న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి సుదీర్ఘకాలం కొనసాగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అధికారి పూనమ్ కేత్రపాల్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఒక సమూహంలో టీకాలు, గత ఇన్‌ఫెక్షన్ల ఆధారంగా వృద్ధి చెందే ఇమ్యూనిటీ స్థాయిలను(హెర్డ్ ఇమ్యూనిటీ లేదా సమూహ రోగనిరోధకత) బట్టి దీర్ఘకాలంలో కరోనా ఎండమిక్(ఒకప్రాంతానికి పరిమితం అయ్యేవ్యాధి)గా మారే అవకాశాలుంటాయన్నారు.
వైరస్ అదుపులో మనిషి ఉండకుండా, మనిషి అదుపులో వైరస్ ఉండే పరిస్థితిన సాధించాలని సంస్థ దక్షిణాసియా డైరెక్టర్‌గా పనిచేస్తున్న సింగ్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించిన ప్రాంతాల ప్రజలపై కరోనా ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేశారు. కోవాక్సిన్‌కు ఈయూఏ(అత్యవసర అనుమతులు) ఇవ్వడంపై మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ బయోటెక్ సమర్పించిన గణాంకాల మదింపు జరుగుతోందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తికావచ్చని తెలిపారు.
చదవండి: (పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా?)
దేశాలన్నింటిలో కరోనా మరణాలకు అధికశాతం కారణం టీకా తీసుకోకపోవడమేనని, ఈ సమయంలో బూస్టర్‌డోసులిస్తే అసలు టీకా తీసుకోనివారికి సరఫరా కష్టమవుతుందని వివరించారు. అందుకే బూస్టర్ డోసులపై సంస్థ ఈ ఏడాది చివరివరకు నిషేధం విధించిందని చెప్పారు. అన్ని దేశాల్లో కనీసం 40 శాతం ప్రజానీకానికి టీకా అందేలా చూడాల్సిఉందన్నారు. అందరూ సురక్షితమయ్యేవరకు ఏ ఒక్కరూ సురక్షితం కాదని గుర్తు చేశారు. సమయాన్ని బట్టి కరోనా టీకా ప్రభావం తగ్గుతుందనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి స్థిరమైన ఆధారాల్లేవని చెప్పారు. బూస్టర్ డోసులకు తాము వ్యతిరేకం కాదని, శాస్త్రీయ నిరూపణలను బట్టి బూస్టర్‌పై సిఫార్సులుంటాయని ఆమె చెప్పారు.
పూర్తి నిర్మూలన అసాధ్యం
కరోనాను ప్రపంచం నుంచి పూర్తిగా తరిమివేయడం సాధ్యం కాకపోవచ్చని పూనమ్ అభిప్రాయపడ్డారు. అయితే కాలక్రమేణా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చని, తద్వారా మరణాలను, ఆస్పత్రిపాలవడాన్ని, ఇతర నష్టాలను కనిష్టాలకు తీసుకురావచ్చని చెప్పారు. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా వైరస్ నుంచి రక్షణ బలహీనంగానే ఉందని, చాలామంది ప్రజలకు వైరస్ సోకే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అందుకే టీకా తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, గాలాడని ప్రాంతాల్లో గుమికూడడాన్ని తగ్గించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం తదితర చర్యలు కొనసాగించాలని గట్టిగా సూచించారు.
థర్డ్ వేవ్ రాకడ, దాని బలం.. మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా సరైన చర్యలు పాటిస్తే మరో వేవ్ రాకుండా చూసుకోవచ్చన్నారు. అనేక దేశాల్లో టీకా లభించని ఈ తరుణంలో తిరిగి కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేయాలన్న భారత్ నిర్ణయాన్ని స్వాగతించారు. కరోనా కారణంగా దేశాలు తమ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరిచే అవకాశం లభించిందని ఆమె చెప్పారు. ఆరోగ్య వ్యవస్థపై ఇలాగే పెట్టుబడులు పెరగాలని అభిలషించారు. బలమైన ఆరోగ్య వ్యవస్థలుంటే ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోగలమని ప్రపంచ దేశాలు గుర్తించాలని సింగ్ చెప్పారు.
(చదవండి: Pakistan: ఫ్యూన్ పోస్ట్ కోసం ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారు)
Comments
Please login to add a commentAdd a comment