ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి ప్రధానంగా ఆరు మార్పులు అమల్లోకి వచ్చాయి. వివాద్ సే విశ్వాస్ పథకం ప్రారంభం, పాన్-ఆధార్, టీడీఎస్..వంటి నిబంధనల్లో మార్పలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
1. వివాద్ సే విశ్వాస్ పథకం
ప్రత్యక్ష పన్ను మదింపులో హెచ్చుతగ్గులు సహజం. ఈ పథకం ప్రకారం మనం లెక్కించిన దానికన్నా పన్ను భారం పెరిగితే మనం అప్పీలుకు వెళ్లవచ్చు. అలాగే డిపార్టుమెంటు వారు కూడా అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలుకు వెళ్లడం అంటే వివాదమే. ఈ వివాదాలు ఒక కొలిక్కి వచ్చేసరికి సమయం ఎంతో వృధా అవుతుంది. కాలయాపనతో పాటు మనశ్శాంతి లేకపోవటం, అశాంతి, అనారోగ్యం మొదలైనవి ఏర్పడతాయి. అటువంటి వివాదాల జోలికి పోకుండా పన్ను భారాన్ని వీలున్నంత వరకు తగ్గించి కట్టేలా చేసే స్కీమ్ ఇది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వివాదాలు పోయి ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పొందడమే దీని పరమావధి.
2. ఆదార్ నంబర్ తప్పనిసరి
పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ నంబరుకు బదులుగా గతంలో ఆధార్ కార్డు నమోదు ఐడీని నింపమనేవారు. కానీ ఇక నుంచి ఆ తంతు కొనసాగదు. కచ్చితంగా పాన్ దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నంబర్ వేయాల్సిందే. ఆధార్ నంబరు వేయకపోవడం వల్ల పాన్ విషయంలో దుర్వినియోగం అవుతోంది. పాన్, ఆధార్ కార్డు అనుసంధానం సరిగ్గా జరగడం లేదు. ఈ మార్పుతో జాప్యాన్ని, దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు.
3. ఎస్‌టీటీ పెంపు
స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ విషయంలో ఫ్యూచర్స్, ఆప్షన్స్‌కి సంబంధించి ఎస్‌టీటీ ఛార్జీని పెంచారు. ఇక నుంచి ఫ్యూచర్స్ విషయంలో ఈ రేటు 0.02%గా ఉంటుంది. అలాగే ఆప్షన్స్‌కి ఎస్‌టీటీ రేటు 0.01%గా ఉంటుంది. ఇవి ఈ మార్కెట్ వృద్ధికి తగ్గట్లుగా ఉంటాయని, రేట్ల క్రమబద్ధీకరణ జరుగుతుందని అంచనా.
ఇదీ చదవండి: 70 ఏళ్లు నిండిన వారికి ఉచిత బీమా!
4. ఫ్లోటింగ్ టీడీఎస్ రేటు
ఇది చిన్న మదుపర్లకు ఇబ్బంది కలగకుండా అంటే, బాండ్ల మీద సమకూరే వడ్డీ సంవత్సరానికి రూ.10,000 దాటితే వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల మీద 10 శాతం ఫ్లోటింగ్ రేటు అమలు చేస్తారు.
5. బైబ్యాక్ షేర్లపై పన్ను
ఇక నుంచి మదుపర్లపై కాకుండా కంపెనీలకు పన్ను విధిస్తారు. ఎలాగైతే డివిడెండ్ల విషయంలో కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకొచ్చారో అలాగే దీన్ని కూడా ప్రతిపాదించారు.
6. టీడీఎస్ రేట్ల సవరణ
కొన్ని టీడీఎస్ రేట్లను సవరించారు. సెక్షన్ 194D కింద బీమా కమీషన్ చెల్లింపులపై టీడీఎస్ రేటు 5% నుంచి 2%కు తగ్గించారు. జీవిత బీమా చెల్లింపులపై టీడీఎస్ రేటు 5% నుంచి 2% కు చేర్చారు. లాటరీ టికెట్ కమీషన్‌లపై ఈ రేటును 2% కి తగ్గించారు.
Comments
Please login to add a commentAdd a comment