Health Coverage
-
70 ఏళ్లు నిండినవారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా
-
70 ఏళ్లు నిండిన వారికి ఉచిత బీమా!
ఒక్కసారి ఆస్పత్రి పాలైతే.. కొన్నేళ్ల పాటు కూడబెట్టుకున్నదంతా కరిగిపోయే పరిస్థితి. ఖరీదైన వైద్యం కారణంగా అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కరోనా అప్పుడు ఇదే చూశాం. ఈ పరిస్థితి రాకూడదంటే ముందస్తుగా బీమా రక్షణ కలి్పంచుకోవడమే మార్గం. కానీ, వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్లు నిండిన వృద్ధులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన’ (ఏబీ–పీఎంజేఏవై) కింద ఉచితంగా ఆరోగ్య బీమా అందిస్తున్నట్టు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద పేదలు, తక్కువ ఆదాయ వర్గాలకే ఉచిత ప్రయోజనం అందుతోంది. ఇకపై ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పీఎం జేఏవై కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీ లభించనుంది. అతి త్వరలోనే అమల్లోకి రానున్న ఈ పథకం గురించి అవగాహన కల్పించే కథనమే ఇది. పీఎంజేఏవై పథకం కింద రూ.5,00,000 సమగ్రమైన కవరేజీ లభిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు అయ్యే వైద్య పరమైన ఖర్చుల (డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్స్ పరీక్షలు)కు సైతం కవరేజీ ఉంటుంది. చికిత్సా సమయంలో ఔషధాలు, కన్జ్యూమబుల్స్ కూడా ఉచితమే. చికిత్సలో భాగంగా వేసే స్టెంట్లు, పేస్మేకర్ల వంటి వాటికీ కవరేజీ లభిస్తుంది. ఐసీయూ, జనరల్ వార్డ్‌లో ఉండి తీసుకునే చికిత్సలకు పరిహారం అందుతుంది. రోగికి చికిత్సా సమయంలో ఉచితంగానే ఆహారం అందిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 రోజుల పాటు చికిత్సకు సంబంధించిన వ్యయాలకు చెల్లింపులు లభిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన మొదటి రోజు నుంచే అన్ని రకాల (ఎంపిక చేసిన) చికిత్సలకు ఉచితంగా కవరేజీ అమల్లోకి వస్తుంది. అంటే ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం ఈ పథకం కింద చికిత్స తీసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే షరతుల్లేవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,350 మెడికల్ ప్యాకేజీలకు కవరేజీ లభిస్తోంది. 70 ఏళ్లు నిండిన వృద్ధులకు సంబంధించి పథకంలో భాగంగా ఏఏ చికిత్సలకు కవరేజీ లభిస్తుందన్నది ప్రభుత్వ నోటిఫికేషన్‌తోనే స్పష్టత వస్తుంది.అర్హత? 70 ఏళ్లు నిండి, ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీకి అర్హులే. పీఎంజేఏవై కింద ఇప్పటికే రూ.5 లక్షల కవరేజీ కలిగిన కుటుంబాల విషయానికొస్తే.. ఆయా కుటుంబాల్లోని 70 ఏళ్లు నిండిన వారు అదనంగా రూ.5 లక్షల హెల్త్ టాపప్ (కవరేజీ)ను పొందేందుకు అర్హులు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్), ఎక్స్ సరీ్వస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) కింద కవరేజీ ఉన్న వారు ఎప్పటి మాదిరే అందులో కొనసాగొచ్చు. లేదా వాటి నుంచి పీఎంజేఏవైకు మారొచ్చు. ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నవారు, ఈఎస్ఐ కింద కవరేజీ కలిగిన వారు, వీటితోపాటు అదనంగా పీఎంజేఏవై కవరేజీకి సైతం అర్హులే.దరఖాస్తు ఎలా..? పీఎంజేఏవై డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్ లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, 70 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అతి త్వరలోనే ఇది ఆరంభం కానుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి, అనంతరం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళికగా ఉంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ/ఆభా) కలిగి ఉంటే, ఈ బీమా ఉచితమని అనుకోవద్దు. ఆభా అన్నది డిజిటల్ రూపంలో హెల్త్ రికార్డులు భద్రపరుచుకునేందుకు ఉపయోగపడే ఖాతా. తమ హెల్త్ రిపోర్ట్‌లను ఈ ఖాతాలోకి ఉచితంగా అప్లోడ్ చేసుకుని, వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు వాటిని డిజిటల్ రూపంలోపంచుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో డిజిటల్ హెల్త్ రికార్డులను పొందొచ్చు. ఆభాతో సంబంధం లేకుండా పీఎంజేఏవై కింద రూ.5 లక్షల కవరేజీకి విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారు, పీఎంజేఏవై కింద ఇప్పటికే హెల్త్ కవరేజీ పొందుతున్న 70 ఏళ్లు నిండిన వృద్ధులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.అందరికీ అనుకూలమేనా?70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఆరోగ్య బీమా సరిపోకపోవచ్చు. ఆస్పత్రి బిల్లులు ∙రూ.5 లక్షలకే పరిమితం కావాలని లేదు. విడిగా తమ ఆరోగ్య చరిత్ర ఆధారంగా, వాటికి కవరేజీతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అవసరం. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ పరిధిలోని ప్యాకేజీ వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. అప్పుడు అందులో లేని చికిత్సలకు కవరేజీనిచ్చే ప్లాన్‌ను విడిగా తీసుకోవచ్చు. వృద్ధులు ఆయుష్మాన్ భారత్ కవరేజీని అదనపు రక్షణగానే చూడాలన్నది నిపుణుల సూచన. అంటే విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు సమగ్రమైన రక్షణతో నిశ్చి తంగా ఉండొచ్చన్నది నిపుణుల సూచన. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితం కనుక.. పథకం కింద చికిత్సలకు ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చు. మన దేశంలో ఆస్పత్రి పడకల సగటు చాలా తక్కువ. కనుక తమవంతు చికిత్స కోసం వేచి చూడాల్సి రావచ్చు. ఇది నచ్చని వారు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు విడిగా హెల్త్ ప్లాన్ వీలు కలి్పస్తుంది. ప్రభుత్వ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలో సింగిల్ ప్రైవేటు రూమ్‌కు అవకాశం ఉండదు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల డబ్బులతో అందిస్తున్న ఉచిత ఆరోగ్య పథకంలో ప్రీమియం సదుపాయాల కల్పన కష్టం. ఒకవేళ ప్రైవేటు రూమ్ తీసుకునేట్టు అయితే, తమ జేబు నుంచి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.ఆర్థిక భారం పడకుండా..ఉన్నట్టుండి అత్యవసర వైద్యం అవసరమైతే సమీపంలోని ప్చైవేటు ఆస్పత్రిలో చేరి్పంచాల్సి రావచ్చు. అప్పుడు విడిగా హెల్త్‌ప్లాన్ లేకుంటే ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల చికిత్సలకు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుంటారు. అలా ఎంపిక చేసుకునే హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్ పరిధిలో లేకపోవచ్చు. విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు పరిష్కారం చూపుతుంది. ప్రైవేటు హెల్త్ ప్లాన్‌లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నా, తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కింద రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం లేదు. కేవలం నగదు రహిత వైద్యమే అందుతుంది. టాప్ రేటెడ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు, ప్రభుత్వ పథకంలో కవరేజీ లేని మరిన్ని రకాల చికిత్సలకు విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో అవకాశం లభిస్తుంది. ప్రైవేటు బీమా సంస్థలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో హాప్పిటల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంటాయి. ‘‘దీర్ఘకాలిక వ్యాధులు లేదా సర్జరీలు, కేన్సర్ తదితర చికిత్సల్లో అధిక సమ్ ఇన్షూర్డ్ (బీమా రక్షణ) ఉండటం వృద్ధులకు ఎంతో కీలకం. వ్యాధులతో బాధపడే వారు స్వతంత్రంగా హెల్త్ కవరేజీ కలిగి ఉండాలి. వృద్ధాప్యంతో అనారోగ్యాలకు ప్రత్యేకమైన చికిత్స అవసరం. అందుకు రూ.5 లక్షల కవరేజీ సరిపోదు. వయసుమీద పడడం వల్ల వచ్చే అనారోగ్యాలకు కొన్సి సందర్భాల్లో ఖరీదైన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆరి్థక భారం పడుతుంది’’ అని పాలసీబజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ చాబ్రా వివరించారు. 