డాక్టర్ రెడ్డీస్‌కు మరో షాక్! | Dr Reddy's Lab Market Cap Falls Rs. 20000 Crore in a Month | Sakshi
Sakshi News home page

డాక్టర్ రెడ్డీస్‌కు మరో షాక్!

Published Thu, Nov 19 2015 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

డాక్టర్ రెడ్డీస్‌కు మరో షాక్!

డాక్టర్ రెడ్డీస్‌కు మరో షాక్!

లా సూట్ దాఖలు చేసిన
 అమెరికా  సంస్థ లుండిన్‌లా
 కంపెనీ ఆర్థిక ఫలితాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణ
 ఖండించిన డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం
 నెల రోజుల్లో రూ. 20,000 కోట్ల
 మార్కెట్‌క్యాప్ ఆవిరి
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్‌కి కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. తాజాగా డాక్టర్ రెడ్డీస్ ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిందంటూ అమెరికాలో క్లాస్ యాక్షన్ లా సూట్ దాఖలయ్యింది. లాస్ ఏంజెల్స్‌కు చెందిన లా సంస్థ లుండిన్ లా ఈ లా సూట్‌ను దాఖలు చేసింది. డాక్టర్ రెడ్డీస్ ఈ మధ్య విడుదల చేసిన ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఆరోపించింది. అంతేకాదు ఈ లా సూట్‌లో ఇతరులు కూడా భాగస్వామ్యులుగా చేరవచ్చని లుండిన్‌లా ఆహ్వానించడం విశేషం.
 
 కానీ ఆరోపణలను డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. కార్పొరేట్ గవర్నెన్స్ పాటించడంలో తామెప్పుడూ ముందుంటామని, సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీ నిబంధనలను పాటిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే తాము ఇండియన్ అకౌంటింగ్, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ స్టాండర్స్ (ఐఎఫ్‌ఆర్‌ఎస్) ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇటువంటి లాసంస్థలు విడుదల చేసే అడ్వటోరియల్ పత్రికా ప్రకటనలపై తాము స్పందిచమని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
 
 ఈ మధ్యనే డాక్టర్ రెడ్డీస్‌కి చెందిన మూడు తయారీ యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలు లేవని యూఎస్‌ఎఫ్‌డీఏ వార్నింగ్ లెటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాత ఆస్ట్రాజెన్‌కాకు చెందిన జెనరిక్ ఔషధం నెగ్జియమ్‌ను అమెరికాలో విక్రయించడంపై స్థానిక కోర్టు తాత్కాలికంగా రద్దు చేసింది. ఇలా వరుసగా తగులుతున్న దెబ్బలతో డాక్టర్ రెడ్డీస్ షేరు నెల రోజుల్లో 25 శాతంగా నష్టపోయింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20,000 కోట్లు హరించుకుపోయింది. గురువారం అమెరికాలో లాసూట్ దాఖలయ్యిందని వార్తలు వెలువడగానే డాక్టర్ రెడ్డీస్ షేరు 7 శాతంపైగా నష్టపోయి రూ. 3,138 కనిష్ట స్థాయికి పడిపోయింది. కానీ ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రితం ముగింపుతో పోలిస్తే 3% నష్టపోయి రూ. 3,287 వద్ద ముగిసింది.
 
 షేర్లు కొన్న ప్రమోటర్లు
 భారీగా పతనమైన నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ప్రమోటర్లకు చెందిన హోల్డింగ్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ గురువారం మార్కెట్లో 45,000 షేర్లను కొనుగోలు చేసింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ లాబ్‌లో హోల్డింగ్ కంపెనీ వాటా 23.35 శాతం నుంచి 23.37 శాతానికి పెరిగింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement