​క్యాన్సర్‌కు కొత్త మందు.. డాక్టర్‌ రెడ్డీస్‌ ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం | Dr Reddy's launches drug for neck, head cancer | Sakshi
Sakshi News home page

​క్యాన్సర్‌కు కొత్త మందు.. డాక్టర్‌ రెడ్డీస్‌ ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం

Published Fri, Nov 29 2024 8:00 AM | Last Updated on Fri, Nov 29 2024 10:00 AM

Dr Reddy's launches drug for neck, head cancer

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫార్మా రంగ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌.. తిరగబెట్టే లేదా మెటాస్టాటిక్‌ నాసోఫారింజియల్‌ కార్సినోమా చికిత్స కోసం భారత్‌లో తొలిసారిగా టోరిపాలిమాబ్‌ అనే ఇమ్యునో–ఆంకాలజీ ఔషధాన్ని విడుదల చేసింది. నాసోఫారింజియల్‌ కార్సినోమా అనేది తల, మెడ క్యాన్సర్‌కు సంబంధించింది. ఇది గొంతు పైభాగంపై చోటుచేసుకుంటుంది. పీడీ–1 ఔషధం అయిన టోరిపాలిమాబ్‌ సంప్రదాయ చికిత్సతో పోలిస్తే అత్యుత్తమ ఫలితాలను ప్రదర్శించిందని రెడ్డీస్‌ వెల్లడించింది. 

భారత్‌లో జైటోర్వి బ్రాండ్‌ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్‌ చేయనున్నట్లు తెలిపింది. ఇమ్యునో–ఆంకాలజీ అనేది ఒక క్యాన్సర్‌ చికిత్స విధానం. ఇది క్యాన్సర్‌ను నిరోధించడానికి, నియంత్రించడానికి, తొలగించడానికి రోగనిరోధక వ్యవస్థ శక్తిని ఉపయోగిస్తుంది. చైనా, యూఎస్‌ తర్వాత ఈ ఔషధం అందుబాటులోకి వచ్చిన మూడవ దేశం భారత్‌ కావడం విశేషం.

ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ.. 
పునరావృతమయ్యే లేదా మెటాస్టాటిక్‌ నాసోఫారింజియల్‌ కార్సినోమా చికిత్సకై యూఎస్‌ ఫుడ్, డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యూఎస్‌ఎఫ్‌డీఏ), యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ), మెడిసిన్స్, హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నియంత్రణ సంస్థలు ఆమోదించిన ఏకైక ఇమ్యునో–ఆంకాలజీ ఔషధం ఇదేనని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. 

టోరిపాలిమాబ్‌ కోసం 2023లో కంపెనీ షాంఘై జున్షి బయోసైన్సెస్‌తో లైసెన్స్, వాణిజ్యీకరణ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, లాటిన్‌ అమెరికాతో సహా 21 దేశాల్లో టోరిపాలిమాబ్‌ను అభివృద్ధి చేయడానికి, అలాగే వాణిజ్యీకరించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రత్యేక హక్కులను పొందింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర తొమ్మిది దేశాల్లో అందుబాటులోకి తేవడానికి లైసెన్స్‌ పరిధి విస్తరణకు సైతం ఈ ఒప్పందం అనుమతిస్తుందని కంపెనీ వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement