
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ తరుముకొస్తున్న తరుణంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. మంగళవారం ఉదయం పార్లమెంటులో జరిగిన బీజేపీ ఎంపీల సమావేశంలో మోదీ ఈ విషయాన్ని చెప్పారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రకటించారు. వచ్చే నెలలో పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జైడస్ వ్యాక్సిన్ సెప్టెంబరు నాటికి ప్రారంభం కానుందని వ్యాక్సిన్లపై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కె అరోరా ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సమయంలో పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు రావడం విశేషం. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. జైడస్ ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకోగా అత్యవసర వినియోగ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. కోవాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబరులో వెల్లడికావచ్చని, దీని ప్రకారం సెప్టెంబరు నాటికి వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించవచ్చని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా తెలిపారు. కాగా దేశంలో ఇప్పటివరకు 44 కోట్లకు పైగా వ్యాక్సిన్లను స్వీకరించగా, ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి దేశంలో అందరికీ టీకాలు వేయాలన్నది ప్రభుత్వ లక్క్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment