ముంబై: స్టాక్ మార్కెట్ కొత్త ఏడాది తొలి వారంలోనూ ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులపై దృష్టి సారించే వీలుంది. గతవారం ప్రారంభమైన షా పాలీమర్స్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ముగుస్తుంది. అదే రోజున రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఐపీఓ లిస్టింగ్ ఉంది.
ఇటీవల దిద్దుబాటులో దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో స్టాక్ సూచీలు రికవరీ అయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్ల మినహా అన్ని రంగాల షేర్లలో బుల్ ర్యాలీ కొనసాగడంతో సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
‘‘ఆర్థిక మాంద్య భయాలు, చైనా కోవిడ్ పరిస్థితులు సూచీల అప్‌సైడ్ ర్యాలీని అడ్డుకుంటున్నాయి. ఇదే సమయంలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. కావున సూచీలు కొంతకాలం పాటు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో ట్రేడవచ్చు. నిఫ్టీ 17800–18400 పాయింట్ల పరిధిలో స్వల్పకాలం పాటు స్థిరీకరణ కొనసాగొచ్చు. కన్సాలిడేషన్ దశను పూర్తి చేసుకున్నట్లయితే నిఫ్టీ జీవితకాల గరిష్టం 18,887 స్థాయిని చేరుకునేందుకు ప్రయత్నం చేయోచ్చు’’ అని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ తెలిపారు. మార్కెట్‌ను నడిపించే అంశాలు ఇవీ..
ఫెడ్ రిజర్వ్ మినిట్స్
గతేడాది డిసెంబర్ 14న జరిగిన అమెరికా ఫెడ్ రిజర్వ్ ఎఫ్‌ఓఎంసీ మినిట్స్ వివరాలు గురువారం వెల్లడి కానున్నాయి. గత నాలుగుసార్లు 75 బేసిస్ పాయింట్లు పెంచిన ఫెడ్.. గత నెలలో 50 పాయింట్లు పెంచింది. దీంతో 4.25 – 4.50 శాతానికి ఫెడ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు చేరింది. గత 15 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. భవిష్యత్తు(2023)లోనూ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ అధికారిక వర్గాలు సంకేతాలిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన వైఖరిపై ఫెడ్ మినిట్స్‌లో మరింత స్పష్టత వచ్చే వీలుంది.
ఎఫ్‌పీఐలు ఓకే
డిసెంబర్‌లో ఈక్విటీల్లోకి రూ. 11,119 కోట్ల పెట్టుబడులు
గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ ఈక్విటీలలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం 2022 డిసెంబర్‌లో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీంతో వరుసగా రెండో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. కొన్ని ప్రపంచ దేశాలలో తిరిగి కోవిడ్–19 కేసులపై ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలోనూ దేశీ స్టాక్స్‌పట్ల ఎఫ్‌పీఐలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే ఇటీవల కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తుండటం గమనార్హం! ఫలితంగా 2022 నవంబర్‌లో నమోదైన రూ. 36,239 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు భారీగా తగ్గాయి. యూఎస్‌లో మాంద్య భయాలు వంటి అంశాలు ఎఫ్‌పీఐ పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ నిపుణులు హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుత అనిశ్చిత వాతావరణంలోనూ చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన దేశీ స్టాక్ మార్కెట్లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు.
భారీ అమ్మకాలు
దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు 2022లో భారీగా రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. యూఎస్ ఫెడ్‌సహా ప్రపంచవ్యాప్తంగా పలు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూపోవడం, చమురు ధరల పెరుగుదల, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. వెరసి గత మూడేళ్లలో నికర పెట్టుబడిదారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు 2022లో నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్‌పీఐలు ఇంతక్రితం అంటే 2021లో రూ. 25,752 కోట్లు, 2020లో రూ. 1.7 లక్షల కోట్లు, 2019లో రూ. 1.01 లక్షల కోట్లు విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇక 2022 డిసెంబర్‌లో రూ. 1,673 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను విక్రయించగా.. ఏడాది మొత్తం రూ. 15,911 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 2021లోనూ డెట్ విభాగంలో రూ. 10,359 కోట్లు, 2020లో రూ. 1.05 లక్షల కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలు విక్రయించారు.
స్థూల ఆర్థిక గణాంకాలు
ముందుగా నేడు మార్కెట్ ఆదివారం వెలువడిన డిసెంబర్ ఆటో విక్రయాలకు స్పందించాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలు ఈ వారంలో డిసెంబర్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలను వెల్లడించనున్నాయి. కోవిడ్ కేసులు తెరపైకి వచ్చిన నేపథ్యంలో కరోనా ప్రభావం ఈ రంగంపై ఎంతమేర పడిందనే అంశాన్ని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. భారత్, అమెరికా డిసెంబర్ తయారీ రంగ పీఎంఐ డేటా(నేడు), బ్రిటన్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. సేవారంగ పీఎంఐ డేటా బుధవారం విడుదల అవుతుంది.
కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే
గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ 2023లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తెరపడనుంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొలిక్కి రావచ్చు. దేశీయ పరిస్థితులను గమనిస్తే.., ధరలు కొండెక్కి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వినియోగం పుంజుకుంటుంది. ప్రభుత్వ వృద్ధి దోహద చర్యలు, ప్రోత్సాహక విధానాలు, కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి మన మార్కెట్‌ను ముందుకు నడపొచ్చని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్వల్ప శ్రేణిలోనే ట్రేడింగ్
Published Mon, Jan 2 2023 5:04 AM | Last Updated on Mon, Jan 2 2023 5:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment