ముంబై: దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో ఈ వారం స్టాక్ సూచీలకు ప్రపంచ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరి డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ(గురువారం) ముగింపు ఉండటంతో ఒడిదుడుకుల ట్రేడింగ్ ఆస్కారం ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళిపై దృష్టి సారించవచ్చు. ఇదే వారంలో వెలువడనున్న ఆర్‌బీఐ, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశపు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు.
ఆశాజన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు కలిసిరావడంతో గతవారంలో సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. సూచీలు అరశాతం బలపడినా.., కఠిన ద్రవ్య విధాన అమలు భయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు ప్రభావంతో సూచీలు తీవ్ర ఊగిసలాటకు లోనవచ్చు.
‘‘ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. మార్కెట్ వ్యాల్యుయేషన్లు సహేతుకంగా ఉన్నాయి. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్‌ఐఐలు ఆసక్తి కనబరుస్తున్నారు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 18000 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే 17650 – 17500 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. ఎగువ స్థాయిలో 18200 – 18250 పాయింట్ల పరిధిని చేధించాల్సి ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ముగింపు
ఈ గురువారం(ఫిబ్రవరి 23న) నిఫ్టీకి చెందిన ఫిబ్రవరి డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,800–18,200 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది.
ప్రపంచ పరిణామాలు
యూరోజోన్‌తో పాటు అమెరికా దేశాల తయారీ, గృహ అమ్మకాల డేటా మంగళవారం విడుదల అవుతుంది. బుధవారం యూరోజోన్ నాన్ మానటరీ పాలసీ సమావేశం ఉంది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ మినిట్స్ గురువారం వెల్లడి కానున్నాయి. అదే రోజున అమెరికా నాలుగో క్వార్టర్ జీడీపీ విడుదల కానున్నాయి. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ ఆర్థిక వ్యవస్థ నుంచి సానుకూల సంకేతాలు వెలువడితే దేశీయ మార్కెట్ ముందడుగు వేస్తుంది. ఇందుకు విరుద్ధంగా బలమైన ఆర్థిక గణాంకాల నమోదు, ద్రవ్యోల్బణ తగ్గుదల కనిపిస్తే ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో మార్కెట్లు పతనాన్ని చవిచూస్తాయి.
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు
ఈ ఏడాది ప్రారంభం నుంచి అమ్మకాలకు పాల్పడిన విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలో రూ.7,600 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఈ ఏడాదిలో ఇప్పటికి వరకు రూ.9,000 కోట్లు ఈక్విటీ షేర్లను కొన్నారు. ‘‘అదానీ సంక్షోభం నుంచి మార్కెట్ తేరుకోవడం ప్రారంభించిన తర్వాత ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు మెరుగయ్యాయి. ఈ పరిణామం దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారు ఆసక్తి కనబరుస్తారనే విషయాన్ని సూచిస్తుంది. అయితే గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు పాల్పడే అవకాశం లేకపోలేదు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
ఆర్‌బీఐ మినిట్స్ వెల్లడి
ఆర్‌బీఐ ఈ ఫిబ్రవరి 6–8 తేదీల మధ్య నిర్వహించిన ద్రవ్య పాలసీ కమిటీ సమావేశపు మినిట్స్(బుధవారం) వెల్లడి కానున్నాయి. పాలసీ విధాన వైఖరిని మరింత లోతుగా విశ్లేషించేందుకు మార్కెట్ వర్గాలు మినిట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అంచనాలకు తగ్గట్టే ఫిబ్రవరిలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ద్రవ్య పరపతి కమిటీ అప్రమత్తంగానే ఉంటుందని, అవసరమైతే కఠిన పాలసీ వైఖరి విధానాన్ని కొనసాగిస్తామని గవర్నర్ వ్యాఖ్యలు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి.
ప్రపంచ పరిణామాలు దారి చూపుతాయ్
Published Mon, Feb 20 2023 6:30 AM | Last Updated on Mon, Feb 20 2023 6:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment