సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ భయాలు, మరోవైపు కోవిడ్-19 వ్యాక్సీన్ల కొరత దేశ ప్రజలను పీడిస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక విషయాలను వెల్లడించారు. అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ సెప్టెంబర్-అక్టోబర్ నాటికి లభిస్తుందని ఆరోగ్య మంత్రి చెప్పారు. తద్వారా 7 కోట్ల మోతాదులను అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇతర వ్యాక్సిన్ల లభ్యతపై కూడా కంపెనీలు దృష్టిపెట్టాయనీ, దేశంలో వ్యాక్సిన్ కొరతను తగ్గించడానికి రాబోయే రోజుల్లో అవి ఉత్పత్తిని ప్రారంభిస్తాయని మాండవియా చెప్పారు.
కాడిలా వ్యాక్సిన్ దశ 3 ట్రయల్స్ పూర్తయ్యాయనీ, సెప్టెంబర్-అక్టోబర్ నాటికి మార్కెట్లో లభిస్తుందని ఆరోగ్య మంత్రి మంగళవారం తెలిపారు కాడిలా జైకోవ్-డి భారతదేశానికి మొదటి డీఎన్‌ఎ వ్యాక్సిన్‌గా ఉంటుందని, 7కోట్ల మోతాదులు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే కోవిడ్ మరణాలను తక్కువగా చేసి చూపించారన్న అరోపణలను ఆయన తిరస్కరించారు. మరణాల నమోదు రాష్ట్రాల వారీగా జరుగుతుందని, తక్కువ సంఖ్యలో మరణాలు లేదా కేసులను నమోదు చేయమని కేంద్రం ఏ రాష్ట్రాన్ని కోరలేదని ఆయన అన్నారు. 12 సంవత్సరాలు పైబడినవారికి అత్యవసర వినియోగ ఆమోద కోసం డీసీజీఐకి ఇప్పటికే దరఖాస్తు చేసిందని తెలిపారు.
ప్రతి నెలా 11-12 కోట్ల కోవిషీల్డ్ డోసులు
సీరం వ్యాక్సిన్ కోవిషీల్డ్ ప్రతి నెలా 11-12 కోట్ల మోతాదులను అందిస్తుండగా, భారత్ బయోటెక్ ఆగస్టులో 3.5 కోట్ల మోతాదుల కోవాక్సిన్ సరఫరా చేయనుందన్నారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ లభ్యత అంచనాలను 15 రోజుల ముందుగానే ఇస్తున్నామని, తదనుగుణంగా టీకాల డ్రైవ్‌ను ప్లాన్ చేయడం తమ బాధ్యత అన్నారు. కరోనా మహమ్మారి మూడో వేవ్ పిల్లలను తాకుతుందని చెప్పడం సముచితం కాదని మాండవియా పేర్కొన్నారు. కాడిలా, భారత్ బయోటెక్ కంపెనీలు పిల్లల వ్యాక్సీన్లపై మొదలు పెట్టిన ట్రయల్స్ విజయ వంతమవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు ఆక్సిజన్ కొరతపైస్పందించిన మంత్రి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన మొత్తం1,573లో 316 ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయని, మిగిలినవి ఆగస్టు చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఆయన తెలియజేశారు.
అంతకుముందు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, కోవిడ్ మరణాల సంఖ్య 4-5 లక్షలుగా తప్పుడు లెక్కలు చెబుతోందని, వాస్తవానికి దేశంలో ఇప్పటివరకు సగటు మరణాల సంఖ్య 52.4 లక్షల కంటే తక్కువ ఉండదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment