Global Index
-
డేటా స్పీడ్‌లో భారత్ జోరు..
న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వేగం 115 శాతం మేర పెరిగింది. దీంతో స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో (ఎస్జీఐ) అత్యంత స్వల్ప సమయంలోనే భారత్ 49 ర్యాంకులు ఎగబాకి 69వ స్థానానికి చేరింది. తద్వారా రష్యా, అర్జెంటీనా వంటి కొన్ని జీ20 దేశాలను కూడా అధిగమించింది. 5జీ సేవల ఆవిష్కరణ తర్వాత భారత్‌లో డేటా స్పీడ్‌కి సంబంధించి నెట్వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ విశ్లేషణ సంస్థ ఊక్లా బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం భారత్‌లో సగటున డౌన్లోడ్ స్పీడ్ 13.87 ఎంబీపీఎస్ నుంచి (2022 సెప్టెంబర్) 115 శాతం వృద్ధి చెంది 29.85 ఎంబీపీఎస్‌కు (2023 జనవరి) పెరిగింది. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఎస్‌జీఐలో 118వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది జనవరిలో 69వ స్థానానికి చేరింది. త్వరలోనే బ్రెజిల్ (35.85 ఎంబీపీఎస్, 57వ ర్యాంకు)ను కూడా అధిగమించనుంది. జియో టాప్.. జనవరిలో జియో 5జీ స్పీడ్ హిమాచల్ ప్రదేశ్‌లో సగటున 246.49 ఎంబీపీఎస్ నుంచి కోల్‌కతాలో 506.25 ఎంబీపీఎస్‌గా నమోదైంది. అలాగే ఎయిర్టెల్ 5జీ యూజర్లకు కోల్‌కతాలో సగటున 78.13 ఎంబీపీఎస్, ఢిల్లీలో 268.89 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా లభించింది. ఇక గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మద్య కాలంలో వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 5జీ లాంచ్ తర్వాత ఇది మరింత వేగవంతమయ్యింది. -
ప్రపంచ పరిణామాలు దారి చూపుతాయ్
ముంబై: దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో ఈ వారం స్టాక్ సూచీలకు ప్రపంచ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరి డెరివేటివ్స్ ఎక్స్పైరీ(గురువారం) ముగింపు ఉండటంతో ఒడిదుడుకుల ట్రేడింగ్ ఆస్కారం ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళిపై దృష్టి సారించవచ్చు. ఇదే వారంలో వెలువడనున్న ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశపు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు. ఆశాజన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు కలిసిరావడంతో గతవారంలో సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. సూచీలు అరశాతం బలపడినా.., కఠిన ద్రవ్య విధాన అమలు భయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు ప్రభావంతో సూచీలు తీవ్ర ఊగిసలాటకు లోనవచ్చు. ‘‘ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. మార్కెట్ వ్యాల్యుయేషన్లు సహేతుకంగా ఉన్నాయి. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి కనబరుస్తున్నారు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 18000 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే 17650 – 17500 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. ఎగువ స్థాయిలో 18200 – 18250 పాయింట్ల పరిధిని చేధించాల్సి ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు ఈ గురువారం(ఫిబ్రవరి 23న) నిఫ్టీకి చెందిన ఫిబ్రవరి డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,800–18,200 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ప్రపంచ పరిణామాలు యూరోజోన్‌తో పాటు అమెరికా దేశాల తయారీ, గృహ అమ్మకాల డేటా మంగళవారం విడుదల అవుతుంది. బుధవారం యూరోజోన్ నాన్ మానటరీ పాలసీ సమావేశం ఉంది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ మినిట్స్ గురువారం వెల్లడి కానున్నాయి. అదే రోజున అమెరికా నాలుగో క్వార్టర్ జీడీపీ విడుదల కానున్నాయి. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ ఆర్థిక వ్యవస్థ నుంచి సానుకూల సంకేతాలు వెలువడితే దేశీయ మార్కెట్ ముందడుగు వేస్తుంది. ఇందుకు విరుద్ధంగా బలమైన ఆర్థిక గణాంకాల నమోదు, ద్రవ్యోల్బణ తగ్గుదల కనిపిస్తే ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో మార్కెట్లు పతనాన్ని చవిచూస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి అమ్మకాలకు పాల్పడిన విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలో రూ.7,600 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఈ ఏడాదిలో ఇప్పటికి వరకు రూ.9,000 కోట్లు ఈక్విటీ షేర్లను కొన్నారు. ‘‘అదానీ సంక్షోభం నుంచి మార్కెట్ తేరుకోవడం ప్రారంభించిన తర్వాత ఎఫ్ఐఐల కొనుగోళ్లు మెరుగయ్యాయి. ఈ పరిణామం దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారు ఆసక్తి కనబరుస్తారనే విషయాన్ని సూచిస్తుంది. అయితే గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు పాల్పడే అవకాశం లేకపోలేదు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఆర్బీఐ మినిట్స్ వెల్లడి ఆర్బీఐ ఈ ఫిబ్రవరి 6–8 తేదీల మధ్య నిర్వహించిన ద్రవ్య పాలసీ కమిటీ సమావేశపు మినిట్స్(బుధవారం) వెల్లడి కానున్నాయి. పాలసీ విధాన వైఖరిని మరింత లోతుగా విశ్లేషించేందుకు మార్కెట్ వర్గాలు మినిట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అంచనాలకు తగ్గట్టే ఫిబ్రవరిలో ఆర్బీఐ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే ద్రవ్యోల్బణం విషయంలో ద్రవ్య పరపతి కమిటీ అప్రమత్తంగానే ఉంటుందని, అవసరమైతే కఠిన పాలసీ వైఖరి విధానాన్ని కొనసాగిస్తామని గవర్నర్ వ్యాఖ్యలు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. -
Global Index: భారీగా సంపద కోల్పోయిన అదానీ.. ర్యాంకు ఢమాల్!
ముంబై: నిన్నా మొన్నటి వరకు ఆసియాలోనే రెండో ధనవంతుడి స్థానం దక్కించుకున గౌతమ్ అదానీ తాజాగా ఆ స్థానం చేజార్చుకున్నారు. అదానీ గ్రూపుతో సంబంధం ఉన్న మూడు కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ అవడంతో ఒక్కసారిగా ఆయన సంపద ఆవిరైపోయింది. దీంతో అదానీని వెనక్కి నెట్టి చైనాకు చెందిన జాంగ్ షాన్షాన్ రెండో స్థానం దక్కించుకున్నారు. ప్రపంచంలో బిలియనీర్ల సంపదను ఎప్పటికప్పుడు అంచనా వేసే గ్లోబల్ ఇండెక్స్ తాజా జాబితా అదానికి షాక్ ఇచ్చింది. ఆసియాలోనే అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రథమ స్థానంలో ఉండగా అనతి కాలంలోనే అదాని రెండో స్థానానికి చేరుకున్నారు. పోర్టు బిజినెస్‌లలో అదానీ గ్రూపు చూపిన దూకుడుతో ఆ కంపెనీ షేర్లు అనూహ్యంగా పెరిగాయి. అదాని గ్రూపులన్నీ కలిసి అతి తక్కువ కాలంలో వంది బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్‌ని దాటాయి. అదానీ ప్రభ వెలిగిపోతున కాలంలో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీపీ) ఇచ్చిన షాక్‌తో అదానీ స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి. గత సోమవారం అదానీ గ్రూపుకి సంబంధించిన 3 కంపెనీల బ్యాంకు అకౌంటర్లను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీపీ) సీజ్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆయన సంపద 77 బిలియన్ డాలర్ల నుంచి 63 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజు వ్యవధిలోనే 14 బిలియన్ల డాలర్ల సంపద ఆవిరైపోయింది. చదవండి : ClubHouse Vs FaceBook : ఎవరి మాట నెగ్గేను ? -
విదేశీ పెట్టుబడులకు చర్యలు: శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ సత్వర చర్యలను పూనుకుంటోంది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందకు కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా విదేశీ మదుపర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ బాండ్లను అంతర్జాతీయ సూచీలో ప్రవేశపెట్టడానికి చర్చలు కొనసాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ సూచీలో విదేశీ నిధులు తప్పనిసరి కావడంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఈ చర్యల వల్ల విదేశీ నిధులు దేశంలోకి ప్రవేశించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అంతర్జాతీయ సూచీలో అత్యధిక విదేశీ నిధులు పొందుతున్న దేశాల నిపుణులతో చర్చిస్తున్నామని, దేశీయ ప్రభుత్వ బాండ్ల ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. ఆర్థిక వ్యవస్థను బలపరిచే క్రమంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)లో నిధులు ప్రవాహాన్ని విశ్లేషిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న విదేశీ పెట్టుబడుదారుల సలహాను ఈ ఏడాది బడ్జెట్లో ప్రస్తావించినట్టు శక్తికాంత దాస్ గుర్తు చేశారు. ఈ పనిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో రుణ వృద్ధి లేకపోవడం వల్ల బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని, వీటన్నింటికి పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ)ను ప్రారంభించిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చదవండి: త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్ -
మరో కీలక మద్దతు 23,736
మార్కెట్ పంచాంగం 2008 జనవరి తర్వాత అంతటి తీవ్రతతో ఈ జనవరిలో గ్లోబల్ సూచీలు పతనమవుతున్నాయి. మొన్న టి వరకూ చైనా మాంద్య భయాలు మార్కెట్లను వెంటాడగా, ఇప్పుడు అమెరికా వృద్ధి పట్ల కూడా విశ్లేషకుల్లో సందేహాలు తలెత్తాయి. ఈ వారంలోనే చైనా, అమెరికా జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. ఆ గణాంకాలు ఇన్వెస్టర్లను ఏ మాత్రం నిరుత్సాహపర్చినా మార్కెట్లు మరింత క్షీణించే ప్రమాదం వుంది. భారత్ వృద్ధి పట్ల గ్లోబల్ ఏజెన్సీలు ఆశావహ అంచనాల్ని వెలువరిస్తున్నా, అంతర్జాతీయ ట్రెండ్‌కు మన మార్కెట్లు మినహాయింపు కాదు. ఎందుకంటే దేశీయ మ్యూచువల్ ఫండ్స్ భారీ పెట్టుబడులు పెడుతున్నా, భారత్ మార్కెట్లను విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా శాసించగలిగేస్థాయిలోనే వున్నారు. సెన్సెక్స్ సాంకేతికాంశాలు జనవరి 15తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 24,455 వద్ద క్లోజయ్యింది. గత వారం మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా 24,800 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోయినంతనే 24,400-24,500 పాయింట్ల శ్రేణికి పతనమై, వరుసగా రెండు రోజులపాటు షార్ట్ కవరింగ్ ర్యాలీలు జరిపింది. మూడవరోజు మాత్రం కనిష్టస్థాయిలో ముగియడం ద్వారా మరింత పతనానికి సంకేతాలిచ్చింది. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో సెన్సెక్స్ మొదలైతే 24,100 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున 23,736 పాయింట్ల మద్దతు సెన్సెక్స్‌కు కీలకమైనది. 2013 ఆగస్టు కనిష్టస్థాయి 17,448 నుంచి ఈ ఏడాది మార్చినాటి రికార్డుస్థాయి 30,025 వరకూ జరిగిన 12,577 పాయింట్ల ర్యాలీలో 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 23,736 పాయింట్లు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో నష్టపోతే రానున్న వారాల్లో 22,000 పాయింట్ల స్థాయివరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం రెండో మద్దతు స్థాయిని సెన్సెక్స్ పరిరక్షించుకోగలిగితే 24,960 పాయింట్ల తొలి అవరోధస్థాయివరకూ పెరగవచ్చు. అటుపైన క్రమేపీ 25,230-25,350 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన స్థిరపడితే 25,700 వరకూ పెరిగే ఛాన్స్ వుంటుంది. తదుపరి మద్దతు శ్రేణి 7,350-7,220 ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 163 పాయింట్ల నష్టంతో 7.438 పాయింట్ల వద్ద ముగిసింది. గత మార్కెట్ పంచాంగంలో సూచిం చినట్లు ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,540 మద్దతును కోల్పోగానే 7,420-7,500 పాయింట్ల మధ్య పతనమైనా, అదే శ్రేణి వద్ద వరుసగా మూడురోజులపాటు మద్దతు పొందగలిగింది. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైతే ఈ మద్దతును కూడా కోల్పోతుంది. ఫలితంగా తదుపరి 7,350-7,220 పాయింట్ల శ్రేణి మధ్య మరో మద్దతు లభ్యమవుతున్నది. ఈ స్థాయిని కోల్పోతే కీలకమైన 7,120 పాయింట్ల స్థాయికి (గత సంవత్సరాల్లో 5,118 పాయింట్ల నుంచి 9,119 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీలో 50% రిట్రేస్‌మెంట్ స్థాయి ఇది) పడిపోవొచ్చు. బీజేపీ ప్రభుత్వం 2014 మే నెలలో అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన ర్యాలీ, అటుపై జరిగిన చిన్న సర్దుబాటు సందర్భంగా ఇదే స్థాయి మద్దతుగా నిల్చినందున, రానున్న రోజుల్లో ఈ మద్దతు నిఫ్టీకి కీలకం. ఈ మద్దతును వదులుకుంటే కొద్ది వారాల్లో 6,600 స్థాయికి పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ వారం తొలి శ్రేణి వద్ద మద్దతు పొందగలిగితే క్రమేపీ 7,600 పాయింట్ల నిరోధస్థాయికి పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 7,675-7,720 శ్రేణిని పరీక్షంచవచ్చు. అటుపైన కొద్ది రోజుల్లో క్రమేపీ 7,800 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. 2014 మే నుంచి 2015 మార్చివరకూ జరిగిన ర్యాలీ సందర్భంగా సెన్సెక్స్‌కంటే నిఫ్టీ 4 శాతం అధికంగా పెరిగినందున, టెక్నికల్ సపోర్టుల్లో ఈ రెండు సూచీలకు సంబంధించి కాస్త హెచ్చుతగ్గులు ఏర్పడిన సంగతి గమనార్హం.