Pradhan Mantri Jan Arogya Yojna
-
70 ఏళ్లు నిండిన వారికి ఉచిత బీమా!
ఒక్కసారి ఆస్పత్రి పాలైతే.. కొన్నేళ్ల పాటు కూడబెట్టుకున్నదంతా కరిగిపోయే పరిస్థితి. ఖరీదైన వైద్యం కారణంగా అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరోనా అప్పుడు ఇదే చూశాం. ఈ పరిస్థితి రాకూడదంటే ముందస్తుగా బీమా రక్షణ కలి్పంచుకోవడమే మార్గం. కానీ, వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్లు నిండిన వృద్ధులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన’ (ఏబీ–పీఎంజేఏవై) కింద ఉచితంగా ఆరోగ్య బీమా అందిస్తున్నట్టు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద పేదలు, తక్కువ ఆదాయ వర్గాలకే ఉచిత ప్రయోజనం అందుతోంది. ఇకపై ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పీఎం జేఏవై కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీ లభించనుంది. అతి త్వరలోనే అమల్లోకి రానున్న ఈ పథకం గురించి అవగాహన కల్పించే కథనమే ఇది. పీఎంజేఏవై పథకం కింద రూ.5,00,000 సమగ్రమైన కవరేజీ లభిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు అయ్యే వైద్య పరమైన ఖర్చుల (డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్స్ పరీక్షలు)కు సైతం కవరేజీ ఉంటుంది. చికిత్సా సమయంలో ఔషధాలు, కన్జ్యూమబుల్స్ కూడా ఉచితమే. చికిత్సలో భాగంగా వేసే స్టెంట్లు, పేస్మేకర్ల వంటి వాటికీ కవరేజీ లభిస్తుంది. ఐసీయూ, జనరల్ వార్డ్‌లో ఉండి తీసుకునే చికిత్సలకు పరిహారం అందుతుంది. రోగికి చికిత్సా సమయంలో ఉచితంగానే ఆహారం అందిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 రోజుల పాటు చికిత్సకు సంబంధించిన వ్యయాలకు చెల్లింపులు లభిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన మొదటి రోజు నుంచే అన్ని రకాల (ఎంపిక చేసిన) చికిత్సలకు ఉచితంగా కవరేజీ అమల్లోకి వస్తుంది. అంటే ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం ఈ పథకం కింద చికిత్స తీసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే షరతుల్లేవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,350 మెడికల్ ప్యాకేజీలకు కవరేజీ లభిస్తోంది. 70 ఏళ్లు నిండిన వృద్ధులకు సంబంధించి పథకంలో భాగంగా ఏఏ చికిత్సలకు కవరేజీ లభిస్తుందన్నది ప్రభుత్వ నోటిఫికేషన్‌తోనే స్పష్టత వస్తుంది.అర్హత? 70 ఏళ్లు నిండి, ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీకి అర్హులే. పీఎంజేఏవై కింద ఇప్పటికే రూ.5 లక్షల కవరేజీ కలిగిన కుటుంబాల విషయానికొస్తే.. ఆయా కుటుంబాల్లోని 70 ఏళ్లు నిండిన వారు అదనంగా రూ.5 లక్షల హెల్త్ టాపప్ (కవరేజీ)ను పొందేందుకు అర్హులు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్), ఎక్స్ సరీ్వస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) కింద కవరేజీ ఉన్న వారు ఎప్పటి మాదిరే అందులో కొనసాగొచ్చు. లేదా వాటి నుంచి పీఎంజేఏవైకు మారొచ్చు. ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నవారు, ఈఎస్ఐ కింద కవరేజీ కలిగిన వారు, వీటితోపాటు అదనంగా పీఎంజేఏవై కవరేజీకి సైతం అర్హులే.దరఖాస్తు ఎలా..? పీఎంజేఏవై డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్ లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, 70 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అతి త్వరలోనే ఇది ఆరంభం కానుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి, అనంతరం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళికగా ఉంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ/ఆభా) కలిగి ఉంటే, ఈ బీమా ఉచితమని అనుకోవద్దు. ఆభా అన్నది డిజిటల్ రూపంలో హెల్త్ రికార్డులు భద్రపరుచుకునేందుకు ఉపయోగపడే ఖాతా. తమ హెల్త్ రిపోర్ట్‌లను ఈ ఖాతాలోకి ఉచితంగా అప్లోడ్ చేసుకుని, వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు వాటిని డిజిటల్ రూపంలోపంచుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో డిజిటల్ హెల్త్ రికార్డులను పొందొచ్చు. ఆభాతో సంబంధం లేకుండా పీఎంజేఏవై కింద రూ.5 లక్షల కవరేజీకి విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారు, పీఎంజేఏవై కింద ఇప్పటికే హెల్త్ కవరేజీ పొందుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.అందరికీ అనుకూలమేనా?70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఆరోగ్య బీమా సరిపోకపోవచ్చు. ఆస్పత్రి బిల్లులు ∙రూ.5 లక్షలకే పరిమితం కావాలని లేదు. విడిగా తమ ఆరోగ్య చరిత్ర ఆధారంగా, వాటికి కవరేజీతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అవసరం. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ పరిధిలోని ప్యాకేజీ వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. అప్పుడు అందులో లేని చికిత్సలకు కవరేజీనిచ్చే ప్లాన్‌ను విడిగా తీసుకోవచ్చు. వృద్ధులు ఆయుష్మాన్ భారత్ కవరేజీని అదనపు రక్షణగానే చూడాలన్నది నిపుణుల సూచన. అంటే విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు సమగ్రమైన రక్షణతో నిశ్చి తంగా ఉండొచ్చన్నది నిపుణుల సూచన. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితం కనుక.. పథకం కింద చికిత్సలకు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చు. మన దేశంలో ఆస్పత్రి పడకల సగటు చాలా తక్కువ. కనుక తమవంతు చికిత్స కోసం వేచి చూడాల్సి రావచ్చు. ఇది నచ్చని వారు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు విడిగా హెల్త్ ప్లాన్ వీలు కలి్పస్తుంది. ప్రభుత్వ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలో సింగిల్ ప్రైవేటు రూమ్‌కు అవకాశం ఉండదు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల డబ్బులతో అందిస్తున్న ఉచిత ఆరోగ్య పథకంలో ప్రీమియం సదుపాయాల కల్పన కష్టం. ఒకవేళ ప్రైవేటు రూమ్ తీసుకునేట్టు అయితే, తమ జేబు నుంచి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.ఆర్థిక భారం పడకుండా..ఉన్నట్టుండి అత్యవసర వైద్యం అవసరమైతే సమీపంలోని ప్చైవేటు ఆస్పత్రిలో చేరి్పంచాల్సి రావచ్చు. అప్పుడు విడిగా హెల్త్‌ప్లాన్ లేకుంటే ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల చికిత్సలకు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుంటారు. అలా ఎంపిక చేసుకునే హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్ పరిధిలో లేకపోవచ్చు. విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు పరిష్కారం చూపుతుంది. ప్రైవేటు హెల్త్ ప్లాన్‌లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నా, తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కింద రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం లేదు. కేవలం నగదు రహిత వైద్యమే అందుతుంది. టాప్ రేటెడ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు, ప్రభుత్వ పథకంలో కవరేజీ లేని మరిన్ని రకాల చికిత్సలకు విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అవకాశం లభిస్తుంది. ప్రైవేటు బీమా సంస్థలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో హాప్పిటల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంటాయి. ‘‘దీర్ఘకాలిక వ్యాధులు లేదా సర్జరీలు, కేన్సర్ తదితర చికిత్సల్లో అధిక సమ్ ఇన్షూర్డ్ (బీమా రక్షణ) ఉండటం వృద్ధులకు ఎంతో కీలకం. వ్యాధులతో బాధపడే వారు స్వతంత్రంగా హెల్త్ కవరేజీ కలిగి ఉండాలి. వృద్ధాప్యంతో అనారోగ్యాలకు ప్రత్యేకమైన చికిత్స అవసరం. అందుకు రూ.5 లక్షల కవరేజీ సరిపోదు. వయసుమీద పడడం వల్ల వచ్చే అనారోగ్యాలకు కొన్సి సందర్భాల్లో ఖరీదైన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆరి్థక భారం పడుతుంది’’ అని పాలసీబజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ చాబ్రా వివరించారు. 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్పీఎంజేఏవై కింద దేశవ్యాప్తంగా 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్ అయ్యాయి. ఇందులో 13,466 ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కానీ, అన్నీ యాక్టివ్‌గా లేవు. యాక్టివ్ హాస్పిటల్ అంటే గడిచిన 45 రోజుల్లో ఆయా ఆస్పత్రుల నుంచి కనీసం ఒక పేషెంట్ అయినా డిశ్చార్జ్ అయి ఉండాలి. యాక్టివ్ ఆస్పత్రులు కేవలం 3,000 మాత్రమే ఉన్నాయి. పైగా ఎంప్యానెల్ అయిన ఆస్పత్రులు అన్నీ కూడా అన్ని రకాల చికిత్సలను ఆఫర్ చేయడం లేదన్నది గుర్తు పెట్టుకోవాలి. అంటే పీఎం జేఏవై కింద ఎంపిక చేసిన ప్యాకేజీలలో కొన్నింటినే ఆఫర్ చేసే వెసులుబాటు ఆస్పత్రులకు ఉంటుంది.మరో మార్గం? పీఎం జేఏవై కింద రూ.5 లక్షల కవరేజీ తీసుకున్న వారు.. విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లించే స్థోమత లేకపోతే ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్‌కు బదులు సూపర్ టాపప్ మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షలు డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఏదైనా ఒక సంవత్సరంలో ఆస్పత్రి బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తుంది. ఒక్కసారి అడ్మిషన్లో రూ.5 లక్షలకు మించి బిల్లు రావాలని లేదు. రెండు మూడు సార్లు చేరి చికిత్స తీసుకుని, మొత్తం బిల్లులు రూ.5 లక్షలు దాటినా సరే సూపర్ టాపప్ కింద పరిహారం పొందొచ్చు. పైగా బేసిక్ హెల్త్ ప్లాన్‌తో పోలి్చతే, సూపర్ టాపప్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమ ఆరోగ్య సమస్యలకు మెరుగైన రక్షణ దిశగా వృద్ధులు ప్రణాళిక రూపొందించుకోవాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
AB-PMJAY: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: డెబ్భై ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు ప్రతిపాదనలను ఆమోదించింది. అర్హులైన లబి్ధదారులకు త్వరలో కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.కుటుంబసభ్యులు ఏబీపీఎంజేఏవై కింద లబ్దిదారులుగా ఉన్నా 70 ఏళ్లు, ఆపై వయసు సీనియర్ సిటిజన్లకు విడిగా ఏటా రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనున్నారు. వృద్ధులు ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలు, ఈఎస్ఐ పథకంలో ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్), మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పథకాల లబ్ది పొందుతున్న వాళ్లు మాత్రం వాటినో, ఏబీపీఎంజేఏవైనో ఏదో ఒకదానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 4.5 కోట్ల కుటుంబాల్లోని వృద్ధులకు మేలు చేకూరనుంది. ఏబీపీఎంజేఏవై ప్రపంచంలోనే ప్రభుత్వరంగంలో అమలవుతోన్న అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమని కేంద్రం తెలిపింది. 12.34 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల మందికి ఈ పథకం లబ్దిచేకూరుస్తుందని కేంద్రం పేర్కొంది. వయసుతో సంబంధంలేకుండా కుటుంబంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. వీరిలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసింది. తొలినాళ్లలో జనాభాలో దిగువ తరగతి 40 శాతం మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తర్వాత 2022 జనవరిలో లబ్దిదారుల సంఖ్యను 12 కోట్ల కుటుంబాలకు పెంచింది. తర్వాత 37 లక్షల ఆశా/అంగన్వాడీ/ఏడబ్ల్యూహెచ్ఎస్లకూ వర్తింపజేశారు. 31వేల మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ రూ.12,461 కోట్ల వ్యయంతో మొత్తంగా 31,350 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ ప్రాజెక్టులకూ కేబినెట్ ఓకే చెప్పింది.→ పీఎం గ్రామ్ సడక్ యోజన–4 కింద అదనంగా 62,500 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి కేబినెట్ సరేనంది. కొత్తగా 25వేల జనావాసాలను కలుపుతూ ఈ రోడ్లను నిర్మించనున్నారు. ఈ మార్గాల్లో వంతెనలనూ ఆధునీకరించనున్నారు. → విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం–ఈబస్ సేవా–పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం పథకాల అమలు కోసం రూ.14,335 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అనుమతి ఇచి్చంది. విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర, అంబులెన్స్, ట్రక్కు, ఇతర వాహనాలపై రూ.3,679 కోట్ల మేర సబ్సిడీ ప్రయోజనాలు పౌరులకు కలి్పంచనున్నారు. → ముందస్తు వాతావరణ అంచనా వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు. రెండేళ్లలో రూ.2,000 కోట్ల వ్యయంతో ‘మిషన్ మౌసమ్’ను అమలుచేయనున్నారు. భారత వాతావరణ శాఖతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ విభాగాల ద్వారా ఈ మిషన్‌ను అమలు చేయనున్నారు. -
నోబెల్ పురస్కారానికి మోదీ నామినెట్..!
సాక్షి, చెన్నై : భారత ప్రధాని నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమిళనాడు బీజేపీ రాష్ట్రా అధ్యక్షురాలు తమిళ్సై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆవిష్కరించిన మోదీకి నోబెల్ ఇవ్వాలని.. ఆ మేరకు ఆయన పేరును నోబెల్ కమిటీకి ఆమె నామినెట్ చేశారు. దీనికి దేశ ప్రజలు అందరూ మద్దతు తెలపాలని కోరారు. దేశంలో 50 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ప్రధాని ఆరోగ్య బీమా యోజనా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదే ఆదివారం రాంచీలో అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. దీన్ని ‘మోదీ కేర్’గా అభివర్ణిస్తున్న పాలకపక్షం, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పథకమంటూ ప్రచారం చేస్తోంది. ఇంత పెద్ద పథకం ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమలులో లేదని దానికి రూపకల్పన చేసిన మోదీకి అత్యున్నత పురస్కారం ఇవ్వాలని తమిళసై అన్నారు. కాగా ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వామలుగా చేర్చనున్నారు. -
ధీమా లేని పీఎం ఆరోగ్య బీమా పథకం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పదివేల పేద కుటుంబాలు అంటే, 50 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ప్రధాని ఆరోగ్య బీమా యోజనా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదే ఆదివారం నాడు అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. దీన్ని ‘మోదీ కేర్’గా అభివర్ణిస్తున్న పాలకపక్షం, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పథకమంటూ విస్తృత ప్రచారం సాగిస్తున్నది. ఇది ఎలా ఉందంటే ‘ఆలు లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది. ఐదు లక్షల రూపాయల ఈ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడానికి బీమా కంపెనీలతోని, ఆ తర్వాత కార్పొరేట్ ఆస్పత్రులతోని ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంది. ఒక్క బీమా కంపెనీలతోనే చర్చలు జరపాలంటే ఆరు నెలల కాలం పడుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఆ తర్వాత కార్పొరేట్ ఆస్పత్రులతో చర్చలు జరిపేందుకు మరికొంత సమయం పడుతుందనడంలో సందేహం లేదు. ఐదు లక్షల బీమాకు 1.082 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రీమియంగా నిర్ణయించింది. ఏ బీమా కంపెనీ కూడా ఇంత తక్కువ ప్రీమియంను అంగీకరించే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని కనీసం 1,765 రూపాయలకు పెంచాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు. అలా పెరిగే ప్రీమియం భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో 60 శాతం ఆర్థిక భారాన్ని కేంద్రం భరించాలని, 40 శాతం భారాన్ని రాష్ట్రాలు భరించాలని కేంద్రం మార్గదర్శకాల్లో నిర్ణయించింది. అలాంటప్పుడు గొప్ప కేంద్ర పథకంగా ఆరోగ్య బీమాను ప్రచారం చేసుకోవడంలో అర్థం ఉందా? లక్ష కోట్లకు రెండు వేల కోట్లకు తేడా ఎంత? పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏటా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఈ పథకం కింద ఈ ఏడాది బడ్టెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేవలం రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. మిగతా 98 వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా తెస్తారు? వాస్తవానికి 2016లో బడ్జెట్ ప్రవేశ పెడుతూ అరుణ్ జైట్లీ పేద ప్రజల కోసం 1.5 లక్షల రూపాయలతో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పథకం కార్యరూపం దాల్చనే లేదు. ఇప్పుడు ప్రధాని ఆరోగ్య బీమా యోజన అంటూ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎన్నో చిక్కు ముడులున్న ఈ పథకాన్ని అమలు చేస్తారని ప్రజలు ఎలా విశ్వసించాలి? 25 కోట్లకుగాను 3.6 కోట్ల మందికే... 2008 సంవత్సరం నుంచే కేంద్రం పేద ప్రజల కోసం ‘రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన’ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి 30వేల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని కల్సిస్తున్న ఈ పథకానికి 750 రూపాయలను ప్రీమియంగా నిర్ణయించారు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు ఐదు లక్షల రూపాయల బీమాకు ప్రీమియం ఎన్ని వేలవుతుందో ఊహించవచ్చు. మరి అలాంటప్పుడు వెయ్యి రూపాయల ప్రీమియంను ఏ బీమా కంపెనీ అంగీకరిస్తుంది? పెంచితే అది ఎవరికి లాభం? 25 కోట్ల మందిని లక్ష్యంగా పెట్టుకొని స్వాస్థ్య బీమాను అమలు చేస్తుండగా, ఇన్నేళ్లకు కూడా లబ్ధిదారుల సంఖ్య 3.6 కోట్లకు దాటలేదు. ఇప్పుడు 50 కోట్లకు లక్ష్యంగా పెట్టుకుంటే ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు? ఈ స్కీమ్‌ను అభివృద్ధి చేయాల్సిన కేంద్రం కొత్త స్కీమ్‌ను ప్రకటించడంలో ఉద్దేశం ఏమిటీ? కార్పొరేట్ ఆస్పత్రుల కోసమే ఉత్తరాదిలో కార్పొరేట్ ఆస్పత్రులు అంతగా విస్తరించ లేదు. ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలే అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. ఇటు దక్షణాదిలో కూడా కార్పొరేట్ ఆస్పత్రులు నగరాలకు, పట్టణాలకే పరిమితం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లేదు. ఈ కారణంగా కార్పొరేట్ ఆస్పత్రి రంగాన్ని ప్రోత్సహించడం కోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని తీసుకొచ్చిందని బెంగళూరులోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ వ్యవస్థాపకులు, డైరెక్టర్ ఎన్. దేవదాసన్ లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు. తమిళనాడు లక్ష రూపాయలు, రెండు లక్షల రూపాయల బీమాతో రెండు పథకాలను సమర్థంగా అమలు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు రెండు లక్షల రూపాయలతో ‘ఆరోగ్య శ్రీ’ పథకాలను బాగానే అమలు చేస్తున్నాయి. అందుకే ఈ రాష్ట్రాలు కేంద్రం కొత్త పథకంలో చేరేందుకు సుముఖంగా లేవు. మూడు లక్షల రూపాయలతోనే ఆరోగ్య బీమా పథకాన్ని ఎంతో సమర్థంగా అమలు చేయవచ్చని వైద్య, ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీలు లాంటి వ్యాధులకు ఐదు లక్షల రూపాయలకుపైగా ఖర్చు అవుతాయి. ఆ పైన అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలాగా మరో స్కీమ్‌ను తీసుకరావచ్చని వారు చెబుతున్నారు. ఐదు లక్షల రూపాయలతో ఒకే బీమా పథకం అంటే కచ్చితంగా అది కార్పొరేట్ ఆస్పత్రులకే మేలు చేస్తోందని, అనవసరైన ఆరోగ్య పరీక్షలకు, చికిత్సలకు అది దోహదపడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 2011లో బిహార్‌లో ఆరోగ్య బీమా ఉందన్న కారణంగా 700 మంది మహిళలకు అనవసరంగా కార్పొరేట్ ఆస్పత్రులు శస్త్ర చికిత్సలు చేసి వారి గర్భసంచులను తొలగించడం తెల్సిందే. లక్ష కోట్లు ఎలా తెస్తారు? దేశంలో మొత్తం ఆరోగ్య రంగానికి 2017–18 ఆర్థిక సంవత్సరానికి 48,878 కోట్ల రూపాయలను కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం ఆ కేటాయింపులు 53,198 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సంవత్సరానికి అదే ఆరోగ్య రంగానికి 54,667 కోట్ల రూపాయలను కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 11.8 శాతం, సవరించిన బడ్జెట్ అంచనాలతో పోలిస్తే కేటాయింపులు కేవలం 2.7 శాతం పెరిగాయి. జీడీపీతో కేటాయింపులను పోలిస్తే పెరగాల్సిన కేటాయింపులు ఏటా తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒక్క పేదల బీమా కోసమే లక్ష కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రపంచంలోనే పెద్ద పథకం ఎలా అవుతుంది? మనకన్నా అధిక జనాభా కలిగిన చైనా తమ దేశ పౌరులందరికి ఐదు లక్షలు, పది లక్షలు అంటూ పరిమితి అనేది లేకుండా నూటికి నూరు శాతం (ఎంత ఖర్చయితే అంత) ఆరోగ్య బీమాను అమలు చేస్తోంది. అప్పుడు అది పెద్ద స్కీమ్ అవుతుందా? మనది పెద్ద స్కీమ్ అవుతుందా? పేదలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ పార్టీ చూస్తోందని, తాను మాత్రం అలా కాదని పథకం ప్రారంభోత్సవంలో మోదీ చెప్పుకున్నారు. ఇంత తాత్సారంతో, ఈ దశలో గ్రౌండ్ వర్క్ పెద్దగా లేకుండానే ఈ ఆరోగ్య బీమా పథకాన్ని తెచ్చారంటే ఏమనుకోవాలి? 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై దృష్టితో కాదా?!