న్యూఢిల్లీ: మన దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచమంతా మనవైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయగాథలో టీకా ఉత్పత్తిదారులు పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన శనివారం కోవిడ్–19 వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశమయ్యారు. టీకాపై తదుపరి పరిశోధనలతోపాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ), భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ప్రధానితో జరిగి సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కేవలం 9 నెలల్లో 100 కోట్ల కరోనా టీకా డోసులు ప్రజలకు పంపిణీ చేయడం గొప్ప ముందడుగు అని, మోదీ నాయకత్వ పటిమతోనే ఈ ఘనత సాధ్యమైందని వారు ప్రశంసించారు.
ప్రధానితో భేటీ అనంతరం ఎస్‌ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి దార్శనికతతో తక్కువ సమయంలోనే 100 కోట్ల డోసులు ఇవ్వడం సాధ్యమయ్యిందని తెలిపారు. దేశంలో ఫార్మా రంగం అభివృద్ధి, భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై మోదీతో చర్చించినట్లు తెలిపారు.
ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవడం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకత అని భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. స్వల్ప వ్యవధిలో 100 కోట్ల టీకా డోసులు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదని, మోదీ పట్టుదల, అంకితభావంతో ఇది అచరణ సాధ్యమయ్యిందని చెప్పారు. ఒక నాయకుడు తన దేశానికి చేయగలిగిన గొప్ప పని ఇది అని కొనియాడారు. డీఎన్‌ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి వెనుక మోదీ కృషి ఎంతగానో ఉందని జైడస్ క్యాడిలా సంస్థ ప్రతినిధి పంకజ్ పటేల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment