న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్‌బీఐ సత్వర చర్యలను పూనుకుంటోంది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందకు కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా విదేశీ మదుపర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ బాండ్లను అంతర్జాతీయ సూచీలో ప్రవేశపెట్టడానికి చర్చలు కొనసాగుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ సూచీలో విదేశీ నిధులు తప్పనిసరి కావడంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఈ చర్యల వల్ల విదేశీ నిధులు దేశంలోకి ప్రవేశించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అంతర్జాతీయ సూచీలో అత్యధిక విదేశీ నిధులు పొందుతున్న దేశాల నిపుణులతో చర్చిస్తున్నామని, దేశీయ ప్రభుత్వ బాండ్ల ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు.
ఆర్థిక వ్యవస్థను బలపరిచే క్రమంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లో నిధులు ప్రవాహాన్ని విశ్లేషిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న విదేశీ పెట్టుబడుదారుల సలహాను ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రస్తావించినట్టు శక్తికాంత దాస్ గుర్తు చేశారు. ఈ పనిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో రుణ వృద్ధి లేకపోవడం వల్ల బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని, వీటన్నింటికి పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ)ను ప్రారంభించిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment