F and O
-
ఎఫ్&వో ట్రేడింగ్ అంటే టైమ్‌పాస్ కాదు..
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్ అనేదేమీ టైమ్‌పాస్‌గా చేసే ఆషామాషీ వ్యవహారం కాదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అశ్వని భాటియా వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీన్ని మరింత సీరియస్‌గా తీసుకోవాలని మార్నింగ్‌స్టార్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు.సెబీ అధ్యయనం ప్రకారం సంస్థాగత ఇన్వెస్టర్లే ఎఫ్‌అండ్‌వోలో లాభపడుతుండగా, 93 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని వెల్లడైన విషయాన్ని భాటియా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే చిన్న మదుపరుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను కట్టడి చేసేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలను ఇన్వెస్టర్లు వ్యతిరేకిస్తుండటం సరికాదని ఆయన తెలిపారు.2020లో కరోనా వైరస్ మహమ్మారి తర్వాత నుంచి ఎఫ్ అండ్ ఓలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అయితే, ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మంచిదేమీ కాదని, ఆందోళనకరమని భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘అంతర్జాతీయంగా నమోదయ్యే డెరివేటివ్స్ వాల్యూమ్స్‌లో సగభాగం పైగా వాటా భారత్‌దే ఉండటం గొప్పగా అనిపించినా, ఇది మనం ధరించడానికి ఇష్టపడని కిరీటంలాంటిది’’ అని వ్యాఖ్యానించారాయన.మరోవైపు, ఎస్ఎంఈ ఐపీవోల విషయంలో అసంబద్ధమైన హంగామాను నివారించేందుకు, ధరల్లో అవకతవకలు జరగకుండా చూసేందుకు నియంత్రణ సంస్థ, స్టాక్ ఎక్స్చేంజీలు ఈ విభాగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయని భాటియా తెలిపారు. త్వరలోనే సెబీ దీనిపై ఒక చర్చాపత్రాన్ని కూడా ప్రవేశపెట్టనుందని వెల్లడించారు. -
అక్టోబర్ నుంచి ఆరు మార్పులు అమలు
ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి ప్రధానంగా ఆరు మార్పులు అమల్లోకి వచ్చాయి. వివాద్ సే విశ్వాస్ పథకం ప్రారంభం, పాన్-ఆధార్, టీడీఎస్..వంటి నిబంధనల్లో మార్పలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవి ఏంటో తెలుసుకుందాం.1. వివాద్ సే విశ్వాస్ పథకంప్రత్యక్ష పన్ను మదింపులో హెచ్చుతగ్గులు సహజం. ఈ పథకం ప్రకారం మనం లెక్కించిన దానికన్నా పన్ను భారం పెరిగితే మనం అప్పీలుకు వెళ్లవచ్చు. అలాగే డిపార్టుమెంటు వారు కూడా అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలుకు వెళ్లడం అంటే వివాదమే. ఈ వివాదాలు ఒక కొలిక్కి వచ్చేసరికి సమయం ఎంతో వృధా అవుతుంది. కాలయాపనతో పాటు మనశ్శాంతి లేకపోవటం, అశాంతి, అనారోగ్యం మొదలైనవి ఏర్పడతాయి. అటువంటి వివాదాల జోలికి పోకుండా పన్ను భారాన్ని వీలున్నంత వరకు తగ్గించి కట్టేలా చేసే స్కీమ్ ఇది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వివాదాలు పోయి ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పొందడమే దీని పరమావధి.2. ఆదార్ నంబర్ తప్పనిసరిపాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ నంబరుకు బదులుగా గతంలో ఆధార్ కార్డు నమోదు ఐడీని నింపమనేవారు. కానీ ఇక నుంచి ఆ తంతు కొనసాగదు. కచ్చితంగా పాన్ దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నంబర్ వేయాల్సిందే. ఆధార్ నంబరు వేయకపోవడం వల్ల పాన్ విషయంలో దుర్వినియోగం అవుతోంది. పాన్, ఆధార్ కార్డు అనుసంధానం సరిగ్గా జరగడం లేదు. ఈ మార్పుతో జాప్యాన్ని, దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు.3. ఎస్టీటీ పెంపుస్టాక్మార్కెట్ ట్రేడింగ్ విషయంలో ఫ్యూచర్స్, ఆప్షన్స్‌కి సంబంధించి ఎస్టీటీ ఛార్జీని పెంచారు. ఇక నుంచి ఫ్యూచర్స్ విషయంలో ఈ రేటు 0.02%గా ఉంటుంది. అలాగే ఆప్షన్స్‌కి ఎస్టీటీ రేటు 0.01%గా ఉంటుంది. ఇవి ఈ మార్కెట్ వృద్ధికి తగ్గట్లుగా ఉంటాయని, రేట్ల క్రమబద్ధీకరణ జరుగుతుందని అంచనా.ఇదీ చదవండి: 70 ఏళ్లు నిండిన వారికి ఉచిత బీమా!4. ఫ్లోటింగ్ టీడీఎస్ రేటుఇది చిన్న మదుపర్లకు ఇబ్బంది కలగకుండా అంటే, బాండ్ల మీద సమకూరే వడ్డీ సంవత్సరానికి రూ.10,000 దాటితే వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల మీద 10 శాతం ఫ్లోటింగ్ రేటు అమలు చేస్తారు.5. బైబ్యాక్ షేర్లపై పన్నుఇక నుంచి మదుపర్లపై కాకుండా కంపెనీలకు పన్ను విధిస్తారు. ఎలాగైతే డివిడెండ్ల విషయంలో కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకొచ్చారో అలాగే దీన్ని కూడా ప్రతిపాదించారు.6. టీడీఎస్ రేట్ల సవరణకొన్ని టీడీఎస్ రేట్లను సవరించారు. సెక్షన్ 194D కింద బీమా కమీషన్ చెల్లింపులపై టీడీఎస్ రేటు 5% నుంచి 2%కు తగ్గించారు. జీవిత బీమా చెల్లింపులపై టీడీఎస్ రేటు 5% నుంచి 2% కు చేర్చారు. లాటరీ టికెట్ కమీషన్లపై ఈ రేటును 2% కి తగ్గించారు. -
పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓ
స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ నితిన్ కామత్ తెలిపారు. సెబీ ఇటీవల చేసిన బ్రోకరేజ్ ఛార్జీలో మార్పుల వల్ల స్టాక్ బ్రోకింగ్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఈమేరకు ఆయన ఒక బ్లాగ్ పోస్ట్‌లో మాట్లాడారు.‘జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,370 కోట్ల ఆదాయాన్ని సంపాధించింది. అందులో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2023లో కంపెనీ ఆదాయం రూ.6,875 కోట్లు, నికర లాభం రూ.2,900 కోట్లుగా ఉంది. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ (ఎంఐఐ)ల్లో పారదర్శకతను నిర్ధారించడానికి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌లో నష్టపోయే బాధితులను తగ్గించేందుకు సెబీ ఇటీవల నిబంధనల్లో మార్పులు చేసింది. వాటి అమలుతో కంపెనీకి రానున్న ఏడాదిలో లాభాలు తగ్గనున్నాయి. ఇండెక్స్ డెరివేటివ్ ట్రేడింగ్ విభాగంలో కంపెనీకు సమకూరే రాబడి 30-50% వరకు తగ్గనుంది’ అని చెప్పారు. సెబీ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. దాదాపు 97 శాతం మంది ట్రేడర్లు ఈ విభాగంలో నష్టాలపాలవుతున్నట్లు గుర్తించింది. దాంతో నిబంధనల్లో మార్పులు చేసింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి.ఇదీ చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపునిబంధనల్లో మార్పులివే..ఇండెక్స్ డెరివేటివ్‌ల కోసం కనీస కాంట్రాక్ట్ పరిమాణం ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. దాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. వచ్చే ఆరు నెలల్లో దీన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచనున్నారు. బ్రోకర్లు క్లయింట్ల నుంచి ఆప్షన్ ప్రీమియంలను ముందుగానే సేకరించవలసి ఉంటుంది. వీక్లీ ఎక్స్‌పైరీలను పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్లు (ఎంఐఐ) ఇంట్రాడే(అదే రోజు ముగిసే ట్రేడింగ్) ప్రాతిపదికన ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లను పర్యవేక్షిస్తాయి. -
రిస్క్ లు తెలుసుకోకుండానే ఎఫ్‌అండ్‌వోలోకి
న్యూఢిల్లీ: సత్వర లాభాలపై ఆశలు, స్పెక్యులేటివ్ ధోరణులే రిటైల్ ఇన్వెస్టర్లను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్ వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో వారు రిస్క్ ల గురించి ఆలోచించకుండా ట్రేడింగ్‌లోకి దూకి, చేతులు కాల్చుకుంటున్నారు. అలా జరగకుండా ఎఫ్‌అండ్‌వోపై పూర్తి అవగాహన పెంచుకుని, రిస్క్ లను ఎలా ఎదుర్కొనాలనేది తెలుసుకుని మాత్రమే ఇందులోకి అడుగుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ లతో కూడుకున్న ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేస్తుండటంపై కొన్నాళ్ల క్రితం ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ మాధవిపురి బచ్ తదితరులు ఈ సాధనం విషయంలో జాగ్రత్త వహించాలని కూడా సూచించారు. అయినప్పటికీ ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ భారీగా పెరుగుతూనే ఉంది. 2019లో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్ నెలవారీ టర్నోవరు 8,740 లక్షల కోట్లుగా ఉండేది. ఇది 2024 మార్చి నాటికి ఏకంగా రూ. 217 లక్షల కోట్లకు ఎగిసింది. సెబీ అధ్యయనం ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో వ్యక్తిగత ట్రేడర్లలో 89 శాతం మంది నష్టపోయారు. నష్టాలు సగటున రూ. 