మార్కెట్ పంచాంగం
2008 జనవరి తర్వాత అంతటి తీవ్రతతో ఈ జనవరిలో గ్లోబల్ సూచీలు పతనమవుతున్నాయి. మొన్న టి వరకూ చైనా మాంద్య భయాలు మార్కెట్లను వెంటాడగా, ఇప్పుడు అమెరికా వృద్ధి పట్ల కూడా విశ్లేషకుల్లో సందేహాలు తలెత్తాయి. ఈ వారంలోనే చైనా, అమెరికా జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. ఆ గణాంకాలు ఇన్వెస్టర్లను ఏ మాత్రం నిరుత్సాహపర్చినా మార్కెట్లు మరింత క్షీణించే ప్రమాదం వుంది. భారత్ వృద్ధి పట్ల గ్లోబల్ ఏజెన్సీలు ఆశావహ అంచనాల్ని వెలువరిస్తున్నా, అంతర్జాతీయ ట్రెండ్‌కు మన మార్కెట్లు మినహాయింపు కాదు. ఎందుకంటే దేశీయ మ్యూచువల్ ఫండ్స్ భారీ పెట్టుబడులు పెడుతున్నా, భారత్ మార్కెట్లను విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా శాసించగలిగేస్థాయిలోనే వున్నారు.
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
జనవరి 15తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 24,455 వద్ద క్లోజయ్యింది. గత వారం మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా 24,800 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోయినంతనే 24,400-24,500 పాయింట్ల శ్రేణికి పతనమై, వరుసగా రెండు రోజులపాటు షార్ట్ కవరింగ్ ర్యాలీలు జరిపింది. మూడవరోజు మాత్రం కనిష్టస్థాయిలో ముగియడం ద్వారా మరింత పతనానికి సంకేతాలిచ్చింది. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో సెన్సెక్స్ మొదలైతే 24,100 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున 23,736 పాయింట్ల మద్దతు సెన్సెక్స్‌కు కీలకమైనది. 2013 ఆగస్టు కనిష్టస్థాయి 17,448 నుంచి ఈ ఏడాది మార్చినాటి రికార్డుస్థాయి 30,025 వరకూ జరిగిన 12,577 పాయింట్ల ర్యాలీలో 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 23,736 పాయింట్లు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో నష్టపోతే రానున్న వారాల్లో 22,000 పాయింట్ల స్థాయివరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం రెండో మద్దతు స్థాయిని సెన్సెక్స్ పరిరక్షించుకోగలిగితే 24,960 పాయింట్ల తొలి అవరోధస్థాయివరకూ పెరగవచ్చు. అటుపైన క్రమేపీ 25,230-25,350 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన స్థిరపడితే 25,700 వరకూ పెరిగే ఛాన్స్ వుంటుంది.
తదుపరి మద్దతు శ్రేణి 7,350-7,220
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 163 పాయింట్ల నష్టంతో 7.438 పాయింట్ల వద్ద ముగిసింది. గత మార్కెట్ పంచాంగంలో సూచిం చినట్లు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,540 మద్దతును కోల్పోగానే 7,420-7,500 పాయింట్ల మధ్య పతనమైనా, అదే శ్రేణి వద్ద వరుసగా మూడురోజులపాటు మద్దతు పొందగలిగింది. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైతే ఈ మద్దతును కూడా కోల్పోతుంది. ఫలితంగా తదుపరి 7,350-7,220 పాయింట్ల శ్రేణి మధ్య మరో మద్దతు లభ్యమవుతున్నది. ఈ స్థాయిని కోల్పోతే కీలకమైన 7,120 పాయింట్ల స్థాయికి (గత సంవత్సరాల్లో 5,118 పాయింట్ల నుంచి 9,119 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీలో 50% రిట్రేస్‌మెంట్ స్థాయి ఇది) పడిపోవొచ్చు. బీజేపీ ప్రభుత్వం 2014 మే నెలలో అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన ర్యాలీ, అటుపై జరిగిన చిన్న సర్దుబాటు సందర్భంగా ఇదే స్థాయి మద్దతుగా నిల్చినందున, రానున్న రోజుల్లో ఈ మద్దతు నిఫ్టీకి కీలకం. ఈ మద్దతును వదులుకుంటే కొద్ది వారాల్లో 6,600 స్థాయికి పతనమయ్యే ప్రమాదం వుంటుంది.
ఈ వారం తొలి శ్రేణి వద్ద మద్దతు పొందగలిగితే క్రమేపీ 7,600 పాయింట్ల నిరోధస్థాయికి పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 7,675-7,720 శ్రేణిని పరీక్షంచవచ్చు. అటుపైన కొద్ది రోజుల్లో క్రమేపీ 7,800 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. 2014 మే నుంచి 2015 మార్చివరకూ జరిగిన ర్యాలీ సందర్భంగా సెన్సెక్స్‌కంటే నిఫ్టీ 4 శాతం అధికంగా పెరిగినందున, టెక్నికల్ సపోర్టుల్లో ఈ రెండు సూచీలకు సంబంధించి కాస్త హెచ్చుతగ్గులు ఏర్పడిన సంగతి గమనార్హం.
మరో కీలక మద్దతు 23,736
Published Mon, Jan 18 2016 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM
Advertisement
Advertisement