Zydus Vaccine
-
రూ.284 కోట్ల పన్ను చెల్లించండి.. జైడస్‌కు ఐటీ శాఖ నోటీసులు
న్యూఢిల్లీ: జైడస్ లైఫ్ సైన్సెస్ అనుబంధ సంస్థ జైడస్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌కు ఆదాయపన్ను శాఖ నుంచి రూ.284.58 కోట్ల మేర నోటీసు జారీ అయింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 143(1) కింద జారీ అయిన ఈ డిమాండ్ నోటీసు, 2023–24 అసెస్మెంట్ సంవత్సరానికి చెందినదని సంస్థ ఎక్సే్చంజీలకు తెలిపింది. రిటర్నుల్లో స్పష్టమైన తప్పుల కారణంగానే ఇది చోటు చేసుకుందని, తప్పొప్పులను సరిదిద్దిన అనంతరం మొత్తం పన్ను డిమాండ్ తొలగిపోతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ సూచనలు కాగా, పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్నుల్లోని సమాచారం, రిపోర్టింగ్ ఎంటెటీల (బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు, బ్రోకరేజీలు తదితర) నుంచి అందిన సమాచారం మధ్య పోలిక లేని కేసుల్లో.. వారికి సూచనలు పంపినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. టీడీఎస్/టీసీఎస్‌కు, దాఖలు చేసిన ఐటీఆర్‌లోని సమాచారం మధ్య వ్యత్యాసం ఉన్న వారికి కూడా సూచనలు పంపింది. -
ఫార్మా కంపెనీలకు కేంద్రం భారీ షాక్!
నాసిరకం మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలపై కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. నాణ్యత లేమి డ్రగ్స్‌ను తయారు చేసిన 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను రద్దుతో పాటు తయారీని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 26 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు అందించింది. భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీలు నకిలీ మందులు విదేశాలకు విక్రయిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఫార్మా కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బృందాలతో దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 76 ఫార్మా కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. ప్రపంచ దేశాల్లో భారత్‌లో తయారు చేసిన డ్రగ్స్ వినియోగించడం కారణంగా పలువురు మరణించడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత ఫిబ్రవరి నెలలో గుజరాత్‌కు చెందిన జైడస్ లైఫ్ సైన్సెస్ (Zydus Lifesciences) సంస్థ కీళ్ల నొప్పుల్ని నయం చేసే జనరిక్ మెడిసిన్ తయారు చేసి యూఎస్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహిస్తుంది. ఆ ఔషదాలున్న 55 వేల బాటిళ్లను రీకాల్‌కు పిలుపునిచ్చింది. గత ఏడాది నోయిడాకి చెందిన మరియన్ బయోటెక్ ఫార్మా సంస్థ నకిలీ దగ్గు మందును తయారు చేసింది. ఇక్కడి ఫార్మా కంపెనీలో తయారైన దగ్గుమందు తాగిన 21 మంది పిల్లల్లో 18 మంది మరణించారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆరోపణలతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు మరియన్ బయోటెక్ ఫార్మాలో శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు. ఆ టెస్ట్‌లలో 22 రకాల మరియన్ బయోటెక్ తయారు చేసిన డ్రగ్స్ నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు. ఇలా ఫార్మా కంపెనీలపై వరుస ఫిర్యాదులు రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఫార్మా కంపెనీల్లో సోదాలు జరిపి చర్యలు తీసుకుంటుంది. -
జైడస్ చేతికి న్యులిబ్రీ ఔషధం
న్యూఢిల్లీ: యూఎస్ కంపెనీ బ్రిడ్జ్బయో ఫార్మా నుంచి ఫాస్డోనొప్టె రిన్(న్యులిబ్రీ) ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు అనుబంధ సంస్థ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెల్త్‌కేర్ దిగ్గజం జైడస్ లైఫ్‌సైన్సెస్ తాజాగా పేర్కొంది. సెంటిల్ థెరప్యూటిక్స్ ఇంక్ నుంచి ఈ ఇంజక్షన్ ఔషధ బ్రాండును సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు అసెట్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసినట్లు వెల్లడించింది. ఎంవోసీడీ టైప్-ఏ వ్యాధిగ్రస్తుల చికిత్సకు వినియోగించగల ఈ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులున్నట్లు పేర్కొంది. శిశువుల్లో అత్యంత అరుదుగా కనిపించే జెనెటిక్ సంబంధ ఈ వ్యాధి మరణాలకు దారితీయవచ్చని కంపెనీ వివరించింది. ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం యూఎస్‌లో న్యులిబ్రీ ఔషధ అభివృద్ధి, కమర్షియలైజేషన్ బాధ్యతలతోపాటు.. అంతర్జాతీయంగానూ అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్‌ను సైతం సెంటిల్ చేపడుతుందని జైడస్ వివరించింది. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
సూది, నొప్పి లేకుండా వ్యాక్సిన్.. మనదేశంలోనే!
సూది, నొప్పి.. రెండూ లేకుండా కరోనా వ్యాక్సిన్ డోసు ఇవ్వడం సాధ్యమేనా?. అవును.. మన దేశంలోనూ ఈ తరహా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం పాట్నా(బిహార్)లో మూడు వ్యాక్సిన్ సెంటర్లలో ఈ తరహా ప్రయోగాన్ని అమలు చేశారు. సూది, నొప్పికి భయపడి చాలామంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రత్యేకించి రూరల్ ఏరియాల్లో సూది మందు మంచిది కాదంటూ అపోహలు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో ఆ భయం పొగొట్టేందుకు జైకోవ్-డి నీడిల్‌లెస్ వ్యాక్సిన్ విధానాన్ని తీసుకొచ్చింది. రేజర్ తరహాలో ఉండే టూల్‌తో జస్ట్ షాట్‌ను ఇస్తారు అంతే. పైగా వ్యాక్సిన్ తీసుకున్నాక నొప్పులు కూడా రావని చెప్తోంది కంపెనీ. జైకోవ్-డి.. దేశీయంగా వచ్చిన రెండో వ్యాక్సిన్(మొదటిది కోవాగ్జిన్). జైడస్ క్యాడిల్లా రూపొందించిన మూడు డోసుల వ్యాక్సిన్. 28 నుంచి 56 రోజుల గడువుల వ్యవధితో రెండు భుజాలకు రెండేసి షాట్స్ చొప్పున(మొత్తం ఆరు షాట్స్) ఇస్తారు. ప్లాస్మిడ్ డీఎన్ఏ ప్లాట్‌ఫామ్‌తో డెవలప్ చేయడం వల్ల ఈ సూదిరహిత వ్యాక్సిన్‌ను ప్రత్యేకంగా భావిస్తున్నారు. ముందుగా పెద్దలకు, ఆపై 12-15 ఏళ్లలోపు పిల్లలకూ ఇచ్చేందుకు కూడా అనుమతి ఉంది. Bihar | Painless and Needleless ZYCOV-D Covid Vaccine launched in Patna Three doses will be given at intervals of 28 days and 56 days. This program has been started at 3 vaccination centers. It is good for people who are afraid of needles: Civil surgeon Dr Vibha Singh (04.03) pic.twitter.com/bJ9JlidrZh — ANI (@ANI) February 4, 2022 -
కోటి ‘జైకోవ్–డి’ డోసులకు కేంద్రం ఆర్డర్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి నియంత్రణకు గాను 12 నుంచి 18 ఏళ్లలోపు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన తొలి టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్–డి వ్యాక్సిన్ కోటి డోసుల కొనుగోలుకు కేంద్రం ఆర్డర్ ఇచ్చినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ టీకాకు ఆగస్టు 20న డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్‌కు పన్నులు మినహాయించి రూ.358 ఖర్చవుతుంది. తమవద్ద ఉన్న పరిమిత వనరుల నేపథ్యంలో ప్రతినెలా ఒక కోటి డోసులను మాత్రమే సరఫరా చేయగలమని జైడస్ క్యాడిలా సంస్థ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. కరోనా నియంత్రణ కోసం జైకోవ్–డి టీకాను మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి డోస్ తర్వాత 28వ రోజు రెండో డోస్, 56వ రోజు మూడో డోస్ ఇవ్వాలి. -
‘జైకోవ్–డి’ టీకా ధర తగ్గిస్తాం
న్యూఢిల్లీ: తమ కోవిడ్–19 టీకా ధరను తగ్గించేందుకు అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిలా సంస్థ అంగీకరించింది. ఒక్కో డోసును రూ.265 చొప్పున విక్రయిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు జైడస్ క్యాడిలా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. అయితే, టీకా ధరపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. ఈ వారంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. 12 ఏళ్లు పైబడిన వారికోసం జైడస్ క్యాడిలా సంస్థ ‘జైకోవ్–డి’ పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించింది. దేశంలో 12 ఏళ్లు పైబడిన వారి కోసం అనుమతి లభించిన తొలి టీకా ఇదే కావడం గమనార్హం. జైకోవ్–డి టీకా వేయడానికి సూది అవసరం లేదు. డిస్పోజబుల్ పెయిన్లెస్ జెట్ అప్లికేటర్ ఉపయోగించాల్సి ఉంది. దీని ధర రూ.93. ఒక్కో డోసుకు ఒక అప్లికేటర్ కావాలి. దీంతో ఒక్కో డోసు ధర మొత్తం రూ.358కు చేరనుంది. ‘జైకోవ్–డి’ టీకాను మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. మూడు డోసులను రూ.1,900కు విక్రయిస్తామని(ఒక్కో డోసు రూ.633.3) జైడస్ క్యాడిలా గతంలో ప్రతిపాదించింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఒక్కో డోసును రూ.358కి విక్రయించేందుకు ముందుకొచ్చింది. -
ప్రపంచం చూపు మనవైపు: మోదీ
న్యూఢిల్లీ: మన దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచమంతా మనవైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయగాథలో టీకా ఉత్పత్తిదారులు పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన శనివారం కోవిడ్–19 వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశమయ్యారు. టీకాపై తదుపరి పరిశోధనలతోపాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ప్రధానితో జరిగి సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కేవలం 9 నెలల్లో 100 కోట్ల కరోనా టీకా డోసులు ప్రజలకు పంపిణీ చేయడం గొప్ప ముందడుగు అని, మోదీ నాయకత్వ పటిమతోనే ఈ ఘనత సాధ్యమైందని వారు ప్రశంసించారు. ప్రధానితో భేటీ అనంతరం ఎస్ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి దార్శనికతతో తక్కువ సమయంలోనే 100 కోట్ల డోసులు ఇవ్వడం సాధ్యమయ్యిందని తెలిపారు. దేశంలో ఫార్మా రంగం అభివృద్ధి, భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై మోదీతో చర్చించినట్లు తెలిపారు. ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవడం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకత అని భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. స్వల్ప వ్యవధిలో 100 కోట్ల టీకా డోసులు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదని, మోదీ పట్టుదల, అంకితభావంతో ఇది అచరణ సాధ్యమయ్యిందని చెప్పారు. ఒక నాయకుడు తన దేశానికి చేయగలిగిన గొప్ప పని ఇది అని కొనియాడారు. డీఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి వెనుక మోదీ కృషి ఎంతగానో ఉందని జైడస్ క్యాడిలా సంస్థ ప్రతినిధి పంకజ్ పటేల్ చెప్పారు. -
పిల్లలకి వ్యాక్సిన్ ఇది సమయమేనా ?
రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వెయ్యొచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేయడంతో తల్లిదండ్రుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు ఇచి్చన వ్యాక్సినే పిల్లలకీ ఇస్తారా ? సైడ్ ఎఫెక్ట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి పిల్లలకి కోవిడ్ వ్యాక్సిన్‌పై చర్చ తెరపైకి వచ్చింది. పిల్లలకి ప్రత్యేకంగా వ్యాక్సిన్ తయారు చేస్తారా? పిల్లలకి ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమీ ఉండదు. అయితే డోసుని తగ్గించి ఇస్తారు. పెద్దలకు ఇచ్చే వ్యాక్సిన్ డోసులో సగం మాత్రమే పిల్లలకి ఇస్తారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ పెద్దలకి ఒక్క మిల్లీ లీటర్ డోసు రెండు విడతలుగా 28 రోజుల వ్యవధిలో ఇస్తున్నారు. పిల్లలకి అందులో సగం అంటే 0.5 ఎంల్ డోసుని రెండు విడతలుగా ఇస్తారు. ఒక్కో డోసు 0.25 ఎంఎల్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా? చిన్నపిల్లలకి ఏ వ్యాక్సిన్ ఇచ్చినా కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పి మాత్రమే ఉంటాయి. ఏయే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి? మన దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన వారికి జైడస్ క్యాడిల్లా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చారు. డీఎన్ఏ ఆధారిత ఈ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. పిల్లలకు అనుమతులు మంజూరైన తొలి వ్యాక్సిన్ ఇదే. అమెరికాకు చెందిన నొవావాక్స్ (భారత్‌లో దీనిని కొవావాక్స్ అని పిలుస్తున్నారు) వ్యాక్సిన్‌ను 2–17 ఏళ్ల వయసు వారికి ఇవ్వడానికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. పుణెకి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ రెండు, మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఇక హైదరాబాద్‌కు చెందిన బయోలాజిక్ ఈ లిమిటెడ్ కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్ 5 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం ప్రయోగాలు నిర్వహించడానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. ఇది సరైన సమయమేనా? కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించకపోవడం, దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టిన ఈ సమయంలో వారికి వ్యాక్సిన్ వెయ్యడానికి ఇది సరైన సమయమేనా అన్న సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే వైద్య నిపుణులు మాత్రం పిల్లలకి కూడా వ్యాక్సిన్ వెయ్యాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దేశ జనాభాలో పిల్లలు 25–30% వరకు ఉంటారు. వీరికి వ్యాక్సిన్ వెయ్యకపోతే, వ్యక్తిగతంగా వారికి నష్టం జరగకపోయినా వారు సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉంది. అంతే కాదు ఇప్పుడిప్పుడే పలు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభించారు. దసరా తర్వాత కొన్ని రాష్ట్రాలు స్కూళ్లని తెరవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పుడు స్కూలుకు వెళ్లే పిల్లలకి వ్యాక్సిన్ వెయ్యకపోతే రెండో వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్ మూడో వేవ్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇతర దేశాల్లో పిల్లలకి వ్యాక్సిన్ ఎలా? అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాల్లో 12 ఏళ్ల వయసు పైబడిన వారికి ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఇస్తున్నారు. ఇక రెండేళ్ల పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తున్న మొట్టమొదటి దేశం క్యూబా. సెపె్టంబర్ 13 నుంచి ఆ దేశం చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టింది. చైనా, యూఏఈ, వెనెజులా దేశాలు రెండేళ్ల వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి సన్నాహాలు ప్రారంభించాయి. నిపుణుల అభిప్రాయాలు మొదటి వేవ్‌లో మొత్తం కేసుల్లో 4% పిల్లలకే సోకింది. రెండో వేవ్ వచ్చేసరికి 10–15% పిల్లల్లో కేసులు పెరిగాయి. పాఠశాలలు కూడా పునఃప్రారంభం కావస్తూ ఉండడంతో పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇదే సమయం. చిన్నారులకి వ్యాక్సిన్ దేశంలో ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుంది – డాక్టర్ సుజీర్ రంజన్, అసోసియేట్ డైరెక్టర్, టాటా ట్రస్ట్స్ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కి డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించలేదు. చాలా దేశాలు కోవాగ్జిన్‌ను గుర్తించడం లేదు. దీనికి కారణం పూర్తి స్థాయి డేటా లేకపోవడమే. అందుకే మరింత డేటా వచ్చేవరకు వేచి చూసి పిల్లలకు వేస్తే మంచిది. – డాక్టర్ శ్రీకాంత్, పీడియాట్రిషన్, బెంగళూరు – నేషనల్ డెస్క్, సాక్షి -
జైకోవ్–డి వ్యాక్సిన్ రూ.1,900
న్యూఢిల్లీ: ఔషధ సంస్థ జైడస్ క్యాడిలా దేశీయంగా రూపొందించిన కరోనా టీకా జైకోవ్–డి త్వరలోనే మార్కెట్లో ప్రవేశించనుంది. 12 ఏళ్లుపై బడిన వారికి జైకోవ్–డి ధర మూడు డోసులకు గాను రూ.1,900గా కంపెనీ నిర్ణయించింది. అయితే, జైడస్ క్యాడిలాతో కేంద్రం జరుపుతున్న చర్చల ఫలితంగా ధర తగ్గే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ వారంలోనే టీకా ధరపై స్పష్టతవస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశీయంగా తయారవుతున్న జైకోవ్–డి ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత టీకా. 0, 28, 56 రోజుల వ్యవధిలో మూడు డోసులుగా ఇవ్వాల్సిన ఈ టీకా ధర పన్నులు కలుపుకుని రూ.1,900గా నిర్ణయించినట్లు క్యాడిలా వర్గాలు తెలిపాయి. ఈ టీకాను సూదికి బదులుగా జెట్ ఇంజెక్టర్‌తో ఇవ్వాల్సి ఉంటుంది. ఇంజెక్టర్ ధర రూ.30 వేలు కాగా, ఒక్కో ఇంజెక్టర్‌తో 20 వేల డోసుల టీకా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను రెండు డోసుల సూది మందుగా ఇస్తున్నారు. దేశవ్యాప్త కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌తోపాటు, ఇతర ఆరోగ్య సమస్యలున్న 12–18 ఏళ్ల గ్రూపులోని వారికి ముందుగా జైకోవ్–డిని ఇచ్చే విషయమై జాతీయ నిపుణుల బృందం(ఎన్టీఏజీఐ) ఇచ్చే సూచనల కోసం వేచి చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
వ్యాధులున్న పిల్లలకు మొదట జైకోవ్–డీ
-
వ్యాధులున్న పిల్లలకు మొదట జైకోవ్–డీ
న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన తొలి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ జైకోవ్–డీని వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ముందుగా ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై విధివిధానాలను ఖరారు చేసేందుకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) త్వరలో ఓ సమావేశం నిర్వహించబోతున్నట్లు వెల్లడిం చారు. ఈ నెల 20న జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్–డీ వ్యాక్సిన్‌కు భారత్‌లో అత్యవసర అనుమతులు లభించడం తెల్సిందే. 12–18 సంవత్సరాల మధ్య వయసు ఉండి, అప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి ముందుగా ఇచ్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. దేశంలో 12–18 ఏళ్ల వయసు ఉన్న వారు 12 కోట్ల మంది ఉంటారని, అందులో ఒక శాతం మంది పలు వ్యాధులతో బాధపడుతుంటారని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. జైకోవ్–డీ వ్యాక్సిన్‌ను సూది లేకుండా మూడు డోసుల ద్వారా అందించనున్నారు. -
సెప్టెంబర్ చివరి నాటికి జైకోవ్–డీ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: సెప్టెంబర్ మాసం మధ్య సమయానికి లేదా నెల పూర్తయ్యేలోపు జైకోవ్–డీ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని జైడస్ క్యాడిలా తెలిపింది. వ్యాక్సిన్ ధరను రానున్న రెండు వారాల్లోగా వెల్లడిస్తామని జైడస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ షర్విల్ పటేల్ చెప్పారు. మూడు డోసుల నీడిల్–ఫ్రీ జైకోవ్–డీ వ్యాక్సిన్‌కు కేంద్రం అత్యవసర అనుమతులు ఇవ్వడం తెల్సిందే. 12–18 ఏళ్ల మధ్య వారికి అందుబాటులోకి రానున్న మొదటి టీకా ఇదే. సెప్టెంబర్ చివరినాటికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని సంస్థ వెల్లడించింది. అక్టోబర్ నాటికి కోటి డోసులను, జనవరి నాటికి 4–5 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలమని ఆశిస్తున్నట్లు పేర్కొంది. దేశం వెలుపల కూడా పలు కంపెనీలతో కలసి భారీగా ఉత్పత్తి చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచంలోనే మొదటి డీఎన్ఏ వ్యాక్సిన్‌గా జైకోవ్–డీ పేరొందిన సంగతి తెలిసిందే. సంవత్సరానికి 10–12 కోట్ల డోసులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. -
గుడ్‌న్యూస్: అందుబాటులోకి మరో కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మూడో దశ రానుందన్న అందోళనల నేపథ్యంలో అయిదో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జైడస్ కాడిల్లాకు చెందిన జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వ డ్రగ్ ప్యానెల్ అనుతిమినిచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ఓ) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఇసి) జైడస్ మూడు డోసుల వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. తుది ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసింది. దీనికి డీజీసీఐ కూడా అనుతినివ్వడంతో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండవ దేశీ వ్యాక్సిన్‌గా జైకోవ్-డీ నిలవనుంది. అంతేకాదు దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చిన తొలి టీకా కూడా ఇదే. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా జైకోవ్-డి పేరుతో ఈ వ్యాక్సిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా. (మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్, 45 రోజుల తర్వాత మూడో డోస్) వ్యాక్సిన్. సూది లేకుండా ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్రే టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కేనని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 12 ఏళ్ల వారికి కూడా వినియోగించేలా భారీగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ఏజ్ గ్రూపు వారికి ట్రయల్స్ చేసిన ఏకైక వ్యాక్సిన్ జైకోవ్-డి కావడం విశేషం. కాగా కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్-వీ, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్-డోస్ వ్యాక్సిన్ వంటి ఐదు టీకాలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. కోవాక్సిన్ తరువాత జైకోవి-డీ దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో వ్యాక్సిన్. జైడస్ కాడిల్లా ఏటా 120 మిలియన్ డోస్‌లను తయారు చేయాలని యోచిస్తోంది. -
గుడ్ న్యూస్: వచ్చే నెలలోనే పిల్లలకు కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ తరుముకొస్తున్న తరుణంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. మంగళవారం ఉదయం పార్లమెంటులో జరిగిన బీజేపీ ఎంపీల సమావేశంలో మోదీ ఈ విషయాన్ని చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రకటించారు. వచ్చే నెలలో పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జైడస్ వ్యాక్సిన్ సెప్టెంబరు నాటికి ప్రారంభం కానుందని వ్యాక్సిన్లపై నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కె అరోరా ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సమయంలో పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు రావడం విశేషం. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. జైడస్ ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకోగా అత్యవసర వినియోగ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. కోవాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబరులో వెల్లడికావచ్చని, దీని ప్రకారం సెప్టెంబరు నాటికి వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించవచ్చని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా తెలిపారు. కాగా దేశంలో ఇప్పటివరకు 44 కోట్లకు పైగా వ్యాక్సిన్లను స్వీకరించగా, ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి దేశంలో అందరికీ టీకాలు వేయాలన్నది ప్రభుత్వ లక్క్ష్యం. -
సెప్టెంబర్‌కల్లా పిల్లలకు వ్యాక్సిన్!
న్యూఢిల్లీ: భారత్‌లో పిల్లలకు కోవిడ్–19 వ్యాక్సిన్ ఈ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. అదే జరిగితే కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఇదో ముఖ్య ఘట్టంగా మారుతుందని అన్నారు. జైడస్ క్యాడిలా కంపెనీ జైకోవ్–డీ పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తి చేసి డేటా కూడా సమర్పించిందని, అత్యవసర అనుమతి కోసం ఎదురు చూస్తోందని చెప్పారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ (2–18 ఏళ్ల లోపు పిల్లలకు) ఆగస్టు లేదంటే సెప్టెంబర్ నాటికి పూర్తి అవుతాయని, అదే సమయానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగా ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌కు సెప్టెంబర్ నాటికి వస్తే వెంటనే పిల్లలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టవచ్చునని గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన వివిధ వార్తా సంస్థలకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. భారత్‌లో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఇప్పటివరకు 42 కోట్లకు పైగా టీకా డోసుల్ని ఇచ్చారు. ఇంచుమించుగా 6% జనాభా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలై ఇన్నాళ్లయినా 18 ఏళ్ల లోపు వారికి మాత్రం టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. పశ్చిమ దేశాల్లో పిల్లలకి ఫైజర్ టీకా ఇప్పటికే ఇవ్వడం మొదలుపెట్టగా... మోడర్నా వ్యాక్సిన్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా 18 ఏళ్ల లోపు వయసు వారికి టీకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో చురుగ్గా ప్రయోగాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి పిల్లల కోసం ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లే అందుబాటులోకి వస్తాయని గులేరియా చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి 18–30 శాతం పెరగడానికి 11–17 ఏళ్ల వయసు వారే కారణమని, వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతున్నారని ఇటీవల లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో తేలింది. భారత్‌లో పిల్లలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైతే వైరస్ వ్యాప్తికి గణనీయంగా అడ్డుకట్ట పడుతుందని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. బూస్టర్ డోస్ అవసరమే కరోనా వైరస్‌లో తరచూ జన్యుపరంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో భవిష్యత్‌లో బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని గులేరియా చెప్పారు. కరోనా వ్యాక్సిన్లు ప్రభావం తగ్గిపోయి రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తే సెకండ్ జనరేషన్ కోవిడ్–19 వ్యాక్సిన్ల (బూస్టర్ డోసులు) అవసరం వస్తుందని అన్నారు. ఇప్పటికే బూస్టర్ డోసులపై ప్రయోగాలు జరుగుతున్నాయని.. ఈ ఏడాది చివరి నాటికి బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని, అందుకే అప్పటికల్లా జనాభా మొత్తానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని గులేరియా చెప్పారు. -
సెప్టెంబర్-అక్టోబర్ నాటికి జైడస్ కాడిలా వ్యాక్సీన్
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ భయాలు, మరోవైపు కోవిడ్-19 వ్యాక్సీన్ల కొరత దేశ ప్రజలను పీడిస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక విషయాలను వెల్లడించారు. అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ సెప్టెంబర్-అక్టోబర్ నాటికి లభిస్తుందని ఆరోగ్య మంత్రి చెప్పారు. తద్వారా 7 కోట్ల మోతాదులను అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇతర వ్యాక్సిన్ల లభ్యతపై కూడా కంపెనీలు దృష్టిపెట్టాయనీ, దేశంలో వ్యాక్సిన్ కొరతను తగ్గించడానికి రాబోయే రోజుల్లో అవి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని మాండవియా చెప్పారు. కాడిలా వ్యాక్సిన్ దశ 3 ట్రయల్స్ పూర్తయ్యాయనీ, సెప్టెంబర్-అక్టోబర్ నాటికి మార్కెట్లో లభిస్తుందని ఆరోగ్య మంత్రి మంగళవారం తెలిపారు కాడిలా జైకోవ్-డి భారతదేశానికి మొదటి డీఎన్ఎ వ్యాక్సిన్‌గా ఉంటుందని, 7కోట్ల మోతాదులు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే కోవిడ్ మరణాలను తక్కువగా చేసి చూపించారన్న అరోపణలను ఆయన తిరస్కరించారు. మరణాల నమోదు రాష్ట్రాల వారీగా జరుగుతుందని, తక్కువ సంఖ్యలో మరణాలు లేదా కేసులను నమోదు చేయమని కేంద్రం ఏ రాష్ట్రాన్ని కోరలేదని ఆయన అన్నారు. 12 సంవత్సరాలు పైబడినవారికి అత్యవసర వినియోగ ఆమోద కోసం డీసీజీఐకి ఇప్పటికే దరఖాస్తు చేసిందని తెలిపారు. ప్రతి నెలా 11-12 కోట్ల కోవిషీల్డ్ డోసులు సీరం వ్యాక్సిన్ కోవిషీల్డ్ ప్రతి నెలా 11-12 కోట్ల మోతాదులను అందిస్తుండగా, భారత్ బయోటెక్ ఆగస్టులో 3.5 కోట్ల మోతాదుల కోవాక్సిన్ సరఫరా చేయనుందన్నారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ లభ్యత అంచనాలను 15 రోజుల ముందుగానే ఇస్తున్నామని, తదనుగుణంగా టీకాల డ్రైవ్‌ను ప్లాన్ చేయడం తమ బాధ్యత అన్నారు. కరోనా మహమ్మారి మూడో వేవ్ పిల్లలను తాకుతుందని చెప్పడం సముచితం కాదని మాండవియా పేర్కొన్నారు. కాడిలా, భారత్ బయోటెక్ కంపెనీలు పిల్లల వ్యాక్సీన్లపై మొదలు పెట్టిన ట్రయల్స్ విజయ వంతమవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు ఆక్సిజన్ కొరతపైస్పందించిన మంత్రి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన మొత్తం1,573లో 316 ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయని, మిగిలినవి ఆగస్టు చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఆయన తెలియజేశారు. అంతకుముందు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, కోవిడ్ మరణాల సంఖ్య 4-5 లక్షలుగా తప్పుడు లెక్కలు చెబుతోందని, వాస్తవానికి దేశంలో ఇప్పటివరకు సగటు మరణాల సంఖ్య 52.4 లక్షల కంటే తక్కువ ఉండదని విమర్శించారు. -
ట్రయల్స్ లేకుండా టీకాలా?: ఢిల్లీ హైకోర్టు
క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా కరోనా టీకాలనివ్వడం, అదికూడా పిల్లలకు ఇవ్వడం ఉత్పాతాన్ని కలిగిస్తుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్స్‌ను సత్వరం పూర్తి చేసి 18ఏళ్లలోపు వారికి కూడా తొందరగా టీకానిచ్చే చర్యలు వేగవంతం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచిఉన్నందున పిల్లలకు వెంటనే టీకాలిచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న పిల్‌పై కోర్టు విచారణ జరిపింది. కెనడా, యూఎస్‌లాంటి దేశాల్లో పిల్లలకు టీకాలిస్తున్నారని, భారత్‌లో ఈ విషయమై ఒక విధానం రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ ఆరోపించారు. అయితే జైడస్ కాడిలా చిన్నపిల్లల కోసం డీఎన్ఏ టీకాపై ట్రయల్స్ జరుపుతోందని, త్వరలో ఇది అందుబాటులోకి రావచ్చని ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్‌శర్మ కోర్టుకు తెలిపారు. వీలయినంత తొందరగా దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యమన్నారు. 18 ఏళ్లలోపు వారికి టీకాపై ట్రయల్స్ జరుగుతున్నాయని, ఇవి పూర్తికాగానే పిల్లల టీకాలపై విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది. ట్రయల్స్‌ను సంపూర్ణంగా ముగించాలని, లేదంటే ఉత్పాతాలు జరుగుతాయని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు టీకా కోసం దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోందని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని సూచించింది. 10, 12 తరగతుల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సినందున వీరికి టీకాలివ్వాలన్న మరో పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.