1.1 లక్షలుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ అనేది హెడ్జింగ్, స్పెక్యులేషన్ కోసం ఉపయోగకరంగా ఉంటుందని, కానీ అధిక స్థాయిలో మార్జిన్లు అవసరమవుతాయి కాబట్టి రిస్క్ లు కూడా ఎక్కువగా ఉంటాయని ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఫైయర్స్ సహ–వ్యవస్థాపకుడు తేజస్ ఖోడే చెప్పారు. వీటి వల్ల చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఈ సాధనాలు, వాటిలో ఉండే రిసు్కల గురించి రిటైల్ ఇన్వెస్టర్లు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయడం మంచిదని సూచించారు. ‘ఈ సాధనాలకు అవసరమైన పెట్టుబడి తక్కువగానే ఉండటం, వివిధ సూచీల్లో వీక్లీ ఎక్స్‌పైరీలు కూడా అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లు భారీగా పెరిగారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లకు రిస్క్ లు కూడా పెరిగాయి‘ అని ఆనంద్ రాఠీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా చెప్పారు. -
ప్రపంచ పరిణామాలు దారి చూపుతాయ్
ముంబై: దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో ఈ వారం స్టాక్ సూచీలకు ప్రపంచ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరి డెరివేటివ్స్ ఎక్స్పైరీ(గురువారం) ముగింపు ఉండటంతో ఒడిదుడుకుల ట్రేడింగ్ ఆస్కారం ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళిపై దృష్టి సారించవచ్చు. ఇదే వారంలో వెలువడనున్న ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశపు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు. ఆశాజన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు కలిసిరావడంతో గతవారంలో సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. సూచీలు అరశాతం బలపడినా.., కఠిన ద్రవ్య విధాన అమలు భయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు ప్రభావంతో సూచీలు తీవ్ర ఊగిసలాటకు లోనవచ్చు. ‘‘ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. మార్కెట్ వ్యాల్యుయేషన్లు సహేతుకంగా ఉన్నాయి. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి కనబరుస్తున్నారు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 18000 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే 17650 – 17500 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. ఎగువ స్థాయిలో 18200 – 18250 పాయింట్ల పరిధిని చేధించాల్సి ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు ఈ గురువారం(ఫిబ్రవరి 23న) నిఫ్టీకి చెందిన ఫిబ్రవరి డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,800–18,200 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ప్రపంచ పరిణామాలు యూరోజోన్‌తో పాటు అమెరికా దేశాల తయారీ, గృహ అమ్మకాల డేటా మంగళవారం విడుదల అవుతుంది. బుధవారం యూరోజోన్ నాన్ మానటరీ పాలసీ సమావేశం ఉంది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ మినిట్స్ గురువారం వెల్లడి కానున్నాయి. అదే రోజున అమెరికా నాలుగో క్వార్టర్ జీడీపీ విడుదల కానున్నాయి. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ ఆర్థిక వ్యవస్థ నుంచి సానుకూల సంకేతాలు వెలువడితే దేశీయ మార్కెట్ ముందడుగు వేస్తుంది. ఇందుకు విరుద్ధంగా బలమైన ఆర్థిక గణాంకాల నమోదు, ద్రవ్యోల్బణ తగ్గుదల కనిపిస్తే ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో మార్కెట్లు పతనాన్ని చవిచూస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి అమ్మకాలకు పాల్పడిన విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలో రూ.7,600 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఈ ఏడాదిలో ఇప్పటికి వరకు రూ.9,000 కోట్లు ఈక్విటీ షేర్లను కొన్నారు. ‘‘అదానీ సంక్షోభం నుంచి మార్కెట్ తేరుకోవడం ప్రారంభించిన తర్వాత ఎఫ్ఐఐల కొనుగోళ్లు మెరుగయ్యాయి. ఈ పరిణామం దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారు ఆసక్తి కనబరుస్తారనే విషయాన్ని సూచిస్తుంది. అయితే గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు పాల్పడే అవకాశం లేకపోలేదు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఆర్బీఐ మినిట్స్ వెల్లడి ఆర్బీఐ ఈ ఫిబ్రవరి 6–8 తేదీల మధ్య నిర్వహించిన ద్రవ్య పాలసీ కమిటీ సమావేశపు మినిట్స్(బుధవారం) వెల్లడి కానున్నాయి. పాలసీ విధాన వైఖరిని మరింత లోతుగా విశ్లేషించేందుకు మార్కెట్ వర్గాలు మినిట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అంచనాలకు తగ్గట్టే ఫిబ్రవరిలో ఆర్బీఐ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ద్రవ్య పరపతి కమిటీ అప్రమత్తంగానే ఉంటుందని, అవసరమైతే కఠిన పాలసీ వైఖరి విధానాన్ని కొనసాగిస్తామని గవర్నర్ వ్యాఖ్యలు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే పరిమిత శ్రేణికి లోబడే ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. దేశీయ సూచీలు ప్రపంచ మార్కెట్ల తీరును అనుసరించే వీలుందంటున్నారు. ఇదే వారంలో ఐదు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘సుధీర్ఘ ర్యాలీ తర్వాత సూచీలు స్థిరీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.., గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదు. కమోడిటీ ధరలు దిగిరావడం, కేంద్ర బ్యాంకులు సరళతర ద్రవ్య విధాన వైఖరితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ మరింత పెరగొచ్చు. నిఫ్టీ కీలకమైన తక్షణ మద్దతు 18,300 స్థాయిని నిలుపుకోగలిగింది. కొనుగోళ్లు కొనసాగితే 18,400–18,450 శ్రేణిలో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే 18,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో గతవారంలో సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ప్రపంచ పరిణామాలు యూరో జోన్ సెప్టెంబర్ కరెంట్ ఖాతా లోటు డేటా రేపు(మంగళవారం) విడుదల అవుతుంది. యూఎస్, బ్రిటన్, యూరో జోన్ దేశాల నవంబర్ తయారీ, సేవా రంగ డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. మరుసటి రోజున గురువారం(ఈ నెల 24న) అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్ విడుదల అవుతాయి. ఈ సందర్భంగా ఫెడ్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(జూలై 28న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్థిరత్వంతో పాటు వృద్ధి విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందనే సానుకూల అంశాలతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున దేశీయ ఈక్విటీలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నవంబర్‌లో ఇప్పటి వరకు(1–17 తేదీల మధ్య) రూ.30,385 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ‘‘భారత కంపెనీల షేర్ల వ్యాల్యుయేషన్లు అధిక స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నందున రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్ పట్ల బేరిష్ వైఖరిని ప్రదర్శించవచ్చు. ఇదే సమయంలో చైనా, దక్షిణ కొరియా, తైవాన్ స్టాకులు ఆకర్షణీయమైన ధరల వద్ద లభ్యమవుతున్న తరుణంలో ఎఫ్ఐఐలు ఈ దేశాల వైపు మెగ్గుచూపవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. ఈ వారంలో అయిదు లిస్టింగ్‌లు ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకున్న అయిదు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ప్రత్యేక రసాయనాలు తయారు చేసే ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్, బ్యాంకింగేతర రంగ ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో నమోదుకానున్నాయి. గ్రే మార్కెట్లో ఆర్కియన్ కెమికల్ షేర్లు 25% ప్రీమియంతో, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ డిస్కౌంట్‌తో ట్రేడవుతున్నాయి. కేన్స్ టెక్నాలజీస్ ఇండియా షేర్లు మంగళవారం, ఐనాన్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ షేర్లు బుధవారం, కీస్టోన్ రియల్టర్స్ షేర్లు గురువారం లిస్ట్ కానున్నాయి. వీటిలో ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి సంస్థ కేన్స్ టెక్నాలజీస్ 30శాతం ప్రీమియంలో.., మిగతా రెండు కంపెనీ షేర్లు ఇష్యూ ధరల వద్ద స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల తీరును ఇన్వెస్టర్లు గమనించవచ్చు. -
ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పనితీరు, చైనాలో కోవిడ్ కేసుల నమోదు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టొచ్చు. తుది దశకు చేరిన దేశీయ కార్పొరేట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను పరిశీలించవచ్చు. ప్రాథమిక మార్కెట్లో రెండు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. మరో రెండు ఐపీవోలు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణుల చెబుతున్నారు. ‘‘చివరి ట్రేడింగ్ సెషన్లో సాంకేతికంగా నిఫ్టీ 16,250 స్థాయిపై ముగిసింది. బౌన్స్‌బ్యాక్ ర్యాలీ కొనసాగితే 16,400 స్థాయిని.., ఆపై 16,666 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 16,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,800వద్ద మద్దతు లభించొచ్చు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్ఎంజీసీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించవచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణ పెరుగుదల, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల అస్థిరత తదితర ప్రతికూల పరిస్థితులను అధిగమించి గతవారం దేశీయ సూచీలు దాదాపు మూడుశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1,533 పాయింట్లు, నిఫ్టీ 484 పాయింట్ల లాభాలన్ని ఆర్జించాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత విశ్లేషిస్తే.., ► గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఏప్రిల్ 26న) నిఫ్టీ సూచీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ► కార్పొరేట్ ఫలితాల ప్రభావం దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్ తుది దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,200కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. దీవీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, సెయిల్, జొమాటో, అదానీ పోర్ట్స్, గ్రాసీం, ఇప్కా ల్యాబ్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఇండిగో, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, బర్గర్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నైకా సంస్థలు మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ► విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి వర్ధమాన దేశాల్లో పెద్ద ఎత్తున ఈక్విటీలను విక్రయిస్తున్నారు. ఈ మే నెల(20 తేదీ నాటికి)లో ఇప్పటి వరకు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ నెల చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వరుసగా ఐదో నెలలో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా మారడం ఈక్విటీ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తోంది. ► ప్రాథమిక మార్కెట్‌పై దృష్టి ఇటీవల ఐపీవోలను పూర్తి చేసుకున్న డెలివరీ.., వీనస్ పైప్స్అండ్ట్యూబ్స్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున ఏథర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుండగా.., గతవారంలో ప్రారంభమై ఈ ముద్ర ఐపీవో మంగళవారం ముగియనుంది. ఈ రెండు పబ్లిక్ ఇష్యూల మొత్తం పరిమాణం రూ.1,221 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల తీరు.., ఐపీఓ స్పందనలను ఇన్వెస్టర్లు గమనించవచ్చు. ప్రపంచ పరిణామాలు అమెరికా ఫెడ్ చైర్మన్ పావెల్.., ఈసీబీ ప్రెసిడెంట్ లాగార్డ్ ప్రసంగాలు మంగళవారం ఉన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్(బుధవారం)తో పాటు జీడీపీ వృద్ధి రేటు అవుట్‌లుక్(గురువారం) విడుదల కానున్నాయి. జపాన్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి అవుతుంది. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. -
నిఫ్టీ... ‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్ అండ్ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... నిఫ్టీ: ఎన్ఎస్ఈ ప్రధాన సూచి నిఫ్టీ–50 మూడురోజులుగా 9.900 పాయింట్ల స్థాయికి అటూ, ఇటూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నది. ఈ నెలలో నిఫ్టీ 10,000 పాయింట్ల శిఖరాన్ని చేరవచ్చన్న అంచనాలు కొద్దిరోజుల క్రితం వరకూ మార్కెట్లో ఉన్నా, ఈ స్థాయిని తక్షణమే అందుకోకపోవచ్చన్న భావన ట్రేడర్లలో ప్రస్తుతం ఏర్పడుతున్నట్లుంది. ఇందుకు సంకేతంగా 10,000 స్ట్రయి క్ వద్ద కాల్‌రైటింగ్ గురువారం జోరందుకుంది. ఈ స్ట్రయిక్ వద్ద తాజాగా 13.42 లక్షల షేర్లు యాడ్‌కావడంతో కాల్ బిల్డప్ 70.87 లక్షల షేర్లకు చేరింది. 9,900 స్ట్రయిక్ వద్దసైతం తాజా కాల్‌రైటింగ్ ఫలితంగా 9.09 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ కాల్ బిల్డప్ 51.81 లక్షల షేర్లకు పెరిగింది. ఇదే స్ట్రయిక్ వద్ద పుట్ కవరింగ్ కారణంగా పుట్స్ ఓఐ నుంచి 3.48 లక్షల షేర్లు కట్ అయ్యాయి. పుట్ బిల్డప్ 39 లక్షలకు తగ్గింది. 9,800 స్ట్రయిక్ వద్ద స్వల్పంగా పుట్ కవరింగ్ జరగడంతో ఇక్కడ బిల్డప్ 64.97 లక్షలకు దిగింది. ఇక నిఫ్టీ ఫ్యూచర్స్ ఓఐ నుంచి గురువారం 2.44 లక్షల షేర్లు (1.32%) తగ్గాయి. నిఫ్టీ ఫ్యూచర్ ఓఐ నుంచి షేర్లు కట్‌కావడం వరుసగా ఇది మూడో రోజు. ఇలా వరుసగా ఓఐ తగ్గడం...అటు షార్ట్స్, ఇటు లాంగ్స్‌ను ట్రేడర్లు స్క్వేర్‌ఆఫ్ చేసుకోవడాన్ని సూచిస్తున్నది. అలాగే సమీప భవిష్యత్తులో 9,800–10,000 పాయింట్ల శ్రేణి మధ్య నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఆప్షన్ డేటా విశ్లేషిస్తున్నది. ♦ కొటక్ ఫ్యూచర్ సంకేతాలెలా ఉన్నాయి? ♦ కెనరా బ్యాంక్ డేటా ఏం చెబుతోంది? ఈ వివరాలు www.sakshibusiness.com లో -
ఒడిదుడుకుల వారం..!
ఈ వారంలో ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ముగింపు షార్ట్ కవరింగ్‌కు అవకాశాలు రూపాయి పతనం కొనసాగవచ్చు: నిపుణుల అంచనా న్యూఢిల్లీ: నవంబర్ నెల డెరివేటివ్‌స కాంట్రాక్టుల ఎక్స్పైరీ ఈ వారమే (గురువారం) కానున్నందున స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు, పార్లమెంట్ సమావేశాల తీరు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల ట్రెండ్, నగదు కొరత నివారించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు.... తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం...: మార్కెట్ సెంటిమెంట్‌పై పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం కొనసాగుతుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్హెడ్(రీసెర్చ్) అభ్నిష్ కుమార్సుధాంశు చెప్పారు. ఈ వారంలో ఆర్థికంగా చెప్పుకోదగ్గ ప్రధాన సంఘటనలేవీ లేనందున పెద్ద నోట్ల రద్దు సంబంధిత వార్తలే ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా అంచనాల కంటే అధికంగా బ్యాంక్ డిపాజిట్లు పెరిగితే, మార్కెట్‌పై సానుకూల ప్రభావం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు కారణంగా తలెత్తిన లిక్విడిటీ సమస్య ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం కొనసాగుతుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచితే భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఊగిసలాట అవకాశాలు.. ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ఈ వారమే ముగియనున్నందున మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. పలు షేర్లు తక్కువ ధరల్లో లభ్యమవుతుండడం, షార్ట్ కవరింగ్ వంటి అంశాల కారణంగా స్టాక్ మార్కెట్ ఊగిసలాటకు గురికావచ్చని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. భారత వృద్ధి కథ ఆకర్షణీయంగా ఉందని, ఆకర్షణీయమైన వేల్యూయేషన్ల కారణంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగుతుందని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ అంచనా వేస్తున్నారు. ఇక ఈ వారంలో ఎల్ అండ్ టీ, ఆయిల్ ఇండియా, తదితర కంపెనీ ఫలితాలను వెల్లడించనున్నారుు. రూపాయి మరింత క్షీణత... అంతర్జాతీయ అంశాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పైనే కాకుండా రూపాయిపై కూడా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఈ వారంలో డాలర్‌తో రూపాయి మారకం ప్రస్తుతమున్న 68.14 నుంచి 68.60 స్థాయికి తగ్గుతుందన్న అంచనాలున్నాయి. గత శుక్రవారం రూపాయి 9 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 19,561 కోట్ల విదేశీ నిధులు వెనక్కి.. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాల కారణంగా విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెల 18 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.9841 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.9,720 కోట్లు, వెరశి రూ.19,561 కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.10,306 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.