ఆరోగ్యానికి... రెండు పాలసీలు!
♦ నచ్చిన కంపెనీ నుంచి పరిహారం కోరొచ్చు
♦ మొదట కంపెనీ గ్రూప్ పాలసీని క్లెయిమ్ చేస్తేనే బెటర్
♦ వైద్య బిల్లు పరిమితి దాటిపోయినా కంగారక్కర్లేదు
♦ ఒక పాలసీ పరిమితి అయిపోతే రెండోది వాడొచ్చు
మన దేశంలో ఒక్క హెల్త్ పాలసీ కూడా లేని వారు ఇప్పటికీ అత్యధికంగానే ఉన్నారు. కాకపోతే ముందు జాగ్రత్తతో రెండు పాలసీలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. సాధారణంగా ఉద్యోగస్తులకు పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ పాలసీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనివల్ల అన్ని అవసరాలూ తీరకపోవచ్చు. పైగా ఉన్నట్టుండి కంపెనీని వీడాల్సి వస్తే హెల్త్ కవరేజీ కూడా ఆగిపోతుంది. అందుకే ఉద్యోగులు విడిగా ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా అవివాహితులైతే వ్యక్తిగత హెల్త్ పాలసీ తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. ఇలా రెండు పాలసీలున్నప్పుడు వాటికి సంబంధించిన కవరేజీ ప్రయోజనాలు వేర్వేరుగా ఉండొచ్చు.
తగినంత కవరేజీ ఉండాలి...
ఒకటికి మించి పాలసీలు తీసుకునే సమయంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. అన్నీ ఒకే తరహాలో ఉండడం అంత ప్రయోజనకరం కాదు. వేటికవే ప్రత్యేక ప్రయోజనాలతో ఉండేలా ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఏ తరహా వైద్య అవసరాలు ఏర్పడినా ఒకటి కాకుంటే మరొకటైనా కవర్ చేసేలా ఉండాలి. ఇక మొదటి పాలసీ గురించి రెండో పాలసీ జారీ చేసే కంపెనీకి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. పరిహారం చెల్లింపులో ఇది కీలకాంశం అవుతుందన్నది భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ చీఫ్ పరాగ్ గుప్తా మాట. ఇక ఒకటికి మించిన పాలసీలు తీసుకునే వారు పారదర్శకంగా అన్ని వివరాలనూ పాలసీ దరఖాస్తులో పేర్కొనడం, ముందు నుంచీ ఉన్న వ్యాధుల సమాచారాన్ని తెలియజేయడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.
అన్ని పాలసీలు ఒకేలా ఉండవు
హెల్త్ పాలసీల్లో మెడిక్లెయిమ్ పాలసీలు నష్ట పరిహారం చెల్లించేవి. అంటే ఇండెమ్నిటీ అన్నమాట. హాస్పిటల్‌లో అయిన వైద్య ఖర్చుల బిల్లులను బీమా కంపెనీలు గరిష్ట పరిమితి మేరకు చెల్లిస్తాయి. మరో రకం డిఫైన్డ్ బెనిఫిట్ (క్రిటికల్ ఇల్‌నెస్) పాలసీలు. ఏదైనా అనారోగ్యం బయటపడిన వెంటనే మొత్తం బీమాను చెల్లించేస్తాయి. ఈ నేపథ్యంలో ఒకటికి మించిన ఇండెమ్నిటీ కవరేజీ పాలసీలు ఉన్నవారు ఆయా బీమా కంపెనీల్లో దేని నుంచైనా పరిహారం పొందొచ్చు. అంతేకానీ, పరిహారం కోసం రెండు బీమా కంపెనీలనూ సంప్రతించడం తప్పనిసరి కాదు. పాలసీదారుడి ఇష్టం మేరకు తనకు ఇండెమ్నిటీ పాలసీలున్న ఏ కంపెనీ నుంచైనా పరిహారం పొందేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఉదాహరణకు రూ.2 లక్షల బిల్లయితే రెండు బీమా పాలసీలున్నవారు ఒక్కో బీమా కంపెనీ నుంచి రూ.లక్ష చొప్పున తీసుకోవాల్సిన ఇబ్బందేమీ లేదు. గతంలో ఈ విధానం ఉండేది. ఒకటికి మించిన పాలసీలుంటే పరిహారాన్ని బీమా నిష్పత్తి మేరకు కంపెనీలు చెల్లించేవి.
ప్రయోజనాలు ఎక్కువే...
