ఒడిదుడుకుల వారం..! | F and O contracts end | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల వారం..!

Published Mon, Nov 21 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

ఒడిదుడుకుల వారం..!

ఒడిదుడుకుల వారం..!

ఈ వారంలో ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల ముగింపు
 షార్ట్ కవరింగ్‌కు అవకాశాలు
 రూపాయి పతనం కొనసాగవచ్చు: నిపుణుల అంచనా
 
 న్యూఢిల్లీ: నవంబర్ నెల డెరివేటివ్‌‌స కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ ఈ వారమే (గురువారం) కానున్నందున స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు, పార్లమెంట్ సమావేశాల తీరు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల ట్రెండ్, నగదు కొరత నివారించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు.... తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. 
 
 పెద్ద నోట్ల రద్దు ప్రభావం...: మార్కెట్ సెంటిమెంట్‌పై పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం కొనసాగుతుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌హెడ్(రీసెర్చ్) అభ్నిష్ కుమార్‌సుధాంశు చెప్పారు.  ఈ వారంలో ఆర్థికంగా చెప్పుకోదగ్గ ప్రధాన సంఘటనలేవీ లేనందున పెద్ద నోట్ల రద్దు సంబంధిత వార్తలే ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా అంచనాల కంటే అధికంగా బ్యాంక్ డిపాజిట్లు పెరిగితే, మార్కెట్‌పై సానుకూల ప్రభావం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు.
 
 రూ.500, రూ.1,000 నోట్ల రద్దు కారణంగా తలెత్తిన లిక్విడిటీ సమస్య ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం కొనసాగుతుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచితే భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
 
 ఊగిసలాట అవకాశాలు.. 
 ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ఈ వారమే ముగియనున్నందున మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్  సీఈఓ రోహిత్  గాడియా చెప్పారు. పలు షేర్లు తక్కువ ధరల్లో లభ్యమవుతుండడం, షార్ట్ కవరింగ్ వంటి అంశాల కారణంగా స్టాక్ మార్కెట్ ఊగిసలాటకు గురికావచ్చని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. భారత వృద్ధి కథ ఆకర్షణీయంగా ఉందని, ఆకర్షణీయమైన వేల్యూయేషన్ల కారణంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగుతుందని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ అంచనా వేస్తున్నారు. ఇక ఈ వారంలో ఎల్  అండ్ టీ, ఆయిల్ ఇండియా, తదితర కంపెనీ ఫలితాలను వెల్లడించనున్నారుు. 
 
 రూపాయి మరింత క్షీణత... 
 అంతర్జాతీయ అంశాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పైనే కాకుండా రూపాయిపై కూడా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.  ఈ వారంలో డాలర్‌తో రూపాయి మారకం ప్రస్తుతమున్న 68.14 నుంచి 68.60 స్థాయికి తగ్గుతుందన్న అంచనాలున్నాయి. గత శుక్రవారం రూపాయి 9 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 
 
 19,561 కోట్ల విదేశీ నిధులు వెనక్కి..
 విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాల కారణంగా విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెల 18 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.9841 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.9,720 కోట్లు, వెరశి రూ.19,561 కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.10,306 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement