ముంబై: దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం స్టాక్ సూచీలకు ప్రపంచ పరిణామాలు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళిపై దృష్టి సారించవచ్చు. ఈ డిసెంబర్ 5–7 తేదీల మధ్య జరిగిన ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశపు మినిట్స్ (బుధవారం వెల్లడి)ను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేసే అవకాశం ఉంది.
ఆర్‌బీఐ, ఫెడ్ రిజర్వ్, ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లు కీలక వడ్డీరేట్లను అరశాతం మేర పెంచడంతో పాటు రానున్న రోజుల్లో కఠిన ద్రవ్య విధాన వైఖరిని కొనసాగిస్తామనే సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గతవారంలో సెన్సెక్స్ 844 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు చొప్పున క్షీణించాయి.
‘‘ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలు లేకపోవడంతో మార్కెట్లలో స్థిరీకరణ దశ కొనసాగొచ్చు. సంవత్సరాంతపు సెలవుల కారణంగా ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పరిమితంగా ఉంటుంది. కావున ట్రేడింగ్ పరిమిత శ్రేణిలో ఉండొచ్చు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 18,100 వద్ద తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోయితే 18,000 వద్ద మరో తక్షణ మద్దతు స్థాయి లభించొచ్చు. ఎగువున 18,500–18,700 శ్రేణిలో నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు.
ప్రపంచ పరిణామాలు
యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాలసీ కమిటీ సమావేశ ఫలితాల వెల్లడి తర్వాత అమెరికా మార్కెట్లు రెండో దశ అమ్మకాలను ఎదుర్కొంటున్నాయి. యూఎస్ గృహ విక్రయాల డేటా(మంగళవారం), క్యూ3 జీడీపీ, నిరుద్యోగ గణాంకాల(గురువారం)పై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. రేపు యూరోజోన్ కరెంట్ ఖాతా డేటాతో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక వడ్డీ రేట్లను ప్రకటించనుంది. బ్రిటన్ క్యూ3 కరెంట్ ఖాతా లోటు గణాంకాలు గురువారం వెల్లడి కానున్నాయి. కీలకమైన ఈ స్థూల ఆర్థిక గణాంకాల నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు.
రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు
దలాల్ స్ట్రీట్ ఈ వారం రెండు ఐపీఓలు సందడి చేయనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న మూడు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఫిన్ టెక్నాలజీస్ ఐపీఓ రేపు ప్రారంభమై, డిసెంబర్ 21న(బుధవారం) ముగిస్తుంది. ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఇష్యూ 20–22 తేదీల మధ్య జరగనుంది. వైన్ ఉత్పత్తి చేసే శూల వైన్‌యార్డ్స్ లిస్టింగ్ మంగళవారం ఉంది. ఫైనాన్సియల్ సర్వీసెస్ అబాన్స్ హోల్డింగ్స్, ప్రీమియం ఆటోమొబైల్ రీటైలర్ లాండ్‌మార్క్ కార్స్ షేర్లు ఒకేరోజున బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి.
ప్రథమార్థంలో రూ.10,555 కోట్ల పెట్టుబడులు
భారత మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు సానుకూల వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ డిసెంబర్ ప్రథమార్థంలో( 1–16 తేదీల మధ్య) రూ.10,555 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గడం, అమెరికా ద్రవ్యోల్బణం దిగిరావడం ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు. ‘‘ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధాన వైఖరి అమలుకు సిద్ధమైన తరుణంలో రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పరిమితంగా ఉండొచ్చు. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్లపై రాబడులు ఎఫ్‌ఐఐల ట్రెండ్‌ను నిర్ణయిస్తాయి. నవంబర్ మొత్తంలో రూ.36,200 కోట్ల కొనుగోళ్లు చేశారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూ.1.22 లక్షల కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. భారత్‌తో పాటు ఫిలిప్పైన్స్, దక్షిణ కొరియా, తైవాన్, థాయిలాండ్, ఇండోనేషియాలో విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment