ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్ అనేదేమీ టైమ్‌పాస్‌గా చేసే ఆషామాషీ వ్యవహారం కాదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అశ్వని భాటియా వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీన్ని మరింత సీరియస్‌గా తీసుకోవాలని మార్నింగ్‌స్టార్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు.
సెబీ అధ్యయనం ప్రకారం సంస్థాగత ఇన్వెస్టర్లే ఎఫ్‌అండ్‌వోలో లాభపడుతుండగా, 93 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని వెల్లడైన విషయాన్ని భాటియా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే చిన్న మదుపరుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను కట్టడి చేసేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలను ఇన్వెస్టర్లు వ్యతిరేకిస్తుండటం సరికాదని ఆయన తెలిపారు.
2020లో కరోనా వైరస్ మహమ్మారి తర్వాత నుంచి ఎఫ్ అండ్ ఓలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అయితే, ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మంచిదేమీ కాదని, ఆందోళనకరమని భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘అంతర్జాతీయంగా నమోదయ్యే డెరివేటివ్స్ వాల్యూమ్స్‌లో సగభాగం పైగా వాటా భారత్‌దే ఉండటం గొప్పగా అనిపించినా, ఇది మనం ధరించడానికి ఇష్టపడని కిరీటంలాంటిది’’ అని వ్యాఖ్యానించారాయన.
మరోవైపు, ఎస్‌ఎంఈ ఐపీవోల విషయంలో అసంబద్ధమైన హంగామాను నివారించేందుకు, ధరల్లో అవకతవకలు జరగకుండా చూసేందుకు నియంత్రణ సంస్థ, స్టాక్ ఎక్స్చేంజీలు ఈ విభాగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయని భాటియా తెలిపారు. త్వరలోనే సెబీ దీనిపై ఒక చర్చాపత్రాన్ని కూడా ప్రవేశపెట్టనుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment