తయారీతో డీఆర్ఎల్ ఆదాయానికి మరో రూ. 200 కోట్లు జతకాగలవని అంచనా. -
డాక్టర్ రెడ్డీస్ లాభం జూమ్
తొలి త్రైమాసికంలో రూ.550 కోట్లు * ఉత్తర అమెరికా, కొత్త ఉత్పత్తులే * ఈ భారీ వృద్ధికి కారణం... * 24 శాతం వృద్ధితో 3,517 కోట్లకు చేరిన మొత్తం ఆదాయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక నికర లాభంలో 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2012-13 తొలి త్రైమాసికంలో రూ. 361 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 550 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికా, రష్యాల్లో అమ్మకాలకు తోడు గతేడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఔషధాలు లాభాలు పెరగడానికి ప్రధాన కారణంగా డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి తెలిపారు. బుధవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రవర్తి మాట్లాడుతూ గతేడాది తొలి త్రైమాసికం తర్వాత ఉత్తర అమెరికా మార్కెట్లో అనేక కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదయ్యిందన్నారు. మొత్తం ఆదాయంలో 57 శాతం ఉత్తర అమెరికా నుంచే సమకూరుతుండగా, ఈ మూడు నెలల కాలంలో ఆదాయం 51 శాతం పెరిగి రూ. 1,087 కోట్ల నుంచి రూ. 1,646 కోట్లకు చేరింది. ఈ సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం 24 శాతం పెరిగి రూ. 2,844 కోట్ల నుంచి రూ. 3,517 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధిపై గరిష్టంగా రూ.1,500 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ మూడు నెలల కాలంలో ఇప్పటి వరకు రూ. 390 కోట్లు వ్యయం చేసినట్లు చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం యూఎస్ఎఫ్డీఏ వద్ద కొత్త ఔషధాలకు సంబంధించి 70 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కువ అంచనా వేశాం... విదేశాల్లో మార్కెటింగ్ కోసం గ్లాస్కో స్మిత్‌క్లైన్ (జీఎస్కే)తో కుదుర్చుకున్న ఒప్పందంపై భారీగా అంచనాలు పెట్టుకున్నామని, కాని వాస్తవ రూపం దీనికి భిన్నంగా ఉందని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఇండియా వెలుపల అభివృద్ధి చెందిన దేశాల్లో డాక్టర్ రెడ్డీస్‌కి చెందిన కొన్ని ఔషధాలను విక్రయించడానికి జీఎస్‌కేతో ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. కాని ఈ డీల్ ద్వారా అనుకున్న విధంగా ఆదాయం పెరగలేదని ముఖర్జీ తెలిపారు. దేశీయంగా 14 శాతం వృద్ధి ఈ మూడు నెలల కాలంలో దేశీయ అమ్మకాల్లో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. సమీక్షాకాలంలో రూ.349 కోట్లుగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది రూ. 400 కోట్లకు చేరాయి. కొన్ని బ్రాండ్స్‌పై అధికంగా దృష్టిసారించడంతో ఈ వృద్ధి సాధ్యమయ్యిందని, ఇందులో కొన్ని ఔషధాలు ఎన్ఎల్ఈఎం పోర్ట్‌ఫోలియోలో కూడా ఉన్నాయన్నారు. ఈ త్రైమాసికంలో కొత్తగా 4 ఉత్పత్తులను విడుదల చేయగా, 9 ఉత్పత్తులకు సంబంధించి యూఎస్ఎఫ్డీఏ వద్ద ఫైలింగ్ చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.