ఒకటికి మించిన పాలసీలు ఉండడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఉదాహరణకు ఆస్పత్రి పాలై రూ.2 లక్షల బిల్లు అయిందనుకోండి. క్లెయిమ్ సందర్భంలో బీమా కంపెనీ రూ.2 లక్షల పరిహారం ఇవ్వకుండా ఏవేవో నిబంధనల సాకుతో రూ.1.50 లక్షలే చెల్లించొచ్చు. అప్పుడు మిగిలిన రూ.50 వేలను చెల్లించాలని కోరుతూ పాలసీదారుడు మరో కంపెనీని ఆశ్రయించొచ్చు. ఇది పాలసీదారుడి హక్కు అని ఐఆర్‌డీఏ ఇప్పటికే స్పష్టం చేసింది. రూ.2 లక్షల చొప్పున రెండు హెల్త్ పాలసీలున్నాయి. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే రూ.3 లక్షల బిల్లు వచ్చిందనుకోండి. ఓ బీమా కంపెనీ నుంచి రూ.2 లక్షల వరకే పరిహారం వస్తుంది. అప్పుడు మిగిలిన రూ.లక్షను మరో బీమా కంపెనీ నుంచి పొందే అవకాశం ఉంది.
ఒకటికి మించిన ఫిక్స్‌డ్ బెనిఫిట్ ప్లాన్లు ఉంటే?
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలే ఫిక్స్‌డ్ బెనిఫిట్ ప్లాన్లు. ఇవి జీవిత బీమాకు రైడర్‌గానూ, విడిగా స్టాండలోన్ పాలసీగానూ తీసుకోవచ్చు. ఐఆర్‌డీఏ నిబంధనల ప్రకారం ఈ తరహా పాలసీల్లో పరిహారం కోసం వచ్చే క్లెయిమ్‌లను అన్ని బీమా కంపెనీలు ఆమోదించాల్సి ఉంటుంది.
క్లెయిమ్ ప్రక్రియ ఇదీ...
సాధారణంగా బీమా కంపెనీలు పరిహా రం చెల్లించేందుకు ఒరిజినల్ బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీని తప్పకుండా సమర్పించాలని కోరతాయి. పరిహారం ఒకే బీమా కంపెనీ నుంచి తీసుకుంటుంటే ఈ విషయంలో సమస్య ఏమీ ఉండదు. కానీ, ఒకటికి మించిన బీమా కంపెనీల నుంచి పరిహారం కోరాల్సి వస్తే ఒరిజినల్ బిల్లులు, ఒరిజినల్ డిశ్చార్జ్ సమ్మరీలు అన్నింటికీ సమర్పించడం సాధ్యం కాదు. అప్పుడు మొదట ఒక బీమా కంపెనీ నుంచి పరిహారం తీసుకున్న తర్వాత ఆ కంపెనీ జారీ చేసే ఒరిజినల్ సెటిల్‌మెంట్ లెటర్‌తోపాటు బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీ జిరాక్స్ కాపీలపై స్వయంగా అటెస్టేషన్ చేసి సమర్పించాల్సి ఉంటుందని భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ చీఫ్ పరాగ్ గుప్తా తెలిపారు.
పరిహారం కోసం దేన్ని ఎంచుకోవాలి?
పాలసీదారులకు ఒకటికి మించిన పాలసీలు ఉన్నప్పటికీ ఏదో ఒక బీమా కంపెనీని పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయొచ్చని చెప్పుకున్నాం. అయితే, ఉన్న పాలసీల్లో ఏ కంపెనీని ఎంచుకోవాలి? అన్న ప్రశ్న ఉదయించొచ్చు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే నో క్లెయిమ్ బోనస్ కోల్పోవాల్సి వస్తుంది. అలాగే, ఏదేనీ పరిహారం కోసం వెయిటింగ్ పీరియడ్‌లో ఉండి ఉండొచ్చు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు విడిగా మరో హెల్త్ పాలసీ ఉన్న వారు... నిస్సంకోచంగా గ్రూప్ హెల్త్ పాలసీ కంపెనీ నుంచి ముందుగా పరిహారం పొందాలన్నది నిపుణుల సూచన. ఎందుకంటే గ్రూప్ పాలసీల్లో నో క్లెయిమ్ బోనస్ తరహా ఎటువంటి ప్రయోజనాలూ ఉండవు. పైగా గ్రూప్ పాలసీలు రిటైల్ పాలసీలతో పోలిస్తే విస్తృత కవరేజీనిచ్చేవిధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.