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్పీఎంజేఏవై కింద దేశవ్యాప్తంగా 30,000 ఆస్పత్రులు ఎంప్యానెల్ అయ్యాయి. ఇందులో 13,466 ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కానీ, అన్నీ యాక్టివ్‌గా లేవు. యాక్టివ్ హాస్పిటల్ అంటే గడిచిన 45 రోజుల్లో ఆయా ఆస్పత్రుల నుంచి కనీసం ఒక పేషెంట్ అయినా డిశ్చార్జ్ అయి ఉండాలి. యాక్టివ్ ఆస్పత్రులు కేవలం 3,000 మాత్రమే ఉన్నాయి. పైగా ఎంప్యానెల్ అయిన ఆస్పత్రులు అన్నీ కూడా అన్ని రకాల చికిత్సలను ఆఫర్ చేయడం లేదన్నది గుర్తు పెట్టుకోవాలి. అంటే పీఎం జేఏవై కింద ఎంపిక చేసిన ప్యాకేజీలలో కొన్నింటినే ఆఫర్ చేసే వెసులుబాటు ఆస్పత్రులకు ఉంటుంది.మరో మార్గం? పీఎం జేఏవై కింద రూ.5 లక్షల కవరేజీ తీసుకున్న వారు.. విడిగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లించే స్థోమత లేకపోతే ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్‌కు బదులు సూపర్ టాపప్ మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షలు డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఏదైనా ఒక సంవత్సరంలో ఆస్పత్రి బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తుంది. ఒక్కసారి అడ్మిషన్లో రూ.5 లక్షలకు మించి బిల్లు రావాలని లేదు. రెండు మూడు సార్లు చేరి చికిత్స తీసుకుని, మొత్తం బిల్లులు రూ.5 లక్షలు దాటినా సరే సూపర్ టాపప్ కింద పరిహారం పొందొచ్చు. పైగా బేసిక్ హెల్త్ ప్లాన్‌తో పోలి్చతే, సూపర్ టాపప్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమ ఆరోగ్య సమస్యలకు మెరుగైన రక్షణ దిశగా వృద్ధులు ప్రణాళిక రూపొందించుకోవాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే కాకుండా, శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక తోడ్పాటునందించడానికి ప్రవేశ పెట్టిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది. డా. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకమని, దాని అమలు సాహసోపేతమైన చర్య అని ఏకంగా నేషనల్ హెల్త్ అథారిటీనే అభివర్ణించింది. ఈ పథకం శస్త్ర చికిత్స చేయించుకుని, విశ్రాంతి తీసుకునే సమయంలో పేదల జీవనోపాధికి పెద్ద భరోసా ఇస్తోందని తెలిపింది. ప్రజారోగ్య రంగంలో ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోందని నేషనల్ హెల్త్ అథారిటీ కితాబునిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య బీమాలో అనుసరిస్తున్న విధానాలను అథ్యయనం చేసిన అథారిటీ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకంపై ప్రశంసలు కురిపించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పేద కుటుంబాల్లోని వారు శస్త్ర చికిత్సలు చేయించుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో గృహ ఖర్చులకు రక్షణ కవచంగా నిలుస్తోందని పేర్కొంది. ఇది చాలా పెద్ద కార్యక్రమమైనప్పటికీ, వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తోందని తెలిపింది. ‘శస్త్ర చికిత్స చేయించుకునే రోగులకు కోలుకోవడానికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. ఆ సమయంలో రోగి జీవనోపాధిని కోల్పోయి, ఆర్థికంగా నష్టపోతారు. విశ్రాంతి సమయంలో రోజువారి వేతనాలు రాకపోవడంతో ఆ కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది. కుటుంబాల నిర్వహణ కష్టమవుతుంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా వారి గృహ ఖర్చులకు రక్షణ కల్పింస్తోంది’ అని అథారిటీ తెలిపింది. శస్త్ర చికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోనే ఆ పేద కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా భత్యం జమ అవుతోందని పేర్కొంది. విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా రూ. 5,000 వరకు పేద కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తున్నారని, మరే ఇతర రాష్ల్రాల్లో ఇలాంటి పథకం లేదని అథారిటీ తెలిపింది. యూనివర్సల్ హెల్త్ కవరేజీలో ఏపీ ముందడుగు యూనివర్సల్ హెల్త్ కవరేజీని సాధించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేసిందని అథారిటీ తెలిపింది. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న పేద కుటుంబాలను రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నవశకం కార్యక్రమం కింద గుర్తించి ఆ కుటుంబాలకు డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపింది. క్యూఆర్ కోడ్, యూనిక్ ఐడీ నెంబర్లతో కూడిన ఈ స్మార్ట్ హెల్త్ కార్డులతో లబ్ధిదారుల వైద్య రికార్డుల నిర్వహణ మెరుగుపడిందని పేర్కొంది. అంతే కాకుండా రోగి వివరాల గోప్యతకు, భద్రతకు ఈ కార్డులు రక్షణ కల్పింస్తున్నాయని చెప్పింది. కుటుంబ యజమాని, సభ్యులందరి వివరాలను, గ్రామ, వార్డు సచివాలయాల వివరాలను కూడా కార్డుల్లో పొందుపరిచారని పేర్కొంది. ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులు చాలా నాణ్యతతో ఉన్నాయని, పదేళ్లకుపైగా మన్నిక ఉంటుందని తెలిపింది. -
హెల్త్ బీమా ఎందుకు తప్పనిసరి?
నేటి జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ప్రతి కుటుంబానికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఎంతో ఉంది. అయినా, ప్రీమియం భారంగా భావించి హెల్త్ కవరేజీ తీసుకోని వారు మన సమాజంలో ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. కనుక అందరూ కాకపోయినా కొందరు అయితే నూటికి నూరు శాతం హెల్త్ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. లేదంటే, ఆర్థిక పరమైన సంక్షోభాన్ని హెల్త్ రిస్క్ రూపంలో ఎదుర్కోవాల్సి రావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం..? అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే హెల్త్ కవరేజీ ఉంటే ఆ నిశ్చింతే వేరు. వయసు పెరుగుతున్న కొద్దీ పలు అనారోగ్యాలు, వ్యాధులు పలకరిస్తుంటాయి. కొందరికి చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ఫిట్నెస్తో సంబంధం లేకుండా వచ్చే కేన్సర్ వంటి మహమ్మారులూ ఉన్నాయి. అందుకని ఆరోగ్య బీమాను మంచి పెట్టుబడిగా.. ధైర్యాన్నిచ్చే, అవసరంలో రక్షణనిచ్చే మంచి ఆయుధంగా చూడాలి. సంపాదన మొదలు పెట్టిన నాటి నుంచి లేదా కనీసం పెళ్లయిన వెంటనే ఆరోగ్య బీమా తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో వ్యాధుల చరిత్ర ఉన్నవారు ఆరోగ్య బీమాను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించడం లేదా ఆలస్యం చేయడం సరికాదు. నిర్లక్ష్యం చేస్తే రిస్క్‌ను ఆహ్వానించినట్టే అవుతుంది. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అలాగే, పిల్లల్ని కనే వయసులోని మహిళలు, అంటువ్యాధులు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఉండేవారు, తరచూ ప్రయాణించే వారు (విమాన ప్రయాణం కావచ్చు.. ఉద్యోగరీత్యా తరచూ వాహన ప్రయాణం చేసే వారు) ఆరోగ్య బీమాను వెంటనే తీసుకోవాలి. తీసుకుంటే పాలసీదారులకే ప్రయోజనం. బీమా కంపెనీలకు కాదు. వీలైనంత చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఆ వయసులో వ్యాధుల రిస్క్ ఉండదు. తక్కువ ప్రీమియానికే మెరుగైన కవరేజీ లభిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ ఉండాలి. కానీ, ఇక్కడ చెప్పుకున్న విభాగాల్లోని వారికి హెల్త్ ప్లాన్ పక్కా ఉండాల్సిందే. కుటుంబ చరిత్ర కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నేడు వంశపారంపర్యంగా మారాయి. ఇందుకు ఆయా కుటుంబాల జీవనశైలి, ఆహార నియమాలు, జీన్స్ ఇలా ఎన్నో అంశాలు నేపథ్యంగా ఉండొచ్చు. గుండె జబ్బులు, మధుమేహం, పలు రకాల కేన్సర్ సమస్యలు ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి. కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా బీమా కవరేజీ తీసుకుని రక్షణ కల్పించుకోవాలి. ఆయా వ్యాధులు పలకరించక ముందు నుంచే బీమా ఉంటుంది కనుక.. ముందు నుంచి ఉన్న వ్యాధుల పరిధిలోకి అవి రావు. ముందు నుంచి ఉన్న వ్యాధులకు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు పాలసీ తీసుకున్న నాటి నుంచి కనిష్టంగా రెండేళ్లు.. గరిష్టంగా నాలుగేళ్ల వరకు వేచి ఉండాలని కోరుతుంటాయి. కంపెనీల మధ్య ఈ వెయిటింగ్ పీరియడ్ వేర్వేరుగా ఉండొచ్చు. ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే.. ఆరో గ్య సమస్యలు వెలుగుచూస్తాయి. దీంతో బీమా కంపెనీలు నిర్ణీత కాలం పాటు వెయిటింగ్ తర్వాతే వాటికి కవరేజీని ఆఫర్ చేస్తాయి. అది కూడా అధిక ప్రీమియానికే అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీరి నుంచి క్లెయిమ్‌ల రిస్క్ ఉంటుంది. అవన్నీ మదింపు వేసి, అందుకు తగ్గ ప్రీమియాన్ని అవి వసూలు చేస్తాయి. ఆరోగ్యవంతులకు, ఆరోగ్య సమస్యలున్న వారికి ఒక్కటే ప్రీమియం వసూలు చేయ డం అన్నది అసాధ్యం. వెయిటిం గ్ పీరియడ్ వల్ల ఆయా కాలంలో అవే ఆరోగ్య సమస్య లతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. ఖర్చంతా పాలసీదారు స్వయంగా భరించా ల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకనే చిన్న వయసులోనే బీమా రక్షణ కల్పించుకో వాలని నిపుణులు సూచిస్తుంటారు. కొన్ని ప్రాంతాలు వేరు.. దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితులు ఉంటుంటాయి. ఆయా ప్రాంతాల్లో డెంగీ, చికెన్ గున్యా, మలేరియా కేసులు అప్పుడప్పుడు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటాయి. అందుకని వీటికి కవరేజీని ఆఫర్ చేసే బీమా ప్లాన్లను ఆయా ప్రాంతాల్లో నివసించే వారు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా అవుట్ పేషెంట్ కవరేజీతో ఈ ప్లాన్లు ఉండేలా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా కొన్ని వ్యాధులు తరచూ కనిపిస్తుంటాయి. స్థానికులు వాటిపై అవగాహనతో కవరేజీ ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలాంటి సమస్యలకు అవుట్ పేషెంట్‌గా వైద్యం చేయించుకోవాలన్నా భారీగా ఖర్చవుతుంది. హెల్త్ప్లాన్లలో ఇన్‌పేషెంట్ (ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలు) కవరేజీ విషయంలో సందేహం అక్కర్లేదు. అదే సమయంలో అవుట్ పేషెంట్‌గా చేసే ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ ఎంపిక జరగాలి. నేడు చాలా బీమా సంస్థలు అవుట్ పేషెంట్ కవరేజీ (ఓపీడీ)ని అందిస్తున్నాయి. వీటికి కొన్ని పరిమితులు, షరతులు, కొంత అదనపు ప్రీమియం అమలవుతుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ బీఫిట్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ డిజిటల్ కేర్ ప్లాన్లు రూ.1,000 నుంచి రూ.10,000 ఓపీడీ కవరేజీ కోసం రూ.300 నుంచి రూ.3,000 వరకు ప్రీమియం వసూలు చేస్తున్నాయి. వీటిని యాడాన్‌గా లేదంటే పాలసీలో భాగంగా తీసుకోవచ్చు. ఓపీడీ కవరేజీలో టెలిమెడికల్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్‌లు ఉచితంగా లభిస్తాయి. తరచూ ప్రయాణాలు.. ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేసే వారికి అన్ని బీమా సంస్థలు ప్లాన్లను ఆఫర్ చేయడం లేదు. కొన్ని మాత్రం కఠిన అండర్ రైటింగ్ నిబంధనలకు లోబడి కవరేజీని ఇస్తున్నాయి. తరచూ ప్రయాణాలు చేసే వారికి కూడా ఎన్నో రకాల రిస్క్‌లు ఎదురవుతుంటాయి. వీరు సులభంగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇతర వృత్తులతో పోలిస్తే ఇలా తరచూ ప్రయాణించే వారికి ఆరోగ్య సమస్యల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా వ్యక్తులు క్యాష్‌లెస్ కవరేజీ నెట్‌వర్క్‌లో ఎక్కువ ఆస్పత్రులు ఉండే బీమా సంస్థ నుంచి ప్లాన్ తీసుకోవడం మంచిది. ప్రయాణ సమయంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా సమీపంలోని నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లి నగదు రహిత వైద్యాన్ని పొందడానికి వీలుంటుంది. క్యాష్‌లెస్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న బీమా సంస్థల ప్లాన్లలోని సదుపాయాలను విశ్లేషించిన తర్వాత ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. సొంత ప్రాంతంలో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు నగదు రహిత చికిత్సల ఆస్పత్రి కాకపోయినా.. ఎవరో ఒకరి నుంచి బదులు తీసుకుని చికిత్స తీసుకోవచ్చు. కానీ, ప్రయాణాల సమయంలో సమస్య వస్తే అప్పుడు ఆదుకునేది నగదు రహిత వైద్యమే అని గుర్తు పెట్టుకోవాలి. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. విదేశాల్లోనూ కవరేజీ లభించే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవాల్సి రావచ్చు. దీనికంటే కూడా ప్రయాణాలు చేసే వృత్తుల్లోని వారు డొమెస్టిక్ హెల్త్ప్లాన్లోనే విదేశీ వైద్యానికి కూడా కవరేజీ ఉండే ఆప్షన్‌తో తీసుకోవడం మంచిది. మణిపాల్ సిగ్నా లైఫ్ టైమ్ హెల్త్‌ప్లాన్ 27 రకాల క్రిటికల్ ఇల్నెస్లకు విదేశాల్లో కవరేజీని ఆఫర్ చేస్తోంది. అలాగే, ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్‌ప్లాన్ 16 రకాల తీవ్ర ఆరోగ్య సమస్యలకు విదేశాల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ను అందిస్తోంది. ఈ తరహా వ్యక్తులు అధిక కవరేజీ (రూ.కోటి వరకు) తీసుకోవడం అత్యవసర పరిస్థితుల్లో అర్థవంతంగా ఉంటుంది. కూర్చుని చేసే ఉద్యోగాలు కదలికలు తక్కువగా ఉండి, సిస్టమ్ ముందు గంటలపాటు కూర్చుని పనిచేసే వారికి దీర్ఘకాలంలో వ్యాధుల రిస్క్ ఎక్కువ. వీరికి జాయింట్స్, స్పైన్ సమస్యలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాలు తేల్చాయి. కనుక వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూనే.. మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీకి కూడా ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అందులోనూ సమగ్ర కవరేజీ ఉండేలా చూసుకోవాలి. పెళ్లయిన మహిళలు వివాహ బంధంలోకి అడుగుపెట్టి పిల్లల కోసం ప్లాన్ చేసుకునే మహిళలు బీమా కవరేజీ పట్ల ముందుగా దృష్టి సారించాలి. దాదాపు అన్ని బీమా సంస్థలు మెటర్నిటీ కవరేజీ కోసం వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తున్నాయి. కేవలం కొన్ని ప్లాన్లు వెయిటింగ్ పీరియడ్ లేకుండా పరిమితంగా మెటర్నిటీ కవరేజీ ఇస్తున్నాయి. ఉద్యోగం చేస్తుంటే సంస్థ నుంచి గ్రూపు హెల్త్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే గ్రూపు హెల్త్ ప్లాన్లలో మొదటి రోజు నుంచే కవరేజీ లభిస్తుంది. స్టార్హెల్త్ యంగ్ స్టార్ గోల్డ్ ప్లాన్, టాటా ఏఐజీ మెడికేర్ ప్రీమియర్ ప్లాన్, ఫ్యూచర్ జనరాలి ప్రోహెల్త్ ప్లస్ మెటర్నిటీ కవరేజీని రూ.30,000–50,000 మధ్య ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో వెయిటింగ్ పీరియడ్ ఉంది. పుట్టే బేబీలకు మొదటి రోజు నుంచి కవరేజీ ఆప్షన్‌తో ఉన్న ప్లాన్ మెరుగైనది అవుతుంది. బజాజ్ అలియంజ్ హెల్త్ సుప్రీమ్ ప్లాన్‌లో.. ఆస్పత్రిలో చేరడానికి ముందు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే వ్యయాలకూ చెల్లింపులు చేస్తుంది. బేబీకి 90 రోజుల వరకు ఇచ్చే టీకాలకూ క్లెయిమ్ లభిస్తుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు అన్నీ కూడా కొత్తగా వచ్చే పిల్లలకూ కవరేజీని ఇచ్చే ఆప్షన్‌తోనే ఉంటాయి. గ్రూపు హెల్త్ ప్లాన్లలో వెయిటింగ్ పీరియడ్ ఉండదు. అందుకని పనిచేసే చోట గ్రూపు హెల్త్‌ప్లాన్ తీసుకుని, విడిగా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. వ్యక్తులు వారి కుటుంబ ఆరోగ్య చరిత్ర, జీవనశైలి, వయసు ఇలాంటి అంశాలన్నీ పరిశీలించుకుని, ఆయా సమస్యలకు కవరేజీనిచ్చే, సమగ్ర ఆరోగ్య ప్లాన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. కారణం ఏదైనా కానీ, పాలసీ తీసుకునే నాటికి ఏవైనా వ్యాధులు ఉంటే వాటి కోసం వేచి చూడక తప్పదు. అటువంటి సందర్భంలో అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం కవరేజీ కోరుకునేట్టు అయితే.. కొన్ని సంస్థలు అధిక ప్రీమియంతో వెంటనే కవరేజీనిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే వీటి ప్రీమియం ధరలు అధికంగా ఉంటాయని మర్చిపోవద్దు. ఎందుకంటే అండర్‌రైటింగ్ (వాటి రిస్క్‌ను సర్దుబాటు చేసుకోవడం) నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి వస్తుంది. గుండె జబ్బులు, కేన్సర్ తదితర తీవ్ర అనారోగ్య సమస్యలకు కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మొదటి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌తో కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. కానీ, రెగ్యులర్ ప్లాన్‌లో వేచి ఉండే కవరేజీతో పోలిస్తే ఇలా తీసుకునే వాటి ప్రీమియం చాలా ఎక్కువ. పైగా తీసుకునే బీమా కవరేజీ కూడా ఇక్కడ కీలకమవుతుంది. కుటుంబంలో తీవ్ర ఆరోగ్య సమస్యల చరిత్ర ఉన్నా.. తీసుకునే నాటికి ఆరోగ్య సమస్యలు పలకరించినా.. రూ.5 లక్షల కవరేజీ ఏ మూలకు సరిపోకపోవచ్చు. ము ఖ్యంగా కేన్సర్ చికిత్సకు రూ.5 లక్షల కవరేజీ చాలదు. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లలో బెనిఫిట్ ఆప్షన్‌తో ఉన్న వాటికి ఎంపిక చేసుకుంటే జాబితాలోని వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఆ మేరకు మొత్తం చెల్లించేస్తాయి. -
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకు వైద్య బీమాతో పాటు ఇతరత్రా తీసుకోతగిన చర్యలు సూచించే కథనమే ఇది. 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు అన్ని పాలసీల్లోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఇంటి నుంచే నర్సింగ్, చికిత్సల సేవలను పొందాల్సి వస్తే అయ్యే వ్యయాలు ఎక్కువగానే ఉంటాయి. అత్యవసర నిధి ఉంటే దాన్నుంచి వీటికి చెల్లింపులు చేసుకోవచ్చు. ఒక్కసారి అత్యవసర నిధి సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెద్దలకు చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేస్తే ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం హెడ్ అమిత్ ఛబ్రా పేర్కొన్నారు. అవసరమైనంత కవరేజీ తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవడం ఎంతో అవసరం. ‘‘మీరు నివసించే ప్రాంతం, జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. ఆలస్యం చేయవద్దు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. కోపేమెంట్ ఎంత..? సీనియర్ సిటిజన్ పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కోపేమెంట్ ఆప్షన్ ఉంటోంది. కోపేమెంట్ అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30 శాతం మధ్య ఉండొచ్చు. క్లెయిమ్ మొత్తంలో ఈ మేరకు పాలసీదారులు భరించగా, మిగిలినది బీమా కంపెనీలు చెల్లిస్తాయి. కనుక కోపేమెంట్ క్లాజ్ లేని పాలసీ తీసుకోవాలి. లేదంటే పాలసీదారుని వాటా తక్కువగా ఉండేదానిని ఎంచుకోవడం మంచిది. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం కావొచ్చు. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే దాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. వీటితో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందుగానే వీటన్నింటినీ తెలుసుకోవాలి. వేచి ఉండే కాలం సీనియర్ సిటిజన్ పాలసీల్లో రెండు రకాల వేచి ఉండే కాలావధి (వెయిటింగ్ పీరియడ్) ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు వర్తించేది ఒకటి. పాలసీ తీసుకున్నాకా రెండు నుంచి నాలుగేళ్లు Výæడిచాకే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర (కొంత కాలానికి వ్యాప్తి చెందేవి) చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్నాక రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాల్సి వస్తుంది. దాదాపు అన్ని పాలసీల్లోనూ ఈ నిబంధనలు ఉంటున్నాయి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ♦ 18% తల్లిదండ్రులకే హెల్త్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ♦ 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతుల మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ♦ 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. -
ఆరోగ్యంపై ముందే మేల్కొంటేనే..
పెద్ద వయసులోనే వైద్య బీమా (హెల్త్ ప్లాన్) అవసరమని చాలా మంది భావిస్తుంటారు. నేటి జీవన శైలి, పర్యావరణ కాలుష్యం, ఉద్యోగ పని స్వభావాల నేపథ్యంలో చిన్న వయసు నుంచే హెల్త్ కవరేజీ ఎంతో అవసరమన్న విషయాన్ని ఇప్పటికీ ఎక్కువ మంది గుర్తించడం లేదు. ఆరోగ్య బీమా పరిశ్రమ క్లెయిమ్ గణాంకాలను పరిశీలిస్తే... చిన్న వయసులోనే బీమా అవసరం ఎంతో ఉందని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. పైగా చికిత్సల వ్యయాలు ఇప్పటికే చాలా ఖరీదుగా ఉండగా, భవిష్యత్తులో ఇవి ఇంకా ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించలేం. కనుక ఆర్జన ఆరంభమైన నాడే వైద్య బీమా తీసుకోవడం ఎంతైనా అవసరం. ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను పరిశీలిస్తే.. జీర్ణ సంబంధిత, జననేంద్రియ, మూత్ర సంబంధిత, ఇన్ఫెక్షన్ వ్యాధులకు సంబంధించినవే మొత్తం క్లెయిమ్‌లలో 45 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బజాజ్ అలియంజ్ గణాంకాలను చూస్తే.. జ్వరాలు, ఇన్ఫెక్షన్ల కారణంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్, డెంగ్యూ ఫీవర్ కారణంగా ఎక్కువ క్లెయిమ్‌లు వచ్చాయి. మరో సంస్థ రాయల్ సుందరం క్లెయిమ్ల్లోనూ జ్వరాలు, ఇన్ఫెక్షన్లకు సంబంధించిన క్లెయిమ్‌లు 30 శాతంగా ఉన్నాయి. తీవ్ర ఆరోగ్య సమస్యలు (గుండెపోటు, స్ట్రోక్, కేన్సర్, మూత్రపిండాల వైఫల్యం తదితర) తలెత్తితే పడే ఆర్థిక భారం అంతా ఇంతా కాదు. ఒక కుటుంబంలో ఒకరికి మించిన సభ్యులకు ఈ సమస్యలు ఒకేసారి ఎదురైతే పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారుతుంది. మొత్తం మీద సర్వసాధారణంగా మనకు వ్యాపించే ఇన్ఫెక్షన్లు, గాయాలు, జీర్ణ సంబంధిత సమస్యలకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు 30 శాతంగా ఉండడాన్ని గమనించాలి. బీమా లేకపోతే వీటి కారణంగా పడే ఆర్థిక భారం గణనీయంగా ఉంటుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థ క్లెయిమ్‌లను పరిశీలిస్తే.. కేన్సర్ చికిత్సల కోసం సగటు క్లెయిమ్ సైజు రూ.77,000గా ఉంది. అదే మస్కులోస్కెలెటల్(కండర) సంబంధిత సమస్యల కారణంగా సగటు క్లెయిమ్ రూ.1.26 లక్షలుగా ఉంది. 60–65 ఏళ్లు దాటిన వారి నుంచి మస్కులోస్కెలెటల్, ఆస్టియోపోరోసిస్, జాయింట్ సంబంధిత క్లెయిమ్‌లు ఎక్కువగా ఉంటుంటాయి. కేన్సర్ కంటే వీటికి ఎక్కువ పరిహారం చెల్లించాల్సి వస్తోంది. బీమా అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్న వయసులోనే... చిన్న నాటి నుంచే హెల్త్ కవరేజీ ఎందుకులే, ఈ వయసులో ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఏవీ రావుగా..?! అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఇక ఉద్యోగులు తమ సంస్థ నుంచి ఎంతో కొంత హెల్త్ కవరేజీ ఉందిలేనన్న ఆలోచనతో అదనంగా కవరేజీ తీసుకునేందుకు ఇష్టపడరు. వయసుతో సంబంధం లేనివి.. గాయాలు, ఆహార విషతుల్యం కారణంగా వచ్చిన క్లెయిమ్‌లు 19–35 సంవత్సరాల విభాగంలో 43 శాతంగా ఉన్నాయి. ఇక ఇన్ఫెక్షన్ల కారణంగా ఎదురయ్యే క్లెయిమ్‌లు కూడా ఇదే వయసు వారి నుంచి వచ్చే మొత్తం క్లెయిమ్‌లలో 42 శాతంగా ఉన్నాయి. ఇక యువతలో ఎక్కువ క్లెయిమ్‌లు ప్రమాదాలకు సంబంధించినవీ ఉంటున్నాయి. ‘‘25 ఏళ్లలోపు వయసున్న వారు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే ధోరణితో ఉంటారు. ఈ వయసు వారి నుంచి వచ్చే క్లెయిమ్‌లు మొత్తం ప్రమాదాల కారణంగా పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లలో 30 శాతంగా ఉంటోంది. సగటు క్లెయిమ్ రూ. 55,000’’అని రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నిఖిల్ ఆప్టే తెలిపారు. ఒకవేళ హెల్త్ పాలసీ ప్రీమియం భారంగా అనిపిస్తే.. చిన్న వయసులో ఆదాయం తక్కువగా ఉన్న వారు కనీసం చౌకగా వచ్చే ప్రమాద బీమా పాలసీని అయినా తీసుకోవడం మంచిది. ‘‘పెద్ద వయసు వారితో పోలిస్తే.. యువతీ, యువకులు ఉద్యోగం చేసే వారు బయటి వాతావరణానికి ఎక్కువగా గురవుతుంటారు. దీంతో వీరు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే, యువతీ, యువకులు వ్యక్తిగత హెల్త్ పాలసీలను ముందుగానే తీసుకోవడం తక్కువే’’ అని సెక్యూర్‌నౌ సీఈవో కపిల్ మెహతా పేర్కొన్నారు. భవిష్యత్తు వ్యయాలు రానున్న ఐదేళ్ల కాలంలో శ్వాస కోçశవ్యాధులు, గుండె జబ్బులు, మస్కులోస్కెలెటల్, కేన్సర్, ప్రమాదాలు, జననేంద్రియ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని బీమా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘‘గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాల్లో పెరుగుదల 100 శాతంగా ఉంది. ఈ విభాగంలో ఎక్కువగా కనిపించేవి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా. పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో, దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా ఉందని ఇది తెలియజేస్తోంది’’ అని నిఖిల్ ఆప్టే పేర్కొన్నారు. ఇక ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాలతో ఆర్థరైటిస్ బారిన పడడం పెరుగుతోంది. దీంతో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. డబ్బులను గుల్ల చేసే పెద్ద ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బులు, కేన్సర్ ఉంటున్నాయి. భవిష్యత్తులోనూ వీటి చికిత్సల వ్యయాలు ఇంకా పెరిగే అవకాశమే ఉంది. ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలే కాకుండా, తదనంతరం ఆ సమస్యకు సంబంధించి అయ్యే ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు కేన్సర్ విషయంలో ఆస్పత్రిలో చికిత్స తర్వాత ఫాలో అప్ కోసం ఒక్కో పరీక్షకు రూ.15,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. వైద్యుల సూచనల మేరకు అవసరమైనంత కాలం పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే గుండె జబ్బుల్లో అయితే, ప్రతీ ఫాలో అప్‌కు కనీసం రూ.1,000 తక్కువ కాకుండా ఖర్చవుతుంది. సీటీ స్కాన్ ఖరీదు రూ.10,000–15,000 వరకు ఉంటుంది. అవయవ మార్పిడి కేసుల్లో ప్రతీ నెలా కనీసం రూ.5,000 తక్కువ కాకుండా మందులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కనుక బీమా తీసుకునే వారు ఈ వ్యయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక లక్ష్యాలకూ బీమా బాసట ► యువ పాలసీదారులపై మరింత దృష్టి ► బజాజ్ అలియంజ్ లైఫ్ ఎండీ తరుణ్ చుగ్ ఆర్థిక లక్ష్యాల సాధనకు కూడా జీవిత బీమా పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయని బజాజ్ అలియంజ్ ఎండీ తరుణ్ చుగ్ తెలిపారు. వైవిధ్యమైన జీవిత బీమా పాలసీలు అందుబాటులోకి రావడంతో ఆర్థిక లక్ష్యాల సాధన కోసం యువ జనాభాలో ఎక్కువ శాతం మంది పెట్టుబడుల కోసం వీటివైపు మొగ్గు చూపుతున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాలసీల విక్రయాలకు సంబంధించి మిలీనియల్స్‌పై మరింత దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. వారికి అనువైన కొత్త తరహా పాలసీలు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే బీమా కవరేజీని లెక్కించడం నుంచి పాలసీ కొనుగోలు, రెన్యువల్ ప్రీమియంల చెల్లింపు దాకా అన్నింటినీ సులభతరం చేసేలా యాప్స్, కాల్క్యులేటర్స్ను అందుబాటులో ఉంచినట్లు చుగ్ చెప్పారు. రిటైర్మెంట్ లాంటి లక్ష్యాలు దీర్ఘకాలికమైనవే అయినప్పటికీ యువత కెరియర్ తొలినాళ్ల నుంచే వీటి కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం ముఖ్యమని ఆయన తెలిపారు. సాధ్యమైనంత ముందుగానే పాలసీ తీసుకోవడం వల్ల దీర్ఘకాలం కవరేజీ లభించడంతో పాటు ప్రీమియం కూడా తక్కువగా ఉంటుందని చుగ్ వివరించారు. మరణానంతర ప్రయోజనాల కన్నా జీవిత లక్ష్యాల సాధనలో బీమా పాలసీలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై అవగాహన కల్పించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. క్యూ1లో 40 శాతం వృద్ధి... ఈ ఆర్థిక సంవత్సరం తమ సంస్థకు సంబంధించి తొలి త్రైమాసికంలో కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం పెరిగిందని చెప్పారు. ఈ విభాగంలో జీవిత బీమా రంగం సగటు వృద్ధి 32 శాతంగా ఉందని పేర్కొన్నారు. విస్తృతమైన నెట్వర్క్, విభిన్నమైన పథకాలు, పాలసీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు మరిన్ని పెట్టుబడులు కొనసాగిస్తుండటం ఇందుకు దోహదపడిందని చెప్పారు. రాబోయే రోజుల్లో పేమెంట్ బ్యాంకులు, ఆన్లైన్ వేదికలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు దేశీయంగా జీవిత బీమా పాలసీల విక్రయాలు మరింతగా పెరిగేందుకు తోడ్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైనంత రక్షణ మన దేశంలో వైద్య బీమా తీసుకునే వారి సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. వైద్య బీమా అన్నదానిని ఇప్పటికీ పన్ను ఆదా సాధనంగా చూసే వారున్నారు. కాకపోతే మిలీనియల్స్ (యువత)లో ఈ ధోరణి మారుతోందన్నారు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అండ్ హెల్త్ క్లెయిమ్స్ హెడ్ పి.భవే. అయితే, ఇటీవలి కాలంలో పెరుగుతున్న ప్రచారం కారణంగా.. రూ.3.5–4 లక్షలుగా సగటు బీమా కవరేజీ ఉంటోంది. ‘‘చాలా ఆరోగ్య సమస్యల్లో ఖర్చు రూ.3 నుంచి రూ.4 లక్షలుగా ఉంటోంది. కనుక కనీసం రూ.5 లక్షల వైద్య బీమాకు తోడు టాపప్ పాలసీ కూడా తీసుకోవడాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి’’ అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ క్లెయిమ్స్ హెడ్ భాస్కర్ నెరుర్కార్ సూచించారు. బేసిక్ పాలసీ కవరేజీ ఏదైనా ఒక ఏడాదిలో పూర్తయిపోయి వైద్య చికిత్సలకు అదనంగా ఖర్చు అయితే అటువంటి సందర్భాల్లో టాపప్ పాలసీ ఆదుకుంటుంది. కనీసం రూ.10 లక్షల కవరేజీకి టాపప్ పాలసీ తీసుకోవాలన్నది ఆప్టే సూచన. అత్యాధునిక పరికరాలతో సంక్లిష్టమైన అవయవ మార్పిడి చికిత్సలు, బైపాస్, కేన్సర్ చికిత్సలు కూడా చేస్తుండడంతో కనీసం ఈ మాత్రం టాపప్ అవసరమని ఆప్టే పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులున్న కుటుంబంలో ఇంటి పెద్ద వయసు 40 ఏళ్లుగా ఉంటే, కనీసం రూ.5 లక్షలకు హెల్త్ కవరేజీతో పాలసీ తీసుకోవాలి. ప్రతీ ఐదేళ్లకోసారి దీన్ని సమీక్షించి అవసరమైనంత పెంచుకోవాలన్నది నిపుణుల సూచన. దీనికితోడు క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కూడా తీసుకోవడం వల్ల ఆయా సమస్యల బారిన పడితే ఏక మొత్తంలో పరిహారం అందుకోవచ్చు. విడిగా ఓ వైద్య నిధిని కూడా సమకూర్చుకోవడం మంచిది. పాలసీలో కవర్ కాని వాటికి ఖర్చు చేసేందుకు అక్కరకు వస్తుంది. కుటుంబ సభ్యులు, ఆరోగ్య చరిత్ర ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తగినంత వైద్య బీమా కవరేజీతో పాలసీ తీసుకోవడం ద్వారా ఆర్థికంగా గుల్ల కాకుండా చూసుకోవచ్చు. -
పెద్దలకూ హెల్త్ పాలసీ
చెన్నైకి చెందిన సుమీత్ (60) ఇటీవలే పదవీ విరమణ చేశాడు. ప్రైవేటు రంగంలో పనిచేసినంత కాలం సంస్థ తరఫున గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అతడి కుటుంబ సభ్యుల అవసరాలను ఆదుకుంది. కానీ, ఉద్యోగానికి విరామం తీసుకోవడంతో ఇకపై తనకు హెల్త్ కవరేజీ ఉండదన్న విషయం తెలుసుకుని అతడు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. పోనీ, ఈ వయసులో హెల్త్ పాలసీ తీసుకుందామనుకున్నా... అతి సాధ్యమేనా? అన్నది అతడి సందేహం. అప్పటికే సుమీత్కు అధిక రక్తపోటు సమస్య కూడా ఉంది. ఈ పరిస్థితి సుమీత్ ఒక్కడికే కాదు... ఎంతో మందికి ఎదురయ్యేదే. కానీ, పరిస్థితులు మారాయి. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ పాలసీలను నేడు ఎన్నో కంపెనీలు అందిస్తున్నాయి. కాకపోతే, ఏ పాలసీ తీసుకోవాలన్నది తేల్చుకోవాలంటే, వాటికి సంబంధించి అన్ని అంశాలనూ తెలుసుకోవాలి. వాటిని తెలియజేసే ఆరోగ్య కథనమే ఇది. ఖరీదైనా సరే... సాధారణ పాలసీలు అయితే వయసురీత్యా ప్రవేశానికి పరిమితులు ఉంటున్నాయి. ఈ పాలసీలను 60–65 ఏళ్ల తర్వాత తీసుకోవడం కష్టమే. అదే సీనియర్ సిటిజన్ పాలసీలు అయితే, ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. ‘‘మా సీనియర్ సిటిజన్ పాలసీ చాలా పెద్ద వయసులో అంటే 65–74 మధ్యనున్న వారు కూడా తీసుకోవచ్చు’’ అని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ జాయింట్ ఎండీ ఎస్.ప్రకాష్ తెలిపారు. అయితే, పెద్ద వయసులో లభించే హెల్త్ పాలసీల ప్రీమియం చౌకగా మాత్రం ఉండదు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ‘‘కాస్త చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనం లభిస్తుంది. ముందస్తు వ్యాధుల కవరేజీ కోసం వారు వేచి ఉండాల్సిన ఇబ్బంది తప్పుతుంది’’ అని జేఎల్టీ ఇండిపెండెంట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లీడ్ పార్ట్నర్ అర్హత్గోటడ్కే తెలిపారు. అయితే, ప్రీమియం ఎక్కువైనా కానీ సీనియర్ సిటిజన్లు అనారోగ్యం కారణంగా ఆర్థికంగా గుల్ల కాకుండా ఉండేందుకు హెల్త్ పాలసీ తీసుకోడమే సరైనదన్నది నిపుణులు ఇచ్చే సలహా. ప్రీమియం రూ.25,000– 30,000 ఖరీదుగా భావించొచ్చు. అత్యవసర నిధి కలిగి ఉన్న వారు సైతం హెల్త్ పాలసీ తీసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఏదైనా పెద్ద వ్యాధి బారిన పడితే మీ మొత్తం నిధి అంతా కరిగిపోవచ్చు. అందువల్ల పెద్దలకు పాలసీనే ఎంతో శ్రేయస్కరమని నిపుణుల సూచన. అపోహలు అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులకు హెల్త్ పాలసీలు లభించడం కష్టమని చాలా మంది భావిస్తుంటారు. కష్టమైనా కానీ, హెల్త్ కవరేజీ పొందడం అసాధ్యమేమీ కాదని బ్యాంక్ బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నవీన్ చందాని అన్నారు. వేతన జీవుల్లో ఎక్కువ మంది సాధారణంగా తమ వృద్ధులైన తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా పాలసీ తీసుకోరు. గ్రూపు హెల్త్ పాలసీలో వారికి కూడా కవరేజీ ఉండడం వల్లే అలా చేస్తుంటారు. ‘‘కార్పొరేట్ హెల్త్ కవరేజీ రూ.2–5 లక్షలకు మించదు. కనుక ఇది సరిపోదు. ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా లేక ఉద్యోగం వీడి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఏం చేస్తారు?’’ అని ప్రశ్నించారు బత్వాల్. అలాగే, వృద్ధులు తమ దృష్టికి వచ్చిన హెల్త్‌పాలసీ తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. అయితే, అలా చేయడానికి ముందు అందులో ఉన్న ప్రయోజనాలు, మినహాయింపులు అన్నింటినీ తెలుసుకోవాలన్నది నిపుణుల సూచన. ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉంటున్నాయని, అన్నింటినీ పరిశీలించిన తర్వాతే తమకు అనువైన పాలసీని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పెద్ద వయసులో తీసుకునే పాలసీలో ముఖ్యంగా చూడాల్సినది బీమా కవరేజీ మొత్తం పెంచుకోవడానికి అవకాశం ఉందా? అని. పైలట్ పాలసీ కాకుండా పూర్తి స్థాయి పాలసీ తీసుకోవాలి. అప్పటికే ఉన్న వ్యాధుల కవరేజీకి ఎంత కాలం వేచి ఉండాలన్నది కూడా పరిశీలించాలి. ‘‘ఇది 18 నెలల నుంచి నాలుగేళ్ల వరకు ఉంటుంది. తక్కువ వెయిటేజీ పీరియడ్ ఉన్న పాలసీని ఎంచుకోవాలి’’ అని సింబో ఇన్సూరెన్స్ సీఈవో అనిక్ జైన్ సూచించారు. ఇక సీనియర్ సిటిజన్ పాలసీల్లో కోపేమెంట్ (క్లెయిమ్‌లో పాలసీదారులు తమ వంతు వెచ్చించాల్సిన మొత్తం) ఎక్కువగా ఉంటుంది. ‘‘10 శాతం కోపేమెంట్ అయితే ఫర్వాలేదు. 30 శాతం అయితే చాలా కష్టమవుతుంది’’ అని జైన్ అన్నారు. అన్ని వివరాలు వెల్లడించడమే మేలు హెల్త్ పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఓ పేపర్‌పై మీకున్న ఆరోగ్య సమస్యల వివరాలన్నీ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత హెల్త్‌పాలసీ ప్రపోజల్ ఫామ్‌లో ఆ వివరాలన్నింటినీ వెల్లడించడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే పూర్తి వివరాలు వెల్లడించకపోవడం క్లెయిమ్‌లు తిరస్కరణకు కారణమవుతున్న వాటిల్లో ముఖ్యమైనది. పాలసీ పత్రంలోని అన్ని నియమ, నిబంధనలు, షరతులను పూర్తిగా చదవడం మంచిది. ప్రపోజల్ తిరస్కరణ సీనియర్ సిటిజన్ పాలసీల్లో ప్రపోజల్ తిరస్కరణ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ ఒక కంపెనీ పాలసీ ప్రపోజల్‌ను తిరస్కరిస్తే, మరో కంపెనీ నుంచి పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ, ఈ వయసులో రాదులేనన్న అపోహతో ఆగిపోవద్దు. ఎందుకంటే ఒక్కో కంపెనీకి భిన్నమైన అండర్‌రైటింగ్ విధానాలు ఉండొచ్చు. ఒక కంపెనీ రిస్కీ ప్రపోజల్‌ను కాదనుకుంటే, మరో బీమా కంపెనీ అదే తరహా రిస్కీ కేసులకు పాలసీలను జారీ చేయవచ్చు. ఒకవేళ విడిగా పాలసీ పొందలేకపోతే, అప్పుడు బ్యాంకు ఖాతాదారునిగా గ్రూపు హెల్త్ పాలసీ కోసం ప్రయత్నించొచ్చని జైన్ సూచించారు. ఏ మార్గంలోనూ పాలసీ లభించని వారి ముందున్న మార్గం వైద్య అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడమే. -
ఆరోగ్యానికి... రెండు పాలసీలు!
♦ నచ్చిన కంపెనీ నుంచి పరిహారం కోరొచ్చు ♦ మొదట కంపెనీ గ్రూప్ పాలసీని క్లెయిమ్ చేస్తేనే బెటర్ ♦ వైద్య బిల్లు పరిమితి దాటిపోయినా కంగారక్కర్లేదు ♦ ఒక పాలసీ పరిమితి అయిపోతే రెండోది వాడొచ్చు మన దేశంలో ఒక్క హెల్త్ పాలసీ కూడా లేని వారు ఇప్పటికీ అత్యధికంగానే ఉన్నారు. కాకపోతే ముందు జాగ్రత్తతో రెండు పాలసీలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. సాధారణంగా ఉద్యోగస్తులకు పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ పాలసీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనివల్ల అన్ని అవసరాలూ తీరకపోవచ్చు. పైగా ఉన్నట్టుండి కంపెనీని వీడాల్సి వస్తే హెల్త్ కవరేజీ కూడా ఆగిపోతుంది. అందుకే ఉద్యోగులు విడిగా ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా అవివాహితులైతే వ్యక్తిగత హెల్త్ పాలసీ తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. ఇలా రెండు పాలసీలున్నప్పుడు వాటికి సంబంధించిన కవరేజీ ప్రయోజనాలు వేర్వేరుగా ఉండొచ్చు. తగినంత కవరేజీ ఉండాలి... ఒకటికి మించి పాలసీలు తీసుకునే సమయంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. అన్నీ ఒకే తరహాలో ఉండడం అంత ప్రయోజనకరం కాదు. వేటికవే ప్రత్యేక ప్రయోజనాలతో ఉండేలా ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఏ తరహా వైద్య అవసరాలు ఏర్పడినా ఒకటి కాకుంటే మరొకటైనా కవర్ చేసేలా ఉండాలి. ఇక మొదటి పాలసీ గురించి రెండో పాలసీ జారీ చేసే కంపెనీకి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. పరిహారం చెల్లింపులో ఇది కీలకాంశం అవుతుందన్నది భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ చీఫ్ పరాగ్ గుప్తా మాట. ఇక ఒకటికి మించిన పాలసీలు తీసుకునే వారు పారదర్శకంగా అన్ని వివరాలనూ పాలసీ దరఖాస్తులో పేర్కొనడం, ముందు నుంచీ ఉన్న వ్యాధుల సమాచారాన్ని తెలియజేయడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. అన్ని పాలసీలు ఒకేలా ఉండవు హెల్త్ పాలసీల్లో మెడిక్లెయిమ్ పాలసీలు నష్ట పరిహారం చెల్లించేవి. అంటే ఇండెమ్నిటీ అన్నమాట. హాస్పిటల్లో అయిన వైద్య ఖర్చుల బిల్లులను బీమా కంపెనీలు గరిష్ట పరిమితి మేరకు చెల్లిస్తాయి. మరో రకం డిఫైన్డ్ బెనిఫిట్ (క్రిటికల్ ఇల్నెస్) పాలసీలు. ఏదైనా అనారోగ్యం బయటపడిన వెంటనే మొత్తం బీమాను చెల్లించేస్తాయి. ఈ నేపథ్యంలో ఒకటికి మించిన ఇండెమ్నిటీ కవరేజీ పాలసీలు ఉన్నవారు ఆయా బీమా కంపెనీల్లో దేని నుంచైనా పరిహారం పొందొచ్చు. అంతేకానీ, పరిహారం కోసం రెండు బీమా కంపెనీలనూ సంప్రతించడం తప్పనిసరి కాదు. పాలసీదారుడి ఇష్టం మేరకు తనకు ఇండెమ్నిటీ పాలసీలున్న ఏ కంపెనీ నుంచైనా పరిహారం పొందేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఉదాహరణకు రూ.2 లక్షల బిల్లయితే రెండు బీమా పాలసీలున్నవారు ఒక్కో బీమా కంపెనీ నుంచి రూ.లక్ష చొప్పున తీసుకోవాల్సిన ఇబ్బందేమీ లేదు. గతంలో ఈ విధానం ఉండేది. ఒకటికి మించిన పాలసీలుంటే పరిహారాన్ని బీమా నిష్పత్తి మేరకు కంపెనీలు చెల్లించేవి. ప్రయోజనాలు ఎక్కువే... ఒకటికి మించిన పాలసీలు ఉండడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఉదాహరణకు ఆస్పత్రి పాలై రూ.2 లక్షల బిల్లు అయిందనుకోండి. క్లెయిమ్ సందర్భంలో బీమా కంపెనీ రూ.2 లక్షల పరిహారం ఇవ్వకుండా ఏవేవో నిబంధనల సాకుతో రూ.1.50 లక్షలే చెల్లించొచ్చు. అప్పుడు మిగిలిన రూ.50 వేలను చెల్లించాలని కోరుతూ పాలసీదారుడు మరో కంపెనీని ఆశ్రయించొచ్చు. ఇది పాలసీదారుడి హక్కు అని ఐఆర్డీఏ ఇప్పటికే స్పష్టం చేసింది. రూ.2 లక్షల చొప్పున రెండు హెల్త్ పాలసీలున్నాయి. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే రూ.3 లక్షల బిల్లు వచ్చిందనుకోండి. ఓ బీమా కంపెనీ నుంచి రూ.2 లక్షల వరకే పరిహారం వస్తుంది. అప్పుడు మిగిలిన రూ.లక్షను మరో బీమా కంపెనీ నుంచి పొందే అవకాశం ఉంది. ఒకటికి మించిన ఫిక్స్డ్ బెనిఫిట్ ప్లాన్లు ఉంటే? క్రిటికల్ ఇల్నెస్ పాలసీలే ఫిక్స్డ్ బెనిఫిట్ ప్లాన్లు. ఇవి జీవిత బీమాకు రైడర్‌గానూ, విడిగా స్టాండలోన్ పాలసీగానూ తీసుకోవచ్చు. ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం ఈ తరహా పాలసీల్లో పరిహారం కోసం వచ్చే క్లెయిమ్‌లను అన్ని బీమా కంపెనీలు ఆమోదించాల్సి ఉంటుంది. క్లెయిమ్ ప్రక్రియ ఇదీ... సాధారణంగా బీమా కంపెనీలు పరిహా రం చెల్లించేందుకు ఒరిజినల్ బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీని తప్పకుండా సమర్పించాలని కోరతాయి. పరిహారం ఒకే బీమా కంపెనీ నుంచి తీసుకుంటుంటే ఈ విషయంలో సమస్య ఏమీ ఉండదు. కానీ, ఒకటికి మించిన బీమా కంపెనీల నుంచి పరిహారం కోరాల్సి వస్తే ఒరిజినల్ బిల్లులు, ఒరిజినల్ డిశ్చార్జ్ సమ్మరీలు అన్నింటికీ సమర్పించడం సాధ్యం కాదు. అప్పుడు మొదట ఒక బీమా కంపెనీ నుంచి పరిహారం తీసుకున్న తర్వాత ఆ కంపెనీ జారీ చేసే ఒరిజినల్ సెటిల్మెంట్ లెటర్‌తోపాటు బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీ జిరాక్స్ కాపీలపై స్వయంగా అటెస్టేషన్ చేసి సమర్పించాల్సి ఉంటుందని భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ చీఫ్ పరాగ్ గుప్తా తెలిపారు. పరిహారం కోసం దేన్ని ఎంచుకోవాలి? పాలసీదారులకు ఒకటికి మించిన పాలసీలు ఉన్నప్పటికీ ఏదో ఒక బీమా కంపెనీని పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయొచ్చని చెప్పుకున్నాం. అయితే, ఉన్న పాలసీల్లో ఏ కంపెనీని ఎంచుకోవాలి? అన్న ప్రశ్న ఉదయించొచ్చు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే నో క్లెయిమ్ బోనస్ కోల్పోవాల్సి వస్తుంది. అలాగే, ఏదేనీ పరిహారం కోసం వెయిటింగ్ పీరియడ్‌లో ఉండి ఉండొచ్చు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు విడిగా మరో హెల్త్ పాలసీ ఉన్న వారు... నిస్సంకోచంగా గ్రూప్ హెల్త్ పాలసీ కంపెనీ నుంచి ముందుగా పరిహారం పొందాలన్నది నిపుణుల సూచన. ఎందుకంటే గ్రూప్ పాలసీల్లో నో క్లెయిమ్ బోనస్ తరహా ఎటువంటి ప్రయోజనాలూ ఉండవు. పైగా గ్రూప్ పాలసీలు రిటైల్ పాలసీలతో పోలిస్తే విస్తృత కవరేజీనిచ్చేవిధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
మహిళకూ ఆరోగ్య బీమా అవసరమే..
మహిళలూ ప్రస్తుతం బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. హోమ్మేకర్గా తన ఇళ్లు, కుటుంబ భద్రతకు ఆమె ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగంలో వృత్తిపరమైన బరువు బాధ్యతలను మోస్తున్నారు. ఇలా ప్రతి విషయం, విభాగంలో ఒక స్వతంత్ర నిర్ణేతగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె సైతం తన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడానికి, ఆయా సందర్భాల్లో సమస్యలను అధిగమించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైద్య వ్యయాల భారం... తరచూ చేయించుకునే ఆరోగ్య పరీక్షలు... క్రమం తప్పని వ్యాయామ ప్రణాళికలు... ఆరోగ్యవంతమైన ఆహారం ఇవన్నీ సరే. ఒక్కొక్కసారి ఆరోగ్యసమస్యలు అనుకోకుండా వచ్చిపడతాయి. అందుకు పలు కారణాలు ఉండవచ్చు. ఇలాంటి సమస్యను కూడా ఎదుర్కొనగలిగే స్థాయిలో ప్రణాళికలు రూపొం దించుకోవాల్సిన అవసరం ఉంది. కేన్సర్, బ్యాక్టీరియా పరమైన తీవ్ర ఇన్ఫెక్షన్లు, బ్రెయిన్ ఫీవర్ వంటి సమస్యలు ఆరోగ్యాన్ని ప్రమాదాల్లో పడేస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్ మహిళలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతున్న అంశమని టాటా మెమోరియల్ సెంటర్ ఇటీవలి ఒక అధ్యయనంలో తేల్చింది. మరో సమస్యాత్మకమైనది సర్వికల్ కేన్సర్. దీనివల్ల వార్షికంగా దాదాపు 74,000 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. ఆయా వ్యాధుల బారిన పడితే వైద్య వ్యయాలు భరించలేని భారంగా మారుతున్నాయి. నేటి మహిళ ఇంటి పనులకే పరిమితం కావడంలేదు. ఒకవేళ ఇంట్లోనే ఉంటున్నా... కుట్లో... అల్లికలో... ఇలా ఏదో ఒక కష్టంచేసి... ఎంతోకొంత సంపాదిస్తున్నారు. ఒక్కొక్క సందర్భాల్లో వీరి రెక్కల కష్టమే సంసారం గడవడానికి సాధనమవుతోంది. ఇలాంటి మహిళల విషయంలో ఆమె ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే... మొత్తం కుటుంబంపై ఈ ప్రతికూల పరిస్థితి పడుతుంది. ‘క్రిటికల్ ఇల్నెస్’ బీమా... ధీమా ఈ నేపథ్యంలో మహిళలకూ ఆరోగ్య బీమా అవసరం ఎంతో ఉందని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అయితే మామూలు ఆరోగ్య బీమా పాలసీలు వైద్య అవసరాలను పెద్దగా తీర్చలేకపోవచ్చు. ముఖ్యంగా ‘తీవ్ర వ్యాధుల’ (క్రిటికల్ ఇల్నెస్) సమస్యలు ఎదురయినప్పుడు ఆయా ఇబ్బందులను అధిగమించడానికి ‘క్రిటికల్ ఇల్నెస్’ రైడర్లతో సమగ్ర పాలసీలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ప్రయోజనాలు అపారం. ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి ‘తీసుకున్న బీమా మొత్తం అంతా చెల్లించేలా’(లమ్సమ్) బీమా కంపెనీలు ప్రొడక్టులు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇవి ఒక్కొక్క సందర్భంలో ఆసుపత్రి వ్యయాలకే సరిపోని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ‘క్రిటికల్ ఇల్నెస్’ రైడర్‌తో కూడిన ఆరోగ్య బీమా పాలసీల ఎంపిక అవసరం. అవసరాలకు తగిన పాలసీలు... పలు బీమా కంపెనీలు ప్రస్తుతం మహిళల ఆరోగ్యానికి, వ్యాధులకు సంబంధించిన ప్రత్యేక బీమా ప్రొడక్టులను అందిస్తున్నాయి. బ్రెస్ట్ కేన్సర్, ఫ్యాలోపియన్ ట్యూబ్ కేన్సర్, యూటెరిన్ కేన్సర్, ఓవేరియన్ కేన్సర్, వెజైనల్ కేన్సర్, సర్వికల్ కేన్సర్ వంటి వ్యాధులను కవర్ చేసే బీమా ప్రొడక్టులు ఇందులో ఉన్నాయి. ఆసుపత్రిలో, అటుపై డిశ్చార్జ్ అనంతరం వ్యయాలను సైతం కవర్చేసే ప్రొడక్టులు ఉన్నాయి. వ్యక్తిగత ప్రమాద బీమా, పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్... వంటివి కూడా ప్రత్యేకంగా మహిళలకు ఉద్దేశించినవి ఉన్నాయి. లమ్సమ్ (ఏకమొత్తం) నుంచి రికవరీ సమయంలో ప్రయోజనం చేకూర్చేలా... అంటే ఈఎంఐ, స్కూల్ ఫీజులు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, రోజూవారీ జీవన వ్యయాల వరకూ కవర్చేసే ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికీ తోడు... హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి చెల్లించే ప్రీమియంలు ఆదాయపు పన్ను శాఖ 80డీ సెక్షన్ కిందకు కూడా వచ్చే విషయం ఇక్కడ ప్రస్తావనాంశం. అవసరాలకు అనుగుణంగా ఈ ప్రొడక్టులను వినియోగించుకుంటే... మీ కుటుంబ ఆర్థిక ఆరోగ్యానికి ‘బీమా’ రక్ష. డివిడెండ్ ధమాకా రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు భారీ డివిడెండ్లను ప్రకటిస్తున్నాయి. టాటా మ్యూచువల్ ఫండ్ ప్యూరీ ఈక్విటీ పథకంపై 40 శాతం, యూటీఐ ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌పై 22 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్స్‌కు రికార్డు తేదీ జనవరి 19గా నిర్ణయించారు. ఈ తేదీ నాటికి యూనిట్లు కలిగి వున్న వారికి ప్రతీ యూనిట్‌పై టాటా ఈక్విటీ ఫండ్ రూ. 4.4, యూటీఐ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ రూ. 2.2 డివిడెండ్ లభిస్తుంది. ఐసీఐసీఐ ఎంఎఫ్‌కి గుర్తింపు 2014 సంవత్సరానికి గాను అత్యుత్తమ ఫండ్ హౌస్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎంపికయ్యింది. ఆసియాలో గత 12 ఏళ్లుగా మంచి పనితీరును కనపరుస్తున్నందుకు గాను ఆసియా అసెట్ మేనేజ్మెంట్ జర్నల్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కొటక్ బ్యాంక్ సోషల్ సేవింగ్ సోషల్ నెట్వర్క్ సైట్స్ ఫేస్బుక్, ట్వీటర్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన కొటక్ మహీంద్రా బ్యాంక్ ‘జిఫి సేవర్’ పేరుతో సోషల్ సేవింగ్ అకౌంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లక్ష కన్నా ఎక్కువ డిపాజిట్ చేసిన మొత్తంపై 6%, అంతకంటే తక్కువ మొత్తంపై 5% వడ్డీని జిఫి సేవర్ అందిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ ఖాతాదారుల్లో 20-25% మంది ట్విట్టర్, ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు.