న్యూఢిల్లీ: తమ కోవిడ్–19 టీకా ధరను తగ్గించేందుకు అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిలా సంస్థ అంగీకరించింది. ఒక్కో డోసును రూ.265 చొప్పున విక్రయిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు జైడస్ క్యాడిలా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. అయితే, టీకా ధరపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. ఈ వారంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. 12 ఏళ్లు పైబడిన వారికోసం జైడస్ క్యాడిలా సంస్థ ‘జైకోవ్–డి’ పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించింది.
దేశంలో 12 ఏళ్లు పైబడిన వారి కోసం అనుమతి లభించిన తొలి టీకా ఇదే కావడం గమనార్హం. జైకోవ్–డి టీకా వేయడానికి సూది అవసరం లేదు. డిస్పోజబుల్ పెయిన్‌లెస్ జెట్ అప్లికేటర్ ఉపయోగించాల్సి ఉంది. దీని ధర రూ.93. ఒక్కో డోసుకు ఒక అప్లికేటర్ కావాలి. దీంతో ఒక్కో డోసు ధర మొత్తం రూ.358కు చేరనుంది. ‘జైకోవ్–డి’ టీకాను మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. మూడు డోసులను రూ.1,900కు విక్రయిస్తామని(ఒక్కో డోసు రూ.633.3) జైడస్ క్యాడిలా గతంలో ప్రతిపాదించింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఒక్కో డోసును రూ.358కి విక్రయించేందుకు ముందుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment