సాక్షి,ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు కాలం కలిసి వస్తోంది. తాజా పరిణామాలతో శుక్రవారం నాటి మార్కట్లో హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ డా.రెడ్డీస్ షేరు దూసుకు పోతోంది. వరుసగా నాల్గోరోజూ కొనుగోళ్ళ మద్దతుతో 5 శాతానికి పైగా ఎగిసి రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఇటీవల నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ తయారీ ఒప్పందానికి తోడు, అమెరికాకు చెందిన సెల్‌జీన్‌తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధికారికంగా ప్రకటించింది. సెల్‌జీన్‌తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్ల ఆసక్తిభారీగా నెలకొంది. ('స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్)
కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘రెవ్లీమిడ్’ ఔషధంపై యూఎస్ కంపెనీ ‘సెల్‌జీన్’ తో డాక్టర్ రెడ్డీస్‌కు పేటెంట్ వివాదాన్ని తాజాగా పరిష్కరించుకుంది. వ్యాజ్యం లోని అన్న అసాధారణమైన వివాదాల పరిష్కారం, రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి డీల్ కుదిరినట్టు తెలిపింది. దీంతో 2022 మార్చి తరువాత ప్రపంచంలోని ‘టాప్-10’ ఔషధాల్లో ఒకటైన ‘రెవ్లీమిడ్’ ఔషధంపై సెల్‌జీన్ యూఎస్ మార్కెట్లో విక్రయించే అంశంపై ఇరు కంపెనీలు ఒప్పందాన్ని ఆమోదించినట్టు తెలిపింది. తద్వారా 2022 మార్చి తర్వాత యూఎస్‌లో ‘రెవ్లీమిడ్’ జనరిక్ ఔషధం విక్రయాలకు డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి లభించింది. అలాగే 2026 జనవరి 31 వరకు కొంత పరిమితితోను. ఆ తర్వాత పరిమితి లేకుండా విక్రయం చేసుకోవచ్చని డాక్టర్ రెడ్డీస్ నార్త్ అమెరికా జెనెరిక్స్ సీఈఓ మార్క్ కికుచి చెప్పారు. మల్టిపుల్ మైలోమా, మైలోడిస్‌ప్లాస్టిక్ సిండ్రోమ్స్, మాంటిల్ సెల్ లింఫోమా, ఫోలిక్యులార్ లింఫోమా లాంటి కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. కాగా వరుస నష్టాలకు చెక్ చెప్పిన లాభాల మార్కెట్లో నిఫ్టీ ఫార్మా దాదాపు 4 శాతం ఎగిసింది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సిప్లా సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment