ఆమ్జెన్తో డాక్టర్ రెడ్డీస్ జట్టు
భారత్‌లో మూడు ఔషధాల మార్కెటింగ్‌కు ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్) తాజాగా అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ఆమ్‌జెన్‌తో భాగస్వామ్యాన్ని మరిన్ని ఔషధాలకు విస్తరించింది. ఈ ఒప్పందం ప్రకారం ఆమ్‌జెన్‌కి చెందిన మూడు ఔషధాలను డీఆర్‌ఎల్ భారత్‌లో మార్కెటింగ్, పంపిణీ చేస్తుంది. ఆంకాలజీ, ఆస్టియోపోరోసిస్ చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. ఎక్స్‌జెవా (డెనోసుమాబ్), వెక్టిబిక్స్ (పానిటుముమాబ్) ప్రోలియా (డెనోసుమాబ్) ఔషధాలు ఇందులో ఉన్నాయి. వాస్తవానికి క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే వివిధ ఔషధాలకు సంబంధించి 2015లోనే ఇరు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
ఆమ్‌జెన్‌కి చెందిన కిప్రోలిస్, బ్లిన్‌సైటో, రెపాథా ఔషధాలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. ఇక, తాజా పరిణామం ఆంకాలజీ, ఆస్టియోపోరోసిస్ సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన ఔషధాలు అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడగలదని డీఆర్‌ఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ రమణ తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్‌తో భాగస్వామ్యంలో భారత్‌లోని మరింత మంది పేషంట్లకు అవసరమైన ఔషధాలను ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఆమ్‌జెన్ వైస్ ప్రెసిడెంట్ పెన్నీ వాన్ తెలిపారు. శుక్రవారం బీఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ షేరు స్వల్పంగా పెరిగి రూ. 3,151 వద్ద ముగిసింది.