ఈ నెల 18 నుంచి డాక్టర్ రెడ్డీస్ షేర్ల బైబ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) ఏప్రిల్ 18 నుంచి షేర్ల బైబ్యాక్ చేపట్టనున్నట్లు మంగళవారం తెలిపింది. గరిష్టంగా షేరు ఒక్కింటికి రూ. 3,500 వెచ్చించనున్నట్లు వివరించింది. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో మంగళవారం నాటి కంపెనీ షేరు ప్రారంభ ధర రూ. 3,079తో పోలిస్తే 14 శాతం అధికం. షేర్ల బైబ్యాక్ కోసం డీఆర్‌ఎల్ గరిష్టంగా రూ. 1,569 కోట్లు కేటాయించింది. కంపెనీ మొత్తం మూలధనంలో 25 శాతం షేర్లకు మించకుండా ఈ బైబ్యాక్ జరుపుతుంది.
మిగులు నిధులను సమర్ధంగా వినియోగించుకునే లక్ష్యంలో భాగంగా బైబ్యాక్ చేపట్టాల్సి వచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజా బైబ్యాక్‌తో షేర్ల సంఖ్య తగ్గుతుందని, ఫలితంగా షేరు ఒక్కింటిపై రాబడి (ఈపీఎస్) పెరుగుతుందని పేర్కొన్నాయి. గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి డీఆర్‌ఎల్ చేతిలో సుమారు రూ. 2,500 కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. కాగా, షేర్ల బైబ్యాక్ వార్తలతో మంగళవారం బీఎస్‌ఈలో డీఆర్‌ఎల్ షేరు ధర 1.79 శాతం పెరిగి రూ. 3,082.80 వద్ద క్లోజయ్యింది.