ముంబై: ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పనితీరు, చైనాలో కోవిడ్ కేసుల నమోదు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టొచ్చు. తుది దశకు చేరిన దేశీయ కార్పొరేట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను పరిశీలించవచ్చు. ప్రాథమిక మార్కెట్లో రెండు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. మరో రెండు ఐపీవోలు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణుల చెబుతున్నారు.
‘‘చివరి ట్రేడింగ్ సెషన్‌లో సాంకేతికంగా నిఫ్టీ 16,250 స్థాయిపై ముగిసింది. బౌన్స్‌బ్యాక్ ర్యాలీ కొనసాగితే 16,400 స్థాయిని.., ఆపై 16,666 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 16,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,800వద్ద మద్దతు లభించొచ్చు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించవచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు.
వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణ పెరుగుదల, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల అస్థిరత తదితర ప్రతికూల పరిస్థితులను అధిగమించి గతవారం దేశీయ సూచీలు దాదాపు మూడుశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1,533 పాయింట్లు, నిఫ్టీ 484 పాయింట్ల లాభాలన్ని ఆర్జించాయి.
మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత విశ్లేషిస్తే..,
► గురువారం ఎఫ్‌అండ్‌ఓ ముగింపు
ఈ గురువారం(ఏప్రిల్ 26న) నిఫ్టీ సూచీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
► కార్పొరేట్ ఫలితాల ప్రభావం
దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్ తుది దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,200కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. దీవీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, సెయిల్, జొమాటో, అదానీ పోర్ట్స్, గ్రాసీం, ఇప్కా ల్యాబ్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఇండిగో, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, బర్గర్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నైకా సంస్థలు మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది.
► విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు
యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి వర్ధమాన దేశాల్లో పెద్ద ఎత్తున ఈక్విటీలను విక్రయిస్తున్నారు. ఈ మే నెల(20 తేదీ నాటికి)లో ఇప్పటి వరకు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ నెల చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వరుసగా ఐదో నెలలో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా మారడం ఈక్విటీ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తోంది.
► ప్రాథమిక మార్కెట్‌పై దృష్టి
ఇటీవల ఐపీవోలను పూర్తి చేసుకున్న డెలివరీ.., వీనస్ పైప్స్‌అండ్‌ట్యూబ్స్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున ఏథర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుండగా.., గతవారంలో ప్రారంభమై ఈ ముద్ర ఐపీవో మంగళవారం ముగియనుంది. ఈ రెండు పబ్లిక్ ఇష్యూల మొత్తం పరిమాణం రూ.1,221 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల తీరు.., ఐపీఓ స్పందనలను ఇన్వెస్టర్లు గమనించవచ్చు.
ప్రపంచ పరిణామాలు
అమెరికా ఫెడ్ చైర్మన్ పావెల్.., ఈసీబీ ప్రెసిడెంట్ లాగార్డ్ ప్రసంగాలు మంగళవారం ఉన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్(బుధవారం)తో పాటు జీడీపీ వృద్ధి రేటు అవుట్‌లుక్(గురువారం) విడుదల కానున్నాయి. జపాన్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి అవుతుంది. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు.
ఒడిదుడుకులు కొనసాగవచ్చు
Published Mon, May 23 2022 12:51 AM | Last Updated on Mon, May 23 2022 12:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment