పీఎం జన ఆరోగ్య యోజన పథకం
ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేదు
రూ. 5 లక్షల హెల్త్ కవరేజీ...
ఇదొక్కటి చాలు అనుకోకూడదు
ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా అవసరమే
ఒక్కసారి ఆస్పత్రి పాలైతే.. కొన్నేళ్ల పాటు కూడబెట్టుకున్నదంతా కరిగిపోయే పరిస్థితి. ఖరీదైన వైద్యం కారణంగా అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరోనా అప్పుడు ఇదే చూశాం. ఈ పరిస్థితి రాకూడదంటే ముందస్తుగా బీమా రక్షణ కలి్పంచుకోవడమే మార్గం. కానీ, వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్లు నిండిన వృద్ధులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన’ (ఏబీ–పీఎంజేఏవై) కింద ఉచితంగా ఆరోగ్య బీమా అందిస్తున్నట్టు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద పేదలు, తక్కువ ఆదాయ వర్గాలకే ఉచిత ప్రయోజనం అందుతోంది. ఇకపై ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పీఎం జేఏవై కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీ లభించనుంది. అతి త్వరలోనే అమల్లోకి రానున్న ఈ పథకం గురించి అవగాహన కల్పించే కథనమే ఇది.
పీఎంజేఏవై పథకం కింద రూ.5,00,000 సమగ్రమైన కవరేజీ లభిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు అయ్యే వైద్య పరమైన ఖర్చుల (డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్స్ పరీక్షలు)కు సైతం కవరేజీ ఉంటుంది. చికిత్సా సమయంలో ఔషధాలు, కన్జ్యూమబుల్స్ కూడా ఉచితమే. చికిత్సలో భాగంగా వేసే స్టెంట్‌లు, పేస్‌మేకర్ల వంటి వాటికీ కవరేజీ లభిస్తుంది. ఐసీయూ, జనరల్ వార్డ్‌లో ఉండి తీసుకునే చికిత్సలకు పరిహారం అందుతుంది. రోగికి చికిత్సా సమయంలో ఉచితంగానే ఆహారం అందిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 రోజుల పాటు చికిత్సకు సంబంధించిన వ్యయాలకు చెల్లింపులు లభిస్తాయి.
ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన మొదటి రోజు నుంచే అన్ని రకాల (ఎంపిక చేసిన) చికిత్సలకు ఉచితంగా కవరేజీ అమల్లోకి వస్తుంది. అంటే ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం ఈ పథకం కింద చికిత్స తీసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే షరతుల్లేవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,350 మెడికల్ ప్యాకేజీలకు కవరేజీ లభిస్తోంది. 70 ఏళ్లు నిండిన వృద్ధులకు సంబంధించి పథకంలో భాగంగా ఏఏ చికిత్సలకు కవరేజీ లభిస్తుందన్నది ప్రభుత్వ నోటిఫికేషన్‌తోనే స్పష్టత వస్తుంది.
అర్హత?
70 ఏళ్లు నిండి, ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీకి అర్హులే. పీఎంజేఏవై కింద ఇప్పటికే రూ.5 లక్షల కవరేజీ కలిగిన కుటుంబాల విషయానికొస్తే.. ఆయా కుటుంబాల్లోని 70 ఏళ్లు నిండిన వారు అదనంగా రూ.5 లక్షల హెల్త్ టాపప్ (కవరేజీ)ను పొందేందుకు అర్హులు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్‌ఎస్), ఎక్స్ సరీ్వస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్‌ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) కింద కవరేజీ ఉన్న వారు ఎప్పటి మాదిరే అందులో కొనసాగొచ్చు. లేదా వాటి నుంచి పీఎంజేఏవైకు మారొచ్చు. ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నవారు, ఈఎస్‌ఐ కింద కవరేజీ కలిగిన వారు, వీటితోపాటు అదనంగా పీఎంజేఏవై కవరేజీకి సైతం అర్హులే.
దరఖాస్తు ఎలా..?
పీఎంజేఏవై డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్ లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, 70 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అతి త్వరలోనే ఇది ఆరంభం కానుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి, అనంతరం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళికగా ఉంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్‌ఏ/ఆభా) కలిగి ఉంటే, ఈ బీమా ఉచితమని అనుకోవద్దు. ఆభా అన్నది డిజిటల్ రూపంలో హెల్త్ రికార్డులు భద్రపరుచుకునేందుకు ఉపయోగపడే ఖాతా. తమ హెల్త్ రిపోర్ట్‌లను ఈ ఖాతాలోకి ఉచితంగా అప్‌లోడ్ చేసుకుని, వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు వాటిని డిజిటల్ రూపంలోపంచుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో డిజిటల్ హెల్త్ రికార్డులను పొందొచ్చు. ఆభాతో సంబంధం లేకుండా పీఎంజేఏవై కింద రూ.5 లక్షల కవరేజీకి విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారు, పీఎంజేఏవై కింద ఇప్పటికే హెల్త్ కవరేజీ పొందుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.
అందరికీ అనుకూలమేనా?
70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఆరోగ్య బీమా సరిపోకపోవచ్చు. ఆస్పత్రి బిల్లులు ∙రూ.5 లక్షలకే పరిమితం కావాలని లేదు. విడిగా తమ ఆరోగ్య చరిత్ర ఆధారంగా, వాటికి కవరేజీతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అవసరం. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ పరిధిలోని ప్యాకేజీ వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. అప్పుడు అందులో లేని చికిత్సలకు కవరేజీనిచ్చే ప్లాన్‌ను విడిగా తీసుకోవచ్చు. వృద్ధులు ఆయుష్మాన్ భారత్ కవరేజీని అదనపు రక్షణగానే చూడాలన్నది నిపుణుల సూచన. అంటే విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.
