టాప్ ఫార్మా సంస్థల్లో...8 హైదరాబాదీ కంపెనీలు
♦ పేరొందిన కంపెనీల్లో డాక్టర్ రెడ్డీస్‌కు 4వ స్థానం
♦ అరబిందో, నాట్కో, సువెన్, దివీస్‌కూ చోటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అత్యధికంగా పేరొందిన ఫార్మా బ్రాండ్ల జాబితాలో హైదరాబాద్‌కి చెందిన 8 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 4వ స్థానంలో నిలిచింది. ‘భారత్‌లో పరపతి గల ఫార్మా బ్రాండ్స్ 2016’ పేరిట టీఆర్‌ఏ రీసెర్చ్, బ్లూబైట్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొం దించింది. ఈ జాబితాలో అరబిందో ఫార్మా 11వ స్థానం, నాట్కో ఫార్మా 21వ స్థానం దక్కించుకున్నాయి. అటు సువెన్ లైఫ్ సెన్సైస్ (40వ ర్యాంకు), దివీస్ లేబొరేటరీస్ (44), జెనోటెక్ లేబొరేటరీస్ (48), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (49), బయోలాజికల్-ఇ 52వ ర్యాంకుల్లో నిలిచాయి.
ఈ జాబితాలో ముంబైకి చెందిన లుపిన్ అగ్రస్థానంలోను, సన్ ఫార్మా రెండు, సిప్లా మూడవ స్థానంలో నిలిచాయి. 41 దేశీ సంస్థలు, 17 అంతర్జాతీయ సంస్థలు.. వెరసి మొత్తం 58 బ్రాండ్స్‌ను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇండియాస్ మోస్ట్ రెప్యూటెడ్ బ్రాండ్స్ సిరీస్‌లో ఇది రెండోది. మీడియాలోనూ, వినియోగదారుల్లోనూ ఆయా బ్రాండ్స్‌పై ఉన్న అభిప్రాయాన్ని విశ్లేషించి, తదనుగుణంగా ర్యాం కులు ఇవ్వడం జరిగిందని ఇండియాస్ మోస్ట్ రెప్యూటెడ్ బ్రాండ్స్ ప్రతినిధి పూజా కౌరా తెలిపారు.
వేగవంతమైన వృద్ధిపరంగా 2020 నాటికి టాప్ 3 ఫార్మా మార్కెట్లలో ఒకటిగా ఉండనుందని ఆమె పేర్కొన్నారు. ఫార్మా రంగంపై గతేడాది జూలై 15- ఈ ఏడాది జూలై 16 మధ్యలో వచ్చిన 24,414 వార్తల విశ్లేషణ ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. భారత్‌లో పేరొందిన విదేశీ బ్రాండ్స్ విషయానికొస్తే జీఎస్‌కే అగ్రస్థానంలోనూ, ఫైజర్, అబాట్ తదుపరి స్థానాల్లోనూ నిలిచాయి.