ఆరోగ్యంపై ముందే మేల్కొంటేనే.. | choose the right health insurance policy | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై ముందే మేల్కొంటేనే..

Published Mon, Oct 14 2019 4:27 AM | Last Updated on Mon, Oct 14 2019 5:03 AM

choose the right health insurance policy - Sakshi

పెద్ద వయసులోనే వైద్య బీమా (హెల్త్‌ ప్లాన్‌) అవసరమని చాలా మంది భావిస్తుంటారు. నేటి జీవన శైలి, పర్యావరణ కాలుష్యం, ఉద్యోగ పని స్వభావాల నేపథ్యంలో చిన్న వయసు నుంచే హెల్త్‌ కవరేజీ ఎంతో అవసరమన్న విషయాన్ని ఇప్పటికీ ఎక్కువ మంది గుర్తించడం లేదు. ఆరోగ్య బీమా పరిశ్రమ క్లెయిమ్‌ గణాంకాలను పరిశీలిస్తే... చిన్న వయసులోనే బీమా అవసరం ఎంతో ఉందని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. పైగా చికిత్సల వ్యయాలు ఇప్పటికే చాలా ఖరీదుగా ఉండగా, భవిష్యత్తులో ఇవి ఇంకా ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించలేం. కనుక ఆర్జన ఆరంభమైన నాడే వైద్య బీమా తీసుకోవడం ఎంతైనా అవసరం.

ఐసీఐసీఐ లాంబార్డ్‌ బీమా సంస్థ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లను పరిశీలిస్తే.. జీర్ణ సంబంధిత, జననేంద్రియ, మూత్ర సంబంధిత, ఇన్ఫెక్షన్‌ వ్యాధులకు సంబంధించినవే మొత్తం క్లెయిమ్‌లలో 45 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బజాజ్‌ అలియంజ్‌ గణాంకాలను చూస్తే.. జ్వరాలు, ఇన్ఫెక్షన్ల కారణంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్, డెంగ్యూ ఫీవర్‌ కారణంగా ఎక్కువ క్లెయిమ్‌లు వచ్చాయి. మరో సంస్థ రాయల్‌ సుందరం క్లెయిమ్‌ల్లోనూ జ్వరాలు, ఇన్ఫెక్షన్లకు సంబంధించిన క్లెయిమ్‌లు 30 శాతంగా ఉన్నాయి. తీవ్ర ఆరోగ్య సమస్యలు (గుండెపోటు, స్ట్రోక్, కేన్సర్, మూత్రపిండాల వైఫల్యం తదితర) తలెత్తితే పడే ఆర్థిక భారం అంతా ఇంతా కాదు. ఒక కుటుంబంలో ఒకరికి మించిన సభ్యులకు ఈ సమస్యలు ఒకేసారి ఎదురైతే పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారుతుంది.

మొత్తం మీద సర్వసాధారణంగా మనకు వ్యాపించే ఇన్ఫెక్షన్లు, గాయాలు, జీర్ణ సంబంధిత సమస్యలకు సంబంధించిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు 30 శాతంగా ఉండడాన్ని గమనించాలి. బీమా లేకపోతే వీటి కారణంగా పడే ఆర్థిక భారం గణనీయంగా ఉంటుంది. ఐసీఐసీఐ లాంబార్డ్‌ సంస్థ క్లెయిమ్‌లను పరిశీలిస్తే.. కేన్సర్‌ చికిత్సల కోసం సగటు క్లెయిమ్‌ సైజు రూ.77,000గా ఉంది. అదే మస్కులోస్కెలెటల్‌(కండర) సంబంధిత సమస్యల కారణంగా సగటు క్లెయిమ్‌ రూ.1.26  లక్షలుగా ఉంది. 60–65 ఏళ్లు దాటిన వారి నుంచి మస్కులోస్కెలెటల్, ఆస్టియోపోరోసిస్, జాయింట్‌ సంబంధిత క్లెయిమ్‌లు ఎక్కువగా ఉంటుంటాయి. కేన్సర్‌ కంటే వీటికి ఎక్కువ పరిహారం చెల్లించాల్సి వస్తోంది. బీమా అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

చిన్న వయసులోనే...
చిన్న నాటి నుంచే హెల్త్‌ కవరేజీ ఎందుకులే, ఈ వయసులో ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఏవీ రావుగా..?! అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఇక ఉద్యోగులు తమ సంస్థ నుంచి ఎంతో కొంత హెల్త్‌ కవరేజీ ఉందిలేనన్న ఆలోచనతో అదనంగా కవరేజీ తీసుకునేందుకు ఇష్టపడరు. వయసుతో సంబంధం లేనివి.. గాయాలు, ఆహార విషతుల్యం కారణంగా వచ్చిన క్లెయిమ్‌లు 19–35 సంవత్సరాల విభాగంలో 43 శాతంగా ఉన్నాయి. ఇక ఇన్ఫెక్షన్ల కారణంగా ఎదురయ్యే క్లెయిమ్‌లు కూడా ఇదే వయసు వారి నుంచి వచ్చే మొత్తం క్లెయిమ్‌లలో 42 శాతంగా ఉన్నాయి. ఇక యువతలో ఎక్కువ క్లెయిమ్‌లు ప్రమాదాలకు సంబంధించినవీ ఉంటున్నాయి. ‘‘25 ఏళ్లలోపు వయసున్న వారు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే ధోరణితో ఉంటారు.

ఈ వయసు వారి నుంచి వచ్చే క్లెయిమ్‌లు మొత్తం ప్రమాదాల కారణంగా పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లలో 30 శాతంగా ఉంటోంది. సగటు క్లెయిమ్‌ రూ. 55,000’’అని రాయల్‌ సుందరం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ నిఖిల్‌ ఆప్టే తెలిపారు. ఒకవేళ హెల్త్‌ పాలసీ ప్రీమియం భారంగా అనిపిస్తే.. చిన్న వయసులో ఆదాయం తక్కువగా ఉన్న వారు కనీసం చౌకగా వచ్చే ప్రమాద బీమా పాలసీని అయినా తీసుకోవడం మంచిది.  ‘‘పెద్ద వయసు వారితో పోలిస్తే.. యువతీ, యువకులు ఉద్యోగం చేసే వారు బయటి వాతావరణానికి ఎక్కువగా గురవుతుంటారు. దీంతో వీరు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే, యువతీ, యువకులు వ్యక్తిగత హెల్త్‌ పాలసీలను ముందుగానే తీసుకోవడం తక్కువే’’ అని సెక్యూర్‌నౌ సీఈవో కపిల్‌ మెహతా పేర్కొన్నారు.

భవిష్యత్తు వ్యయాలు
రానున్న ఐదేళ్ల కాలంలో శ్వాస కోçశవ్యాధులు, గుండె జబ్బులు, మస్కులోస్కెలెటల్, కేన్సర్, ప్రమాదాలు, జననేంద్రియ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని బీమా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘‘గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాల్లో పెరుగుదల 100 శాతంగా ఉంది. ఈ విభాగంలో ఎక్కువగా కనిపించేవి లోయర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా. పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో, దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా ఉందని ఇది తెలియజేస్తోంది’’ అని నిఖిల్‌ ఆప్టే పేర్కొన్నారు. ఇక ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాలతో ఆర్థరైటిస్‌ బారిన పడడం పెరుగుతోంది. దీంతో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. డబ్బులను గుల్ల చేసే పెద్ద ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బులు, కేన్సర్‌ ఉంటున్నాయి.

భవిష్యత్తులోనూ వీటి చికిత్సల వ్యయాలు ఇంకా పెరిగే అవకాశమే ఉంది. ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలే కాకుండా, తదనంతరం ఆ సమస్యకు సంబంధించి అయ్యే ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు కేన్సర్‌ విషయంలో ఆస్పత్రిలో చికిత్స తర్వాత ఫాలో అప్‌ కోసం ఒక్కో పరీక్షకు రూ.15,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. వైద్యుల సూచనల మేరకు అవసరమైనంత కాలం పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే గుండె జబ్బుల్లో అయితే, ప్రతీ ఫాలో అప్‌కు కనీసం రూ.1,000 తక్కువ కాకుండా ఖర్చవుతుంది. సీటీ స్కాన్‌ ఖరీదు రూ.10,000–15,000 వరకు ఉంటుంది. అవయవ మార్పిడి కేసుల్లో ప్రతీ నెలా కనీసం రూ.5,000 తక్కువ కాకుండా మందులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కనుక బీమా తీసుకునే వారు ఈ వ్యయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.  

ఆర్థిక లక్ష్యాలకూ బీమా బాసట
► యువ పాలసీదారులపై మరింత దృష్టి
► బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఎండీ తరుణ్‌ చుగ్‌

ఆర్థిక లక్ష్యాల సాధనకు కూడా జీవిత బీమా పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయని బజాజ్‌ అలియంజ్‌ ఎండీ తరుణ్‌ చుగ్‌ తెలిపారు. వైవిధ్యమైన జీవిత బీమా పాలసీలు అందుబాటులోకి రావడంతో ఆర్థిక లక్ష్యాల సాధన కోసం యువ జనాభాలో ఎక్కువ శాతం మంది పెట్టుబడుల కోసం వీటివైపు మొగ్గు చూపుతున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాలసీల విక్రయాలకు సంబంధించి మిలీనియల్స్‌పై మరింత దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. వారికి అనువైన కొత్త తరహా పాలసీలు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.

అలాగే బీమా కవరేజీని లెక్కించడం నుంచి పాలసీ కొనుగోలు, రెన్యువల్‌ ప్రీమియంల చెల్లింపు దాకా అన్నింటినీ సులభతరం చేసేలా యాప్స్, కాల్‌క్యులేటర్స్‌ను అందుబాటులో ఉంచినట్లు చుగ్‌ చెప్పారు. రిటైర్మెంట్‌ లాంటి లక్ష్యాలు దీర్ఘకాలికమైనవే అయినప్పటికీ యువత కెరియర్‌ తొలినాళ్ల నుంచే వీటి కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం ముఖ్యమని ఆయన తెలిపారు. సాధ్యమైనంత ముందుగానే పాలసీ తీసుకోవడం వల్ల దీర్ఘకాలం కవరేజీ లభించడంతో పాటు ప్రీమియం కూడా తక్కువగా ఉంటుందని చుగ్‌ వివరించారు. మరణానంతర ప్రయోజనాల కన్నా జీవిత లక్ష్యాల సాధనలో బీమా పాలసీలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై అవగాహన కల్పించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు.  

క్యూ1లో 40 శాతం వృద్ధి...
ఈ ఆర్థిక సంవత్సరం తమ సంస్థకు సంబంధించి తొలి త్రైమాసికంలో కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం పెరిగిందని చెప్పారు. ఈ విభాగంలో జీవిత బీమా రంగం సగటు వృద్ధి 32 శాతంగా ఉందని పేర్కొన్నారు. విస్తృతమైన నెట్‌వర్క్, విభిన్నమైన పథకాలు, పాలసీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు మరిన్ని పెట్టుబడులు కొనసాగిస్తుండటం ఇందుకు దోహదపడిందని చెప్పారు. రాబోయే రోజుల్లో పేమెంట్‌ బ్యాంకులు, ఆన్‌లైన్‌ వేదికలు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు దేశీయంగా జీవిత బీమా పాలసీల విక్రయాలు మరింతగా పెరిగేందుకు తోడ్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అవసరమైనంత రక్షణ
మన దేశంలో వైద్య బీమా తీసుకునే వారి సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. వైద్య బీమా అన్నదానిని ఇప్పటికీ పన్ను ఆదా సాధనంగా చూసే వారున్నారు. కాకపోతే మిలీనియల్స్‌ (యువత)లో ఈ ధోరణి మారుతోందన్నారు ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ యాక్సిడెంట్‌ అండ్‌ హెల్త్‌ క్లెయిమ్స్‌ హెడ్‌ పి.భవే. అయితే, ఇటీవలి కాలంలో పెరుగుతున్న ప్రచారం కారణంగా.. రూ.3.5–4 లక్షలుగా సగటు బీమా కవరేజీ ఉంటోంది. ‘‘చాలా ఆరోగ్య సమస్యల్లో ఖర్చు రూ.3 నుంచి రూ.4 లక్షలుగా ఉంటోంది. కనుక కనీసం రూ.5 లక్షల వైద్య బీమాకు తోడు టాపప్‌ పాలసీ కూడా తీసుకోవడాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి’’ అని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ హెల్త్‌ క్లెయిమ్స్‌ హెడ్‌ భాస్కర్‌ నెరుర్కార్‌ సూచించారు.

బేసిక్‌ పాలసీ కవరేజీ ఏదైనా ఒక ఏడాదిలో పూర్తయిపోయి వైద్య చికిత్సలకు అదనంగా ఖర్చు అయితే అటువంటి సందర్భాల్లో టాపప్‌ పాలసీ ఆదుకుంటుంది. కనీసం రూ.10 లక్షల కవరేజీకి టాపప్‌ పాలసీ తీసుకోవాలన్నది ఆప్టే సూచన. అత్యాధునిక పరికరాలతో సంక్లిష్టమైన అవయవ మార్పిడి చికిత్సలు, బైపాస్, కేన్సర్‌ చికిత్సలు కూడా చేస్తుండడంతో కనీసం ఈ మాత్రం టాపప్‌ అవసరమని ఆప్టే పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులున్న కుటుంబంలో ఇంటి పెద్ద వయసు 40 ఏళ్లుగా ఉంటే, కనీసం రూ.5 లక్షలకు హెల్త్‌ కవరేజీతో పాలసీ తీసుకోవాలి. ప్రతీ ఐదేళ్లకోసారి దీన్ని సమీక్షించి అవసరమైనంత పెంచుకోవాలన్నది నిపుణుల సూచన. దీనికితోడు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ కూడా తీసుకోవడం వల్ల ఆయా సమస్యల బారిన పడితే ఏక మొత్తంలో పరిహారం అందుకోవచ్చు. విడిగా ఓ వైద్య నిధిని కూడా సమకూర్చుకోవడం మంచిది. పాలసీలో కవర్‌ కాని వాటికి ఖర్చు చేసేందుకు అక్కరకు వస్తుంది. కుటుంబ సభ్యులు, ఆరోగ్య చరిత్ర ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తగినంత వైద్య బీమా కవరేజీతో పాలసీ తీసుకోవడం ద్వారా ఆర్థికంగా గుల్ల కాకుండా చూసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement