Medical insurance policies
-
ఆరోగ్యంపై ముందే మేల్కొంటేనే..
పెద్ద వయసులోనే వైద్య బీమా (హెల్త్ ప్లాన్) అవసరమని చాలా మంది భావిస్తుంటారు. నేటి జీవన శైలి, పర్యావరణ కాలుష్యం, ఉద్యోగ పని స్వభావాల నేపథ్యంలో చిన్న వయసు నుంచే హెల్త్ కవరేజీ ఎంతో అవసరమన్న విషయాన్ని ఇప్పటికీ ఎక్కువ మంది గుర్తించడం లేదు. ఆరోగ్య బీమా పరిశ్రమ క్లెయిమ్ గణాంకాలను పరిశీలిస్తే... చిన్న వయసులోనే బీమా అవసరం ఎంతో ఉందని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. పైగా చికిత్సల వ్యయాలు ఇప్పటికే చాలా ఖరీదుగా ఉండగా, భవిష్యత్తులో ఇవి ఇంకా ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించలేం. కనుక ఆర్జన ఆరంభమైన నాడే వైద్య బీమా తీసుకోవడం ఎంతైనా అవసరం. ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను పరిశీలిస్తే.. జీర్ణ సంబంధిత, జననేంద్రియ, మూత్ర సంబంధిత, ఇన్ఫెక్షన్ వ్యాధులకు సంబంధించినవే మొత్తం క్లెయిమ్‌లలో 45 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బజాజ్ అలియంజ్ గణాంకాలను చూస్తే.. జ్వరాలు, ఇన్ఫెక్షన్ల కారణంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్, డెంగ్యూ ఫీవర్ కారణంగా ఎక్కువ క్లెయిమ్‌లు వచ్చాయి. మరో సంస్థ రాయల్ సుందరం క్లెయిమ్ల్లోనూ జ్వరాలు, ఇన్ఫెక్షన్లకు సంబంధించిన క్లెయిమ్‌లు 30 శాతంగా ఉన్నాయి. తీవ్ర ఆరోగ్య సమస్యలు (గుండెపోటు, స్ట్రోక్, కేన్సర్, మూత్రపిండాల వైఫల్యం తదితర) తలెత్తితే పడే ఆర్థిక భారం అంతా ఇంతా కాదు. ఒక కుటుంబంలో ఒకరికి మించిన సభ్యులకు ఈ సమస్యలు ఒకేసారి ఎదురైతే పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారుతుంది. మొత్తం మీద సర్వసాధారణంగా మనకు వ్యాపించే ఇన్ఫెక్షన్లు, గాయాలు, జీర్ణ సంబంధిత సమస్యలకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు 30 శాతంగా ఉండడాన్ని గమనించాలి. బీమా లేకపోతే వీటి కారణంగా పడే ఆర్థిక భారం గణనీయంగా ఉంటుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థ క్లెయిమ్‌లను పరిశీలిస్తే.. కేన్సర్ చికిత్సల కోసం సగటు క్లెయిమ్ సైజు రూ.77,000గా ఉంది. అదే మస్కులోస్కెలెటల్(కండర) సంబంధిత సమస్యల కారణంగా సగటు క్లెయిమ్ రూ.1.26 లక్షలుగా ఉంది. 60–65 ఏళ్లు దాటిన వారి నుంచి మస్కులోస్కెలెటల్, ఆస్టియోపోరోసిస్, జాయింట్ సంబంధిత క్లెయిమ్‌లు ఎక్కువగా ఉంటుంటాయి. కేన్సర్ కంటే వీటికి ఎక్కువ పరిహారం చెల్లించాల్సి వస్తోంది. బీమా అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్న వయసులోనే... చిన్న నాటి నుంచే హెల్త్ కవరేజీ ఎందుకులే, ఈ వయసులో ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఏవీ రావుగా..?! అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఇక ఉద్యోగులు తమ సంస్థ నుంచి ఎంతో కొంత హెల్త్ కవరేజీ ఉందిలేనన్న ఆలోచనతో అదనంగా కవరేజీ తీసుకునేందుకు ఇష్టపడరు. వయసుతో సంబంధం లేనివి.. గాయాలు, ఆహార విషతుల్యం కారణంగా వచ్చిన క్లెయిమ్‌లు 19–35 సంవత్సరాల విభాగంలో 43 శాతంగా ఉన్నాయి. ఇక ఇన్ఫెక్షన్ల కారణంగా ఎదురయ్యే క్లెయిమ్‌లు కూడా ఇదే వయసు వారి నుంచి వచ్చే మొత్తం క్లెయిమ్‌లలో 42 శాతంగా ఉన్నాయి. ఇక యువతలో ఎక్కువ క్లెయిమ్‌లు ప్రమాదాలకు సంబంధించినవీ ఉంటున్నాయి. ‘‘25 ఏళ్లలోపు వయసున్న వారు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే ధోరణితో ఉంటారు. ఈ వయసు వారి నుంచి వచ్చే క్లెయిమ్‌లు మొత్తం ప్రమాదాల కారణంగా పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లలో 30 శాతంగా ఉంటోంది. సగటు క్లెయిమ్ రూ. 55,000’’అని రాయల్ సుందరం హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నిఖిల్ ఆప్టే తెలిపారు. ఒకవేళ హెల్త్ పాలసీ ప్రీమియం భారంగా అనిపిస్తే.. చిన్న వయసులో ఆదాయం తక్కువగా ఉన్న వారు కనీసం చౌకగా వచ్చే ప్రమాద బీమా పాలసీని అయినా తీసుకోవడం మంచిది. ‘‘పెద్ద వయసు వారితో పోలిస్తే.. యువతీ, యువకులు ఉద్యోగం చేసే వారు బయటి వాతావరణానికి ఎక్కువగా గురవుతుంటారు. దీంతో వీరు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే, యువతీ, యువకులు వ్యక్తిగత హెల్త్ పాలసీలను ముందుగానే తీసుకోవడం తక్కువే’’ అని సెక్యూర్‌నౌ సీఈవో కపిల్ మెహతా పేర్కొన్నారు. భవిష్యత్తు వ్యయాలు రానున్న ఐదేళ్ల కాలంలో శ్వాస కోçశవ్యాధులు, గుండె జబ్బులు, మస్కులోస్కెలెటల్, కేన్సర్, ప్రమాదాలు, జననేంద్రియ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని బీమా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘‘గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాల్లో పెరుగుదల 100 శాతంగా ఉంది. ఈ విభాగంలో ఎక్కువగా కనిపించేవి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా. పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో, దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా ఉందని ఇది తెలియజేస్తోంది’’ అని నిఖిల్ ఆప్టే పేర్కొన్నారు. ఇక ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాలతో ఆర్థరైటిస్ బారిన పడడం పెరుగుతోంది. దీంతో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. డబ్బులను గుల్ల చేసే పెద్ద ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బులు, కేన్సర్ ఉంటున్నాయి. భవిష్యత్తులోనూ వీటి చికిత్సల వ్యయాలు ఇంకా పెరిగే అవకాశమే ఉంది. ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలే కాకుండా, తదనంతరం ఆ సమస్యకు సంబంధించి అయ్యే ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు కేన్సర్ విషయంలో ఆస్పత్రిలో చికిత్స తర్వాత ఫాలో అప్ కోసం ఒక్కో పరీక్షకు రూ.15,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. వైద్యుల సూచనల మేరకు అవసరమైనంత కాలం పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే గుండె జబ్బుల్లో అయితే, ప్రతీ ఫాలో అప్‌కు కనీసం రూ.1,000 తక్కువ కాకుండా ఖర్చవుతుంది. సీటీ స్కాన్ ఖరీదు రూ.10,000–15,000 వరకు ఉంటుంది. అవయవ మార్పిడి కేసుల్లో ప్రతీ నెలా కనీసం రూ.5,000 తక్కువ కాకుండా మందులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కనుక బీమా తీసుకునే వారు ఈ వ్యయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక లక్ష్యాలకూ బీమా బాసట ► యువ పాలసీదారులపై మరింత దృష్టి ► బజాజ్ అలియంజ్ లైఫ్ ఎండీ తరుణ్ చుగ్ ఆర్థిక లక్ష్యాల సాధనకు కూడా జీవిత బీమా పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయని బజాజ్ అలియంజ్ ఎండీ తరుణ్ చుగ్ తెలిపారు. వైవిధ్యమైన జీవిత బీమా పాలసీలు అందుబాటులోకి రావడంతో ఆర్థిక లక్ష్యాల సాధన కోసం యువ జనాభాలో ఎక్కువ శాతం మంది పెట్టుబడుల కోసం వీటివైపు మొగ్గు చూపుతున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాలసీల విక్రయాలకు సంబంధించి మిలీనియల్స్‌పై మరింత దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. వారికి అనువైన కొత్త తరహా పాలసీలు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే బీమా కవరేజీని లెక్కించడం నుంచి పాలసీ కొనుగోలు, రెన్యువల్ ప్రీమియంల చెల్లింపు దాకా అన్నింటినీ సులభతరం చేసేలా యాప్స్, కాల్క్యులేటర్స్ను అందుబాటులో ఉంచినట్లు చుగ్ చెప్పారు. రిటైర్మెంట్ లాంటి లక్ష్యాలు దీర్ఘకాలికమైనవే అయినప్పటికీ యువత కెరియర్ తొలినాళ్ల నుంచే వీటి కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం ముఖ్యమని ఆయన తెలిపారు. సాధ్యమైనంత ముందుగానే పాలసీ తీసుకోవడం వల్ల దీర్ఘకాలం కవరేజీ లభించడంతో పాటు ప్రీమియం కూడా తక్కువగా ఉంటుందని చుగ్ వివరించారు. మరణానంతర ప్రయోజనాల కన్నా జీవిత లక్ష్యాల సాధనలో బీమా పాలసీలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై అవగాహన కల్పించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. క్యూ1లో 40 శాతం వృద్ధి... ఈ ఆర్థిక సంవత్సరం తమ సంస్థకు సంబంధించి తొలి త్రైమాసికంలో కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం పెరిగిందని చెప్పారు. ఈ విభాగంలో జీవిత బీమా రంగం సగటు వృద్ధి 32 శాతంగా ఉందని పేర్కొన్నారు. విస్తృతమైన నెట్వర్క్, విభిన్నమైన పథకాలు, పాలసీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు మరిన్ని పెట్టుబడులు కొనసాగిస్తుండటం ఇందుకు దోహదపడిందని చెప్పారు. రాబోయే రోజుల్లో పేమెంట్ బ్యాంకులు, ఆన్లైన్ వేదికలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు దేశీయంగా జీవిత బీమా పాలసీల విక్రయాలు మరింతగా పెరిగేందుకు తోడ్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైనంత రక్షణ మన దేశంలో వైద్య బీమా తీసుకునే వారి సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. వైద్య బీమా అన్నదానిని ఇప్పటికీ పన్ను ఆదా సాధనంగా చూసే వారున్నారు. కాకపోతే మిలీనియల్స్ (యువత)లో ఈ ధోరణి మారుతోందన్నారు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ అండ్ హెల్త్ క్లెయిమ్స్ హెడ్ పి.భవే. అయితే, ఇటీవలి కాలంలో పెరుగుతున్న ప్రచారం కారణంగా.. రూ.3.5–4 లక్షలుగా సగటు బీమా కవరేజీ ఉంటోంది. ‘‘చాలా ఆరోగ్య సమస్యల్లో ఖర్చు రూ.3 నుంచి రూ.4 లక్షలుగా ఉంటోంది. కనుక కనీసం రూ.5 లక్షల వైద్య బీమాకు తోడు టాపప్ పాలసీ కూడా తీసుకోవడాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి’’ అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ క్లెయిమ్స్ హెడ్ భాస్కర్ నెరుర్కార్ సూచించారు. బేసిక్ పాలసీ కవరేజీ ఏదైనా ఒక ఏడాదిలో పూర్తయిపోయి వైద్య చికిత్సలకు అదనంగా ఖర్చు అయితే అటువంటి సందర్భాల్లో టాపప్ పాలసీ ఆదుకుంటుంది. కనీసం రూ.10 లక్షల కవరేజీకి టాపప్ పాలసీ తీసుకోవాలన్నది ఆప్టే సూచన. అత్యాధునిక పరికరాలతో సంక్లిష్టమైన అవయవ మార్పిడి చికిత్సలు, బైపాస్, కేన్సర్ చికిత్సలు కూడా చేస్తుండడంతో కనీసం ఈ మాత్రం టాపప్ అవసరమని ఆప్టే పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులున్న కుటుంబంలో ఇంటి పెద్ద వయసు 40 ఏళ్లుగా ఉంటే, కనీసం రూ.5 లక్షలకు హెల్త్ కవరేజీతో పాలసీ తీసుకోవాలి. ప్రతీ ఐదేళ్లకోసారి దీన్ని సమీక్షించి అవసరమైనంత పెంచుకోవాలన్నది నిపుణుల సూచన. దీనికితోడు క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కూడా తీసుకోవడం వల్ల ఆయా సమస్యల బారిన పడితే ఏక మొత్తంలో పరిహారం అందుకోవచ్చు. విడిగా ఓ వైద్య నిధిని కూడా సమకూర్చుకోవడం మంచిది. పాలసీలో కవర్ కాని వాటికి ఖర్చు చేసేందుకు అక్కరకు వస్తుంది. కుటుంబ సభ్యులు, ఆరోగ్య చరిత్ర ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తగినంత వైద్య బీమా కవరేజీతో పాలసీ తీసుకోవడం ద్వారా ఆర్థికంగా గుల్ల కాకుండా చూసుకోవచ్చు. -
వైద్య బీమా పాలసీ... ప్చ్!
వైద్య బీమా ప్రాధాన్యాన్ని నేడు ఎంతో మంది అర్థం చేసుకుంటున్నారు. వైద్య సేవల వ్యయాలు బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేస్తున్న రోజులు కావడంతో ఆర్జించే వారిలో ఎక్కువ మంది వైద్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. దీని పట్ల ఇటీవలి కాలంలో అవగాహన కూడా విస్తృతం అవుతోంది. ఇది నాణేనికి ఒక వైపు. కానీ, వైద్య బీమా పాలసీలు తీసుకున్న వారిలో అందరూ సంతోషంగానే ఉంటున్నారా...? దాదాపు సగానికి సగం అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. ఇది నాణేనికి మరో వైపు కోణం. తాము తీసుకున్న పాలసీల్లోని ఫీచర్ల పట్ల సంతోషంగా లేమని 48 శాతం మంది తెలిపారు. పెద్ద వయసు వారిలో ఇది మరీ ఎక్కువగానే ప్రస్ఫుటమైంది. 65 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు వారిలో 67 శాతం మంది (ప్రతీ ముగ్గురిలో ఇద్దరు) తాము తీసుకున్న వైద్య బీమా పాలసీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటువంటి ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. అసంతృప్తి ఎక్కువే 48% అంటే సగం మంది హెల్త్ పాలసీల పట్ల అసంతృప్తితో ఉన్నారంటే దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా విస్మరించకూడని అంశమే. మరీ ముఖ్యంగా పెద్ద వయసు వారిలో మూడింట రెండొంతుల సంతృప్తిగా లేరంటే వారు ఆశించిన ప్రయోజనాలు బీమా సంస్థలు అందించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద వయసులోనే వైద్య బీమా అవసరం ఎక్కువగా ఉంటుంది. వారు తరచుగా పాలసీ కవరేజీని వినియోగించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అందుకే వైద్య బీమా పాలసీ తీసుకునే ముందే పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఏజెంట్లకో, మధ్యవర్తులకో దరఖాస్తు పత్రాన్ని నింపే బాధ్యతను వదిలేయకుండా, డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివి, అందులోని ఫీచర్లను అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావడం అవసరమని ఈ సర్వే ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పాలసీ తీసుకున్న తర్వాత ఎక్కువ శాతం విధానపరమైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ‘‘పాలసీ షెడ్యూల్, నియమ, నిబంధనలు, కస్టమర్ సమాచార షీట్ వంటివన్నీ పాలసీ కిట్‌లో ఉంటాయి. పాలసీలో కీలకమైన సెక్షన్లు అన్నీ ఉంటాయి. అలాగే, కొత్త పాలసీదారులను ఆహ్వానిస్తూ వారిలో కొందరికి కాల్ చేసి, ముఖ్యమైన ఫీచర్లు, షరతులు, నియమాలు వివరించడం జరుగుతుంది’’ అని సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దార్ తెలిపారు. రెన్యువల్ ప్రీమియం భారం పాలసీదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలు ఎక్కువగా కంపెనీలు రెన్యువల్ ప్రీమియంను భారీగా పెంచేయడంపైనే ఉన్నాయి. ‘‘రెన్యువల్ ప్రీమియం పెరగడం అన్నది వాస్తవికం. ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఇది ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆశిష్ మెహ్రోత్రా తెలిపారు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) 2013లో క్లెయిమ్ ఆధారిత ప్రీమియం పెంపు విధానాన్ని నిషేధించింది. పాలసీదారులు క్రితం సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుని ఉంటే, మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం పెంచే విధానాన్ని కంపెనీలు అనుసరించేవి. అలాగే, వయసు పెరుగుతున్న కొద్దీ రెన్యువల్ ప్రీమియం పెంపు సైతం బీమా సంస్థలు అనుసరిస్తున్న మరో విధానం. ఉదాహరణకు 30–35 ఏళ్ల గ్రూపు నుంచి 36వ సంవత్సరంలోకి ప్రవేశించిన పాలసీదారునికి ప్రీమియం రెన్యువల్ భారం కొంచెం ఎక్కువే. వీరు 36–40 వయసు గ్రూపులోకి ప్రవేశించినట్టు. ఇలా బీమా సంస్థలు ఐదేళ్లకొక వయసును గ్రూపుగా పరిగణించి రిస్క్ పారామీటర్ల ఆధారంగా ప్రీమియం పెంచేస్తున్నాయి. వైద్య బీమా పాలసీని జీవిత కాలం పాటు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉన్నా.. అది ఏడాది కాల కాంట్రాక్టేనని గుర్తించాలి. కనుక పాలసీ తీసుకున్నప్పుడే ప్రీమియం రేట్లను పోల్చి చూడడం కూడా అవసరం. క్లెయిమ్ సెటిల్మెంట్ 60% పాలసీదారులు క్లెయిమ్స్ విషయంలోనూ అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నో మినహాయింపులు చూపించి పాక్షికంగానే కంపెనీలు పరిహారం చెల్లించాయన్నది 65 శాతం మంది చెప్పిన మాట. ఎక్కువ మంది తమ బీమా సంస్థల క్లెయిమ్ పరిష్కార రికార్డు పట్ల సంతోషంగా లేకపోవడం ఆందోళనకరమేనని, దీన్ని సత్వరమే మార్చాల్సిన అవసరం ఉందన్నారు ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్‌రైటింగ్, క్లెయిమ్స్ విభాగం చీఫ్ సంజయ్ దత్తా. పాలసీదారులు సైతం బాధ్యతగా పాలసీ తీసుకునే సమయంలోనే తమ వైద్య చరిత్ర గురించి ఏ మాత్రం దాచిపెట్టకుండా పూర్తి వివరాలను తెలియజేయడం కూడా అవసరమేనని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని బీమా కంపెనీలు పాలసీదారులకు ముందు నుంచి ఉన్న వ్యాధులకు... ఏడాది నుంచి నాలుగేళ్ల తర్వాత కవరేజీ కల్పిస్తున్నాయి. ఆయా వ్యాధుల ఆధారంగా వెయిటేజీ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. ‘‘పాలసీ ప్రయోజనాల విషయంలో కంపెనీలు పారదర్శక పాటించడం అవసరం. అలాగే, కస్టమర్లు పాలసీ తీసుకునే ముందు అన్ని వివరాలు వెల్లడించడం, సేవల సమయాన్ని నిర్దేశించడం వంటివి కస్టమర్ల సంతృప్త స్థాయిలను మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయి’’ అని సంజయ్ దత్తా పేర్కొన్నారు. ముఖ్యంగా పాలసీదారులు పాలసీలో ఉన్న మినహాయింపుల విషయమై అవగాహన కలిగి ఉండడం కూడా వివాదాలకు దారితీయకుండా ఉంటుంది. బీమా సంస్థలు అనుసరించాల్సిన మినహయింపుల ప్రామాణిక జాబితాను ఐఆర్డీఏ లోగడే గుర్తించింది. బీమా సంస్థలు తప్పనిసరిగా దీనికి బద్ధులై ఉండాలి. దీన్ని ఉల్లంఘిస్తే వివాదాల పరిష్కార వేదికలను ఆశ్రయించొచ్చు. అయితే, పాలసీదారులు గమనించాల్సిన అంశం ఒకటుంది. రెన్యువల్ సమయంలోనూ బీమా సంస్థలు కొత్తగా మినహాయింపులను చేరుస్తున్నాయి. ‘‘రెన్యువల్ చేసుకుంటున్నందున పాలసీ ఒప్పందం అంతకుముందు మాదిరే ఉంటుందని పాలసీదారులు అనుకుంటుంటారు. కానీ, రెన్యువల్ సమయంలోనూ ఏకపక్షంగా బీమా సంస్థలు మినహాయింపులు చేర్చడాన్ని పాలసీదారులు ఎదుర్కొంటున్నారు’’ అని ప్రసూన్ సిక్దార్ తెలిపారు. అందుకే వైద్య బీమాకు సంబంధించి, ఇండివిడ్యువల్ విభాగంలో ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో (ఐసీఆర్) చూడాలంటున్నారు నిపుణులు. ఓ కంపెనీ వసూలు చేసిన ప్రీమియం, పరిహారం రూపంలో చెల్లించిన మొత్తాలను ఈ ఐసీఆర్ రేషియో తెలియజేస్తుంది. 75–85 శాతం మధ్య ఐసీఆర్ ఉంటే ఆరోగ్యకరమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. పరిష్కారాలకు మార్గాలు పాలసీ తీసుకున్నాక కొంచెం అసంతృప్తి ఉంటే ఫర్వాలేదు కానీ, ఎక్కువ అసంతృప్తి ఉంటే అందులోనే కొనసాగాల్సిన అగత్యమేమీ లేదు. హెల్త్ పాలసీ పోర్టబులిటీ సదుపాయం ఉంది. మంచి ఫీచర్లతో, తక్కువ మినహాయింపులతో ఆఫర్ చేసే, చక్కని క్లెయిమ్ పరిష్కార రేషియో ఉన్న కంపెనీకి పాలసీని మార్చుకోవచ్చు. పోర్ట్ పెట్టుకున్నప్పటికీ, అంతకుముందు వరకు ఉన్న నో క్లెయిమ్ బోనస్ వంటి సదుపాయాలను కోల్పోవాల్సిన అవసరం కూడా రాదు. ఆశ్చర్యకరం ఏమిటంటే బీమా పోర్టబులిటీ సదుపాయాన్ని 2011లోనే ఐఆర్డీఏ కల్పించినప్పటికీ... తమకు ఆ విషయం ఇప్పటికీ తెలియదని ఈ సర్వేలో 27.12% చెప్పడం గమనార్హం. ఇక పాలసీదారులు క్లెయిమ్ విషయంలో వివాదాలు, అభ్యంతరాలు ఉంటే అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించొచ్చు. తమ బీమా పాలసీ విషయంలో అసంతృప్తితో ఉన్నామని చెప్పిన వారిలో 70%కి పైగా అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించలేదు. ఎందుకని అంటే... అంబుడ్స్‌మన్ కు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకోవడం అన్నది ఎంతో సమయం తీసుకునే, క్లిష్టమైన ప్రక్రియగా 77% మంది భావిస్తున్నారు. ఇక 42% మంది అంబుడ్స్‌మన్ గురించి తెలియదని చెప్పారు. ఒకవేళ అంబుడ్స్‌మన్ వద్ద జరిగిన నిర్ణయం పట్ల సంతోషంగా లేకపోతే దానిపై వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌లను ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. -
ఈ మూడూ తప్పనిసరండోయ్..
ఏ నిమిషానికి ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి బీమా పాలసీలు తప్పనిసరి అవసరాలుగా మారుతున్నాయి. బీమా అనగానే ట్యాక్స్ సేవింగ్ పాలసీలని, మనీ బ్యాక్ పాలసీలని.. మరొకటని రకరకాల పాలసీల సమాచారంతో గందరగోళం నెలకొంటుంది. ఏది తీసుకోవాలో అర్థం కాక బుర్ర హీటెక్కిపోతుంటుంది. బీమా ప్రధానోద్దేశం .. మనకేదైనా అనుకోనిది జరిగితే.. కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడటమే. మిగతా వాటిని పక్కన పెట్టి ఈ కోణంలో చూస్తే ముచ్చటగా మూడు రకాల పాలసీలు ఉంటే మంచిది. అవే.. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్.. ఆదాయానికి ఆధారం అయిన కుటుంబ పెద్ద హఠాత్తుగా కన్నుమూస్తే.. కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలకు అక్కరకొస్తుంది ఈ పాలసీ. కుటుంబానికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందజే స్తుంది. తక్కువ ప్రీమియానికి అత్యధిక కవరేజి ఇవ్వగలగడం ఈ పాలసీల ప్రత్యేకత. అయితే, ఒకవేళ పాలసీ వ్యవధి పూర్తయ్యే దాకా పాలసీదారు జీవించే ఉంటే మాత్రం ఎలాంటి డబ్బూ రాదు. ఒకవేళ కట్టిన ప్రీమియాలు కూడా వెనక్కి రావాలనుకుంటే యులిప్‌లు, ఎండోమెంట్ లాంటి వేరే పాలసీలను ఎంచుకోవాలి. వైద్య బీమా పాలసీలు.. వైద్యానికయ్యే ఖర్చులు ఏయేటికాయేడు భారీగా పెరిగిపోతున్నాయి. చిన్న అనారోగ్యానికి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినా వేలకు వేలు వదిలిపోతున్నాయి. కనుక ప్రస్తుతం వైద్య బీమా పాలసీ అనివార్యంగా మారింది. మీరు పనిచేసే కంపెనీ వైద్య బీమా సదుపాయం కల్పించినా.. ఆ కంపెనీలో ఉద్యోగం మానేస్తే కవరేజి ఉండదు కాబట్టి సొంతానికంటూ ఒక పాలసీ ఉండటం మంచిది. ఈ పాలసీలు రకరకాల ప్రయోజనాలు కల్పిస్తాయి. ప్రమాద బీమా.. ప్రమాదాల వల్ల అంగవైకల్యం వచ్చినా, మరణం సంభవించినా.. ఈ తరహా పాలసీలు ఉపయోగపడతాయి. వైద్య బీమా అనేది చికిత్స ఖర్చుల దాకా మాత్రమే పరిమితం అయితే.. ప్రమాద బీమా పాలసీలు అంతకుమించి మరికాస్త ప్రయోజనం ఇస్తాయి. ప్రమాదం కారణంగా మంచానికే పరిమితమై.. ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడి, ఆదాయం ఉండకపోతే రోజులు గడవడం కష్టంగా మారుతుంది కదా. ఇలాంటప్పుడు ప్రమాదం, వైకల్యం వంటి అంశాలను బట్టి ప్రమాద బీమా పాలసీ ద్వారా నిర్దిష్ట మొత్తం లభిస్తుంది. ఏ పాలసీ తీసుకున్నా.. అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కొంతైనా పరిశోధన చేసి మరీ తీసుకుంటే తర్వాత రోజుల్లో ఇబ్బందులు పడనక్కర్లేదు.