అప్పుడు సమగ్రమైన రక్షణతో నిశ్చి తంగా ఉండొచ్చన్నది నిపుణుల సూచన. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితం కనుక.. పథకం కింద చికిత్సలకు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చు. మన దేశంలో ఆస్పత్రి పడకల సగటు చాలా తక్కువ. కనుక తమవంతు చికిత్స కోసం వేచి చూడాల్సి రావచ్చు. ఇది నచ్చని వారు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు విడిగా హెల్త్ ప్లాన్ వీలు కలి్పస్తుంది. ప్రభుత్వ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలో సింగిల్ ప్రైవేటు రూమ్‌కు అవకాశం ఉండదు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల డబ్బులతో అందిస్తున్న ఉచిత ఆరోగ్య పథకంలో ప్రీమియం సదుపాయాల కల్పన కష్టం. ఒకవేళ ప్రైవేటు రూమ్ తీసుకునేట్టు అయితే, తమ జేబు నుంచి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.
ఆర్థిక భారం పడకుండా..
ఉన్నట్టుండి అత్యవసర వైద్యం అవసరమైతే సమీపంలోని ప్చైవేటు ఆస్పత్రిలో చేరి్పంచాల్సి రావచ్చు. అప్పుడు విడిగా హెల్త్‌ప్లాన్ లేకుంటే ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల చికిత్సలకు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుంటారు. అలా ఎంపిక చేసుకునే హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ నెట్‌వర్క్ పరిధిలో లేకపోవచ్చు. విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు పరిష్కారం చూపుతుంది. ప్రైవేటు హెల్త్ ప్లాన్‌లో నాన్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నా, తర్వాత రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కింద రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం లేదు.
కేవలం నగదు రహిత వైద్యమే అందుతుంది. టాప్ రేటెడ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు, ప్రభుత్వ పథకంలో కవరేజీ లేని మరిన్ని రకాల చికిత్సలకు విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అవకాశం లభిస్తుంది. ప్రైవేటు బీమా సంస్థలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో హాప్పిటల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంటాయి. ‘‘దీర్ఘకాలిక వ్యాధులు లేదా సర్జరీలు, కేన్సర్ తదితర చికిత్సల్లో అధిక సమ్ ఇన్షూర్డ్ (బీమా రక్షణ) ఉండటం వృద్ధులకు ఎంతో కీలకం. వ్యాధులతో బాధపడే వారు స్వతంత్రంగా హెల్త్ కవరేజీ కలిగి ఉండాలి. వృద్ధాప్యంతో అనారోగ్యాలకు ప్రత్యేకమైన చికిత్స అవసరం. అందుకు రూ.5 లక్షల కవరేజీ సరిపోదు. వయసుమీద పడడం వల్ల వచ్చే అనారోగ్యాలకు కొన్సి సందర్భాల్లో ఖరీదైన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆరి్థక భారం పడుతుంది’’ అని పాలసీబజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ చాబ్రా
వివరించారు.
30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్
పీఎంజేఏవై కింద దేశవ్యాప్తంగా 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్ అయ్యాయి. ఇందులో 13,466 ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కానీ, అన్నీ యాక్టివ్‌గా లేవు. యాక్టివ్ హాస్పిటల్ అంటే గడిచిన 45 రోజుల్లో ఆయా ఆస్పత్రుల నుంచి కనీసం ఒక పేషెంట్ అయినా డిశ్చార్జ్ అయి ఉండాలి. యాక్టివ్ ఆస్పత్రులు కేవలం 3,000 మాత్రమే ఉన్నాయి. పైగా ఎంప్యానెల్ అయిన ఆస్పత్రులు అన్నీ కూడా అన్ని రకాల చికిత్సలను ఆఫర్ చేయడం లేదన్నది గుర్తు పెట్టుకోవాలి. అంటే పీఎం జేఏవై కింద ఎంపిక చేసిన ప్యాకేజీలలో కొన్నింటినే ఆఫర్ చేసే వెసులుబాటు ఆస్పత్రులకు ఉంటుంది.
మరో మార్గం?
పీఎం జేఏవై కింద రూ.5 లక్షల కవరేజీ తీసుకున్న వారు.. విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లించే స్థోమత లేకపోతే ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్‌కు బదులు సూపర్ టాపప్ మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షలు డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఏదైనా ఒక సంవత్సరంలో ఆస్పత్రి బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తుంది. ఒక్కసారి అడ్మిషన్‌లో రూ.5 లక్షలకు మించి బిల్లు రావాలని లేదు. రెండు మూడు సార్లు చేరి చికిత్స తీసుకుని, మొత్తం బిల్లులు రూ.5 లక్షలు దాటినా సరే సూపర్ టాపప్ కింద పరిహారం పొందొచ్చు. పైగా బేసిక్ హెల్త్ ప్లాన్‌తో పోలి్చతే, సూపర్ టాపప్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమ ఆరోగ్య సమస్యలకు మెరుగైన రక్షణ దిశగా వృద్ధులు ప్రణాళిక రూపొందించుకోవాలి.
–సాక్షి, బిజినెస్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment