లాభాలకు అవకాశం | Stock Market Experts Views and Advice, and Jerome Powell speech | Sakshi
Sakshi News home page

లాభాలకు అవకాశం

Published Mon, Mar 6 2023 5:53 AM | Last Updated on Mon, Mar 6 2023 5:53 AM

Stock Market Experts Views and Advice, and Jerome Powell speech - Sakshi

ముంబై: ట్రేడింగ్‌ నాలుగురోజులే ఈ వారంలో స్టాక్‌ సూచీలు లాభాలు ఆర్జించే వీలుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ప్రధాన వార్తలు లేనందున ఇన్వెస్టర్లు ప్రపంచ పరిణామాలపై దృష్టి సారించవచ్చు. ముఖ్యంగా ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ టెస్టిమోనీ ప్రసంగం భారత్‌ తో పాటు ఈక్విటీ మార్కెట్లకు కీలకం కానుంది. అమెరికా మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణిని మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలు, బాండ్లపై రాబడులు, తదితర సాధారణ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. బీఎస్‌ఈ కరెన్సీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ వేళలను నేటి నుంచి (ప్రస్తుతం ఉన్న మధ్యాహ్నం 3.30 గంటల నుంచి) సాయంత్రం 5.00 గంటల వరకు పొడగించడమైంది.

నష్టాల నుంచి తేరుకున్న స్టాక్‌ సూచీలు గతవారం కొంతమేర రికవరీ అయ్యాయి. సెన్సెక్స్‌ 345 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు స్వల్పంగా లాభపడ్డాయి.  

ట్రేడింగ్‌ నాలుగు రోజులే  
హోళీ సందర్భంగా మంగళవారం స్టాక్‌ ఎక్చ్సేంజీలకు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగురోజులకే పరిమితం కానుంది. కమోడిటీ మార్కెట్‌ తొలి సెషన్‌లో పనిచేయదు. సాయంత్రం సెషన్‌ (సాయంత్రం 5గంటల నుంచి 11:55 గంటకు వరకు)లో ట్రేడింగ్‌ జరుగుతుంది. అగ్రి కమోడిటీ ఇండెక్స్‌ రెండు సెషన్లలోనూ పనిచేయదు. ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం యథావిధిగా ప్రారంభవుతాయి.
‘‘మార్కెట్లో రికవరీ సూచీలపై కొంత ఒత్తిడిని తగ్గించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు రాణించడం ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే. అయితే ఐటీ, ఆటో, ఇంధన షేర్లు కూడా పుంజుకోవాల్సిన అవశ్య కత ఎంతైనా ఉంది. ఇటీవల నిఫ్టీ 200 డేస్‌ మూ వింగ్‌ యావరేజ్‌ అధిగమించగలిగింది.      

తక్షణ నిరోధం 17,750...
ప్రస్తుతం 17,750 వద్ద తక్షణ నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీ జరిగి 17,900 స్థాయిని అందుకోవచ్చు. అనూహ్యంగా దిద్దుబాటుకు లోనైతే 17500 – 17350 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. మిశ్రమ సంకేతాలు నెలకొన్న తరుణంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ లిమిటెడ్‌ సీనియర్‌ సాంకేతిక విశ్లేషకుడు పర్వేష్‌ గౌర్‌ తెలిపారు.

మంగళవారం పావెల్‌ టెస్టిమోనీ ప్రసంగం
ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సెనెట్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఎదుట మంగళవారం, హౌసింగ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కమిటీ ఎదుట బుధవారం యూఎస్‌ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ) వివరణ ఇవ్వనున్నారు. పావెల్‌ ప్రసంగంతో అమెరికా ఆర్థిక అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, వడ్డీరేట్ల సైకిల్‌ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పావెల్‌ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.

ప్రపంచ పరిణామాలు  
బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ద్రవ్య పాలసీ నిర్ణయాలు, చైనా సీపీఐ, బ్రిటన్‌ పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు అమెరికా ఫ్యాక్టరీ ఆర్డర్, యూరో జోన్‌ ఎస్‌అండ్‌పీ కన్‌స్ట్రక్షన్‌ పీఐఎం, రిటైల్‌ గణాంకాలు వెల్లడి కానున్నాయి. అలాగే జపాన్‌ కరెంట్‌ అకౌంట్, చైనా బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్, ద్రవ్యోల్బణం, పీపీఐ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్ల ఈల్డ్స్‌(దిగుమతులు) కొన్నేళ్ల గరిష్టాలను చేరుకున్నాయి. అయితే అమెరికా ఆర్థిక వృద్ధి నమోదు కారణంగా డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడంతో బాండ్లపై రాబడులు కొంత నెమ్మదించాయి.

మూడు రోజుల్లో రూ.8,300 కోట్ల కొనుగోళ్లు
విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చి మొదటి మూడు ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.8,300 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. గతవారంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ అదానీ గ్రూప్‌ నాలుగు కంపెనీ షేర్లలో 1.87 బిలియన్‌ (రూ. 15,280 కోట్లు) డాలర్లు భారీ పెట్టుబడిని పెట్టడంతో ఎఫ్‌ఐఐల నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా ప్రకారం ఎఫ్‌ఐఐలు ఫిబ్రవరి రూ.5,249 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ‘‘ఈ మార్చిలోనూ విదేశీ అమ్మకాలు కొనసాగవచ్చు. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్ల ఈల్డ్స్‌(దిగుమతులు) కొన్నేళ్ల గరిష్టాలను చేరుకున్నాయి. ఈక్విటీలతో పోలిస్తే రిస్క్‌ సామర్థ్యం తక్కువగా ఉండే బాండ్లపై పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement