ఉక్రెయిన్‌పై రష్యా ఆగని విధ్వంసం! భారత్‌ నుంచి వేల కోట్లు హుష్ కాకి! | Fpi Dumped Indian Shares Worth Record Rs 1.4 Lakh Crore In 2021-22 | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై రష్యా ఆగని విధ్వంసం! భారత్‌ నుంచి వేల కోట్లు హుష్ కాకి!

Published Thu, Apr 7 2022 7:18 AM | Last Updated on Thu, Apr 7 2022 7:54 AM

Fpi Dumped Indian Shares Worth Record Rs 1.4 Lakh Crore In 2021-22 - Sakshi

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో దేశీ స్టాక్స్‌లో నికరంగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. దీంతో ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఇది దేశీ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఇందుకు కోవిడ్‌–19 కేసులు భారీగా విస్తరించడం, ఆర్థిక రికవరీపై ఆందోళనలు, రష్యా– ఉక్రెయిన్‌ మధ్య తలెత్తిన యుద్ధం తదితర ప్రతికూల అంశాలు ప్రభావం చూపాయి. అయితే అంతక్రితం ఏడాది(2020–21) ఇందుకు విరుద్ధమైన రీతిలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 2.7 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయడం విశేషం!  

గతంలో ఇలా.. 
ఇంతక్రితం 2008–09లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 47,706 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. 2015–16లో రూ. 14,171 కోట్లు, 2018–19లో రూ. 88 కోట్ల విలువైన స్టాక్స్‌ మాత్రమే విక్రయించారు. గతేడాది అంటే 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చివరకూ ఎఫ్‌పీఐలు దేశీ ఈక్విటీలలో రూ. 1.4 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. గతేడాది 12 నెలల్లో 9 నెలలపాటు అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిచ్చారు. 2021 అక్టోబర్‌ నుంచి అమ్మకాల తీవ్రత పెరగింది. భవిష్యత్‌లోనూ చమురు ధరల సెగ, ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు వెనక్కి మళ్లే వీలున్నట్లు స్టాక్‌ నిపుణులు భావిస్తున్నారు.  

ప్రతికూలతలు.. 
దేశీ స్టాక్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐల విక్రయాలకు పలు అంశాలు కారణమవుతున్నట్లు మార్నింగ్‌స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. వీటిలో కరోనా మహమ్మారి భారీగా విస్తరించడాన్ని ప్రస్తావించారు. అంతవరకూ వేగవంత ఆర్థిక రికవరీపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు కేసులు భారీగా పెరగడంతో ఒక్కసారిగా నిరాశకు లోనైనట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో రూ. 12,613 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా.. కేసులు తగ్గి ఆంక్షలు వైదొలగడంతో తిరిగి జూన్‌లో రూ. 

17,215 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. 
మరోపక్క దేశీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆకట్టుకోవడం, వ్యాక్సినేషన్‌ పుంజుకోవడం వంటి సానుకూల అంశాలు ఇందుకు తోడ్పాటునిచ్చాయి. ఆపై జూన్, జులైల్లో తిరిగి విక్రయాలకే కట్టుబడగా.. ఆగస్ట్, సెప్టెంబర్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. ఆపై అక్టోబర్‌ నుంచీ భారీ అమ్మకాలకు తెరతీశారు. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన పరపతి నిర్ణయాలు, వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు ప్రభావం చూపాయి.  

భారత మార్కెట్లు ఖరీదే.. 
దేశీ స్టాక్‌ మార్కెట్లు ఖరీదుగానే కనిపిస్తున్నట్లు ట్రూ బీకాన్, జిరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ అభిప్రాయపడ్డారు. దీంతో ఎఫ్‌పీఐలు చైనాకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రీబ్యాలెన్సింగ్‌లో భాగంగా దేశీ స్టాక్స్‌ విక్రయించడంతోపాటు.. ఇతర అవకాశాలవైపు దృష్టిసారించినట్లు వివరించారు. దేశీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు వెనక్కి మళ్లేందుకు ప్రధానంగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ పెంపు సంకేతాలే కారణమని అప్‌సైడ్‌ఏఐ సహవ్యవస్థాపకుడు ఏ.అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. చమురు ధరల జోరు, రూపాయి బలహీనత, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు, మార్కెట్లు ఖరీదుకావడం వంటి పలు అంశాలు సైతం ఎఫ్‌పీఐలపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆయన వివరించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement